గుజరాత్లో 2002లో జరిగిన గోధ్రా అనంతర అల్లర్ల సమయంలో అక్కడ తానుంటే, మోడీ కంటే బాగా వాటిని అణిచేసేవాడినని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇండియా బ్లాగ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ''అప్పట్లో అల్లర్లను యంత్రంగం బాగా అణిచేసి ఉండాలి. కానీ, మోడీ అప్పటికి ముఖ్యమంత్రి పదవి కొత్తగా చేపట్టారు. నేను ఉండి ఉంటే మరింత బాగా అణిచేసేవాడిని. మోడీ మీద ఆ మరక పడింది గానీ, వ్యక్తిగతంగా ఆయన అల్లర్లకు బాధ్యుడు కాడు. దోషి అయి ఉంటే ఈపాటికే ఆయనకు శిక్ష పడేది. ఆయనంటే భయపడేవాళ్లే మోడీని వ్యతిరేకిస్తారు'' అన్నారు. అల్లర్లకు కారణం యంత్రాంగం వైఫల్యమేనని పారిక్కర్ అన్నారు. ప్రధాని పదవికి తాను తగిన అభ్యర్థిని కానే కానని, మోడీ యువతకు ఆశాజ్యోతిగా ఎదిగారని అన్నారు. యువత మొత్తం మోడీని ప్రధానిగా చూడాలనుకుంటోందని, ఆయన ప్రధాని కావాలంటే వాళ్లు తమ ప్రతినిధులుగా సరైనవారిని ఎన్నుకోవాలని చెప్పారు.
ఇక గోవాలో కేథలిక్కులు సాంస్కృతిక పరంగా హిందువుల లాంటివాళ్లేనంటూ పారిక్కర్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. భారతదేశ సాంస్కృతిక మూలాల్లో హిందూత్వం ఉందని, గోవాలో కేథలిక్కులకు, బ్రెజిల్లోని వారికి అసలు పోలికే లేదని.. చాలావరకు ఇక్కడి కేథలిక్కులు హిందువుల ఆచారాలనే పాటిస్తారని ఆయన అన్నారు. గోవా జనాభాలో దాదాపు 30 శాతం మంది కేథలిక్కులే. గతంలో గోవా అసెంబ్లీలో 24 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ, ఏకంగా 8 మంది కేథలిక్కులను అభ్యర్థులుగా నిలబెట్టింది. కొందరు టీవీ చానళ్ల వాళ్లు అనుకుంటున్నట్లుగా తాను కత్తిపట్టుకుని ముస్లింలను నరకడానికి వెళ్లేలాంటి హిందూత్వ వాదిని కానని పారిక్కర్ స్పష్టం చేశారు.
గోధ్రా సమయంలో నేనుంటే మోడీ కంటే బాగా అణిచేసేవాడిని: పారిక్కర్
Published Thu, Sep 5 2013 11:00 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement