పచ్చిమిర్చి | specials story on Rakhi Sawant | Sakshi
Sakshi News home page

పచ్చిమిర్చి

Published Sun, Apr 9 2017 11:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

పచ్చిమిర్చి - Sakshi

పచ్చిమిర్చి

రాఖీసావంత్‌ మాట మిర్చిలా ఘాటుగా ఉంటుంది. మనసు నొప్పిస్తుంది. కోపం తెప్పిస్తుంది. మిర్చి స్వభావమే అంత. ఘాటు తగ్గేవరకు హాహాకారాలు వినిపిస్తూనే ఉంటాయి.

బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ముంబైలోనా? పంజాబ్‌లోనా? పోలీసుల అదుపులోనా లేదా తనకెంతో ఇష్టమైన చైనీస్‌ ఫుడ్‌ తింటూ ఏదైనా రెస్టారెంట్‌లోనా? ఎక్కడున్నా సరే, ఇవాళ మాత్రం ఆవిడ లూథియానా కోర్టుకు హాజరు కావలసిందే. నేడు ఆమె కేసు హియరింగ్‌కు వస్తోంది. గత ఏడాది జూలైలో నరీందర్‌ ఆదిత్య అనే న్యాయవాది రాఖీపై కేసు పెట్టారు. వాల్మీకి కులస్థుల మనోభావాలు గాయపడేలా ఒక టీవీ ఛానెల్‌లో రాఖీ మాట్లాడారని ఆయన ఆరోపణ.

 కేస్‌ ఫైల్‌ అయ్యాక రాఖీ ఇంతవరకు ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. దాంతో కోర్టు ఆదేశాలపై ఇద్దరు పంజాబ్‌ పోలీసులు గత నెల 9న అరస్టు వారెంటుతో రాఖీని వెతుక్కుంటూ ముంబై వెళ్లారు. తర్వాత రాఖీ కచ్చితంగా ఎక్కడ ఉన్నదీ నిన్న ఆదివారం నాటికి కూడా ఎవరికీ తెలియదు!చెడ్డవాళ్లు మంచివాళ్లుగా ఎలా మారతారో చెప్పడానికి రాఖీ సావంత్‌ వాల్మీకి మహర్షిని ఉదాహరణగా తీసుకోవడమే ఆమెను చిక్కుల్లో పడేసింది.

అసలు ఇదంతా పంజాబీ గాయకుడు మికా సింగ్‌తో వచ్చింది. పదేళ్ల క్రితం తన బర్త్‌ డే పార్టీకి వచ్చిన రాఖీని అతడు బలవంతంగా పెదవులపై ముద్దు పెట్టడం, రాఖీ అతడిపై కేసు పెట్టడం.. అంత తేలిగ్గా లోకానికి మరపురానివ్వని సంఘటనలు. ‘అయితే ఇప్పుడతడు మంచివాడైపోయాడు. జస్ట్‌ లైక్‌ వాల్మీకి! దారికాసి దోపిడీలు చేసే వాల్మీకి.. ఆ తర్వాత మంచివాడైపోయిన విధంగానే మికా సింగ్‌ మారిపోయాడు’ అని రాఖీ అనడమే ఆమెను కోర్టుకు ఈడ్చింది. అలా అన్నందుకు ఆ తర్వాత ఆమె క్షమాపణ కోరారు కానీ, కేసు కొనసాగుతూనే ఉంది. ‘నేను చిన్నప్పుడు చదువుకున్న దానిని బట్టి అలా మాట్లాడాను.

 అంతే తప్ప ఎవర్నీ చిన్నబుచ్చాలన్న ఉద్దేశం నాకు లేదు’ అని రాఖీ ఓ చిన్న వీడియో ద్వారా వివరణ ఇచ్చినప్పటికీ వినేందుకెవరూ సిద్ధంగా లేరు. నిజానికి రాఖీ సావంత్‌ది వివరణ ఇచ్చుకునే తత్వం కాదు. ‘డ్రామా క్వీన్‌’ అని అమెకు పేరు వచ్చింది కానీ, అంతకన్నా కూడా ఆమెను ‘దుస్సాహసి’ అని అంటేనే సరిగ్గా సరిపోతుంది. వాల్మీకి కులస్తులను కించపరిచారన్న ఆరోపణలు వచ్చినప్పుడు రాఖీ సావంత్‌ స్పందన మొదట వేరేలా ఉంది. ‘‘నేను సల్మాన్‌ఖాన్‌ని కాదు. రాఖీ సావంత్‌ని. నా మీద ఆరోపణలు చేయడం వల్ల మీకు ఒనగూడేది ఏమీ ఉండదు. నేనొక మామూలు అమ్మాయిని’’ అని అన్నారు రాఖీ.

రాఖీని ‘రాకింగ్‌ రాఖీ’ అనడానికి తగినంత ‘స్పంక్‌’ అమెలో ఉంది. స్పంక్‌ అంటే ధైర్యం, దృఢచిత్తం. మాట అనగలరు. మాట మీద నిలబడగలరు. పోనీలే పాపం అని అనిపించినప్పుడు మాట మీద నుంచి దిగగలరు కూడా. వాల్మీకిపై వ్యాఖ్యలకు సారీ చెప్పడం కూడా ఇలా దిగి చెప్పిందే. దిగడానికి కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యం రాఖీకి ఉంది.

‘‘దేవుడు ఇవ్వనిది డాక్టర్‌ ఇస్తాడు’’ అని తన బోటాక్స్‌ సర్జరీల గురించి దాపరికం లేకుండా ధైర్యంగా చెప్పుకున్న రాఖీ సావంత్‌ ఇవాళ కోర్టుకు వెళతారా? Good girls go to heaven, bad girls go every where...గ్రామీ అవార్డు విజేత జిమ్‌ స్టెయిన్‌మెన్‌ రాసిన పాట ఇది. మంచమ్మాయిలు స్వర్గానికి వెళితే, చెడ్డమ్మాయిలు ప్రతిచోటుకీ వెళ్తారట. రాఖీ బ్యాడ్‌ గర్ల్‌ అన్నదే కనుక మన ఒపీనియన్‌ అయితే.. నేచురల్‌గానే ఆమె ఎక్కడికైనా వెళ్లగలరు.


ఎవరీ అమ్మాయి?
రాఖీ సావంత్‌ ముంబై అమ్మాయి.  1978 నవంబర్‌ 25 రాఖీ డేటాఫ్‌ బర్త్‌. అసలు పేరు నీరూ భేడా. డాన్సర్, మోడల్, బాలీవుడ్‌ న టి, టెలివిజన్‌ టాక్‌ షో ల వాగుడుకాయ. హిందీ, కన్నడ, మరాఠీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. కలర్స్‌ ఛానల్‌ రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌’లో కూడా ఉంది. ‘రాష్ట్రీయ ఆమ్‌ పార్టీ’ అని ఒక సొంత పార్టీ పెట్టుకుని 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది రాఖీ. ఎన్నికలయ్యాక ‘రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎ)లో చేరింది. ‘ఎ’ అన్నది పార్టీ వ్యవస్థాపకుడు రామ్‌దాస్‌ బంధు అథావాల్‌ పేరు. ఇది ‘రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా’ (ఆర్‌.పి.ఐ.) నుంచి చీలిన పార్టీ. అంబేడ్కర్‌ నడిపిన ‘షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ ఫెడరేషన్‌’ నుంచి ఆర్‌.పి.ఐ. వచ్చింది. రాఖీ మాటలు, చేతలు నిరంతరం ఆమెను వార్తల్లో తాజా మనిషిగా ఉంచుతాయి. ఆమె వయసు 38.

ఇంటి విషయాలు
రాఖీ తల్లి పేరు జయా భేడా. ఆమె ఆనంద్‌ సావంత్‌ను చేసుకుంది. వొర్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆయన  కానిస్టేబుల్‌. జయ తన మొదటి వివాహం వల్ల కలిగిన పిల్లలకు కూడా రెండో భర్త ఇంటి పేరునే పెట్టుకుంది. రాఖీ సోదరుడు రాఖేశ్‌ సావంత్‌ సినిమా డైరెక్టర్‌. సోదరి ఒకప్పటి నటి ఉషా సావంత్‌. రాఖీ సావంత్‌ క్రైస్తవ మతాన్ని స్వీకరించిన హిందువుల అమ్మాయి. ముంబై సమీపంలోని గోక్లీబాయ్‌ హైస్కూల్‌లో రాఖీ చదివింది. మిథీబాయ్‌ కాలేజీలో డిగ్రీ చేసింది.

