godhra riots
-
గుజరాత్ అల్లర్లు
గుజరాత్‌లోని గోధ్ర రైల్వే స్టేషన్ సమీపంలో సబర్బతీ ఎక్స్‌ప్రెస్ రైలు దహనమై 59 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు స్థలం వద్దకు కరసేవకు వెళ్లి తిరిగి వస్తున్న హిందూ యాత్రికులే ఆ ఘటనలో అత్యధికంగా ఉన్న మృతులు. 2002 ఫిబ్రవరి 27న ఈ దారుణమైన ఘటన జరిగింది. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ ప్రభుత్వం దీనిపై దర్యాప్తు కమిషన్‌ను నియమించింది. ఆరేళ్ల దర్యాప్తు తర్వాత వెయ్యి నుంచి రెండు వేల మంది వరకు ఉన్న మూక ఈ దహనకాండకు పాల్పడినట్లు కమిషన్ వెల్లడించింది. గోధ్ర ఘటన అనంతరం గుజరాత్లో మతకలహాలు చెలరేగాయి. గోధ్రలో జరిగిన దానికి పర్యవసానంగా అహ్మదాబాద్‌లో హింసాకాండ కార్చిచ్చులా వ్యాపించింది. మొదటి కొద్ది గంటల్లో ఒక వర్గంపై ఇంకో వర్గం ప్రతీకారాగ్నితో విరుచుకుపడింది. తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆ మతకలహాల మారణకాండలో ఇరు వర్గాలకు చెందిన నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు 2,800 కి.మీ. పాకిస్థాన్ సరిహద్దు పొడవునా మందు పాతరలు అమర్చుతున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటన. హెలికాప్టర్ కూలి లోక్‌సభ స్పీకర్ గంటి మోహనచంద్ర బాలయోగి దుర్మరణం. భారత వైమానిక దళంలోకి సుఖోయ్ 30 ఎం.ఎ.ఐ. యుద్ధ విమానం. (చదవండి: ఫూలన్‌దేవి హత్య 25 జూలై 2001) -
అప్పుడే మోదీకి సపోర్ట్ చేశాం: సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ముంబై: గుజరాత్లో గోద్రా అల్లర్ల తరువాత అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రే మద్దతుగా నిలిచారని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం ఓ సభలో మాట్లాడుతూ.. ‘గోద్రా అల్లర్ల తరువాత మోదీ హఠావో ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలోనే ఆద్వానీ ఓ ర్యాలీ కోసం ముంబై వచ్చారు. అప్పుడు బాలా సాహెబ్‌తో మాట్లాడుతూ.. మోదీని తొలగించాల్సి ఉంటుందా అని అడిగారు. దీనిపై బాలా సాహెబ్ స్పందిస్తూ.. లేదు అతని జోలికి వెళ్లకండి. ‘మోదీ గయాతో గుజరాత్ గయా’(మోదీ పోతే, గుజరాత్ పోయినట్లే) అని తెలిపారు. మోదీ ప్రధానమంత్రి అవుతారని ఊహించలేదు. కానీ మేము హిందుత్వానికి మద్దతు ఇచ్చాం’ అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇప్పటికి కూడా మోదీతో సత్సంబంధాలు ఉన్నాయని, కానీ దానర్థం పొత్తు పెట్టుకుంటామని కాదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో మసీదుల్లో లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసా పారాయణం వంటి వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో హిందుత్వంపై శివసేన వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖల్యు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చదవండి: ఒక్క అవకాశం ఇవ్వండి.. అలా చేయకుంటే తరిమికొట్టండి: కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలు పశ్చిమ బెంగాల్‌లాగే మహారాష్ట్రలో త్వరలో ప్రతిఘటనను ఎదుర్కోవచ్చని తెలిపారు. ‘ప్రతిదానికి ఓ పరిమితి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ వెళ్లాలంటే కేంద్ర ఏజెన్సీలు భయపడుతున్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి రాకూడదు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర సంస్థలను ఉపయోగించుకోకూడదు. రాజకీయ నాయకులు చేసిన దానికి అధికారులు భయపడుతున్నారు. ప్రధాని దేశం మొత్తానికి. ఆయన దేశ శత్రువులతో పోరాడాలి. అదే విధంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రేపై సీఎం విరుచుకుపడ్డారు. కొంతమంది ఎప్పటికీ జెండాలు మారుస్తూనే ఉంటారని విమర్శించారు. ‘ముందుగా వారు మరాఠీయేతరులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడేమో హిందువేతరులపై దాడులు చేస్తున్నారు. ఇది మార్కెటింగ్ కాలం. ఇది పని చేయకుంటే ఇంకొకటి. లౌడ్ స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఒక మతం గురించి చెప్పిందని నేను అనుకోను. మార్గదర్శకాలు అన్ని మతాలకు వర్తిస్తాయి’ అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. చదవండి: 118 ఏళ్ల వ్యక్తి ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసా.. చాక్లెట్, ఓ గ్లాస్ వైన్ -
గోద్రా అల్లర్లు: మోదీ పేరు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : 2002 నాటి గోద్రా అల్లర్ల కేసులో నరేంద్ర మోదీ నుంచి తమకు నష్టపరిహారం కల్పించాలంటూ గుజరాత్‌లోని సబర్కంతా దిగువ న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. గోద్రా అల్లర్లలో నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేయం ఉందని నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందుకు వ్యాజ్యం నుంచి ఆయన పేరును తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. నాటి అల్లర్ల సమయంలో ప్రత్యర్థి దాడిలో హత్య గురైన మరణించిన ముగ్గురు ముస్లిం వ్యక్తుల తరఫున బ్రిటన్‌కు చెందిన ఓ కుటుంబం స్థానిక కోర్టులో 2004లో వ్యాజ్యం దాఖలు చేసింది. తమ కుటుంబ సభ్యుల మృతికి నాటి సీఎం నరేంద్ర మోదీనే కారణమని, ఆయన నుంచి 24 కోట్ల రూపాయలు నష్ట పరిహారం కల్పించాలని పిటిషన్లో డిమాండ్ చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన దిగువ కోర్టు.. నాటి అల్లర్లకు మోదీనే కారణమని చెప్పలేనమి పిటిషన్ నుంచి ఆయన పేరును తొలగిస్తున్నట్లు ఆదివారం తీర్పును వెలువరించింది. మోదీకి క్లీన్ చిట్ కాగా 2002 నాటి గోద్రా అల్లర్ల కేసులో కేంద్ర ప్రభుత్వ నియమించిన నానావతి కమిషన్ మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ 2014 ఎన్నికల వరకు గుజరాత్ సీఎంగా పని చేశారు. ఆయన హయాంలో జరిగిన గోద్రా అల్లర్ల ఘటన తర్వాత.. చెలరేగిన హింసాత్మక ఘటనల్లో వెయ్యి మందికిపైగా చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మైనార్టీలే. ఇందులో మోదీ ప్రమేయం ఉందడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అల్లరి మూకలను నియంత్రించడంలో పోలీసుల వైఫల్యమే కారణమని నానావతి కమిషన్ నివేదికలో తెలిపింది. (నాటి మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్) సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీల దహనం పక్కా ప్రణాళికతో చేసిందేనని.. తర్వాత జరిగిన అల్లర్లు మాత్రం ప్రణాళికా బద్ధంగా జరిగినవి కావని నానావతి కమిషన్ తెలిపింది. ఈ అల్లర్ల వెనుక రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మంత్రి ప్రమేయం ఉందనడానికి లేదా.. వారి ప్రోద్బలంతోనే దాడులు జరిగాయనడానికి ఆధారాలు లేవని కమిషన్ తన నివేదికలో వెల్లడించింది. 1500 పేజీలతో తొమ్మిది సంచికలుగా ఈ నివేదికను రూపొందించింది. విచారణ ఇలా.. ఈ అల్లర్ల కేసు విచారణకు గుజరాత్ హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి కేజీ షాతో 2002 మార్చి 6న నాటి సీఎం మోదీ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ ఆయనతో మోదీకి ఉన్న సాన్నిహిత్యం కారణంగా మానవ హక్కుల సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దీంతో సుప్రీం రిటైర్డ్ జస్టిస్ జీటీ నానావతి పేరును కూడా కమిషన్‌లో చేర్చారు. మధ్యంతర నివేదిక సమర్పించడానికి ముందే షా చనిపోవడంతో.. గుజరాత్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ అక్షయ్ మెహతాను ఈ కమిషన్‌లో సభ్యుడిగా చేర్చారు. 2008 సెప్టెంబర్‌లో నివేదిక తొలి భాగాన్ని ప్రభుత్వానికి సమర్పించిన కమిషన్.. 2014 నవంబర్ 18నన నాటి గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్‌కు మరో నివేదికను సమర్పించింది. -
మోదీ మౌనంపై పుస్తకం.. కేసు నమోదు
సాక్షి, న్యూఢిల్లీ : గోద్రా అల్లర్ల సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉన్నారంటూ ముగ్గురు రచయితలు విడుదల చేసిన పుస్తకం అసోంలో వివాదంగా మారింది. అసొంలో 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకంలో గోద్రా అల్లర్లపై ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రచయితలు 2011లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. సీఎంగా ఉన్న మోదీ అల్లర్లపై మౌనం వహించారని, దీంతో ఎంతో మంది అమాయక ప్రజల మరణానికి ఆయన కారణం అయ్యారని పుస్తకంలో వారు పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పుస్తకాన్ని ముద్రించారని, దానిని వెంటనే బ్యాన్ చేయాలని కోరుతూ సుమిత్రా గోస్వామి, మానవ్ జ్యోతిలు పిటిషన్ దాఖలు చేశారు. మోదీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, విద్యార్థులకు తప్పుడు సమాచారాన్ని ఇస్తూ పుస్తకాన్ని ముద్రించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పుస్తక రచయితలైన దుర్గా శర్మ, అఫిక్ జామాన్, బుర్హాన్‌లపై అసోంలోని గల్హట్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. దీనిపై రచయితలు స్పందిస్తూ.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఆర్టీ) సిలబస్ ప్రకారమే పుస్తకాన్ని రచించామని.. మోదీని తప్పుపట్టే విధంగా దానిలో ఎలాంటి అంశాలు లేవని రచయితలు తెలిపారు. 2011 నుంచి ఆ పుస్తకం పబ్లిష్ అవుతోందని ఇప్పుడు అనవసరంగా దానిపై వివాదం చేస్తున్నారని వారు వాపోయారు. దీనిపై అసోం విద్యాశాఖ మంత్రి సిద్దార్ధ భట్టాచార్య మాత్రం స్పందించేందుకు నిరాకరించారు. కాగా 2002 ఫిబ్రవరిలో గోద్రా సమీపంలో సబర్మతి రైలు తగలబడడంతో దాదాపు 57కిపైగా ప్రయాణికుల దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన మతఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అప్పట్లో సీఎంగా ఉన్న మోదీపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. -
టీడీపీ-బీజేపీ ఫైట్; తెరపైకి గోద్రా అల్లర్లు
సాక్షి, రాజమండ్రి: నాలుగేళ్లు ఉమ్మడిగా అధికారాన్ని పంచుకున్న టీడీపీ-బీజేపీలు ఇప్పుడు బద్ధశత్రువుల్లా కలహించుకుంటున్నవేళ గోద్రా అల్లర్ల వ్యవహారం మళ్లీ చర్చకు వచ్చింది. 2002నాటి గోద్రా అల్లర్లకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న (అప్పటి గుజరాత్ సీఎం) నరేంద్ర మోదీని ఏపీలో అడుగుపెట్టనివ్వబోనని చంద్రబాబు శపథం చేయడం తెలిసిందే. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఇరువురు నేతలూ కలిసిపోయి, కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. కానీ, నాటి బాబు వ్యాఖ్యలను మోదీ ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారని, ఆ కక్షతోనే ఏపీకి అన్యాయం చేస్తున్నారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ గోద్రా అల్లర్లను ప్రస్తావించారు. ‘‘గోద్రాలో మైనారిటీల ఊచకోతను చంద్రబాబు ఖండించారు. అప్పటి నుంచే బాబుపై మోదీ కక్ష పెంచుకున్నారు’’ అని గోరంట్ల వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమిలో చేరి టీడీపీ నష్టపోయిందని, కేంద్రంలో టీడీపీకి పనికిమాలిన శాఖలు దక్కితే, ఏపీలో మాత్రం బీజేపీకి ముఖ్యమైన శాఖలు ఇచ్చామని అన్నారు. వీర్రాజుకు కౌంటర్: టీడీపీపై ఎడతెగని విమర్శలు చేస్తోన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైనా గోరంట్ల ఫైరయ్యారు. ‘‘వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వీర్రాజు.. ఇవాళ మాపై విమర్శలు చేస్తున్నారు. ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజమండ్రి రూరల్‌లో నాపై పోటీకి రావాలి. రాజమండ్రిలో అమిత్ షా సభ పెడితే వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిన ఘనత వీర్రాజుది’’ అని మండిపడ్డారు. -
గోధ్రా అనంతర అల్లర్లు: నిందితులంతా నిర్దోషులే
గోధ్రా అనంతర అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 26 మందీ నిర్దోషులేనని గాంధీనగర్ కోర్టు తీర్పు చెప్పింది. వారిపై తగిన సాక్ష్యాధారాలు లేనందున వారిని నిర్దోషులుగా వదిలిపెట్టింది. కోర్టు వదిలిపెట్టినవారిలో కలోల్ నాగరిక్ సహకారీ బ్యాంకు ప్రస్తుత చైర్మన్ గోవింద్ పటేల్ కూడా ఉన్నారు. నిందితులంతా చాలా కాలం నుంచి బెయిల్ మీద విడుదలై ఉన్నారు. 2002 ఫిబ్రవరి 27వ తేదీన గోధ్రా రైల్వేస్టేషన్లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలును తగలబెట్టిన తర్వాత, ఆ మర్నాడు.. అంటే 28వ తేదీన గాంధీనగర్ జిల్లాలోని కలోల్ తాలూకా పాలియాడ్ గ్రామంలో మైనారిటీలకు చెందిన ఆస్తులను ధ్వంసం చేసి, అక్కడ దోపిడీ, దారుణాలు చేశారన్న కేసులో ఈ 26 మంది నిందితులుగా ఉన్నారు. ఆరోజు మొత్తం 250 మందితో కూడిన గుంపు ఒకటి ఆ ప్రాంతంపై దాడి చేసి దర్గాలో కొంత భాగాన్ని కూడా ధ్వంసం చేసిందని పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో అరోపించారు. కలోల్ అదనపు జిల్లా జడ్జి బీడీ పటేల్ ఈ కేసులో తీర్పు వెల్లడించారు. ఈ కేసులో సాక్షులంతా తాము నిందితులను గుర్తించలేమని చెప్పడంతో కేసును రుజువు చేసేందుకు తగిన సాక్ష్యాధారాలు ఏమీ లేవని జడ్జి చెప్పారు. పైగా, ఇప్పటికే నిందితులతో రాజీకి వచ్చినందున తమకు ఎవరిపైనా కోపం లేదని కూడా వాళ్లు కోర్టుకు తెలిపారు. మతసామరస్యాన్ని సాధించే ప్రయత్నాలలో భాగంగా నిందితులు ఇప్పటికే మైనారిటీలకు తగిన నష్టపరిహారం చెల్లించారని డిఫెన్సు న్యాయవాది భవేష్ రావల్ కోర్టుకు తెలిపారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలును తగలబెట్టడంతో ఆరోజు ఎస్-6 బోగీలో ఉన్న 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో గుజరాత్లో భారీ ఎత్తున అల్లర్లు చెలరేగాయి. వాటిలో మైనారిటీ వర్గానికి చెందిన దాదాపు వెయ్యి మంది వరకు మరణించారు. -
వాజ్‌పేయితో సంప్రదింపులు బయటపెట్టొచ్చా?
గుజరాత్ ప్రభుత్వం, మోడీల ఆమోదం కోరిన పీఎంఓ న్యూఢిల్లీ: గోధ్రా అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని వాజ్‌పేయితో జరిపిన సంప్రదింపులను బహిర్గత పరచడంపై గుజరాత్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆమోదాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) కోరింది. అయితే గతంలో ఆ సమాచారాన్ని బహిర్గతపరచడానికి పీఎంఓ కేంద్ర ప్రజా సమాచార అధికారి (సీపీఐఓ) ఎస్ఈ రిజ్వీ నిరాకరించారు. ఆర్టీఐ యాక్ట్ 8 (1)(హెచ్) ప్రకారం ఏవిధమైన కారణాలు చూపకుండానే ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆర్టీఐ ద్వారా సమాచారం కోరిన దరఖాస్తుదారుడు అభ్యతరం చెప్పారు. ఆ సమాచారం ఇవ్వకపోవడానికి సరైన కారణాలు చూపించలేదని అతడు ఆరోపించాడు. పదకొండేళ్ల క్రితం జరిగిన ఆ సంప్రదింపులను బహిర్గతం చేయడం వల్ల విచారణపై ప్రభావం పడదని, అది నిందితులకు ఆందోళన కలిగించే అంశం కూడా కాదని ఆయన చెప్పారు. దీనిని సమర్థించిన అప్పీలేట్ అథారిటీ ఆ కేసుకు సంబంధించిన అదనపు సమాచారం ఇవ్వాల్సిందిగా సీపీఐఓకు సూచించిం ది. తాజా సమాచారాన్ని పదిహేను రోజుల్లోగా దరఖాస్తుదారునకు అందించాలని అప్పీలేట్ అథారిటీ, పీఎంఓ డెరైక్టర్ కృష్ణన్ కుమార్ నిర్ణయించారు. దీంతో ఆర్టీఐ యాక్ట్ 11 (1) ప్రకారం థర్డ్‌పార్టీ అయి న గుజరాత్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మోడీలకు అప్పీలేట్ నిర్ణయాన్ని తెలిపామని రిజ్వీ చెప్పారు. -
గోధ్రా సమయంలో నేనుంటే మోడీ కంటే బాగా అణిచేసేవాడిని: పారిక్కర్
గుజరాత్లో 2002లో జరిగిన గోధ్రా అనంతర అల్లర్ల సమయంలో అక్కడ తానుంటే, మోడీ కంటే బాగా వాటిని అణిచేసేవాడినని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇండియా బ్లాగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ''అప్పట్లో అల్లర్లను యంత్రంగం బాగా అణిచేసి ఉండాలి. కానీ, మోడీ అప్పటికి ముఖ్యమంత్రి పదవి కొత్తగా చేపట్టారు. నేను ఉండి ఉంటే మరింత బాగా అణిచేసేవాడిని. మోడీ మీద ఆ మరక పడింది గానీ, వ్యక్తిగతంగా ఆయన అల్లర్లకు బాధ్యుడు కాడు. దోషి అయి ఉంటే ఈపాటికే ఆయనకు శిక్ష పడేది. ఆయనంటే భయపడేవాళ్లే మోడీని వ్యతిరేకిస్తారు'' అన్నారు. అల్లర్లకు కారణం యంత్రాంగం వైఫల్యమేనని పారిక్కర్ అన్నారు. ప్రధాని పదవికి తాను తగిన అభ్యర్థిని కానే కానని, మోడీ యువతకు ఆశాజ్యోతిగా ఎదిగారని అన్నారు. యువత మొత్తం మోడీని ప్రధానిగా చూడాలనుకుంటోందని, ఆయన ప్రధాని కావాలంటే వాళ్లు తమ ప్రతినిధులుగా సరైనవారిని ఎన్నుకోవాలని చెప్పారు. ఇక గోవాలో కేథలిక్కులు సాంస్కృతిక పరంగా హిందువుల లాంటివాళ్లేనంటూ పారిక్కర్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. భారతదేశ సాంస్కృతిక మూలాల్లో హిందూత్వం ఉందని, గోవాలో కేథలిక్కులకు, బ్రెజిల్‌లోని వారికి అసలు పోలికే లేదని.. చాలావరకు ఇక్కడి కేథలిక్కులు హిందువుల ఆచారాలనే పాటిస్తారని ఆయన అన్నారు. గోవా జనాభాలో దాదాపు 30 శాతం మంది కేథలిక్కులే. గతంలో గోవా అసెంబ్లీలో 24 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ, ఏకంగా 8 మంది కేథలిక్కులను అభ్యర్థులుగా నిలబెట్టింది. కొందరు టీవీ చానళ్ల వాళ్లు అనుకుంటున్నట్లుగా తాను కత్తిపట్టుకుని ముస్లింలను నరకడానికి వెళ్లేలాంటి హిందూత్వ వాదిని కానని పారిక్కర్ స్పష్టం చేశారు. -
మోడీకి ముసలం!
'నరేంద్ర మోడీని దేవుడుగా భావించాను. కానీ ఆయన చెప్పుడు మాటలు విని మాకు వెన్నుపోటు పొడిచాడు' అంటూ వివాదస్పద ఐపీఎస్ డీజీ వంజారా సంధించిన రాజీనామా లేఖాస్త్రం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. హస్తినవైపు అడుగులు వేస్తున్న 'నమో'కు వంజారా రూపంలో మరో అడ్డంకి ఎదురయింది. ఒకప్పుడు తనకెంతో సన్నిహితుడిగా మెలిగిన ఈ ఐపీఎస్ ఆఫీసర్ మంగళవారం నాడు (సెప్టెంబర్ 3న) తన సర్వీసుకు రాజీనామా చేశారు. ఆయన పంపిన 10 పేజీల రాజీనామా లేఖ మోడీని ఇరకాటంలో పడేసింది. సొహ్రాబుద్దీన్ తదితర బూటకపు ఎన్కౌంటర్ కేసుల్లో ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన వంజారా 987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. మోడీకి సన్నిహితంగా మెలిగిన ఆయన 2007నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతీ కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయనతో పాటు 32 మంది పోలీసు అధికారులు కూడా బూటకపు ఎన్కౌంటర్ ఆరోపణలతో ఊచలు లెక్కపెడుతున్నారు. సర్కారు విధానాలనే అమలు చేసిన తాము ఇప్పుడు కష్టాల్లో ఉంటే సర్కారుకు చీమకుట్టినట్టయినా లేకపోవడంతో వంజారా రాజీనామా పేరుతో తన 'దేవుడి'కి లేఖ సంధించారు. గోద్రా హింసాకాండ తర్వాత ఉగ్రవాదం అణచివేతలో ఏమాత్రం రాజీ పడకూడదన్న మోడీ ప్రభుత్వ విధానాన్నే తాము అమలు చేశామని లేఖలో పేర్కొన్నారు. తనతోపాటు బూటకపు ఎన్కౌంటర్ల కేసులో జైల్లో ఉన్న అధికారులందరూ ప్రభుత్వ విధానాన్నే పాటించారని వెల్లడించారు. తప్పంతా విధానాలను రూపొందించిన ప్రభుత్వానిదని, అందువల్ల దాన్ని సబర్మతీ జైల్లోగానీ, నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైల్లోగానీ పెట్టాలని డిమాండ్ చేశారు. పరోక్షంగా మోడీని బాధ్యుడిని చేశారు. మోడీని నాటి రాష్ట్ర హోంమంత్రి అమిత్‌షా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. వంజారా అందించిన లేఖాస్త్రంతో మోడీపై కాంగ్రెస్ దాడికి దిగింది. ముఖ్యమంత్రి పదవి నుంచి మోడీ తప్పుకోవాలని, ఆయనపై సీబీఐతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. అటు బీజేపీ తమ నాయకుడిని వెనకేసుకొచ్చింది. మరోవైపు వంజారా రాజీనామాను గుజరాత్ ప్రభుత్వం ఆమోదించలేదు. బీజేపీ ప్రధాని అభ్యర్థి రేసులో ముందున్న మోడీకి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. 'గోద్రా' అలర్లు ఆయనను నీడలా వెంటాడుతున్నాయి. కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన మోడీకి హస్తిన బాటలో మరెన్ని సవాళ్లు ఎదురుకానున్నాయో చూడాలి.