
వెయ్యి బారల లోతు రచయిత
ఒక యువపాత్రికేయుడిగా రుడ్యార్డ్ కిప్లింగ్ తనను ఇంటర్వ్యూ చేసిన కొన్నాళ్ల తర్వాత, మార్క్ ట్వేన్ ఇలా వ్యాఖ్యానించాడు: ‘నేను అంతకుముందు కలిసిన వారందరికంటే ఆయనకు ఎక్కువ తెలుసు; అలాగే, ఆయన గతంలో కలిసిన వారందరిలోకీ నేను తక్కువ తెలిసినవాడినని ఆయనకు తెలుసని నాకు తెలుసు’.
మార్క్ ట్వేన్ అంటేనే ఒక చమత్కారం, ఒక నవ్వు, ఒక సరదా. ‘తల్లిదండ్రులకు విధేయంగా ఉండు, వాళ్లు ఉన్నప్పుడు’ అని పిల్లలకు సలహా ఇస్తాడు. ‘మనం తప్పులు చేయకూడదు, ఎవరైనా చూస్తున్నప్పుడు’ అని వ్యంగ్యం విసురుతాడు. ‘మంచిగా ఉండు; త్వరలోనే ఒంటరివాడవవుతావు’ అని సమాజతీరును పట్టిస్తాడు.
1876లో వచ్చిన ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్’ ఆయన్ని రచయితగా నిలబెట్టింది. ప్రతి ఇంటి గోడకూ సాయర్ రంగులు పూశాడు. ప్రతి ఇంటి పిల్లాడికీ సాయర్‌తో దోస్తీ కుదిరింది. ప్రధానంగా బాలల వినోదం కోసం రాసినదైనా, పెద్దవాళ్లూ దాన్ని చదవడం మానలేదు. ‘పెద్దవాళ్లు తమ చిన్నతనంలో తాము ఎలా ఉండేవారో, తమ ఆలోచనలు ఎలా ఉండేవో, తాము ఎలా మాట్లాడేవారో, చిత్రమైన సన్నివేశాల్లో ఎలా చిక్కుకునేవారో ఆహ్లాదకరంగా వారికి జ్ఞాపకం’ చేసిందా నవల.
శామ్యూల్ లాంగ్‌హార్న్ క్లెమెన్స్‌గా అమెరికాలో జన్మించిన మార్క్ ట్వేన్ తన కలంపేరును స్వీకరించిన తీరు కూడా విచిత్రంగా ఉంటుంది. ఆయన స్టీమ్‌బోట్లో కొంతకాలం పనిచేశాడు. నీటిలోతు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, అందులోని సిబ్బంది, గట్టిగా, ‘మార్క్ ట్వేన్’ అని అరిచేవాళ్లు. మార్క్=గురుతు; ట్వేన్=రెండు; రెండు బారలు అని చెప్పడం వాళ్ల ఉద్దేశం!
తన పదకొండో ఏట తండ్రిని కోల్పోయిన ట్వేన్- ఏడుగురిలో ఒకడిగా పుట్టాడు. వాళ్ల నాన్న దగ్గర ఒక బానిస పనిచేసేవాడు. వాళ్ల చిన్నాన్న దగ్గర ఎక్కువమంది ఉండేవారు. ఆ బానిసలతో ట్వేన్ పొలంలో గడిపేవాడు. వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లి కూర్చునేవాడు. వాళ్లు చెప్పే కథల్ని వినేవాడు. ఆ బాల్యమే ఆయన్ని తర్వాత్తర్వాత మహోదాత్తమైన ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ హకల్‌బెరీ ఫిన్’ రాయించింది.
ట్వేన్ మామూలుగా కుడిచేత్తోనే రాసేవాడు. ఒక దశలో ఆ చేయి నొప్పితో బాధించినప్పుడు ఎడమ చేత్తో కూడా సాధన చేశాడు. ఏ చేత్తో రాసినా హాస్యం చిప్పిల్లేది. అయితే, మార్క్ ట్వేన్ హాస్యం ఉత్తి నవ్వులాట హాస్యం కాదు. హాస్యం ఎప్పుడూ దుఃఖంలోంచి, ఆ దుఃఖం ఉపశమనం కోసమే పుడుతుంది. ఆయనే అన్నట్టు, ‘నిజమైన హాస్యం కరుణరసానికి దారి తీస్తుంది’.
‘పుస్తకాలు, స్వేచ్ఛ పొందిన మనుషుల ఆత్మలు’ అంటాడు ట్వేన్. ఆ పుస్తకాల్లో హాస్యం సాకుగా ఆయన ఎంత లోతైన ఆలోచనలు వెల్లడించాడో ‘ద మిస్టీరియస్ స్ట్రేంజర్’ (విచిత్రవ్యక్తి)లోని ఈ వాక్యాలు చెబుతాయి: ‘అయితే ప్రతి మనిషికీ ఇన్ని లక్షల గమ్యస్థానాలున్నప్పుడు తనకు ఇష్టమైనది ఎంచుకోవచ్చుగదా అని నువ్వంటావు. కాని అతడు చేరవలసిన గమ్యస్థానం నిర్ణయించేది అతడు కాదు; అతడు జీవితంలో మొట్టమొదట చేసిన పనే దాన్ని నిర్ణయిస్తుంది. ఒకవేళ ఫలానా పని చెయ్యగూడదని అనుకుంటాడనుకో. ఆ అనుకోవడాన్ని నిర్ణయించేది కూడా అతని మొదటి పనే. ఫలానా పని చెయ్యడనుకో. ఆ చెయ్యకపోవడాన్ని నిర్ణయించేది కూడా మొదటి పనే’.
లోతైన, గాఢమైన, ఛిద్రమైన జీవితాన్ని అనుభవించాడాయన. ప్రచురణ సంస్థ పెట్టాడు. మొదట్లో డబ్బులు కళ్లజూసినా అది క్రమంగా ఆయన్ని అప్పులపాలు చేసింది. లెక్చర్లు ఇస్తూ డబ్బులు సంపాదించాడు. వాటికిగానూ ఎన్నో దేశాలు పర్యటించాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉపన్యసించేవాడు కాబట్టి, ఆయన రచనల్ని ప్రచురించడానికి సంస్థలు ముందుకొచ్చేవి కాదు. ఈ నష్టం ఇలావుంటే, కుటుంబనష్టం మరీ కుంగదీసింది! డిఫ్తీరియాతో రెండేళ్ల కొడుకు లాంగ్డన్ చనిపోయాడు. 24 ఏళ్ల వయసులో కూతురు సుసీ స్పైనల్ మెనింజైటిస్‌తో మరణించింది. మూర్ఛరోగమున్న కూతురు జీన్ 29 ఏళ్ల వయసులో చనిపోయింది. క్లారా ఒక్కతే తల్లిదండ్రులకు చివరిదాకా మిగిలిన బిడ్డ! ‘తన స్వీయ సమ్మతి లేకుండా ఏ మనిషి కూడా సౌకర్యంగా ఉండలేడు’ అనేవాడు ట్వేన్. తన సమ్మతి లేకుండా ఏ మనిషైనా బాధ కూడా ఎలా పడగలడు! ట్వేన్ కూడా ఈ కష్టాల్ని ఇలాగే దాటాడేమో!
మతగ్రంథాల్ని, ఆధ్యాత్మిక రచనల్ని ఎంతగా చదివినప్పటికీ దేవుడి ఉనికి మీద విశ్వాసంగానీ, అవిశ్వాసంగానీ ప్రకటించని అజ్ఞేయవాదిగానే జీవితాంతం మిగిలిపోయిన ట్వేన్... 75 ఏళ్లకు ఒకసారి కనిపించే హేలీ తోకచుక్క కనబడిన 1835(నవంబర్ 30)లో జన్మించాడు. తిరిగి మళ్లీ కనబడిన 1910లో తన ఏడుపదుల వయసులో అస్తమించాడు. చావుపుట్టుకల్ని కూడా చమత్కారంతో మేళవించడం ఎలా సాధ్యమైందో ఆయన్ని ఎలా అడగటం!
- ఆర్.ఆర్.
‘తల్లిదండ్రులకు విధేయంగా ఉండు, వాళ్లు ఉన్నప్పుడు’. ‘మనం తప్పులు చేయకూడదు, ఎవరైనా చూస్తున్నప్పుడు’.
- మార్క్ ట్వేన్