జగన్ మీద లగడపాటికి ఎందుకంత అక్కసు? | Why does Lagadapati spew venom on YS Jagan? | Sakshi
Sakshi News home page

జగన్ మీద లగడపాటికి ఎందుకంత అక్కసు?

Published Mon, Oct 28 2013 1:42 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

జగన్ మీద లగడపాటికి ఎందుకంత అక్కసు? - Sakshi

జగన్ మీద లగడపాటికి ఎందుకంత అక్కసు?

జగడపాటి, సారీ లగడపాటి రాజగోపాల్ బాధపడుతున్నారు, దిగులుగా ఉన్నారు. బెంగటిల్లుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతూ, అంకమ్మ శివాలెత్తుతున్నారు.

జగడపాటి, సారీ లగడపాటి రాజగోపాల్ బాధపడుతున్నారు, దిగులుగా ఉన్నారు. బెంగటిల్లుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతూ, అంకమ్మ శివాలెత్తుతున్నారు. రంకెలేస్తున్న ఆయన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు చేయాల్సింది 'ఇంత సంస్కారహీనంగా ఆ రంకెలేంట'ని లగడపాటిని తిట్టడం కాదు, ఆ రోగగ్రస్తుని బాధని సానుభూతితో చూడండి. వీలైతే ' గెట్ వెల్ సూన్' అని అతనికో గులాబీ పంపండి. కొన్ని బూతుకూతలు కూసినంత మాత్రాన ఆయన అసభ్యులు కారు, గౌరవనీయులైన భారత పార్లమెంటు సభ్యులు (రాజీనామా చేశానని సాకు చెబుతారేమో). ఎకాయెకిన 10 జన్‌పథ్‌లో ఎప్పుడైనా అడుగుపెట్టగల పరపతి ఉన్నవాడు. లగడపాటిని 'స్థితిమంతుడు', 'ఆస్తిపరుడు' వంటి బరువు తక్కువ మాటలతో వర్ణించడం (ఆయనకి) పరువు తక్కువ. ఆయనొక సువిశాల పారిశ్రామిక సామ్రాజ్యాధిపతి. వినుకొండ నుంచి గుంటూరు మీదుగా విజయవాడ దాకా ఎదిగిన ఆయనంటే గిట్టని వారు నడమంత్రపు సిరి అని కూడా అంటే అంటారుగాక, అటువంటి కోటానుకోటీశ్వర్ ఎందుకంత ఏడుస్తున్నారు? ఎందుకలా జుట్టుపీక్కుంటూ అరుస్తున్నారు?  

ఇప్పుడు, ఎప్పుడూ ఫోకస్ తన మీదే ఉండాలని ఏ రాజకీయ నాయకుడైనా అనుకుంటాడు. కాబట్టి లగడపాటిని నీ అర్హతానర్హతలు ఎంచుకోమని ఎలా చెప్పగలం? తెలంగాణ సమస్య మరోసారి తలెత్తినప్పటి నుంచీ కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయినట్టే కలలు గన్న బొత్స, చిరంజీవి, కావూరి.... వంటి నాయకుల క్యూలో ముందు వరసలో తోసుకుంటూ చొరబడ్డవాడు లగడపాటి. ముఖ్యమంత్రి కావాలని కొందరు  లోలోన ఆశలు పెట్టుకుంటే, కొందరు 'కుదిరితే అవుదాం' అని ప్రాక్టికల్‌గా సరిపెట్టుకుంటే, లగడపాటి వంటి మరికొందరు 'నేను గాక పోతే ఇంకెవడు 'అనే మంకు పట్టుతో ఉంటారు. అలా సీఎం సీటుకు మానసికంగా, భౌతికంగా కమిట్ అయిపోయిన లగడపాటికి దుశ్శకునాలు ఎదురయ్యాయి. ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో అవ్వడం వేరు, లోక్‌సభకో, రాజ్యసభకో సభ్యుడు కావడం కూడా వేరే, ఏకంగా ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అవ్వడం - జీవితంలో అరుదుగా వచ్చే ఛాన్స్. అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి కూడా గట్టిగా లేని కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఆ ఛాన్సు దక్కినప్పుడు, పార్లమెంటు నియోజకవర్గం స్థాయి  ఉన్న తనకి ఎందుకు దక్కకూడదు? ఇలా పరిపరి ఆలోచనలు చేసిన లగడపాటికి  ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అవకాశం ఎంతమాత్రం లేదని తేలిపోవడంతో నిద్రపట్టడం లేదు. ఆయన బ్యాలెన్స్ కోల్పోయారు. కోట్లు మూలుగుతున్నాయి, సూటుకేసులతో గదులు నిండి ఉన్నాయి. అవేవీ తనను సీఎం చేయలేవన్న చేదునిజం ఆయనని మరింత దిగజారుస్తోంది.

ఎంత ఎక్కువ డబ్బుంటే, అతనికే పెద్ద పదవి అనుకుంటే, ఈ దేశానికి ముఖేష్ అంబానీ ప్రధాన మంత్రి కావాలి; మన రాష్ట్రానికి జీఎంఆర్ అదినేత గ్రంధి మల్లికార్జునరావు ముఖ్యమంత్రి కావాలి. డబ్బుంటే బంగారం తాపడం చేసిన బీఎండబ్ల్యూ కారు కొనొచ్చు, కానీ జగన్‌కి ఉన్న జనం ప్రేమను కొనడం మాత్రం సాధ్యం కాదు. కొంత సారా పోయించి, కాసిన్ని బిర్యానీ పాకెట్లు పంచి, మహా అయితే కొన్ని దొంగ వోట్లు వేయించుకోవచ్చు. కానీ జన హృదయనేత కావడం కుదరదు. ఎన్ని జన్మలెత్తినా తాను జగన్ కాలేనని అర్థం కావడమే లగడపాటి అక్కసుకి కారణం.

నిన్నగాక మొన్న జగన్ 'సమైక్య శంఖారావం' సభ పెడితే అంత జనం వచ్చారేంటి? వానలు, చెరువులకి గండ్లూ లేకపోతే అంతకంతా వచ్చే వారు కదూ! జగన్‌కి అంత పాపులారిటీ ఏమిటి? ఆయన మాట్లాడుతుంటే జనం ఉద్వేగంతో ఉరకలెత్తడం ఏమిటి? అనే విషయమే లగడపాటికి కొరుకుడు పడలేదు, మింగుడు పడలేదు.
డబ్బున్నవాడు ప్రతి ఒక్కడికీ బుర్ర కూడా ఉండాలని రాయడం బాబాసాహెబ్ అంబేడ్కర్ మర్చిపోయారు. (తన) దురదృష్టవశాత్తు లగడపాటికి బుర్ర చాలా తక్కువ, నోరు బాగా ఎక్కువ. నిన్న సోనియాని సూటుకేసులతో కొనేద్దామని భరోసాగా ఉన్న ఆయన, తన నరం లేని నాలుకను అడ్డగోలుగా వాడుతూ జగన్‌కి సోనియాకీ కొత్త చుట్టరికం కలుపుతున్నాడు.

ఉన్న కాస్త మెదడు మోకాలు నుంచి అరికాలుకి జారిపోయిన కంగాళీ స్థితిలో లగడపాటి తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు కొత్త పార్టీ పెట్టే యోచనలో కూడా ఉన్నారని సమాచారం (లేదా కిరణ్‌ పెడతారని ప్రచారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి). ఆయన కొత్త పార్టీ పెడితే ఏమౌతుంది? సిఎం మాట అటుంచి, కనీసం ఎంపీ సీటు కూడా గల్లంతౌతుందేమో. వర్తమానం వల్లకాడు, భవితవ్యం కటిక చీకటి. కొన్ని రాజకీయ రుగ్మతలకి మందులుండవు. ఎర్రగడ్డ పిలుస్తోంది రా! కదిలిరా! లగడపాటీ! తలకి రోకలి చుట్టుకొని రా కదలిరా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement