
పంచామృతం: ఎక్స్‌ట్రా టాలెంట్...!
ఏంజెలీనా జోలీ
మన హీరోయిన్లు ఈ మధ్య సినిమాల్లో రౌద్రపూరితమైన పాత్రలను చేస్తూ కత్తులు చేతబడుతున్నారు. అయితే హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ నిజజీవితంలోనే కత్తిని తిప్పడంలో నిపుణురాలు. చేతిలో ఇమిడిపోయే నైఫ్‌ను చూపరులను ఆకట్టుకొనేలా తిప్పగలదు ఏంజెలీనా. షూటింగ్ స్పాట్స్‌లోనూ, రియాలిటీ షోలోలలోనూ ఏంజెలీనా తన ఈ నైపుణ్యాన్ని ప్రద ర్శిస్తూ ఆకట్టుకొంటూ ఉంటుంది.
ఆయుష్మాన్ ఖురానా
ఇతడు సెట్‌లో ఉంటే సహనటులు, ఇతర యూనిట్‌కు ఫుల్‌ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందట. షూటింగ్ స్పాట్‌కు తనతో పాటు గిటార్‌ను తెచ్చుకొని మధురమైన సంగీతం వినిపిస్తాడు ఈ హీరో. అంతే కాదు ‘విక్కీడోనర్’ సినిమా కోసం ఒక పాటను రచించి, ట్యూన్ కట్టి, కంపోజ్ చేశాడు. తనలోని భిన్నమైన టాలెంట్‌ను చాటుకొన్నాడు.
వివేక్ ఒబెరాయ్
ఒకప్పుడు విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌తో ప్రేమగ్రంథం సాగించిన ఈ హీరో ఆమెను తన కవిత్వంతోనే ఆకట్టుకొని ఉంటాడని అంటారు ఇతడిని ఎరిగిన వాళ్లు. ఎందుకంటే కవితలు రచించడంలో వివేక్ ఒబెరాయ్‌కు మంచి నైపుణ్యం ఉందట. తన భావనలను అందమైన అక్షరాల్లో కూర్చగలడట ఈ హీరో.
వాళ్లేంటో, వాళ్లు ఏ విధంగా ఫేమస్ అయ్యారో, ఏ రంగంలో ప్రతిభవంతులో ప్రపంచమందరికీ తెలుసు. అయితే ప్రతి వ్యక్తి సరదాగానో, సీరియస్‌గానో తమ వృత్తికి భిన్నమైన ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. వినడానికి ఆశ్చర్యంగా, తెలుసుకోవడానికి ఆసక్తి కరంగా ఉంటాయి
ఆ ప్రతిభాపాటవాలు. అదెలాగంటే....
జస్టిన్ బీబర్
బీబర్ అంటే జలపాతంలా హోరెత్తించే సంగీతమే గుర్తుకు వస్తుంది. అయితే ఆఫ్‌లైన్‌లో ఈ యువకుడు రూబిక్స్ క్యూబ్‌తో తన టాలెంట్‌ను నిరూపించుకొంటూ ఉంటాడు. జులాయి సినిమాలో అల్లు అర్జున్‌లా రెండే నిమిషాల్లో రూబిక్ క్యూబ్‌ను సాల్వ్ చేయగలడు బీబర్. చాలా మందికి అసాధ్యమైన, చాలా సమయం పట్టే సరదా పనిని బీబర్ చకచకా చేస్తాడు.
ప్రియాంక చోప్రా...
ప్రియాంక అంటే ఆమెను మిస్ వరల్డ్‌గానే చాలా మంది గుర్తు పెట్టుకొంటారు. బాలీవుడ్ నటిగా ఆమెను ఆరాధించే వాళ్లూ ఉన్నారు. అయితే ప్రియాంకకు సంగీతంపై మంచి పట్టుందనేది తక్కువమందికి తెలిసిన అంశం. ఇప్పటికే ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేసి ప్రియాంక తన సంగీత పటిమను చాటుకొంది. ఈ విధంగా మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేసిన ఏకైక ఘనత ప్రియాంకచోప్రాకు మాత్రమే సొంతం.