జిప్ అప్ హుర్రె
భారతీయ వనితకు అందం సంప్రదాయ చీరతోనే వస్తుంది. ఎన్ని మోడర్న్ డ్రెస్‌లు వేసినా కూడా.. అచ్చమైన ఆడపిల్లలా కనిపించాలంటే చీరతో సింగారించుకోవాల్సిందే. చీరకట్టులో అందం చూసి దానికి ఫ్యాన్స్ అయిపోయిన విదేశీ వనితలూ ఉన్నారు. చేయి తిరిగిన పడుచులకు కూడా శారీ కట్టుకోవడానికి 15 నిమిషాలు కావాల్సిందే. అదే అలవాటు లేని ఆడవాళ్లకు చీర కట్టుకోవడం కత్తిమీద సామే. అందంగా కట్టుకున్నా.. కుచ్చుళ్లు ఎక్కడ జారిపోతాయో అని టెన్షన్ కొందరిది. వీరి టెన్షన్‌కు చెక్ పెడుతూ ఇన్‌స్టా శారీస్ తీసుకొచ్చారు ఫ్యాషన్ డిజైనర్లు. ఈ రెడీమేడ్ శారీని లాంగ్ ఫ్రాక్ వేసుకున్నట్టు వేసుకుని జిప్ లాగితే సరి.. శారీలో సెట్ అయిపోతారు.
నయా ట్రెండ్స్‌తో ఫ్యాషన్ మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్న డిజైనర్లు.. రోజుకో వెరైటీ కాస్ట్యూమ్స్‌తో అదరగొడుతున్నారు. శారీస్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, వాటికి తమ క్రియేటివిటీ జోడించి మరిన్ని మెరుగులు అద్దుతున్నారు. ఇన్నాళ్లూ డిఫరెంట్ శారీస్‌తో మార్కులు కొట్టేసిన వీళ్లు.. చీరకట్టును ఈజీ చేస్తూ ఇన్‌స్టా శారీలను తీసుకొచ్చారు. జస్ట్ జిప్‌తో ఈజీగా ధరించే విధంగా డిజైన్ చేశారు. ట్రెడిషన్‌ను మిస్ చేయకుండా బ్లౌజ్ అటాచ్‌మెంట్‌తో ఈ చీరలు వస్తున్నాయి. బ్లెండెడ్ సిల్క్, ఫ్రెంచ్ లేస్, ఫాలోయింగ్ నెట్ వంటి మెటీరియల్స్‌తో ఈ కస్టమైజ్డ్ శారీస్ ప్రిపేర్ చేస్తున్నారు.
అమ్మాయిలకు వరం..
ఈ ఫాస్ట్ గోయింగ్ వరల్డ్‌లో శారీ డ్రేపింగ్‌తో ఇబ్బంది పడే అమ్మాయిలకు ఇది ఒక వరం. ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు చీరలు కట్టుకునే టైం కూడా ఉండదు. వారికి కూడా ఈ రకం చీరలు ఎంతో హెల్ప్ చేస్తాయి. పార్టీల్లో స్పెషల్‌గా, యూనిక్‌గా కనిపించాలని భావించే వాళ్లు ‘ఇన్‌స్టా శారీస్’ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కలెక్షన్లలో రస్టిక్ రెడ్, ఎమరాల్డ్ గోల్డ్, బోల్డ్ గోల్డ్, బ్రిలియంట్ పింక్ వంటి రంగుల్లో కనిపిస్తున్నాయి. వీటి ధర రూ.9,000 నుంచి రూ.20 వేల వరకు ఉంది.
- నీతా, సఖి ఫ్యాషన్స్ డిజైనర్
శిరీష చల్లపల్లి