కర్కాటకం రాశి ఫలాలు | Ugadi Panchangam 2019 | Cancer Horoscope 2019-20 in Telugu - Sakshi
Sakshi News home page

వికారినామ సంవత్సర (కర్కాటక రాశి ) రాశిఫలాలు

Published Sun, Mar 31 2019 12:10 AM | Last Updated on Tue, Apr 2 2019 6:27 PM

2019 To 2020  Cancer Zodiac Sign Horoscope - Sakshi

కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆరింట శని కేతువుల సంచారం, షష్ఠమ, సప్తమ స్థానాలలో గురుగ్రహ సంచారం, వ్యయంలో రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. క్రమశిక్షణ, విద్యారంగం పట్ల ఆసక్తి, ఆధునిక విద్య, వినూత్న వ్యాపారాలలో శ్రద్ధ, రాణింపు ఉంటాయి. సంఘంలో మంచి పేరుప్రతిష్ఠలు కలిగి ఉంటారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. అంతరాత్మసాక్షికి విరుద్ధంగా ఏ పనీ చేయలేరు. అవకాశం ఉండి కూడా సొంత వాళ్ళకు సహాయం చేయలేదనే నిందలు మోయాల్సి వస్తుంది. ఆత్మీయులు ప్రతిభాపాటవాలు సాధించాలని కోరుకుంటారు. ఉన్నతస్థానంలో ఉండి కూడా అయినవాళ్లకు ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుుతుంది. సమాజానికి, ధర్మానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు. సొంత వర్గానికి చెందిన వ్యక్తులతోనే బద్ధవైరం ఏర్పడుతుంది. మీతో మంచిగా ఉండి కావాల్సినవి సాధించుకున్నవారు మీ వ్యక్తిత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. దిక్కుమాలిన స్నేహాలు కొంపదీస్తాయి. దానధర్మాలు అధికంగా చేస్తారు. మీకు అందే సహాయ సహకారాలు కూడా గొప్పగానే ఉంటాయి. పేరుప్రతిష్ఠలకు వృత్తిలో ప్రాధాన్యం ఇస్తారు. డబ్బుకోసం తాపత్రయపడరు. ధనమే మీ చుట్టూ తిరగాలని కోరుకుంటారు. స్త్రీ, పురుష విచక్షణ లేకుండా సంతానం ఆనందించేలా చూస్తారు. ఉద్యోగంలో బదిలీ మీ అభిష్టానికి వ్యతిరేకంగా జరుగదు.

 ముఖ్యమైన బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రత్యామ్నాయం లేదు కనుక మీరే‡ దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం నేర్పరితనం మిమ్ములను నిలబెడతాయి. మీ ప్రతిభ విదేశాలలో రాణిస్తుంది. మీ వాళ్ళకు ప్రభుత్వపరమైన స్కాలర్‌షిప్స్, ప్రభుత్వపరమైన స్కీమ్స్‌ ద్వారా లబ్ధి చేకూరుతుంది. కుల మత వర్గ వివక్ష లేకుండా పని చేసుకుపోయే మీమీద ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్రపడుతుంది. అనుకున్న కార్యక్రమాలు సంతృప్తికరంగానే ఉంటాయి. కొనుగోలు చేసిన ఆస్తుల విలువ కృత్రిమంగా తగ్గించే యత్నాలు జరుగుతాయి. స్థిరంగా ఉండండి, నష్టపోకుండా లాభాలతో బయటపడతారు. చిన్నచిన్న విషయాలకు కలహాలు పెట్టుకొని సమాజంలో పరువు పోగొట్టుకునే మీ వర్గం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తివ్యాపారాలలో, ఉద్యోగంలో మీ ప్రత్యేకశైలి నిలబెట్టుకుంటారు. కొన్ని విషయాలలో పట్టుదలగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ సంబంధమైన, ప్రైవేట్‌ సంబంధమైన కాంట్రాక్టులు, లీజులు, లైసెన్సులు, రెన్యువల్స్‌ అనుకూలిస్తాయి. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు, విజయం సాధిస్తారు. ఇతరులు చేయవలసిన శ్రమ మీరు చేయవలసి వస్తుంది. మీ వృత్తిలో ఒడిదుడుకులు ఏర్పడినా మీ స్థానం పదిలంగానే ఉంటుంది. సహోదర సహోదరీవర్గానికి రహస్యంగా సహాయం చేస్తారు. ఉన్నతవిద్యను అభ్యసించే అవకాశం, ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాసంబంధమైన విషయాలలో  మీరు కోరుకున్న పురోగతి లభిస్తుంది. విద్యాసంస్థలు, సామాజిక సేవాసంస్థలు, లోహపు వ్యాపారులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. చేతివృత్తి పనులవారికి మంచి ఫలితాలు ఉంటాయి. భూముల కొనుగోలు, అమ్మకాల విషయాలలో మాట చాతుర్యం వల్ల లాభపడతారు. రాజకీయంగా ఉన్నతస్థానంలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్ములను ఆదరిస్తారు, అభిమానిస్తారు. స్థానికనాయకులతో మాత్రం విభేదాలు పరాకాష్టకు చేరుతాయి. జీవితంలో అశాంతి సృష్టిస్తున్న ఓ స్త్రీని వదిలించుకోవడానికి న్యాయపోరాటం చేసి విజయం సాధిస్తారు.

మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాజకీయపదవి ప్రాప్తి. ఉద్యోగానికి సరైన కారణం లేకుండా సెలవుపెడతారు. స్త్రీ, పురుషుల అనుబంధానికి, స్నేహానికి ఎవరైతే వక్రభాష్యాలు చెబుతున్నారో వారు మీ వల్ల ఇబ్బందులు పడతారు. ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెబుతారు. ఆ సలహాలు పాటించమని ఒత్తిడి  చేయరు. వాళ్ళ విచక్షణకే వదిలేస్తారు. మీ మాటను ధిక్కరించిన వారిని జీవితాంతం శత్రువులుగానే చూస్తారు. మీరు అభిమానించిన స్త్రీ కనుమరుగు అవుతుంది (కొద్దిమంది విషయంలో). కొంతమంది విషయంలో వన్‌సైడ్‌ లవ్‌ ఫలించదు. ఇతరుల విధానాలకు మీరు అతిగా ప్రభావితులు అవుతారు. వాస్తవాలను స్పష్టంగా గ్రుహిస్తారు. ఊహాలోకాలలో విహరించే పరిస్థితికి స్వస్తి చెబుతారు. దొంగస్వామీజీల వల్ల నష్టపోతారు. మంచీచెడూ మీరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధించినప్పటికీ మీ వైరివర్గంవారు మీ శ్రమని గుర్తించక విమర్శిస్తారు. మీరు నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడడం వలన వైరివర్గం దానిని మీ అహంభావంగా భావించి, మీ మీద అకారణంగా ద్వేషాన్ని పెంచుకుంటారు. మీ సన్నిహిత, సహచరవర్గంలో ఉండేవారి వల్లనే మానసిక వేదన కలుగుతుంది. పుత్రసంతానం కన్నా ఆడపిల్లల మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు. జ్యేష్ఠ సంతానానికి ఉద్యోగం లభిస్తుంది. ఆడపిల్లల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి గట్టిగా ప్రయత్నాలు  పారంభిస్తారు, అవి సఫలం అవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసే వ్యాపారులకు, కమీషన్‌ ఏజంట్లకు మంచికాలం. వచ్చిన డబ్బులను వచ్చినట్లుగానే ఖర్చుపెట్టే పద్ధతిని మార్చుకోవాలని అనుకుంటారు. పొదుపు పథకాలలో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సమాజంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. వాళ్ళు మీ వ్యాపారంలో భాగస్వాములు అవుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థల పురోగతి బాగుంటుంది. విద్యా, ఉద్యోగ, విదేశీయాన విషయాలు బాగుంటాయి. సాంకేతిక విద్యలోనూ, వైద్యవిద్యలోనూ రాణిస్తారు. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఐఏఎస్, ఐఐటీ వంటి వాటికి ఎంపిక అవుతారు. స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్లు, లాభాలు బాగుంటాయి. శక్తిహీనులైనవారికి బాధ్యతలు అప్పగించి నష్టపోతారు. వ్యక్తుల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో పొరపాటు పడతారు.

సంవత్సర ద్వితీయార్ధంలో విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గతంలో చేసిన ఋణాలను తీర్చివేస్తారు. కొత్త వర్క్‌ ఆర్డర్స్‌ చేతికి అందుతాయి. ఇతరులకి సంబంధించిన ధనం, డాక్యుమెంట్స్, రహస్య పత్రాలు కొద్దిరోజులు మీ దగ్గర దాచి ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛను ఇచ్చారని మీపై ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. పని చేయడంలోగానీ, చేయించడంలోగానీ ఎక్కడా రాజీపడరు. ఈ లక్షణమే మీ విజయానికి కారణం అవుతుంది. ఏ పనినైనా మీకు అప్పగిస్తే నిశ్చింతగా ఉండవచ్చు అనే భావన అందరికీ కలుగుతుంది. కుటుంబపరమైన వ్యవహారాల మీద దృష్టిపెట్టడం లేదని వృతి ఉద్యోగాలకు తాళికట్టాడని మీపై విమర్శలు వస్తాయి. కుటుంబం కోసమే కష్టపడుతున్నారన్న విషయం మీ మనస్సాక్షికి తప్ప మరొకరికి తెలియదు. కుటుంబ సంబంధ వ్యవహారాలు మీరు గమనిస్తున్నారన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. దూరప్రాంతంలో ఉన్న మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. నిద్రాహారాలను లెక్కచేయకుండా శ్రమిస్తారు. శ్రమకి తగిన ఫలితాలను పొందగులుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. జీవితభాగస్వామితో అన్నివిషయాలు అరమరికలు లేకుండా పంచుకుంటారు. జీవిత భాగస్వామికి ఇవ్వవలసిన గౌరవాన్ని, సముచిత స్థానాన్ని ఇస్తారు. కీళ్లనొప్పులు, ఎలర్జీ సమస్యలు, జీర్ణకోశ ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది.  వ్యవసాయ సంబంధమైన విషయాలు ప్రోత్సాహంగా ఉంటాయి. గృహనిర్మాణ సామాగ్రి, ఆయుర్వేద, హోమియోపతి, అల్లోపతి మందులు, నూనె సంబంధమైన వ్యాపారాలు, ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులు చదివిన చదువుకు సంబంధంలేని ఉద్యోగం చేయాల్సి వస్తుంది. బ్యాంకులాకర్లు, ఏటీఎం కార్డులు, క్రెడిట్‌ కార్డులు, వీసా, పాస్‌పోర్ట్‌ వంటివాటి విషయంలో జాగ్రత్త వహించండి. తరచు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అందులో కొన్ని రహస్య ప్రయాణాలు కూడా ఉంటాయి. రాజకీయ సంబంధమైన స్నేహాలు, పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వనరులు చేకూర్చే ఒప్పందాలు కుదురుతాయి. బంధువులలో వచ్చిన ఓ సంబంధాన్ని తిరస్కరిస్తారు. మీ హితవు కోరే బంధువులు ఎవరో తెలుస్తుంది. మీ ద్వారా ప్రయోజనం పొందిన స్నేహితులు కూడా మిమ్ములను శత్రువులుగానే చూస్తారు. 

స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. రాజకీయ పదవి లభించే అవకాశం ఉంది. సంఘాల ద్వారా మంచి ఖ్యాతి, సంఘాలకు మంచి నాయకత్వం వహించడం తద్వారా లాభాలు గడిస్తారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. బ్యాంకు ఋణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారం బాగుంటుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపుతారు. సంతానం మీ మాటను ధిక్కరించడం సమస్యగా మారుతుంది. ఇంట్లో మీ మాటే నెగ్గాలి అన్న మొండితనంతో ఉండవద్దు. సర్దుకుపోవడం వల్ల లాభం చేకూరుతుంది. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించండి. మోకాళ్ళ నొప్పులు బాధించే అవకాశం ఉంది. శారీరకంగా, మానసికంగా శ్రమించి డబ్బులు ఖర్చుపెట్టి సంతానాన్ని ఒకదారికి తీసుకు వస్తారు. మీరు ఊహించిన విధంగా వారు జీవితంలో స్థిరపడతారు. కుటుంబానికి కుటుంబ బాధ్యతలలో మీ వంతు కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేరుస్తారు. చిన్నచిన్న వ్యాపారాలు, పెట్టుబడులు లాభిస్తాయి. సంపాదించిన ధనాన్ని మంచికి ఉపయోగిస్తారు. కళా, సాహిత్య, సాంకేతికరంగాలలో మీ ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది. ఇష్టంలేని వ్యక్తులతో చట్టబద్ధంగా విడిపోతారు. వృత్తి ఉద్యోగాలపరంగా నూతన అవకాశాలు కలిసివస్తాయి. వీలైనంత వరకు విభేదాలకు దూరంగా ఉండండి. మీకు మీరుగా సమస్యలను పెద్దవిగా చేయవద్దు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి. అవివాహితులకు వివాహకాలం.  ఆత్మీయులతో, సన్నిహితులతో వాగ్వివాదాలు సంభవిస్తాయి. బ్యూటీపార్లర్లు నడిపేవారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వివాహ విషయమై సొంత నిర్ణయాలు తీసుకుని అయినవాళ్ళు దూరం అవుతారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారపరంగా వచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఓర్పు పాటించడం అవసరం. పోటీపరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు. మొత్తంమీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement