వృషభం రాశి ఫలాలు | Ugadi Panchangam 2019 | Taurus Horoscope 2019-20 in Telugu - Sakshi
Sakshi News home page

వికారినామ సంవత్సర (వృషభ రాశి) రాశిఫలాలు

Published Sun, Mar 31 2019 12:05 AM | Last Updated on Tue, Apr 2 2019 6:27 PM

2019 To 2020 Taurus Zodiac Sign Horoscope - Sakshi

వృషభరాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అష్టమంలో శని, కేతువుల సంచారం, అష్టమ, భాగ్యస్థానాలలో గురు సంచారం, రెండింట రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. సంవత్సర ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార, వ్యవహారాలపరంగా బాగుంది. రాజకీయంగా అగ్నిపరీక్షాకాలం. విద్యాసంబంధ విషయాలు, సాంకేతిక, గణిత విద్యలకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. మెడిసిన్‌ సీటు లభిస్తుంది. సినిమా వ్యాపారం కలసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్‌మిల్స్, రైస్‌మిల్స్, షుగర్‌ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. ఆక్వా, పౌల్ట్రీరంగాల్లో కలసిరాదు. రాజకీయ పదవీ ప్రాప్తి సంభవం. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో నిదానం అవసరం. కోర్టుతీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతనంగా పరిచయమైన మిత్రుల వల్ల లాభపడతారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వాహనాలు నడపడంలో, ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. సహోదర సహోదరీవర్గానికి రహస్యంగా సహాయపడతారు. ప్రేమ వివాహాలు వివాదస్పదం అవుతాయి. స్త్రీలతో విభేదాలు కొంతకాలం ఇబ్బందిపెడతాయి. మీ ఆంతర్యం, వైరాగ్యం, నిర్వేదం ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. పైకి నిండుకుండలా కనిపిస్తారు, గంభీరంగా ప్రవర్తిస్తారు. పదిమందికి సహాయం చేయగులిగిన శక్తిసామర్థ్యాలు, ధన బలం భగవంతుడు మీకు ఇస్తాడు. జ్యేష్ఠ సంతాన పురోగతి మానసిక సంతోషానికి కారణం అవుతుంది.  మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా అండగా ఉంటారు. నిర్మాణ çపనులలో నాణ్యత కోసం ప్రయత్నిస్తారు. చాలామంది చాదస్తం అని అవహేళన చేసినా మీ పద్ధతి మార్చుకోరు.

అదే మీకు మంచి కీర్తిప్రతిష్ఠలను తెచ్చిపెడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. నష్టపోయిన విషయాన్ని చెప్పుకుంటే సిగ్గు పోతుందని మిన్నకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీ వ్యాపారంలో ఒక  స్త్రీ భాగస్వామ్యం కలసివస్తుంది. మీ వ్యాపారానికి ఉన్నతస్థాయి వ్యక్తుల పరపతి తోడ్పడుతుంది. వ్యాపార, ఆర్థిక విషయాలకు సంబంధించి స్నేహితులను, ఆత్మీయులను దూరంగా పెడతారు. అంత్యనిష్టూరం కన్నా ఆది నిష్టూరమే మేలు అని భావిస్తారు. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోనంత వరకు మీకు తిరుగులేదు. జీవిత భాగస్వామితో విభేదాలు చికాకు కలిగిస్తాయి. పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకువస్తారు. వ్యసనపరులైన చిన్ననాటి స్నేహితులను ఆదుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కళా సాంస్కృతిక రంగాల వారికి కీర్తిప్రతిష్ఠలు, అవార్డులు వస్తాయి. పలుకుబడి ఉపయోగించి ఈ అవార్డులు సంపాదించారని దుష్ప్రచారం జరుగుతుంది. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. మిమ్మల్ని పొగిడే వాళ్ళపట్ల జాగ్రత్తగా ఉండండి. మంచిగా ఉంటూ నమ్మకద్రోహం చేస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. ఫర్నిచర్, గృహ పరికరాలు, హోమియోపతి, ఆయుర్వేదం, హోటళ్లు, బేకరీ వ్యాపారాలకు అనుకూలంగా ఉంది. మీ మాట జవదాటని రక్తసంబంధీకులు, కుటుంబసభ్యులు మీ మాట వినని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం వక్రమార్గంలోకి వెళ్తారు. మంచిమాటలు చెప్పి వేరే చోట ఉంచి వాళ్లని ఓ దారికి తీసుకువస్తారు. విందులు, వినోదాలు ఎక్కువవుతాయి. వాటికి దూరంగా ఉండాలని మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. ఫైనాన్స్‌ వ్యాపారానికి, షేర్స్‌కి దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వివాదాలకు, దూరంగా ఉండండి. ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా వల్ల ఇబ్బందులు రావచ్చు. కుటుంబంలో ఐకమత్యం లేని కారణం చేత సంతానాన్ని సక్రమమైన మార్గంలో నడిపించలేరు. అయితే ఈ సమస్య ఒక్క నెల మాత్రమే బాధిస్తుంది. తదుపరి సంతాన పురోగతి బాగుంటుంది.

యూనియన్స్, క్లబ్బులు ప్రతిష్ఠాత్మకమైన సేవాసంస్థలలో మీకు మంచి గౌరవం, స్థానం లభిస్తుంది. పన్నులు వసూలు చేసే అధికారులు మీ స్నేహితులు కావడం వల్ల మీ పొరపాట్లకు జరిమానా పడదు. మీరంటే ఎంతమాత్రం ఇష్టంలేని ఉన్నతస్థాయి అధికారి ఒకరు ఆకస్మికంగా మిమ్మల్ని పిలిపించి అనుకూలమైన ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది. కాంట్రాక్టులు, సబ్‌ కాంట్రాక్టులు, లీజులు పొడగించబడతాయి. మీకు తెలియకుండా మీ భాగస్వాములు తీసుకున్న నిర్ణయాలు సంస్థకు చెడ్డపేరు తీసుకువస్తాయి. స్థిరాస్తుల పంపకంలో పెద్దలు, బంధువులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఇతరుల హక్కుల కోసం పోరాటం చేస్తారు. బతిమాలినా కాని పనులను భయపెట్టి సాధిస్తారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పాత శత్రువులు మళ్లీ తెరమీదకు వస్తారు. నిష్కారణమైన నిందలు మానసిక ఒత్తిడికి కారణం అవుతాయి. శుభకార్యాల విషయంలో పంతం నెగ్గించుకుంటారు. ఉద్యోగంలో ప్రత్యర్థుల కుతంత్రాలు ఫలించవు. మీ స్వయంకృతాపరాధాలే ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తివ్యాపార వ్యవహారాలలో విమర్శలు, ఇబ్బందులు ఏర్పడతాయి. కొందరికి ఇతరుల మీద ద్వేషం మీ మీద అభిమానంగా మారి సహాయపడతారు. కాలుష్యం వల్ల స్వల్ప అనారోగ్య పరిస్థితులు నెలకొంటాయి. వైవాహిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చట్టపరంగా విడిపోతారు. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అగ్రిమెంట్స్‌ వాయిదా పడతాయి. ప్రత్యర్థివర్గంలోని గ్రూపు రాజకీయాలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కాంట్రాక్టులు, సబ్‌ కాంట్రాక్టులు, లైసెన్సులు, లీజులు లాభిస్తాయి. ఉద్యోగంలో బదిలీలు ఆశించినట్లుగానే ఆగుతాయి. రాని బాకీలు రాకపోగా వివాదాస్పదాలు అవుతాయి. మధ్యవర్తి పరిష్కారం వల్ల నష్టపోకుండా నిలబడతారు. ప్రభుత్వ సంబంధమైన లీజులు, కాంట్రాక్టులు పొడిగించబడతాయి. పరభాషా ప్రావీణ్యం, సాంకేతికవిద్య, కళానైపుణ్యం, వైద్యవిద్య, క్రీడా నైపుణ్యం మొదలైనవి గుర్తింపుకు నోచుకొని ఉన్నతస్థితికి బాటలు వేస్తాయి. మీ ముందు పొగడడము, మీ చాటున తిట్టడం కొంతమందికి నిత్యకృత్యం అవుతుంది. సాక్ష్యాధారాలు చూపించి మరీ కొన్ని వివాదాలను పరిష్కరించగలుగుతారు. క్రీడారంగంలోని వారికి కుళ్ళు రాజకీయాలు ఇబ్బంది పెడతాయి. టీవీ సినిమా రంగంలోని వారికి ఆశాజనకం. చిత్ర కళాకారులకు మంచి ఫలితాలున్నాయి. డాక్యుమెంట్స్‌ మీద సంతకాలు చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు పరిశీలించుకుని సంతకం చేయండి. గణితవిద్యకు సంబంధించి విశేషంగా కృషి చేసి అనుకూల ఫలితాలు సాధిస్తారు. రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి. నూతన వ్యాపారం బాగుుంటుంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో మళ్ళీ నిలదొక్కుకుంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థిక విషయాలు బాగున్నాయి. పోటీ పరీక్షలలో నెగ్గి వైద్యకళాశాలలో సీటు సంపాదిస్తారు. విద్యాసంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. చిట్టీలు, ఫైనాన్స్‌ వ్యాపారానికి దూరంగా ఉండండి. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. వివాహాది శుభకార్యాలను సంతృప్తికరంగా నిర్వహించగలుగుతారు. విదేశీ విషయాలు కలసివస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. బదిలీ కోరుకునే వారికి బదిలీ అవుతుంది. ప్రేమ వివాహాలు ఫలించవు. జీవితంలో దగ్గరైన ఓ వ్యక్తిని నమ్మడం జరుగుతుంది. కానీ అతని వల్ల మీకు నమ్మకద్రోహం ఎదురవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీలలో సీటు లభిస్తుంది. వస్త్ర వ్యాపారం, స్టేషనరీ వ్యాపారం, ఆహారపదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. కుటుంబంలో ఐకమత్యం కోసం విశేషంగా శ్రమిస్తారు. ఫలితాలు నామమాత్రంగా ఉంటాయి. క్రీడారంగంలో మీకున్న నైపుణ్యానికి తగిన గుర్తింపు, అవార్డులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలపరంగా మీ విధులను సక్రమంగా, నిజాయితీగా నిర్వహిస్తారు. ఇది చాలామందికి నచ్చని అంశంగా మారుతుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్ఠల వలన కొంతమంది ఉన్నతాధికారులకు అసూయ కలుగుతుంది. దొంగ స్వామీజీల వల్ల, దొంగ గుురువుల వల్ల నష్టపోతారు. అనువంశికంగా రావలసిన ఆస్తుల విషయంలో సమన్యాయం జరుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ అవసరం. కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు కలిగినవారు జాగ్రత్తగా ఉండాలి. కంప్యూటర్‌ విద్య, ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించి ఎప్పటినుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఉద్యోగం వస్తుంది. క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో సెలక్ట్‌ అవుతారు. మీరు చేసే ఇతరాత్ర వ్యాపారాలు, వ్యవసాయరంగ ఉత్పత్తులు, బ్యూటీ పార్లర్స్, చీరలు అమ్మడం, హోటళ్లు మొదలైన వ్యాపారాలు కలిసివస్తాయి. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటారు, లాభపడతారు. విమర్శలకు తావు లేకుండా రాజకీయపదవి లభిస్తుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement