
భారం: ఆ దేశాలకు ఒక బరువైన సమస్య...!
ప్రపంచానికి ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటి? ఏ సమస్య పరిష్కారం కోసం చాలా దేశాల ప్రభుత్వాలు కంకణం కట్టుకొని ప్రయత్నిస్తున్నాయి? ఏ విషయంలో కృషి చేసిన వారిని ప్రభుత్వాలు ప్రత్యేకంగా అభినందిస్తున్నాయి? వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి?!
ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే.. మనలో చాలా మంది ‘పచ్చదనం పరిశుభ్రత’ ‘అడవుల పెంపకం’ ‘కాలుష్య నియంత్రణ’ తరహా సమాధానం ఇచ్చేసుకొంటాం. అయితే ఈ రంగాల్లో కృషి చేస్తున్న వారి విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు ప్రపంచానికి ఒక ‘బరువైన’ సమస్య తలనొప్పిగా తయారైంది. ఆ సమస్యను పరిష్కరించడానికి అనేక దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే ‘ఊబకాయం’.
దుబాయ్‌లో బంగారం ఇస్తున్నారు!
ఒక కిలోగ్రాము బరువు తగ్గారంటే ఒక గ్రాము బంగారం ఉచితం అనే బంపర్ ఆఫర్‌ను అమల్లో పెట్టింది దుబాయ్ ప్రభుత్వం. ఆ దేశ ప్రభుత్వానికి ప్రజల ఊబకాయం నిద్రలేకుండా చేస్తోంది. ఎలాగైనా సరే వాళ్లందరి బరువును తగ్గించాలని, ఫిట్‌గా ఉంచాలని అక్కడి ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. నిజానికి దుబాయ్ ప్రభుత్వం ప్రతిదానికీ రాయితీలు ఇస్తుండటంతో ఆ దేశప్రజలకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోతోంది. శారీరక శ్రమ చేయాల్సిన అవసరం తగ్గింది. చిన్న చిన్న పనులకు కూడా పరాయి దేశాల నంచి కూలీలను తెచ్చుకొనే సంస్కృతి ఉందక్కడ. దీంతో శారీరకంగా ఏమాత్రం కష్టపడని జనాలు ఊబకాయులు అవుతున్నారు. ఇప్పుడు దుబాయ్‌లో దాదాపు 40 శాతం మంది ఊబకాయం బాధితులే అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాయితీలతో ప్రజలను ఇలా తయారు చేసిన ప్రభుత్వం ఇప్పుడు అలాంటి విధానాలతోనే వారి బరువును తగ్గించడానికి పాటుపడుతోంది. ‘బరువు త గ్గండి బంగారం పొందండి’ అంటూ పదేపదే బంపర్ ఆఫర్‌లతో జనాలను ప్రలోభపరుస్తోంది. అయితే దీనికి వస్తున్న స్పందన అంతంత మాత్రమేనట!
బ్రిటన్ పీఎం స్వయంగా రంగంలోకి దిగాడు!
దుబాయ్‌లాగే పౌరుల ఊబకాయత్వంతో బాగా ఇబ్బందులు పడుతున్న దేశం బ్రిటన్. ఇక్కడ కూడా దాదాపు 30 శాతం ప్రజలు మితిమీరిన బరువుతో ఏ పనీ చేయలేకపోతున్నారట. ఆఖరికి సొంత పనులకు కూడా వీళ్లకు సహాయకుడు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే చిన్నపిల్లల్లో కూడా ఊబకాయ సమస్య తీవ్రస్థాయికి చేరింది. వాళ్లు తీసుకొనే ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉంటున్నాయనీ, దీంతో శరీరాల్లో ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ పెరిగిపోతోందనీ వైద్యులు నిర్ధారిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు బ్రిటన్ ప్రధాని కామెరూన్. ప్రతి వారాంతంలోనూ క్యాలరీ, షుగర్ ఫ్రీ ఆహారాన్ని తీసుకొంటానని ఆయన ప్రకటించారు. శని, ఆదివారాల్లో కామెరూన్ తన శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరకుండా చూసుకొంటూ అందరికీ ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. తను పత్యం పాటిస్తున్నాడు కాబట్టి దేశంలో తనను అభిమానించే వాళ్లు ఆ విషయంలో ఆదర్శంగా తీసుకొంటారనీ, దీని వల్ల కొంతమేర అయినా ఊబకాయ సమస్య తగ్గుతుందనీ కామెరూన్ ఆశ.
కేవలం దుబాయ్, బ్రిటన్‌లే కాదు. ఆర్థికంగా పుష్టిగా ఉన్న దేశాల్లో, ప్రజలకు రాయితీలను ఇచ్చి పెంచుతున్న అనేక దేశాలలో ఊబకాయం (ఒబేసిటీ) ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. దాన్ని నివారించడానికి ఎవరి పాట్లు వాళ్లు పడుతున్నారు. ఎందుకంటే ఊబకాయం దేశాల ఉత్పాద కతను తగ్గిస్తోంది. మానవ వనరుల్లో సోమరితనాన్ని పెంచుతోంది. ఇది భవిష్యత్తులో వైద్య పరంగానూ భారం అయ్యే ప్రమాదం ఉంది. చాలా దేశాల్లో ఇలా మితిమీరి తినడం, శారీరక శ్రమ చేయపోవడం జాతీయ విపత్తులుగా మారుతున్నాయి. ఏదేమైనా ప్రమాదాన్ని మొదట గుర్తించిన దేశాలు ఈ రెండు. వీటి సరసన నడవడానికి మరికొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయి.