మీనం రాశి ఫలాలు | Ugadi Panchangam 2019 | Pisces Horoscope 2019-20 in Telugu - Sakshi
Sakshi News home page

వికారినామ సంవత్సర (మీన రాశి ) రాశిఫలాలు

Published Sun, Mar 31 2019 12:35 AM | Last Updated on Tue, Apr 2 2019 6:42 PM

2019 To 2020  Pisces Zodiac Sign Horoscope - Sakshi

ఈ రాశివారికి ఈ సంవత్సరం బాగుంటుంది. దశమంలో శని కేతువుల సంచారం,  చతుర్థంలో రాహు గ్రహ సంచారం, దశమ, ఏకాదశాలలో గురు గ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. శ్రమానంతరం ఫలితాలు దక్కించుకుంటారు. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి శ్రమిస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. మీ ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో సాధ్యం కావడం కష్టం అని గ్రహించండి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉంటే జీవితంలో మరింత అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. సబ్‌–కాంట్రాక్టులలో మీ వాటా మీకు కొన్ని అవాంతరాలు దాటుకుని వస్తాయి. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసి మానసిక సంతోషాన్ని పొందుతారు. చాలాకాలం తరువాత బంధాలు తెగిన వ్యక్తులతో తిరిగి సంబంధాలు ఏర్పడతాయి. ఉన్నతస్థితిని సాధించినా సుఖం లేకుండా శ్రమజీవితాన్ని గడుపుతారు. వైద్య, సాంకేతిక, వ్యాపార రంగాలలో రాణిస్తారు. రాజకీయరంగంలో ప్రారంభం నుండి స్థితి బాగుంటుంది. వీలునామాలు, లిటిగేషన్స్‌ వ్యవహారాలు లాభిస్తాయి. చెస్, క్రికెట్‌ మొదలైన క్రీడారంగాలలో బాగా రాణిస్తారు. బలమైన అభిమాన వర్గం ఉంటుంది. హాస్య సంబంధమైన రచనలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార విస్తరణ సంతృప్తికరంగా ఉంటుంది. బాగాలేని సంస్థ రూపురేఖల్ని మార్చి మంచి దారిలో పెట్టగలరు. భూములు, పెద్దలు ఇచ్చిన ఆస్తుల వంటివి అభివృద్ధి చెందుతాయి. కొన్ని వివాదాలు స్థిరాస్థులపరంగా తప్పకపోవచ్చు. మధ్యవర్తిత్వ సంతకాలు మొదలైనవి కలిసిరావు. విధానాలను మార్చుకొని నూతన పంథాలో పాత విషయాలను అందరూ మరిచిపోయేలా చేస్తారు. కొన్ని విషయాలు మరుగున పడితేగానీ కొత్త విషయాలు లాభించవని గ్రహిస్తారు. తెలివిగా ఎత్తువేస్తారు. వీలైనంతవరకు నూతన పరిచయాలకు ప్రాధాన్యతనిస్తారు. పాత మిత్రులను దూరంగా ఉంచడం సంభవం. ఉద్యోగంలో ప్రయోజనం లేని అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఇన్సూరెన్సు విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అడ్రస్సు పొరపాటు వల్ల మీకు అందవలసిన సమాచారం ఆలస్యం అవుతుంది. పెరిగిన కుటుంబ ఖర్చులకు అనుగుణంగా ఆదాయ మార్గాలు లభిస్తాయి. శుభకార్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తారు. మోసపూరిత మనస్తత్వం కలిగిన వారి మాటలు నమ్మి నష్టపోతారు. విందులు, వినోదాలలో అపశ్రుతులు ప్రతిష్ఠను దెబ్బతీస్తాయి. అన్ని విధాలుగా మంచి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఏమీ లేదని ప్రతిసారీ మీ మీదపడి ఏడుస్తుంటారు. అలాంటి వాళ్ళ వల్ల ముప్పు పొంచి వుంది. ముందుగా ఎవ్వరికీ మీ వ్యూహం చెప్పవద్దు. విద్యాసంబంధమైన విషయాలలో కొన్ని మార్పులు, అదనపు అర్హతలు అవసరమవుతాయి. కొన్ని సందర్భాలలో అర్హత ఎక్కువ కావడం వల్ల అవకాశాలు జారిపోవడం జరుగుతుంది. కొన్ని అవకాశాలకు మీ అర్హతలు తక్కువ అవుతాయి.

ఇది కొద్ది కాలం మాత్రమే ఇబ్బంది పెడుతుంది. మీ మనసుకు సంతృప్తి కలిగే పని, ఉద్యోగం ఎట్టకేలకు లభిస్తాయి. ఒక స్త్రీ మనస్తత్వం, ఆతిథ్యం మీకు అర్థంకాక ఆలోచనకు దారితీస్తుంది. సభ్యతలేని వ్యక్తుల వల్ల మీరు ఇబ్బంది పడతారు. నడమంత్రపుసిరి మనుషుల్లో ఇంత మార్పు తెస్తుందా అని ఆశ్చర్యపోతారు. కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడిని అడ్డం పెట్టుకుని అడ్డదారిలో ధనం సంపాదిస్తారు. ఈ విషయం ఆలస్యంగా మీ దృష్టికి వస్తుంది. మీ నిజాయితీ నిరూపించుకోవలసిన పరిస్థితి రావచ్చు. మీ ప్రత్యర్థులు దీనిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందే ప్రయత్నాలు విఫలం అవుతాయి. గృహ సంబంధిత ఖర్చులు, రిపేరు ఖర్చులు అధికం అవుతాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి చర్యలు తీసుకుంటారు. సంవత్సర ద్వితీయార్ధంలో పట్టుబట్టి కొన్ని ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. రవాణా సంబంధమైన, ప్రింటింగ్, డాక్యుమెంట్స్, అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కార్డులు మొదలైన విషయాలలో జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగాలి. అతికష్టం మీద ముఖ్యమైన విషయాలలో మీ తప్పులేదని రుజువవుతుంది. మీ స్వయంకృతాపరాధాలు, మీ వల్ల జరిగిన తప్పిదాలు పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోవు. మీ ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. అయితే కృత్రిమంగా ప్రభుత్వపరంగా ఇబ్బందులు రావచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పులు ఆరోగ్యం మీద, వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపుతాయి. సంవత్సర ద్వితీయార్ధంలో స్త్రీలకు సంబంధించిన వివాదాలలోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది. మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వలన ఆటంకాలు ఏర్పడతాయి. ఎంత జాగ్రత్త వహించినా అనుచరవర్గం, సహోదరవర్గం వల్ల చికాకులు తప్పకపోవచ్చు. ఎవరిని నమ్మాలో, ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడమే కష్టతరమవుతుంది. దీక్షా కార్యక్రమాలు స్వయంగా నియమనిష్ఠలతో నిర్వహిస్తారు. ఉద్యోగంలేని వారికి ఉద్యోగప్రాప్తి, సంతానంలేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. పిక్నిక్‌లు, విందులు, వినోదాలు, విహారయాత్రలు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. స్వల్పకాల పరిచితుల వల్ల అపరిమితమైన సహాయ సహకారాలు, సేవలు అందుతాయి.

ఉద్యోగపరంగా స్థాన చలనానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. లోహ, ఖనిజ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి, చేతివృత్తి పనివారికి, చిన్న వ్యాపారులకు, హోటల్, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు విజయవంతమైన ఫలితాలు, లాభాలు సంభవం. కొన్ని ఇబ్బందులు ఎదురైనా విద్యారంగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఐఐటీ, ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి వాటికి ఎంపికవుతారు. పోటీపరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. స్నేహితులు, బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థలు, అనాథాశ్రమాలు పురోగమనంలో ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. చెవి, ముక్కు, గొంతు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి. మధ్య మధ్యలో వైరల్‌ జ్వరాలు ఇబ్బంది పెడతాయి. విద్యాసంబంధ విషయాలకు అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. వ్యాపారంలో చేసిన మార్పుల వలన మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలపైన కొంతమంది దుష్ప్రచారం చేస్తారు. అపనిందలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సంతానాన్ని చదువుల కోసం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు ఋణాలు లభిస్తాయి. ప్రతిష్ఠాత్మకమైన సంస్థలలో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. ప్రతిరంగంలోనూ గట్టిపోటీ ఎదుర్కొనవలసి వస్తుంది. సహనంతో అందరితో కలిసి పనిచేసే ధోరణి అవలంబిస్తారు. ప్రజాసంబంధాలు పెంచుకుంటారు. విలువైన డాక్యుమెంట్స్‌ మొదలైన వాటి భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అవసరమైన సమాచారం కోసం ఎక్కువ ధనాన్ని, పరిచయాలను ఉపయోగిస్తారు. గృహ, ఆస్తి విషయాలను సక్రమంగా నిర్వహిస్తారు. వాయిదా పడుతున్న ఒక ముఖ్య విషయం పరిష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. భార్యవైపు బంధువులను చేసి ఆదుకుంటారు. ముఖ్యమైన బాధ్యతల నుండి పాతవాళ్లను తప్పించి కొత్తవాళ్ళకు అప్పజెప్తారు. అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలను నైపుణ్యంతో చక్కబెడతారు. రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్, లైసెన్స్‌లు పునరుద్ధరణ వంటివి సజావుగా సాగిపోతాయి. స్థాయికి దిగజారిన సంఘటనలు ఎదురవుతాయి. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచన చేసి పరిష్కార మార్గాలు కనుగొంటారు. ఇందుకు అవసరమైన మనోధైర్యం కలిగి ఉంటారు. గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం గ్రీన్‌కార్డు తప్పక లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ శక్తికొలది ఇతరులకు సహాయపడతారు. మీ ప్రతిభాపాటవాలతో పాటు మీ పూజలు, పునస్కారాలు, దానధర్మాల ఫలితం అక్కరకు వస్తుంది.

కుటుంబ పురోగతి బాగుంటుంది. సంతానం చదువులో రాణిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలకు నూటికి తొంబై శాతం కాలం బాగుంది. అయినప్పటికీ సామాజిక పరిస్థితుల వల్ల, వాతావరణ పరిస్థితుల వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. స్వగృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు. రాత్రిపూట చేసే ఆలోచనలు కలిసివస్తాయి. చాలామంది జీవితాలు మీ ఆలోచనా విధానాల మీద, మీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. పగ, ప్రతీకారం, ముక్కు మీద కోపం, వ్యసనాలు మొదలైన వాటికి దూరంగా ఉంటారు. ఇతర భాషలు నేర్చుకోవాలనే విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. స్నేహితుల ఒత్తిడి మేరకు యూనియన్‌ కార్యక్రమాలలో పాల్గొనవలసి వస్తుంది. యూనియన్‌ కార్యక్రమాలను పకడ్బందీగా, జాగ్రత్తగా నడిపి మీడియా దృష్టిని ఆకర్షిస్తారు. పసుపు, మిర్చి, కాటన్, కూరగాయలు, బియ్యం, కందిపప్పు, మినపపప్పు వ్యాపారులకు మంచి లాభాలు దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా నడుస్తాయి. నిర్మాణ సంబంధమైన పనులకు సంబంధించి మంచి లాభాలు లభిస్తాయి. ఎదుటివాళ్ళను అంచనా వేయడంలో దాదాపుగా పొరపాటుపడరు. మీ అంచనాలు, వ్యూహాలు, పలుకుబడి సమయస్ఫూర్తి భాగస్వాములకు, సంస్థలకు కొండంత అండగా నిలుస్తాయి. మీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలిగినవారు నిజంగా ఎవరని తెలుసుకోగలుగుతారు. స్వల్ప కారణాలు పెరిగి పెద్దవై, భేదాభిప్రాయాలు ఎక్కువై ముఖ్యమైన వారితో చట్టపరంగా విడిపోతారు. దీర్ఘకాలిక ఋణాలను గడువుకు ముందే తీర్చివేస్తారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ మిమ్మల్ని విసిగిస్తున్న ఓ ముఖ్యమైన పని పరిష్కారమవుతుంది. తెలివిగా ప్రవర్తించి అన్ని విధాలా ఆలోచన చేసి శుభకార్యాల విషయాన్ని ఓ కొలిక్కి తెస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. విదేశాలలోని మిత్రుల నుండి కొద్దిపాటి ఆర్థిక సాయం లభిస్తుంది. లాభం చేకూర్చే ప్రయాణాలు వ్యూహ, ప్రతివ్యూహాలు ఆర్థికపరమైన రహస్య లావాదేవీలు మొదలైనవి చోటు చేసుకుంటాయి. గతంలో వద్దు అనుకున్న వ్యవహారాలను తిరిగి ప్రారంభిస్తారు. పురోభివృద్ధికి ఉపకరించే ఏ అంశాన్నీ నిర్లక్ష్యం చేయరు. మీ ప్రవర్తనలో ఉన్న లోపాలను ఇతరులు విమర్శించక ముందే మార్పులు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలపరంగా చికాకులు ఏర్పడతాయి. మీతో జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతింటామని తెలుసుకుని సహోద్యోగులు జాగ్రత్తగా మసలుకుంటారు. ఆర్థిక, ఆరోగ్య స్థితులు మెరుగుపడతాయి.

స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దైవానుగ్రహం వలన ఏ పని చేపట్టినా సమర్థించేవారు, సపోర్టు చేసేవారు ఉంటారు. కుటుంబ శ్రేయస్సు కోసం సంతానానికి మంచి బోధనలు చేస్తారు. విద్యాపరంగా సంతాన పురోగతి బాగున్నప్పటికీ మార్కులు తగ్గుతాయి. సంతానం ప్రక్కదోవ పట్టకుండా వేయికళ్ళతో జాగ్రత్తగా గమనిస్తారు. ప్రేమ వివాహాలు చేసుకోవాలకున్న వారికి కాస్త ఆలస్యంగా చేదు అనుభవాలు ఎదురవుతాయి. కుటుంబ ప్రతిష్ఠను, తల్లిదండ్రుల ప్రేమను మరిచిపోయి క్షణికావేశంలో ప్రేమవివాహం చేసుకున్నందుకు విచారిస్తారు. నిర్లక్ష్యానికి గురి అవుతున్న స్థిరచరాస్తులను రక్షించుకోవడానికి శ్రమిస్తారు. మేధావులను, ఘటికులను అవలీలగా ఎదుర్కొన్న మీరు ఒక అనామకుడి చేతిలో మోసపోతారు. పోటీపరీక్షలలో అనుకూల ఫలితాలు వస్తాయి. విదేశీయాన సంబంధమైన ప్రయత్నాలు రెండో యత్నంలో సఫలీకృతమవుతాయి. విదేశాలలో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి మంచి అవకాశాలు వస్తాయి. పాస్‌పోర్ట్, వీసా, గ్రీన్‌కార్డు వంటివి చేతికి అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అన్నదాన విరాళాలకు ప్రాముఖ్యతనిస్తారు. సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. సంతాన సాఫల్య కేంద్రాల వల్ల ప్రయోజనం శూన్యం అని తెలుసుకుంటారు. ఏది ఏమైనా మీకు బయట నుండి వచ్చే సమస్యల కన్నా ఆత్మీయులు, ఇంట్లో వారి వలన చిక్కులు ఏర్పడతాయి. బ్యాంకు వ్యవహారాలు, క్రెడిట్‌ కార్డులు, పొదుపు వ్యవహారాలు మొదలైన విషయాలలో సాంకేతికపరమైన చిక్కులు ఏర్పడవచ్చు. వాయిదా పద్ధతిలో మీకు ఇష్టమైన కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. చేతివృత్తి పనివారికి అనుకూల కాలం. విద్యా, సాంస్కృతిక రంగాలలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. క్రీడారంగంలోని వారికి అవార్డులు లభిస్తాయి. సంవత్సర ద్వితీయార్ధంలో పార్శ్వపు నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ళనొప్పులు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగంలో నైపుణ్యం, అంకితభావం మీకు గౌరవాన్ని, స్థిరత్వాన్ని తెచ్చిపెడతాయి. కలలుగన్న స్వగృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అవివాహితులైన వారికి ఆకస్మికంగా మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి అనుకూలమైన సంబంధం కుదురుతుంది. మీకు ఇష్టం లేకపోయినా రాజకీయరంగంలోకి ప్రవేశిస్తారు. తాత్కాలిక వ్యాపారాల మీద పెట్టుబడి పెట్టి లాభం పొందుతారు. వస్త్రవ్యాపారం, కూరగాయల వ్యాపారం, ఫ్యాన్సీ, హోమియోపతి, అల్లోపతి వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. డాక్టర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్స్, విద్యాసంస్థల నిర్వాహకులు, పాల వ్యాపారులు విశేషంగా ధనం అర్జిస్తారు. బంగారం, వెండి కొనుగోలు చేసే యోగం ఉంది. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యా, వైజ్ఞానిక రంగాలలో అనుకున్నది సాధిస్తారు. ఆహార క్రమశిక్షణ చాలా అవసరం. మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించడం జరుగుతుంది. కొన్ని వాస్తవాలు బయటపడటంతో ఆ వ్యక్తిని దూరంగా ఉంచుతారు. అతని వల్ల ప్రమాదం సంభవిస్తుందేమోనన్న భయం కూడా మీ మనస్సుని కలవరపరుస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement