కడప జిల్లా ఉరుటూరు నా స్వస్థలం. ఉద్యోగ నిమిత్తం ఏడాదిన్నర కిందట నెల్లూరు వచ్చాను. నాకు ఇద్దరు కూతుళ్లు. నా ఐదేళ్ల పెద్ద కూతురు ఎల్‌కేజీ చదువుతోంది. ఒకసారి నా పెద్ద కూతురిని తీసుకుని విజయమహల్ సమీపంలోని ఏటీఎం సెంటర్‌కు పోయాను. బ్యాంక్ సిబ్బంది డబ్బు పెడుతుండటంతో నేను, నా బిడ్డ బయట నిలబడ్డాం. ‘నాయన బెరీన లెక్క తీసుకో. పోయి కొనుక్కుందాం’ అని గోము చేయసాగింది.
డబ్బు తీసుకొచ్చిన వాహనానికి సెక్యూరిటీగా వచ్చిన వ్యక్తి ‘మీది కడపనాబ్బీ’ అని వెలుగు నిండిన కళ్లతో ప్రశ్నించాడు. ‘అవునన్నా’ సంభ్రమాశ్చర్యంతో జవాబిచ్చాను. వెంటనే ‘మీది’ అని అడగడంతో పాటు ఎట్లా కనుక్కున్నావు అని అడిగాను. ‘మాది పులివెందులబ్బీ. బెరీనా, లెక్క లాంటివి వాడేది మనమే కదా. నీ బిడ్డ మన యాసలో మాట్లాడ్తాంటే నాకు పాణం లేచొచ్చింది’ అని జవాబిచ్చాడాయన. ‘నీ పేరు’ అని నా కూతురిని అడిగాడు. ‘లక్షణ ప్రజ్వలిక’ అని సమాధానం చెప్పింది. ‘ఓయమ్మో.. అంత పేరు ఎవరు పెట్నారు’ అని మురిపెంగా ప్రశ్నించాడు. ‘మా జేజి లక్షణ అని, నాయన ప్రజ్వలిక అనుకున్యారంటా. ఇద్దరూ కలిసి లక్షణ ప్రజ్వలిక’ అని పెట్టినారు అని జవాబిస్తుంటే ఆయన ఆనందంతో తబ్బిబ్బయ్యాడు.
ఇంటికొచ్చాక నా భార్యతో ఈ విషయాలన్నీ చెప్పాను. పిల్లలకు కడప మాండలికంలో మాట్లాడటం నిర్బంధంగా అమలు చేయాలని తీర్మానించాం. అమ్మ భాషలో మనుషులను దగ్గరగా తీసుకునే స్వభావం ఉంటుంది. మా బిడ్డలు మాట్లాడటం వింటాంటే కలిగే ఆనందం అనుభవించాల్సిందే తప్ప చెబితే అర్థం అయ్యేది కాదు.
- సొదుం రమణారెడ్డి, నెల్లూరు
ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, భీతిగొల్పిన సందర్భాలు, మీ ఊరి విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు, వారు రాసే చిట్టిపొట్టి కవితలు, వేసే రంగురంగుల చిత్రాలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మీ పిల్లలకు సంబంధించిన విశేషాలు పంపేటప్పుడు వాళ్ల ఫొటోలు జతచేయడం మర్చిపోకండి. మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,
రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com
తపాలా: నాయనా, బెరీన లెక్క తీసుకో!
Published Sun, Feb 23 2014 4:12 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement