
రూటు మార్చింది!
‘గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా’... ఈ పాట వింటే ఉదయ్ కిరణ్ వెంటనే ఎలా గుర్తొస్తాడో, అనిత కూడా అలానే గుర్తొస్తుంది. ముద్దుగా, బొద్దుగా, చిన్న పోనీ టెయిల్ వేసుకుని ఆ సినిమాలో అందరినీ అలరించిందామె. ఆ తర్వాత తొట్టిగ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను, శ్రీరామ్ వంటి కొన్ని సినిమాలు చేసింది. బాలీవుడ్‌లో కూడా పలు సినిమాల్లో నటించింది. కానీ అక్కడ కానీ, ఇక్కడ కానీ సక్సెస్ కాలేకపోయింది. దాంతో తన రూటు మార్చేసింది. సినిమాల మీద ఆశ పెట్టుకోవడం అనవసరం అనుకుందో ఏమోగానీ బుల్లితెర వైపు అడుగులు వేసింది. సీరియల్స్‌తో అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే వెండితెర మీద హీరోయిన్‌గా కనిపించిన ఆమె, బుల్లితెర మీద మాత్రం విలన్ వేషాలు వేస్తోంది. ‘యే హై మొహొబ్బతే’లో గర్విష్టి అయిన భార్యగా, మమతానురాగాలు తెలియని తల్లిగా, బాంధవ్యాలను సైతం అవసరానికి వాడుకునే స్వార్థపరురాలిగా అద్భుతంగా నటిస్తోంది అనిత. ఈ దెబ్బతో అనిత టీవీ ఇండస్ట్రీలో శాశ్వతంగా జెండా పాతేసేలానే ఉంది మరి!