శార్వరి నామ సంవత్సర (వృశ్చిక రాశి) రాశిఫలాలు | 2020 To 2021 Scorpio Zodiac Sign Horoscope In Sakshi Funday | Sakshi
Sakshi News home page

శార్వరి నామ సంవత్సర (వృశ్చిక రాశి) రాశిఫలాలు

Published Sun, Mar 22 2020 8:31 AM | Last Updated on Sun, Mar 22 2020 8:31 AM

2020 To 2021 Scorpio Zodiac Sign Horoscope In Sakshi Funday

ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. విద్యాసంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. కొన్ని స్థిరాస్తులు కొంటారు. కొన్ని స్థిరాస్తులు అమ్మి వేరేవిధంగా అభివృద్ధి చేస్తారు. ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. పరపతి కలిగిన రాజకీయ నాయకులు, స్నేహితులు అండగా ఉంటారు. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరమవుతారు. ఆర్థికపురోగతికి నూతన వ్యాపారాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది.

న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్ట్, సబ్‌కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన బ్రాంచీలు నెలకొల్పుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు మంచి కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు, జీవితాశయం నెరవేరుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. రాజకీయ పదవీప్రాప్తి, ఆశించిన లాభాలు, ఫలితాలు మీకు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు మీకు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. సినిమా, టీ.వీ, ట్రావెల్స్, ఆటోమొబైల్స్‌ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. అన్నదానానికి, గోసంరక్షణకు మీ శక్తిమేర విరాళాలు ఇస్తారు. భాగస్వాముల పనితీరుని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు.

వారిలో లోపం కంటపడినప్పుడల్లా హెచ్చరికలు జారీ చేస్తుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ వ్యవహరించరు. పరిస్థితులు బేరీజు వేసుకుని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. సర్పదోష నివారణా చూర్ణములో సర్వరక్షా చూర్ణము కలిపి స్నానం చేయండి. ఎక్కువ జీతం ఇచ్చి నమ్మకమైన సేవక జనాన్ని నియమించుకుంటారు. అపార్ట్‌మెంట్‌ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. చెప్పుడు మాటలు విని కాకుండా వాస్తవాలు స్వయంగా తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. బంగారం, వెండి, విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. వాయిదా పద్ధతిలో అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వపరంగా రావలసిన బిల్లులు చేతికి అందుతాయి. స్పెక్యులేషన్‌కి దూరంగా ఉండండి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు వస్తాయి. సరైన సమయానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయండి. ఇతరులు ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అవుతాయి.

ఇదే సమస్యగా మారుతుంది. డబ్బులు వసూలు చేసుకోలేరు, వారిపై చర్య తీసుకోలేరు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అగ్రిమెంట్స్‌ పూర్తవుతాయి. నూతన లైసెన్సులు లభిస్తాయి. విద్యాసంబంధిత, నిర్మాణ సంబంధిత ఋణాలు మంజూరు అవుతాయి. నిత్యం హనుమాన్‌ సింధూర్‌ ధరించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పశువుల పెంపకం, పౌల్ట్రీ వ్యాపారులకు అనుకూలం. ఫంక్షన్‌హాల్స్‌ నిర్వాహకులకు మధ్యస్థంగా ఉంది. పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఇంటర్నెట్‌ సెంటర్, వైద్య పరికరాలు అమ్మే వ్యాపారులకు అనుకూలంగా ఉంది. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కీళ్ళనొప్పులు, ఇ.ఎన్‌.టి. సమస్యలు ఇబ్బంది పెడతాయి. యోగాసనాలు, మెడిటేషన్‌ వల్ల లబ్ధి పొందుతారు. తెలిసి తెలియని వైద్యం చేయించుకోవద్దు. ప్రకృతి వైద్యాలకు దూరంగా ఉండండి. నరదిష్టి, బంధుఘోష అధికంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. పుస్తక పఠనం, గ్రంథ రచన పట్ల శ్రద్ధ అధికమవుతుంది. పట్టుదలతో కృషి చేస్తారు. ఈ పట్టుదల వెనుక ఆంతర్యంలో ప్రతీకారం, పగ పొంచి ఉంటాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని మీ పెద్దరికాన్ని కాపాడుకుంటారు.

సోదరసోదరీ వర్గంతో సంబంధ బాంధవ్యాలు సక్రమంగా నిర్వర్తిస్తారు. అధిక శ్రమ చేస్తారు. అయితే మీరు ఊహించని పరిణామాలు ఏర్పడటం వల్ల ప్రత్యర్థుల వ్యూహం వల్ల అంతగా లాభాలు రావు. అయినప్పటికీ మరో రూపంలో ధనం వస్తుంది. ఆ లోటు పూడుస్తుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలలో అవకతవకలు చోటు చేసుకుంటాయి. మీ సన్నిహితుల సహకారంతో వాటిని ఒక గాడిలో పెట్టగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కార్యాలయంలో టీమ్‌ స్పిరిట్‌తో పనిచేసి మంచి ఫలితాలు సాధించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. వాహనం మార్పు చేస్తారు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. రాజకీయ పదవిప్రాప్తి. కోర్టుపరమైన వ్యవహారాల గురించి విస్తృతమైన చర్చ కొనసాగిస్తారు. కోర్టుతీర్పులు రాకుండానే మధ్యవర్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. శాంతి, సహనం, ఓర్పు వహించి చర్చలు ఫలవంతం చేసుకుంటారు. మీ ప్రయోజనాలు కాపాడుకుంటారు. మీ వ్యాపారంలో ఓ స్త్రీ భాగస్వామ్యం కలిసి వస్తుంది. మీ భాగస్వాముల వద్ద, స్నేహితుల వల్ల మీ విశ్వాసాన్ని నిరూపించుకోవలసి రావడం ఇబ్బందిగా మారుతుంది. మీరు సహకరించదు.

మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి ఋజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడిన అనేకమందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే ‘‘పాముపడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో కానీ ఆ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుండే లొంగి ఉండడం మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయడం మీకు చేతకాదని తేల్చి చెప్పేస్తారు. ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగతెంపులు చేసుకుంటారు కృషిని నమ్ముకుంటారు. భగవంతుడిని కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెబుతారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాలలో ఋజువవుతుంది. రియల్‌ ఎస్టేట్‌ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు వ్రాసిన డాక్యుమెంట్స్‌లో లోపాలు బయటపడతాయి. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తిప్రతిష్ఠలు గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో చాలా మందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయినవారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదేపనిగా గుర్తుకురావడం వల్ల చెప్పలేని మానసిక వేదన, హృదయభారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏమి సాధించాలని జీవిస్తున్నామన్న భావన మనస్సును వేధిస్తుంది. భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తిసామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, ప్రార్థనలు, పూజలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు.  

ప్రింట్‌మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా నూతన అవకాశాలు కలిసివస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తులు కలిసివస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఇన్‌కవ్‌ుట్యాక్స్‌ సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్‌ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి, చోరభయం పొంచి వుంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలాసవంతమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పరిధిలో లేని పనులు చేసిపెట్టమని ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. రాజకీయ నాయకులను కొనుక్కుంటే ఏ రకమైన తప్పు చేసినా శిక్షలు పడవు అని గ్రహిస్తారు. గనులు, ఇసుక వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కొంతమంది రాజకీయ నాయకులకు మీరు అంతరంగికులుగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. స్టాక్‌ మార్కెట్లు కలిసిరావు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement