భలే భలే బైక్ ట్యాక్సీ | Bike taxy drivers to be called as Goa | Sakshi
Sakshi News home page

భలే భలే బైక్ ట్యాక్సీ

Published Sun, Nov 2 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

భలే భలే బైక్ ట్యాక్సీ

భలే భలే బైక్ ట్యాక్సీ

సౌలభ్యం: గోవాలో బైక్ ట్యాక్సీ డ్రైవర్లను పైలట్లు అంటారు. వాస్కోడాగామా ప్రాంతంలో స్టాండ్‌ల మీద పసుపు రంగు బైకులతో సిద్ధంగా ఉంటారు పైలట్లు. కొందరు యూనిఫామ్ కూడా ధరిస్తారు. మీరు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డులో నడుస్తున్నారు. సోమాజిగూడకు పోవాలి. నడిచేందుకు ఓపికుండదు. సమయానికి బస్సుండదు. ఆటో ఎక్కుదామంటే నలభయ్యో యాభయ్యో ఇమ్మంటాడు. జేబులో అంత ఉండదు. ఉన్నా అంతివ్వడానికి మనసొప్పుకోదు. అలాంటి సమయంలో బైకు మీద ఓ వ్యక్తి వచ్చి, పది రూపాయలిస్తే డ్రాప్ చేస్తా అంటే ఎలా ఉంటుంది? ఇండియాలో ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఈ తరహా ‘టూ వీలర్ ట్యాక్సీ’ కాన్సెప్ట్ జోరందుకుంటే భవిష్యత్తులో మనకూ అందుబాటులోకి కావచ్చు.
 
 టూ వీలర్ ట్యాక్సీ... ఈ కాన్సెప్ట్ ఇండియాకు కొత్త కావచ్చు. కానీ విదేశాల్లో చాలా పాపులర్. చైనాలో 1980 ప్రాంతంలోనే టూ వీలర్ ట్యాక్సీలు నడిచాయి. 90ల్లో ఊపందుకున్నాయి. ప్రస్తుతం చైనాలోని ప్రధాన నగరాలన్నింట్లో బైక్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. 2008 ఒలింపిక్స్ సమయంలో మన అథ్లెట్లు బీజింగ్ నగరంలో బైక్ ట్యాక్సీల మీద షికార్లు చేశారు కూడా. అక్కడ బైక్ ట్యాక్సీ మీద ఐదు కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు మన కరెన్సీ ప్రకారం 50 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆటోలు, ట్యాక్సీలతో పోలిస్తే ఇది చాలా చవక. చైనాలో బైక్ ట్యాక్సీలు ఊపందుకుంటున్న సమయంలోనే బ్రెజిల్‌లోనూ ఈ సంప్రదాయం మొదలైంది. ఒక బ్యాంకు ఉద్యోగి పది బైకులు కొని ముందుగా టూ వీలర్ ట్యాక్సీ ప్రయాణాలకు శ్రీకారం చుట్టాడు.
 
 ఈ ఆలోచన సూపర్‌హిట్ అయి, దేశంలోనే పలు నగరాలకు విస్తరించింది. ప్రస్తుతం బ్రెజిల్ దేశవ్యాప్తంగా టూ వీలర్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు బ్రిటన్‌లోనూ బైక్ ట్యాక్సీ కాన్సెప్ట్ ఉంది. అయితే అక్కడ ఇది కూడా ఖరీదైన వ్యవహారమే. అక్కడి డ్రైవర్లు ఖరీదైన లగ్జరీ బైకులు వాడతారు. కాబట్టి ప్రయాణం కూడా ఖరీదైందే. ఇంకా కంబోడియా, కామెరూన్, ఇండోనేషియా, నైజీరియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో బైక్ ట్యాక్సీలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఈ దేశాల్లో బైక్ ట్యాక్సీల కోసం స్టాండ్‌లు కూడా ఉన్నాయి.
 
 మన దగ్గర ఆ రెండు చోట్లే!
 ఇండియాలో టూ వీలర్ ట్యాక్సీకి ముందుగా శ్రీకారం చుట్టింది గోవానే. ఈ సాగర నగరంలో బైకుల్ని అద్దెకిచ్చే కాన్సెప్ట్ ఎప్పట్నుంచో ఉండగా, కొన్నేళ్ల క్రితం బైక్ ట్యాక్సీ స్టాండ్‌లు మొదలయ్యాయి. గోవాలో బైక్ ట్యాక్సీ డ్రైవర్లను పైలట్లు అంటారు. వాస్కోడాగామా ప్రాంతంలో స్టాండ్‌ల మీద పసుపు రంగు బైకులతో సిద్ధంగా ఉంటారు పైలట్లు. కొందరు యూనిఫామ్ కూడా ధరిస్తారు. ఈ బైకులపై ప్రయాణం చేయడానికి మినిమమ్ ఛార్జి రూ.10. రెండు కిలోమీటర్ల తర్వాత కి.మీ.కి రూ.4 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టూరిజం ప్యాకేజీలు కూడా ఉన్నాయి.
 
 ఆటోలు, ట్యాక్సీలతో పోలిస్తే 25 శాతం డబ్బులతో బైక్ ట్యాక్సీలపై గోవా నగరమంతా చుట్టేయచ్చు. దేశంలో గోవా తర్వాత పర్యాటక ప్రాంతంగా మంచి పేరున్న కేరళలోనూ బైక్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. కొచ్చిలో ‘టాప్ గేర్ రెంట్ ఏ బైక్’ అనే పేరుతో ఓ సంస్థ ఐదు టూ వీలర్ ట్యాక్సీల్ని అందుబాటులోకి తెచ్చింది. వీటికి మంచి స్పందనే వచ్చింది. కిలోమీటరుకు రూ.4 ఖర్చు చేసి వీటిపై ప్రయాణం చేయొచ్చు. విశేషమేంటంటే... ఈ బైక్ నడిపే డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడికి రూ.లక్ష చొప్పున ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది.
 
 మెహబూబ్... బ్రాండ్ అంబాసిడర్!
 కేరళలో బైక్ ట్యాక్సీ కాన్సెప్ట్‌కి మంచి పేరు తెచ్చింది అశ్వక్ మెహబూబ్. దుబాయిలో చేస్తున్న ఉద్యోగం బోర్ కొట్టేసి, ఇండియాకు వచ్చిన మెహబూబ్ కొన్నాళ్లపాటు ఏ పనీ లేకుండా గడిపాడు. ఖాళీగా ఉన్న అతణ్ని డ్రాపింగ్ కోసం స్నేహితులు పిలిచేవాళ్లు. వేరే ఉద్యోగం ఏం చేద్దామా అనుకుంటున్న సమయంలో ఎక్కడో టూ వీలర్ ట్యాక్సీ గురించి చదివి, అదే తనకు జీవనోపాధి కాగలదని ఆలోచించాడు మెహబూబ్. తనను డ్రాపింగ్ కోసం పిలిచే మిత్రులకే తన ఆలోచన చెప్పాడు. వాళ్లంతా ప్రోత్సహించారు. క్రమంగా తనుండే ప్రాంతంలో మెహబూబ్ బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. మొదట మెహబూబ్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆటోవాలాలు తర్వాత అతణ్ని అర్థం చేసుకుని, తమ స్టాండ్‌లోనే అతనికి చోటిచ్చారు.
 
 అనుమతులకు సంబంధించి పోలీసుల నుంచి కూడా ఓ దశలో ఇబ్బందులు ఎదురైనా, నేరుగా పోలీస్ కమిషనర్‌నే కలిసి గ్రీన్‌సిగ్నల్ తెచ్చుకున్నాడు మెహబూబ్. పేషెంట్లను ఉచితంగా ఆసుపత్రులకు చేరవేస్తూ... లాంగ్ డ్రైవ్‌లకు డిస్కౌంట్ ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ మంచి పేరే తెచ్చుకున్నాడు మెహబూబ్. నిరుద్యోగులు తనను సంప్రదిస్తే, వాళ్లకూ ఇదే ఉపాధి కల్పిస్తానంటున్నాడు మెహబూబ్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement