ఆమె | a true story to crime | Sakshi
Sakshi News home page

ఆమె

Published Sun, Jan 29 2017 12:00 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

ఆమె

ఆమె

పట్టుకోండి చూద్దాం

1
నాగభూషణంకు ఇద్దరు భార్యలు. ఆయన మొదటి భార్య చనిపోయిన నెలకే... ఆస్తి విషయంలో రెండో భార్య పిల్లలకు, నాగభూషణంకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తరువాత రాజీ చర్చలు జరిగాయి.అయితే ఉన్నట్టుండి నాగభూషణం హత్యకు గురయ్యాడు.‘‘ఉదయం నాలుగున్నరకల్లా లేవాలి కాబట్టి  రాత్రి పదిన్నర టైంలో పడుకుంటాను. బాబుగారికి రాత్రి పన్నెండు, ఒంటిగంట వరకు చదువుకొని పడుకునే అలవాటు ఉంది. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా అప్పుడప్పుడూ ఆయన స్నేహితులు వస్తుంటారు. స్నేహితులతో కలిసి కాఫీ తాగడం ఆయనకు చాలా ఇష్టం. అయితే... నన్ను నిద్ర లేపడం ఇష్టం లేక ఆయనే స్వయంగా కాఫీ తయారుచేస్తుంటారు. నేను నా గదిలో పడుకొని ఉన్నాను. రాత్రి  ఆయన కోసం ఎవరు వచ్చారో తెలియదు. తెల్లారిన తరువాత బాబుగారి గదిలోకి వెళితే ఆయన చనిపోయిన విషయం తెలిసింది. కుర్చీలో అటు వైపుకు ఒరిగిపోయారు. ఆయన ముందు టేబుల్‌పై రెండు కాఫీ కప్పులు ఉన్నాయి’’ అని చెప్పాడు పని మనిషి సూరయ్య.

పోలీసులు... ఆ కప్పులను జాగ్రత్తగా పరిశీలించారు.ఒక కప్పుపై ‘మై మగ్‌’ అని ఉంది. ఈ మగ్‌ను నాగభూషణం మాత్రమే ఉపయోగిస్తాడు. మరో కప్పు...గెస్ట్‌లు ఉపయోగించేది.విషప్రయోగంతో... నాగభూషణాన్ని చంపిన విషయం బయటపడిపోయింది. అయితే... గెస్ట్‌ కాఫీ కప్పుపై ఎలాంటి వేలి ముద్రలు కనిపించలేదు. అయినప్పటికీ ఈ కప్పు ఆధారంగా విషప్రయోగం చేసిన నాగభూషణం రెండో భార్య కూతురు రాగిణిని పోలీసులు  అరెస్టు చేశారు. ఎలా?

2
విశ్వేశ్వర్రావు రాత్రి హత్యకు గురైన విషయం నగరమంతా పాకిపోయింది. అజాతశత్రువైనా విశ్వేశ్వర్రావుని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అనేది హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసుల విచారణ మొదలైంది... ‘‘కుటుంబసభ్యులంతా టూర్‌కు వెళ్లారు. అయ్యగారికి ఆరోగ్యం బాగ లేకపోవడంతో  ఇంట్లోనే ఉండిపోయారు. రాత్రి తనకు ఇష్టమైన సినిమా వస్తుంటే చూస్తున్నారు. నేను నా  గదిలో పడుకొని ఉన్నాను. పొద్దున కాఫీ ఇవ్వడానికి వెళితే... చనిపోయి ఉన్నారు’’ అని చెప్పాడు పనిమనిషి సాగర్‌.‘‘రాత్రి ఆయన గురించి ఎవరైనా వచ్చారా?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ నరసింహ.‘‘ఆయనకు చాలామంది స్నేహితులు. కొందరు రెగ్యులర్‌గా వస్తుంటారు. కానీ రాత్రి ఎవరు వచ్చారనేది నాకు తెలియదు’’ అని చెప్పాడు సాగర్‌.విశ్వేశ్వర్రావును తరచుగా  కలుసుకునే వారిలో నలుగురు ఉన్నారు... రమణ, రంగారావు, చంద్రశేఖరం, రాజేశ్వరి. ఈ నలుగురిని  ఎంక్వైరీ చేశాడు ఇన్‌స్పెక్టర్‌.ఒక్కొక్కరు ఒక్కో టైంలో విశ్వేశ్వర్రావును కలుసుకున్నట్లు విచారణలో తేలింది.నలుగురూ... విశ్వేశ్వర్రావుకు మంచి మిత్రులే.ఎవరిని అనుమానించాలో అర్థం కావడం లేదు.విశ్వేశ్వర్రావు గదిలో ఆక్వేరియం దగ్గర ఒక నోట్‌ బుక్‌ కనిపించింది. అందులో ఆక్వేరియంలో ఉన్న చేపల గురించి, వాటి చేష్టల గురించి వాటికి సంబంధించిన  ఫీడ్‌ గురించి రాసి ఉంది. ఆక్వేరియం వైపు ఒకసారి చూశాడు ఇన్‌స్పెక్టర్‌ నరసింహ. మరోసారి మరింత పరిశీలనగా  చూశాడు. ఏదో ఆలోచన ఫ్లాష్‌లా మెరిసింది. ఆ తరువాత రాజేశ్వరి ఇంటికి వెళ్లాడు.

‘ఇలా వచ్చారేమిటి?!’ అన్నట్లుగా చూసింది ఆమె. అలా చూస్తూనే ఇన్‌స్పెక్టర్‌ను ఇంట్లోకి ఆహ్వానించి కాఫీ ఇచ్చింది. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ... ఆక్వేరియం వైపు చూశాడు ఇన్‌స్పెక్టర్‌. ఈసారి మరింత పరిశీలనగా చూశాడు. ఇది గమనించి...‘‘విశ్వేశ్వర్రావుగారికి ఈ ఆక్వేరియం అంటే చాలా ఇష్టం. చాలాసేపు ఇందులోని చేపలను చూస్తూ గడిపేవారు. రకరకాల చేపల గురించి  అభిరుచే మమ్మల్ని దగ్గర చేసింది అని గతంలో కూడా మీకు చెప్పాను కదా’’ అంది రాజేశ్వరి‘‘విశ్వేశ్వర్రావుని చంపింది మీరే. అరెస్ట్‌ చేస్తున్నాను’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌. రాజేశ్వరి తన నేరాన్ని ఒప్పుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు. హంతకురాలు రాజేశ్వరి అని  ఇన్‌స్పెక్టర్‌ ఎలా కనిపెట్టాడు?

ఆన్సర్‌
1. ఆ రాత్రి ఏదో పుస్తకం చదువుకుంటున్న నాగభూషణం, కూతురు రాగిణి రావడంతో కాసేపు మాట్లాడి,  కాఫీ తయారు చేయడానికి కుర్చీలో నుంచి లేచాడు. అతడిని వారించి తానే  కాఫీ తయారుచేసింది రాగిణి. నాగభూషణం రెస్ట్‌రూమ్‌లోకి వెళ్లి వచ్చేలోపు  
‘మై మగ్‌’లో విషం కలిపింది. తాను తాగిన కప్పుపై వేలిముద్రలు లేకుండా జాగ్రత్త పడిందిగానీ... కాఫీకప్పు అంచులకు అంటిన తన ఫేవరెట్‌ లిపిస్టిక్‌ ‘పింక్‌ లవ్‌’ గుర్తులను మరచిపోయింది.

2. విశ్వేశ్వర్రావు ఆక్వేరియంలో కనిపించాల్సిన అరోవాన చేప... రాజేశ్వరి ఇంట్లోని ఆక్వేరియంలో కనిపించింది. ఈ చేప వల్ల అన్ని కలిసొస్తున్నాయని, నష్టాల్లో  ఉన్న వ్యాపారం సైతం లాభాల బాట పట్టిందని రాజేశ్వరికి  ఎన్నోసార్లు చెప్పాడు విశ్వేశ్వర్రావు. రాజేశ్వరికి సెంటిమెంట్ల పిచ్చి.  వ్యాపారంలో విపరీతమైన నష్టాల్లో ఉన్న రాజేశ్వరి  కన్ను అరోవాన చేపపై పండింది.  అలా ఆ రాత్రి విశ్వేశ్వర్రావుని హత్య చేసి అరోవాన చేపను దోచుకెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement