గోధ్రా అనంతర అల్లర్లు: నిందితులంతా నిర్దోషులే
గోధ్రా అనంతర అల్లర్లు: నిందితులంతా నిర్దోషులే
Published Fri, Feb 3 2017 4:35 PM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM
గోధ్రా అనంతర అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 26 మందీ నిర్దోషులేనని గాంధీనగర్ కోర్టు తీర్పు చెప్పింది. వారిపై తగిన సాక్ష్యాధారాలు లేనందున వారిని నిర్దోషులుగా వదిలిపెట్టింది. కోర్టు వదిలిపెట్టినవారిలో కలోల్ నాగరిక్ సహకారీ బ్యాంకు ప్రస్తుత చైర్మన్ గోవింద్ పటేల్ కూడా ఉన్నారు. నిందితులంతా చాలా కాలం నుంచి బెయిల్ మీద విడుదలై ఉన్నారు. 2002 ఫిబ్రవరి 27వ తేదీన గోధ్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలును తగలబెట్టిన తర్వాత, ఆ మర్నాడు.. అంటే 28వ తేదీన గాంధీనగర్ జిల్లాలోని కలోల్ తాలూకా పాలియాడ్ గ్రామంలో మైనారిటీలకు చెందిన ఆస్తులను ధ్వంసం చేసి, అక్కడ దోపిడీ, దారుణాలు చేశారన్న కేసులో ఈ 26 మంది నిందితులుగా ఉన్నారు. ఆరోజు మొత్తం 250 మందితో కూడిన గుంపు ఒకటి ఆ ప్రాంతంపై దాడి చేసి దర్గాలో కొంత భాగాన్ని కూడా ధ్వంసం చేసిందని పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో అరోపించారు.
కలోల్ అదనపు జిల్లా జడ్జి బీడీ పటేల్ ఈ కేసులో తీర్పు వెల్లడించారు. ఈ కేసులో సాక్షులంతా తాము నిందితులను గుర్తించలేమని చెప్పడంతో కేసును రుజువు చేసేందుకు తగిన సాక్ష్యాధారాలు ఏమీ లేవని జడ్జి చెప్పారు. పైగా, ఇప్పటికే నిందితులతో రాజీకి వచ్చినందున తమకు ఎవరిపైనా కోపం లేదని కూడా వాళ్లు కోర్టుకు తెలిపారు. మతసామరస్యాన్ని సాధించే ప్రయత్నాలలో భాగంగా నిందితులు ఇప్పటికే మైనారిటీలకు తగిన నష్టపరిహారం చెల్లించారని డిఫెన్సు న్యాయవాది భవేష్ రావల్ కోర్టుకు తెలిపారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలును తగలబెట్టడంతో ఆరోజు ఎస్-6 బోగీలో ఉన్న 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో గుజరాత్‌లో భారీ ఎత్తున అల్లర్లు చెలరేగాయి. వాటిలో మైనారిటీ వర్గానికి చెందిన దాదాపు వెయ్యి మంది వరకు మరణించారు.
Advertisement