1997 టు 2017  
రాఖీ సినిమాల్లోకి వచ్చిన సంవత్సరం 1997. తొలి సినిమా ‘అగ్నిచక్ర’.  తర్వాతంతా చిన్న చిన్న సినిమాలు. పెద్ద పెద్ద ఐటమ్‌ సాంగ్స్‌. హిమేశ్‌ రేషమియా కంపోజ్‌ చేసిన ‘మొహబ్బత్‌ హై మిర్చి’ ఐటమ్‌ సాంగ్‌ (ఛురా లియా హై తుమ్నే సినిమాలోనిది) రాఖీ కెరీర్‌ గ్రాఫ్‌ వేగాన్ని ఒక్కసారిగా పైపైకి పెంచేసింది. ‘అగ్నిచక్ర’ మొదలు, ‘ఉపేక్ష’ (ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది) వరకు సుమారు 35 చిత్రాలో నటించారు. తెలుగులో ‘6  టీన్స్‌’ అనే సినిమాలో నటించారు. తెలుగులోనే ‘ద్రోణ’ చిత్రంలో ఒక ఐటమ్‌ సాంగ్‌ (సయ్యారే.. సయ్యారే)లో కనిపించారు. అన్ని భాషల్లో కలిపి రాఖీ అకౌంట్‌లో 20 వరకు ఐటమ్‌ సాంగ్స్‌ ఉన్నాయి. ఇవి కాక, ఓ పది మ్యూజిక్‌ వీడియోలు, ముప్పై టీవీ షోలు రాఖీవి ఉన్నాయి. రాఖీ గాయని కూడా. 2007లో ఆమె తన తొలి ఆల్బమ్‌ ‘సూపర్‌ గర్ల్‌’తో సంగీత ప్రపంచాన్ని షేక్‌ చేసింది.

దళితుల హక్కుల కోసం!
2019 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి, దళితుల హక్కుల కోసం పోరాడతానని రాఖీ అంటున్నారు. గత ఎన్నికల్లో ఆమె వాయవ్య ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకు కేవలం 2006 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పార్టీ ఎన్నికల గుర్తుగా ఆమె ‘గ్రీన్‌ చిల్లీ’ని కోరుకున్నారు. తన వ్యక్తిత్వాన్ని పచ్చి మిర్చితో పోల్చవచ్చని రాఖీ చెబుతుంటారు. ఎన్నికల్లో ఓడిపోయాక రాఖీ ఆర్‌.పి.ఐ (ఎ)లో చేరారు. అప్పుడే తొలిసారిగా ఆమె తనకు దళితుల కోసం పనిచేయాలని ఉందని ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, మహిళా విభాగం అధ్యక్షరాలిగా కూడా పని చేశారు.

విశేషాలు–వివాదాలు
రాఖీ తండ్రికి ఆమె సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. మొదట్లో ఇద్దరికీ గొడవలు అయ్యేవి. చివరికి ఆ పెంకి పిల్లతో వాదించడం ఆయన మానుకున్నారు 

టీనా మునిమ్‌ పెళ్లిలో రాఖీ (అప్పటికి 12 ఏళ్లు) భోజనాలు వడ్డించే అమ్మాయిగా పని చేసింది

యోగా గురు రామ్‌దేవ్‌ బాబా అంటే తనకెంతో ఇష్టం అని, ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఉందని కొంతకాలం క్రితం రాఖీ చేసిన ప్రకటన దేశంలో కలకలం రేపింది 

కొల్హాపూర్‌లో ఓసారి స్టేజ్‌ షో ఇచ్చినప్పుడు రాఖీ అభ్యంతరకరమైన భంగిమలతో డాన్స్‌ చేశారని, ఒళ్లు కనిపించేలా దుస్తులు ధరించారని ఆమెపై కేసు నమోదు అయ్యింది

2006లో పంజాబీ సింగింగ్‌ సెన్సేషన్‌ మికా సింగ్‌ తన బర్త్‌డే పార్టీకి వచ్చిన రాఖీ సావంత్‌కు బలవంతంగా ముద్దు పెట్టడంతో ఆమె అతడిపై క్రిమినల్‌ కేసు పెట్టారు 

లెక్కలేనన్ని కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకున్నారని రాఖీపై ఓ విమర్శ

ఓ ప్రీమియర్‌ షోలో రెండేళ్ల క్రితం నటి కైనాజ్‌ పర్వేజ్‌ను రాఖీ ముద్దు పెట్టుకోవడం పెద్ద చర్చ అయింది

మోదీ బొమ్మ ఉన్న దుస్తుల్ని ధరించి ఆమె బీజేపీ అభిమానులకు కోపం తెప్పించారు.

మిర్చి కోట్స్‌
రాఖీసావంత్‌కి తనను తాను గ్రీన్‌ మిర్చితో పోల్చుకోవడం ఇష్టం. ఆమె మాటలు కూడా పచ్చి మిర్చి అంత ఘాటుగానే ఉంటాయి. వాటిలో కొన్ని

డొనాల్ట్‌ ట్రంప్‌ మీద పోటీ చేసి ఉంటే నేను తేలిగ్గా గెలిచి ఉండేదాన్ని

నేను డిప్రెషన్‌లో పడే టైపు కాదు. డిప్రెషన్‌లో పడేసే టైపు

షారుక్‌ ఖాన్‌ కనిపెట్టిన మణిమాణిక్యాన్ని నేను

ఎవరేం చేస్తున్నారని కేజ్రీవాల్‌లా నేనో కన్నేసి ఉంచను. డైరెక్ట్‌గా మీడియాను స్పాట్‌లోకి తీసుకెళ్తానంతే

సెక్స్‌ అప్పీల్‌ లేకుండా టాలెంట్‌ ఏమిటి! టాలెంట్‌ లేకుండా సెక్స్‌ అప్పీల్‌ ఏమిటి!!

రాఖీకి పెళ్లయిందా?
పెళ్లయిందీ, పెళ్లి పెటాకులూ అయింది. 2009లో రాఖీ తన 31వ యేట ‘రాఖీ కా స్వయంవర్‌’ అనే రియాలిటీ షోలో తన జీవిత భాగస్వామిని వరించి వివాహం చేసుకున్నారు. అలా ఆ ఏడాది ఆగస్టు 2న రాఖీ.. స్వయంవరానికి వచ్చిన కెనడా కుర్రాడు ఎలేష్‌ పారజాన్‌వాలా మెడలో పూలహారం వేశారు. అయితే, ఆ తర్వాత కొద్ది నెలలకే ‘మేమిద్దరం విడిపోయాం’ అని ఆమె ప్రకటించారు. ఆ తర్వాత రాఖీ నాలుగేళ్ల పాటు అభిషేక్‌ అవస్థితో డేటింగ్‌ చేశారు. బ్రేకప్‌ తర్వాత, శ్రద్ధాశర్మ తన బాయ్‌ ఫ్రెండ్‌ని దొంగిలించిందని రాఖీ ఆరోపించారు. అభిషేక్‌ అవస్థి యాక్టర్, కొరియోగ్రాఫర్, డాన్సర్, మోడల్‌. రాఖీ కన్నా వయసులో మూడేళ్లు చిన్న. బ్రేకప్‌ అయినప్పుడు రాఖీ అభిషేక్‌ను లాగిపెట్టి చెప్పదెబ్బ కూడా కొట్టింది.

ఏక్‌ నిరంజని
‘అమ్మా లేదు, నాన్నా లేడు, అక్కా చెల్లి తంబీ లేడు.. ఏక్‌ నిరంజన్‌’ అని ‘ఏక్‌ నిరంజన్‌’ సినిమాలో ప్రభాస్‌ పాడతాడు. రాఖీ సావంత్‌కి వీళ్లందరూ ఉన్నారు కానీ, ‘నాకెవరూ లేరు’ అని ఆమె చెబుతుంటారు! ఆమె ఉద్దేశం.. ఎవరి సహాయమూ లేకుండా స్వయంకృషితో పైకొచ్చానని చెప్పడం. రాఖీ.. ‘రాఖీ’ పండుగను కూడా జరుపుకోరు. అందుకు ‘ఇదీ’ అని కారణం ఏమీ లేదు కానీ, క్రైస్తవ మతాన్ని స్వీకరించాక రాఖీ వదులుకున్న హైందవ సంప్రదాయాల్లో రాఖీ కూడా ఒకటి. రాఖీ సావంత్‌ ప్రస్తుతం ముంబైలోని లంకంత సొంత ఇంట్లో తనొక్కరే ఉంటున్నారు. అయితే తన లక్కీ మ్యాన్‌ కోసం రెండోసారి ‘స్వయంవరం’ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు!! రాఖీ బెస్ట్‌ ఫ్రెండ్, నటి అయిన సోఫియా హయత్‌ చెబుతున్న దానిని బట్టి రాఖీ ఈ ఏడాదిలో ఎప్పుడైనా వివాహం చేసుకోవచ్చని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement