శ్రావణ సుమగంధం | Varalaxmi Vratham special: ladies to celebrate wearing designed sarees | Sakshi
Sakshi News home page

శ్రావణ సుమగంధం

Published Fri, Aug 8 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

శ్రావణ సుమగంధం

శ్రావణ సుమగంధం

బిజీలైఫ్.. పొట్టి జడను, పోనీ టెయిల్‌ను సపోర్ట్ చేసినా, అకేషనల్ షెడ్యూల్ మాత్రం వాలుజడ.. పూలజడనే సవరిస్తోంది! ఇందుకు సాక్ష్యం.. ఈ వరలక్ష్మీ వ్రతమే! అయితే ఈ అలంకరణను ఇదివరకటిలా  అమ్మ.. అత్తమ్మ... అమ్మమ్మలు చేయట్లేదు స్పెషల్ డిజైనర్లు అల్లుతున్నారు అందంగా..
 
 సంస్కృతిని చాటే పండుగపబ్బాలకు సంప్రదాయ సోకులే అసలైన ఆకర్షణ. అందుకే మామూలప్పుడు ఎలా ఉన్నా పర్వదినాలకు మాత్రం బారెడు జడ.. మూరెడుపూలతో కాంతులీనుతుంటారు కాంతలు. ఈ అలంకరణ ఆరేళ్ల పాప నుంచి అరవై ఏళ్ల అమ్మమ్మల దాకా అందరికీ ప్రీతిపాత్రమే! ఇంతకుముందు ఈ జడల్లో మల్లెలు, మరువాలు, బంతులు, చేమంతులు, కనకాంబరాలు చేరేవి. కట్టేది చీరైనా, పరికిణీ జాకెట్టయినా.. ఓణీ అయినా పూలు ఇవే! జడలో తురిమే వైనమూ అదే! ఇపుడు.. కాలం మారింది. అభిరుచి పాతదే అయినా అమలయ్యే తీరు కొత్తందాన్ని సంతరించుకుంది. విదేశీపుష్పాలు సైతం కురులకు కలరింగ్ ఇస్తున్నాయి. కొంచెం సృజన ఉన్నవాళ్లు ఈ జడను అప్‌డేట్ చేసి పూలజడ డిజైనర్లుగా అడ్రస్ చాటుకుంటున్నారు.
 
 పువ్వులతో పాటు..
 బుజ్జిబుజ్జి నడకల తన బుజ్జాయి బుల్లి జడకు పువ్వులు భారమవుతాయని అమ్మలు భావిస్తే.. వీసమెత్తు బరువులేని కనకాంబరంలాంటి పూలతో పాటు టిష్యూ లేసులు, కుందన్ బిళ్లలు, ముత్యాలు, రతనాలను జడ ఒంపుల్లో చేర్చి ఆ బిడ్డల్ని బంగారు బొమ్మల్లా తీర్చిదిద్దుతున్నారు. అరచేతి వెడల్పున డిజైన్లు సృష్టించి, వాటిని జడ పొడవునా పొదుగుతున్నారు. సిగ్గులొలికే పెళ్లికూతురి కోసం మల్లెమొగ్గలతో జడను కుడుతున్నారు. అత్తారింట జరిగే రిసెప్షన్‌కి ఆ అపరంజి ఇంకాస్త అందంగా కనిపించడానికి ఆమె జడపై నెమళ్లను నాట్యమాడిస్తున్నారు. ఇలా ఒక్కో వేడుకకు ఒక్కో విధమైన వైవిధ్యాన్ని పూలజడల్లో చూపిస్తున్నారు.
 
 రంగులను బట్టి..
 చీర.. లంగా ఓణీల రంగులను బట్టి పువ్వులను.. వాటి చుట్టూ వాడే పూసలను ఎంచుకుంటున్నారు. తెలుపు చీరకు ప్రకృతి ఇచ్చిన మల్లె, లిల్లీ సుమాలు.. మధ్య మధ్యలో ముత్యాలు, కృత్రిమంగా చేసిన గోల్డ్ ఫ్లవర్స్, మోటివ్స్‌ని జతచేర్చి జడలో కూర్చుతున్నారు.  ఆకుపచ్చ రంగు చీరయితే సంపంగి, మరువాన్ని అల్లేసి ఇతర పువ్వులను, మోటివ్స్‌ను, రకరకాల జడబిళ్లలను కలిపేస్తున్నారు. వంకాయ రంగుకు ఆర్కిడ్స్, డబుల్ షేడెడ్ పువ్వులు కావాలనుకుంటే కార్నిషన్ వాడుతున్నారు. ఈ పూలజడలు డిజైన్‌ను బట్టి ధర.రూ.2,000/- నుంచి 3,500/- వరకు లభిస్తున్నాయి. మరింత ఖరీదైన జడబిళ్లలు వాడాలంటే ఖర్చు దానికి తగిన విధంగానే ఉంటుంది. జడబిళ్లలు, ఇతర యాక్సెసరీస్ మన హైదరాబాద్‌లోనే దొరుకుతాయి.
 - విజయారెడ్డి
 
 ‘ఏ చిన్న వేడుకైనా అమ్మాయిల అలంకరణ కోసండిజైనర్ పూల జడలను అడుగుతున్నారు. ఈ మాసం నోములు, వ్రతాలలో అమ్మాయిలను లక్ష్మీదేవిలా అలంకరించాలనుకుంటారు. రాబోయే దసరా, నవరాత్రి, దీపావళి వేడుకల్లో.. పెళ్లి సంబరాల్లో డిజైనర్ పూలజడలకు మంచి గిరాకీ ఉంటోంది. ఆర్డర్ మీద వీటిని తయారుచేస్తుంటాం.’
 - కల్పన రాజేష్, పూలజడల
 డిజైనర్, ఎల్.బి.నగర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement