శంకర్ పిళ్లై
‘అర పేజీ వార్త కూడా చెప్పలేని భావాన్ని, మూడుకాలాల చిన్న కార్టూన్ అద్భుతంగా చెప్పగలదు’ అన్నారు ప్రఖ్యాత పత్రికా రచయిత నండూరి రామమోహనరావు. డిసెంబర్ 26, 1989లో శంకర్ పిళ్లై కన్నుమూసినప్పుడు రాసిన సంపాదకీయంలో పంక్తులవి. నిజమే, కార్టూన్ అంటే కొన్ని కొంటె గీతల, రాతల మిశ్రమం కావచ్చు. కానీ అవి చరిత్రకు రెండో వైపు ఉన్న అదృశ్య వాస్తవికతను మన మెదడుకు ఆహ్లాదంగా అందిస్తాయి. ఉన్నత స్థానాలలోని వారి ఆలోచనలను నగ్నంగా మన ముందు ఆవిష్కరిస్తాయి. శంకర్ పిళ్లై ప్రతి వ్యంగ్య చిత్రం అలాంటి బాధ్యతను నిర్వర్తించినదే. కొన్ని కార్టూన్లను చూస్తే అర్ధ శతాబ్దపు సంక్షుభిత చరిత్రనీ, దాని పూర్వాపరాలనీ కూడా ఒకే కార్టూన్‌లో శంకర్ నిక్షిప్తం చేయగలరని చెప్పాలనిపిస్తుంది. 1941లో హిందుస్తాన్ టైమ్స్‌లో వచ్చిన కార్టూన్ అదే చెబుతుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే.
1906లో దాదాభాయ్ నౌరోజీ కార్యదర్శిగా తొలిసారి కలకత్తా జాతీయ కాంగ్రెస్ సభలకు హాజరయ్యారు మహమ్మదలీ జిన్నా. ఆనాటికి ఆయన గుండె నిండా జాతీయవాదమే. 1916 నాటి లక్నో ఒప్పందం వేళకు సరోజినీనాయుడు దృష్టిలో ఆయన ‘అంబాసిడర్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ’. 1933లో ఇంగ్లండ్‌లో ఒక విందు ఏర్పాటు చేసి ప్రత్యేక పాకిస్తాన్‌ను కోరమంటూ చౌదరి రహమత్ అలీ ఖాన్ సూచిస్తే, ‘అది అసాధ్యం’ అంటూ లేచి వెళ్లిపోయిన వ్యక్తి జిన్నా. అప్పటికీ ఆయన ఆలోచన అఖండ భారతం గురించే. కానీ 1941కి ఆయన ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటుకు కృత నిశ్చయుడయ్యారు. ఈ మధ్యలో ఎన్నో విమర్శలు, చీత్కారాలు. ఆసియాలో, నిజానికి ప్రపంచ చరిత్రలో ప్రత్యేకమైన భారత విభజన ఘట్టంలోనే ఎంతో కీలకమైన ఈ మొత్తం చారిత్రక పరిణామాన్ని, వ్యక్తిత్వంలో వచ్చిన మార్పుని శంకర్ పిళ్లై ఒక్క కార్టూన్‌లో ఆవిష్కరించారు. ‘హిందుస్తాన్ టైమ్స్‌తో నీవు ఎదిగావా? లేకుంటే నీ వల్ల హిందుస్తాన్ టైమ్స్ ఎదిగిందా?’ అంటూ శంకర్‌కు రాసిన ఉత్తరంలో గాంధీ చాలా లోతైన, ప్రశంసాపూర్వకమైన ధర్మ సందేహం వ్యక్తం చేశారు. ‘శంకర్, నన్ను కూడా వదిలిపెట్టొద్దు!’ (డోన్ట్ స్పేర్ మీ, శంకర్) అన్నారు నెహ్రూ. నండూరి మాటలలోనే, ‘ఆనాటి చరిత్రపురుషులంతా శంకర్‌తో కార్టూనించుకోవాలని ఎదురుచూసినవారే’. అందుకే శంకర్ భారతీయ రాజకీయ వ్యంగ్య చిత్రకళకు ఆది శంకరుడని అంటారు. అది ఎంతో నిజం! శంకర్ పుట్టుకతోనే వ్యంగ్య చిత్రకారుడు. శ్రీరమణగారు అన్నట్టు ‘నాన్ రుషిః కురుతే కార్టూన్’.
కేరళలోని కాయంకుళం గ్రామంలో విశాలమైన ఆ ఆవరణలో ఉన్న ఇంటికి నోట్ బుక్‌లో వేసిన ఒక బొమ్మ పట్టుకుని వచ్చాడు, ఆ ఊరి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అసలే మండిపడిపోతున్న ఆయనకు ఆ ఇంటి పెద్దాయన అన్నమాట మరీ ఒళ్లు మండించింది. ‘ఇది నా మనవడు వేశాడా? బావుంది కదా మాస్టారు!’ అని. శంకర్ తన లెక్కలు మాస్టారి మీద వేసిన వ్యంగ్య చిత్రమది. ఆ మాస్టారు పిల్లలకు అర్థమేటిక్ సమస్య ఇచ్చి, డ్రాయిర్ మీద కాళ్లు బారజాపుకుని గుర్రుపెట్టి నిద్రించేవాడట. అలాంటి భంగిమలో ఉన్న గురువుగారి బొమ్మను గీశాడు బాల శంకర్. అది చూడడంతోనే తరగతి గదంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది. విషయం ప్రధానోపాధ్యాయుడి దాకా పోయింది. పక్షం పాటు శంకర్‌ని తరగతుల నుంచి బహిష్కరించాడాయన. అదీ చాలదన్నట్టు మనవడి కళాఖండాన్ని తెచ్చి ఆయన తాతయ్యకి చూపించాడు. కానీ శంకర్ మామయ్య మాత్రం అతడిలోని కళను ప్రోత్సహించాలని భావించారు. ఫలితమే ఒక గొప్ప కార్టూనిస్టు భారతదేశంలో రూపొందాడు. తాతయ్య ఇల్లు, ఆయన ప్రేమ, ఆ విశాల ఆవరణ, వర్షం వెలిసిన వెంటనే తోటి పిల్లలని చెట్ల కిందకి తీసుకెళ్లి కొమ్మల్ని ఊపడం, ఆ ఆవరణలో చెరువు, అందులో మొసలి, దానితో సరసాలు, ఆ సరసాలు అర్థంకాక అది ఒకసారి తీవ్రస్థాయిలో తిరుగుబాటు చేయడం, పాఠశాల ముచ్చట్లు ఇవన్నీ శంకర్ తన బాల్యం గురించి చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ వెలువరించిన పుస్తకంలో రాసుకున్నవే.
శంకర్ పూర్తి పేరు ఇలికుళతు కేశవ శంకర్ పిళ్లై. జూలై 31, 1902లో కాయంకుళంలోనే పుట్టారు. తిరువనంతపురంలో డిగ్రీ పూర్తి చేసి, న్యాయశాస్త్రం చదవడానికి బొంబాయి వెళ్లారు. చదువుతూనే, ఫ్రిలాన్స్ కార్టూనిస్టుగా ఉంటూనే చిన్న చిన్న ఉద్యోగాలు చేశారాయన. ఆయన తన కార్టూన్‌కి మొదటిసారి తీసుకున్న పారితోషికం మూడు రూపాయలు. 29వ ఏట పెళ్లి చేసుకున్న తరువాత పూర్తిగా కార్టూన్ కళకు అంకితమయ్యారు. ఆయన తొలిదశ కార్టూన్లు ‘బాంబే క్రానికల్’, ‘ఫ్రీ ప్రెస్ జర్నల్’, ‘వీక్లీ హెరాల్డ్’ పత్రికలలో వెలువడేవి. అప్పుడు పరిచయమైనవారే పోతాన్ జోసెఫ్. జోసెఫ్‌కు తరువాత హిందుస్తాన్ టైమ్స్ ప్రధాన సంపాదకునిగా అవకాశం వచ్చింది. దీనితో ఆయన శంకర్‌ను ఆ పత్రిక ప్రధాన కేంద్రం ఢిల్లీకి పిలిపించి స్టాఫ్ కార్టూనిస్ట్‌గా అవకాశం కల్పించారు. అప్పటి నుంచి శంకర్ ఢిల్లీలోనే ఉండిపోయారు. కానీ తన కళను మెరుగు పరుచుకోవడానికి నిరంతరం పాటు పడ్డారు. అనేక ఫైన్ ఆర్ట్స్ కళాశాలల్లో చదివారు. ఇంగ్లండ్‌లో 14 మాసాలు ఉండి తర్ఫీదు కూడా తీసుకున్నారు. స్కాట్లాండ్ కార్టూనిస్ట్ డేవిడ్ లాను శంకర్ ఆదర్శంగా తీసుకునేవారు. ఆయన శిష్యులు అనతగిన అబూ అబ్రహాం, ఓవీ విజయన్, కుట్టీ, సామువేల్ వర్మలను కూడా డేవిడ్‌నే ఆదర్శంగా తీసుకోమని చెప్పేవారు. అనంతరకాలాలలో రాజీందర్ పురి, ఏసుదాసన్, బీఎం గఫూర్, మికీ పటేల్, రంగా, ప్రకాశ్ ఘోష్ వంటివారు శంకర్ దగ్గర శిష్యరికం చేశారు.
కార్టూన్ల చుట్టూనే తిరిగిన శంకర్ జీవితంలోని ఘట్టాలను చూసినా అదే ప్రతిబింబిస్తూ ఉంటుంది. సహాయ నిరాకరణ ఉద్యమంలో భారతీయ పత్రికలలో సంపాదక వ్యాఖ్యలను సెన్సార్ చేసేవారు. కానీ కార్టూన్ల జోలికి వచ్చేవారు కాదు. అలాంటి సందర్భంలోనే నాటి వైస్రాయ్ దూత ఒకరు వచ్చి శంకర్‌కు అభివాదం చేసి, ‘మీ కార్టూన్లంటే వైస్రాయ్‌గారికి ఇష్టం. ఇవాళ ఆయన మీద మీరు వేసిన కార్టూన్ ఒరిజినల్ కాపీ ఇవ్వవలసిందిగా ఆయన కోరుతున్నారు, మీ సంతకంతో’ అని చెప్పాడు. మరొకసారి వైస్రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో (1936–1943)ను భద్రకాళిగా చిత్రించారు శంకర్. అది కూడా శ్మశాన వాటికలో కాలుతున్న ఒక శవం ఎదుట నిలిచి ఉన్నట్టు చిత్రించారు. అది ఆయన దృష్టికి వెళ్లింది. ఉదయం ఒకరు వచ్చి, ఆ కార్టూన్ ఒరిజినల్ వైస్రాయ్ కోరుతున్నారని చెప్పి తీసుకువెళ్లారు. భారత స్వాతంత్య్రోద్యమం మీద శంకర్ లెక్కలేనన్ని కార్టూన్లు గీశారు. శంకర్ గీసిన ఒరిజినల్స్ అడిగి తీసుకున్న వారిలో నెహ్రూ అగ్రగణ్యుడు. ప్రథమ ప్రధాని మీద శంకర్ నాలుగువేల కార్టూన్లు గీశారు. ‘జవహర్‌లాల్ ఎప్పుడూ నేను గీసిన ఒరిజినల్స్ అడిగేవారు. ఆయన రాజకీయ చర్యల గురించి వాటిలో నేను తీవ్రంగా వెక్కిరించేవాడిని. అందుకు ఆయన నన్ను అభినందించేవారు. తనలోని బలహీనతలను గురించి తెలుసుకోవడంలో సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పేవారు. పరిపూర్ణత ఏ మానవుడికీ సాధ్యం కాదు. ఈ విషయాన్ని నెహ్రూ గుర్తించేవారు’ అని నెహ్రూ గురించి శంకర్ రాశారు. చైనా యుద్ధం తరువాత నెహ్రూ తనలో తాను కుంగిపోయినా, దేశ రాజకీయ చిత్ర పటంలో మాత్రం ఆయనదే పైచేయిగా ఉండేది. ఆ విషయాన్ని శంకర్ తన కార్టూన్‌లో ఆవిష్కరించారు. అందులో లాల్‌బహదూర్‌శాస్త్రి, గుల్జారీలాల్ నందా, మొరార్జీ దేశాయ్, ఇందిర వంటివారంతా పరుగులు తీస్తూ ఉంటారు. ఒక కరదీపిక పట్టుకుని వారందరి కంటే ముందు (రేసులో అన్నమాట) ఉంటారు నెహ్రూ. ఇదే నెహ్రూ జీవించిఉండగా శంకర్ వేసిన చివరి కార్టూన్. తరువాత పది రోజులకు నెహ్రూ కన్నుమూశారు.
స్వాతంత్య్రం వచ్చిన మరుసటి సంవత్సరమే శంకర్స్ ఈ దేశానికి మరొక ఘనత తెచ్చి పెట్టారు. 1948 మే మాసంలో ‘శంకర్స్ వీక్లీ’ ప్రారంభించారు. ఈ పత్రికను ప్రారంభించినదే నెహ్రూ. ఇందులో తన కార్టూన్లతో పాటు, ఇతరులు వేసిన కార్టూన్లకు కూడా చోటు కల్పించేవారు. ఇంగ్లండ్ నుంచి వెలువడిన ‘పంచ్’ తరహాలో పూర్తిగా కార్టూన్లతోనే వెలువడిన ఏకైక పత్రిక– – శంకర్స్ వీక్లీ. ముఖపత్రం మీద ఒక నాయకుడి కేరికేచర్‌తో ఇది వెలువడుతూ ఉండేది. చాలా బలమైన, స్పష్టమైన భాషతో శంకర్ సంపాదMీ యం రాసేవారు. శంకర్ కార్టూనిస్టు మాత్రమే కాదు. బాల సాహిత్యం కోసం చిల్ట్రన్స్ బుక్ ట్రస్ట్‌ను స్థాపించి ఎన్నో పుస్తకాలను కళాత్మకంగా అందించారు. పిల్లల కోసం జాతీయ స్థాయిలో పెయింటింగ్ పోటీలు పెట్టారు. తరువాత దానిని అంతర్జాతీయ స్థాయి పోటీగా మలచారు. ఢిల్లీలో ఆయన పెట్టిన బొమ్మల ప్రదర్శనశాల ఇప్పటికీ దర్శనీయ స్థలంగానే మిగిలి ఉంది.
‘రాజుగారి వంటి మీద గుడ్డలు లేవు, షేమ్ షేమ్’ అని దివ్యవస్త్రాల రాజుగారి కథలో ఎలుగెత్తి చాటే పిల్లవాడు గుర్తున్నాడా? దివ్యవస్త్రాలు లేదా దేవతావస్త్రాలు నేసి, కట్టిస్తాం, మీ కీర్తిని నలుదిశలా గుబాళింప చేస్తాం అంటూ, దిగంబరంగా రాజావారిని అంబారీ ఎక్కించి ఉరేగించిన దొంగల కథ అది. దొంగల మాయతో దేశం మొత్తం భ్రమలో పడినా ఆ పిల్లవాడు మాత్రం పడలేదు. ఫలితం– అంతర్లీనంగా ఉన్న గొప్ప నగ్నవాస్తవం బట్టబయలైంది. సరిగ్గా కార్టూన్ కూడా అలా ఎలుగెత్తి చాటే గొంతే! శంకర్ కుంచె అలాంటి వంద గొంతుకలకు నిలయం. కానీ 1975 జూన్ 25వ తేదీన ఇందిరా గాంధీ ప్రకటించిన అత్యవసర పరిస్థితి ఈ వ్యంగ్య ధారకు అడ్డుకట్ట వేసింది. సెన్సార్ ఆంక్షలకు తలొగ్గడం ఇష్టం లేక శంకర్ తన వారపత్రికను స్వచ్ఛందంగా మూసి, తన పెన్ను కూడా మూసేశారు (1989లో కన్నుమూశారు). నెహ్రూ తన షష్టిపూర్తికి కుమార్తె ఇందిరకు ఒక అపురూపమైన బహుమతి ఇచ్చారు. అది తన మీద శంకర్ గీసిన 20 చిత్రాల ఆల్బమ్. ఆ సంగతి కూడా ఇందిర మరచిపోయారు. మీరు సరైన నిర్ణయం, అంటే పత్రిక మూసివేయాలన్న నిర్ణయం– తీసుకున్నారంటూ శంకర్‌కు ఉత్తరం రాశారు. ఇంగ్లండ్‌లో 1841లో ప్రారంభమైన ‘పంచ్’ పత్రిక 2002 వరకు కొనసాగింది. కానీ శంకర్స్ వీక్లీ పాతికేళ్లలోనే మూతపడింది. మన హాస్య, వ్యంగ్య ప్రియత్వానికి ఇదే గొప్ప నిదర్శనం. నెహ్రూ ప్రారంభించిన గొప్ప పత్రిక, ఆయన కుమార్తె నియంతృత్వం కారణంగా మూతపడటం ఒక చారిత్రక వైచిత్రి.
∙డా. గోపరాజు నారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment