ప్రాణ ప్రదాత
ఒక మనిషికి ప్రాణం పోయగలగడం అనేది ఓ గొప్ప వరం.
ఆ వరాన్ని పొందినవారు నిజంగా ఎంతో అదృష్టవంతులు.
- ఆనందీ జోషి
ఆ రోజుల్లో అమ్మాయిలు స్కూలు మెట్లెక్కడమే కనాకష్టం. ఆడవాళ్లు కళ్లెత్తి చూడటమే పెద్ద ఘోరం. అలాంటిది అందరినీ కళ్ల నుంచి కాళ్ల వరకూ పరీక్షించాల్సిన బాధ్యత. డాక్టర్ స్థానంలో ఒక మహిళను ఊహించడానికే వీల్లేని రోజుల్లో ఆమె పాశ్చాత్య దేశాల్లో వైద్య విద్య చదివారు. ఆమెను మొట్టమొదటి మహిళా వైద్యురాలిగా అల్లోపతి వైద్యురాలిగా పేర్కొంటారు. ఆమే... ఆనందీ గోపాల్ జోషీ.
ఆనంది అసలు పేరు యమున. మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్ అనే ప్రాంతంలో 31 మార్చి 1865న ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించారు ఆనంది. మొదట్లో యమున కుటుంబ పెద్దలు కణ్యాళ్ ప్రాంత భూస్వాములుగా పేరుగడించినా ఆ తర్వాతి కాలంలో సంపదను కోల్పోయారు. తొమ్మిదేళ్ల వయసులోనే యమునను గోపాల్‌రావు జోషీ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. యమున కంటే గోపాలరావు ఇరవయ్యేళ్లు పెద్ద. పైగా అప్పటికే అతడి భార్య చనిపోయి ఉంది. పెళ్లి తర్వాత యమున పేరు ఆనందిగా మారింది.
గోపాల్‌రావు మొదట అలీబాగ్‌కు... ఆ తర్వాత కోల్‌కతాకు బదిలీ మీద వెళ్లారు. ఆయనకు ఆధునిక భావాలు ఎక్కువ. తన భార్య ఆనందికి చదువులో ఆసక్తి ఉండటంతో ఆంగ్ల విద్య చదవ మంటూ ప్రోత్సహించారు. పద్నాలుగేళ్ల వయసులో ఆనందికి కొడుకు పుట్టాడు. పది రోజుల మాత్రమే బతికి ఏదో అంతు చిక్కని వ్యాధితో పిల్లాడు చనిపోయాడు. ఆ సంఘటనే ఆనంది జీవితాన్ని మలుపు తిప్పింది.
తన కొడుకును బలిదీసుకున్న ఆరోగ్యపరిస్థితులేమిటో తెలుసుకోవాలని ఆనంది నిశ్చయించుకుంది. మెడిసిన్ చదవాలనుకుంది. భార్య ఆసక్తిని గమనించిన గోపాల్‌రావు తన భార్య అమెరికాలో చదివేందుకు అనుమతించా లంటూ యునెటైడ్ స్టేట్స్‌లోని రాయల్ వైల్డర్ అనే ఒక మతగురువుకు లేఖ రాశారు. ఆమె చదువుకోడానికి అనువైన ప్రదేశాన్ని సూచించాలంటూ కోరారు.
ఈలోపు ఆనంది ఆరోగ్యం దెబ్బతింది. తరచూ జ్వరం, తలనొప్పి, ఆయాసం వచ్చేవి. ఇంతలోనే గోపార్‌రావుకు సెరాంపూర్‌కి బదిలీ అయ్యింది. ఆమె ఆరోగ్యం అంతగా బాగాలేకపోయినా వైద్య విద్య కోసం యూఎస్ వెళ్లాలంటూ ఆనందిని ఒప్పించారు గోపాల్‌రావు. విదేశాలకు వెళ్లాలన్న ఆమె సంకల్పాన్ని తెలుసుకున్న అప్పటి సంప్రదాయ సమాజం ఆమె సంకల్పాన్ని నిరసించింది. కానీ తాను వైద్యవిద్య అభ్యసించాలనే కృతనిశ్చయంతో ఎందుకు ఉన్నాననే విషయాన్ని సెరాంపూర్ కాలేజీ హాల్లో ఇచ్చిన ప్రసంగంలో ఈ ప్రపంచానికి తెలియజేసింది ఆనంది. ఒక భారతీయ మహిళ వైద్యవిద్య ఎందుకు చదవాలో, అది తమ సమాజానికి ఎంతగా అవసరమో వివరించింది.
ఈ క్రమంలో తాను మతం మార్చుకోనని కూడా ప్రకటించిందామె. అప్పటి భారతీయ వైస్‌రాయ్ విదేశాల్లో ఆనంది చదువు కోసం రెండువందల రూపాయల ఉపకారవేతనాన్నీ అందించారు. ఆమె 1883లో కోల్‌కతా నుంచి న్యూయార్క్‌కు వెళ్లారు. ఉమన్స్ మెడికల్ కాలేజీ ఆఫ్ పెన్సిల్వేనియాలో వైద్యవిద్యార్థినిగా చేరారు. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లు. అక్కడి వాతావరణానికి ఆమె ఆరోగ్యం మరింత పాడైంది.
ఆమెకు టీబీ సోకింది. అయినా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక 1886 మార్చి 11 వ తేదీన ఆమె వైద్య విద్యలో ఎండీ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి అప్పటి సంస్థాన రాజ్యమైన కొల్హాపూర్‌లోని ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్‌లో ఫిజీషియన్-ఇన్-చార్జ్‌గా నియమితులయ్యారు. ఇంచుమించు అదే సమయంలో ఆనందీ గోపాల్ జోషీతో పాటు వైద్యురాలిగా అదే సమయంలో కాదంబినీ గంగూలీ అనే మరో మహిళ కూడా పట్టభద్రులయ్యారు. అందుకే ఈ ఇద్దరినీ మొదటి భారతీయ మహిళా ఫిజీషి యన్స్‌గా గుర్తిస్తారు.
కాదంబి కూడా చరిత్రలో గొప్ప స్థానాన్ని పొందారు. ఆనంది డాక్టర్ అయిన అదే ఏడాది 1886లోనే మరో మహిళ కూడా ఇంగ్లిష్ వైద్యంలో డాక్టర్‌గా అవిర్భవించారు కాదంబిని. అప్పటి బీహార్‌లోని భాగల్పూర్‌లో 1861 జూలై 18న కాదంబిని పుట్టారు. ఆమె తండ్రి బ్రజ కిశోర్ బసు భాగల్పూర్‌లో హెడ్‌మాస్టర్. ఆయన సంఘసంస్కర్త. కాదంబినిని చదివించారు. ఆమె బంగ మహిళా విద్యాలయలో చదివారు. యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతా ఎంట్రన్స్ పరీక్షలో పాసైన మొదటి మహిళ. కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి 1886లో వైద్య విద్యలో పట్టభద్రులయ్యారు. చాందసభావాలు కలిగిన అప్పటి సమాజం నుంచి నిరసనలూ, సవాళ్లు ఎదుర్కొని విజయవంతంగా తన చదువులు పూర్తి చేశారామె.
ద్వారకానాథ్ గంగూలీ అనే బ్రహ్మసమాజ కార్యకర్త అయిన ద్వారకానాథ్ గంగూలీతో ఆమె వివాహం అయ్యింది. ఆ తర్వాత దంపతులిద్దరూ సమాజ సంస్కరణ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. సామాజిక బంధనాల నుంచి మహిళల స్వేచ్ఛకోసం కృషి చేశారు.
తొమ్మిదేళ్ల వయసులోనే యమునను గోపాల్ రావు జోషీకి ఇచ్చి పెళ్లి చేశారు. యమున కంటే గోపాలరావు 20 ఏళ్లు పెద్ద. పైగా అప్పటికే అతడి భార్య చనిపోయింది.
- యాసీన్