మోడీకి ముసలం! | Will DG Vanzara derail Narendra Modi's PM ambitions? | Sakshi
Sakshi News home page

మోడీకి ముసలం!

Published Wed, Sep 4 2013 8:36 PM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM

మోడీకి ముసలం! - Sakshi

మోడీకి ముసలం!

'నరేంద్ర మోడీని దేవుడుగా భావించాను. కానీ ఆయన చెప్పుడు మాటలు విని మాకు వెన్నుపోటు పొడిచాడు' అంటూ వివాదస్పద ఐపీఎస్ డీజీ వంజారా సంధించిన రాజీనామా లేఖాస్త్రం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. హస్తినవైపు అడుగులు వేస్తున్న 'నమో'కు వంజారా రూపంలో మరో అడ్డంకి ఎదురయింది. ఒకప్పుడు తనకెంతో సన్నిహితుడిగా మెలిగిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ మంగళవారం నాడు (సెప్టెంబర్ 3న) తన సర్వీసుకు రాజీనామా చేశారు. ఆయన పంపిన 10 పేజీల రాజీనామా లేఖ మోడీని ఇరకాటంలో పడేసింది.

సొహ్రాబుద్దీన్ తదితర బూటకపు ఎన్‌కౌంటర్ కేసుల్లో ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన వంజారా 987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. మోడీకి సన్నిహితంగా మెలిగిన ఆయన 2007నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతీ కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయనతో పాటు 32 మంది పోలీసు అధికారులు కూడా బూటకపు ఎన్‌కౌంటర్ ఆరోపణలతో ఊచలు లెక్కపెడుతున్నారు. సర్కారు విధానాలనే అమలు చేసిన తాము ఇప్పుడు కష్టాల్లో ఉంటే సర్కారుకు చీమకుట్టినట్టయినా లేకపోవడంతో వంజారా రాజీనామా పేరుతో తన 'దేవుడి'కి లేఖ సంధించారు.

గోద్రా హింసాకాండ తర్వాత ఉగ్రవాదం అణచివేతలో ఏమాత్రం రాజీ పడకూడదన్న మోడీ ప్రభుత్వ విధానాన్నే తాము అమలు చేశామని లేఖలో పేర్కొన్నారు. తనతోపాటు బూటకపు ఎన్‌కౌంటర్ల కేసులో జైల్లో ఉన్న అధికారులందరూ ప్రభుత్వ విధానాన్నే పాటించారని వెల్లడించారు. తప్పంతా విధానాలను రూపొందించిన ప్రభుత్వానిదని, అందువల్ల దాన్ని సబర్మతీ జైల్లోగానీ, నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైల్లోగానీ పెట్టాలని డిమాండ్ చేశారు. పరోక్షంగా మోడీని బాధ్యుడిని చేశారు. మోడీని నాటి రాష్ట్ర హోంమంత్రి అమిత్‌షా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.

వంజారా అందించిన లేఖాస్త్రంతో మోడీపై కాంగ్రెస్ దాడికి దిగింది. ముఖ్యమంత్రి పదవి నుంచి మోడీ తప్పుకోవాలని, ఆయనపై సీబీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. అటు బీజేపీ తమ నాయకుడిని వెనకేసుకొచ్చింది. మరోవైపు వంజారా రాజీనామాను గుజరాత్ ప్రభుత్వం ఆమోదించలేదు. బీజేపీ ప్రధాని అభ్యర్థి రేసులో ముందున్న మోడీకి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. 'గోద్రా' అలర్లు ఆయనను నీడలా వెంటాడుతున్నాయి. కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన మోడీకి హస్తిన బాటలో మరెన్ని సవాళ్లు ఎదురుకానున్నాయో చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement