
నడిచేటి కోవెల అమ్మేలే...
బిచ్చగాడు’ చిత్రం కోసం రాసిన పాట ఇది. కథానాయకుడి తల్లి చావుబతుకుల మధ్య పోరాడుతున్న సందర్భానికి అనుగుణంగా ఈ పాట రాశాను.
‘వంద దేవుళ్లే కలిసొచ్చినా...అమ్మ నీలాగ చూడలేరమ్మా....’ అని పల్లవి ప్రారంభించాను. ఔను... వందమంది దేవుళ్లు కలిసి మన ఆలనపాలన చూస్తున్నా.... వాళ్లు అమ్మలా చూసిన భావన కలగదు. వాళ్లు ఎంత చూసినా ఏదో తక్కువైనట్టే ఉంటుంది. ఓ పసిబిడ్డను పది మంది ఎత్తుకుని ముద్దాడినా బిడ్డ దృష్టంతా తల్లి మీదే, తల్లి వైపే ఉంటుంది. ‘కోట్ల సంపదే అందించినా... నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా...’ మనం కోట్లు ఖర్చు పెడితే ఎదుటి వాళ్ల సేవను పొందగలమేమో గాని, వాళ్ల ప్రేమని పొందలేం.
‘నా రక్తము ఎంతిచ్చినా... నీ త్యాగాలనే మించునా... నీ రుణమే తీర్చాలంటే... ఒక జన్మైనా సరిపోదమ్మా... మన సుఖం కోసం అమ్మ తన జీవితమంతా ధారపోస్తుంది. అలాంటి అమ్మ ఋణం తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి... ఏం చేసినా తక్కువే. వంద జన్మలñ త్తినా తీర్చుకోలేనిది అమ్మ ఋణం.
నడిచేటి కోవెల అమ్మేలే... ప్రాణం పోయగల శక్తి దైవానికుంటే, బిడ్డకు ప్రాణం పోసిన దైవం అమ్మ. అందుకే దైవం గుడిలో కాదు... అమ్మ ఒడిలోను, తనను ఎత్తుకొని లాలించే ఆమె అణువణువులో ఉందనిపిస్తుంది.
పగలైనా రాత్రైనా జాగారాలు... పిల్లల సుఖమే మెడ హారాలు బిడ్డకు జ్వరం వస్తే అమ్మ నిద్రపోదు. బిడ్డలు నిదురిస్తుంటే, సుఖంగా నిద్రపోతున్నారో లేదో అని తాను నిద్రపోకుండా, చూస్తూ ఉంటుంది.
దీపంలా కాలి వెలుగే పంచెను... పసి నవ్వులే చూసి బాధే మరిచెను
ఒక ఒత్తి తను కాలుతూనే లోకానికి వెలుగునిస్తుంది. అలాగే అమ్మ తన కడుపు కాల్చుకొని, బిడ్డ కడుపు నింపుతుంది. అమ్మ ఎన్నో కష్టాలను దిగమింగి బిడ్డలకు సంతోషాన్ని పంచుతుంది. తను ఎంత కష్టపడినా అంతా తన బిడ్డల ఆనందం కోసమే.
తన ప్రాణం పోయే క్షణంలోకూడా బిడ్డను చూస్తే అమ్మకు ప్రాణం లేచి వస్తుంది. పిల్లల సుఖం కోసం అమ్మ తన జీవితాన్నే అర్పిస్తుంది. అందుకే అమ్మను కనిపించే దైవం అంటారు.
– సంభాషణ: డా. వైజయంతి