మా సీన్మా ఎందుకు ఆడలేదంటే.. | A Comedy Story Written By Yakub Pasha | Sakshi
Sakshi News home page

మా సీన్మా ఎందుకు ఆడలేదంటే..

Published Sun, Aug 4 2019 9:48 AM | Last Updated on Sun, Aug 4 2019 9:48 AM

A Comedy Story Written By Yakub Pasha - Sakshi

‘‘మీ సినిమా మీద ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్నారు ప్రేక్షకులు. తీరా చూస్తే తుస్సుమనిపించింది. రిలీజ్‌కు ముందు... రికార్డ్‌లు తిరగరాస్తుంది అన్నారు!  అలా జరగలేదు సరికదా... సినిమా చరిత్రలోనే అత్యంత తక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్రలో నిలబడింది మీ సినిమా.  ఇలా ఎలా జరిగింది?!’’
‘‘గుడ్‌ క్వశ్చనండీ. కథ విషయానికి వస్తే... చాలా గొప్ప కథండీ. ఆ కథ రాసినందుకు నేను ఇప్పటికీ గర్వంగా ఫీలవుతాను. ఈ కథ కోసం మూడున్నర సంవత్సరాలు వెచ్చించాను. ఫైనల్‌ వెర్షన్‌ కోసం ఆఫ్రికాలోని  ఏకో మాకో డురుకు డురుకు ఐలాండ్‌కు వెళ్లాను. కథ విషయానికి వస్తే బ్రహ్మాండమైన కథ... ఎటొచ్చి  హీరోగారి ఇమేజ్‌ కథకు అడ్డుతగిలింది.

ఉదాహరణకు కొన్ని సీన్లు చెబుతాను...
హీరోగారికి జలుబు చేసి హీరోయిన్‌ ముందు హాచ్‌ హాచ్‌... అని తుమ్మతుంటాడు.
‘‘అసలు హీరో తుమ్మడమేమిటి?’’ అనే నెగెటివ్‌ ఇంపాక్ట్‌ ప్రేక్షకుల్లో వచ్చిందండి.
ఎంతైనా  హీరో అంటే ఒక ఇమేజ్‌ ఉంటుంది కదండీ!
ముందు ఈ సీన్‌ను మేము వేరేలా ప్లాన్‌ చేసుకున్నాం...
వర్షంలో హీరో బాగా తడుస్తాడు. జలుబు ఎటాక్‌ అవుతుంది.
అప్పుడే హీరోగారిని విలన్లు చుట్టుముట్టి  ‘హ్హా హ్హా....’ అని గట్టిగా నవ్వుతారు.
‘‘రేయ్‌... ఇప్పుడు నీ దగ్గర చిన్న వెపన్‌ కూడా లేదు’’ అని తమ దగ్గర ఉన్న గన్స్‌ తీస్తారు విలన్లు.

అప్పుడు–
వాళ్ల కంటే పెద్దగా నవ్వి సడన్‌గా ఆపి...
‘‘నా దగ్గర మీ అందరికంటే  పెద్ద వెపన్‌ ఉంది’’ అంటాడు హీరో.
‘‘ఏమిటది?’’ షాకై పోతూ అడుగుతారు విలన్లు.
‘‘జలుబు’’ అంటాడు హీరో.
విలన్‌లు ఆశ్చర్యంలో నుంచి తేరుకునేలోపే...
‘హాచ్‌ హాచ్‌’ అని గట్టిగా తుమ్ముతాడు హీరో... అంతే అతని ముక్కులో నుంచి ముప్పై బుల్లెట్లు ఏకధాటిగా వచ్చి విలన్లను మట్టి కరిపిస్తాయి.
ఈ సీన్‌ ఉండి ఉంటే బయర్స్‌ సేఫ్‌ అయ్యేవారు.
కాని సహజత్వం కోసం ప్రయత్నించాం... అది మిస్‌ ఫైర్‌ అయ్యింది.

ఒక డైరెక్టర్‌గా నేను నమ్మేదేమిటంటే... సినిమా టైటిల్‌ చూడగానే దానిలో మస్క్యులర్‌ స్ట్రెంత్‌ కనిపించాలి. అందుకే బాగా ఆలోచించి ‘పులి చిరుతపులి సింహం ఏనుగు మొసలి’ అని మా సినిమాకు పేరు పెట్టాను. ఇవన్నీ కూడా బలానికి ప్రతీకలు... హీరోగారిని దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్‌ పెట్టడం జరిగింది. కాని... ప్రేక్షక మహాశయులు ఇదో జంతువుల సినిమా అనుకున్నారు.
‘పోట్టర్‌ మీదో పులి చింహం ముచలి అని రాశారు. సినిమాలో మాత్తరం సీతాకోకచిలక కూడా లేదు’ అని అసంతృప్తికి గురయ్యారు  చాలామంది. ఈ విషయంలో ప్రేక్షక మహాశయులకు క్షమాపణ కోరుతున్నాను.
హీరో కంట్లో చింతనిప్పులు తప్ప... చిన్న కన్నీటి చుక్కయినా కనిపించరాదు అనేది యాజ్‌ ఏ డైరెక్టర్‌గా నా ఒపీనియన్‌ అండీ... అందుకే మా సినిమాలో ఎంత విషాదానికైనా హీరో నవ్వుతూనే ఉంటాడు. ఇక్కడ కూడా  కాస్త మిసండర్‌స్టాండింగ్‌ జరిగిందండీ... హీరోకి పిచ్చేమో అనుకున్నారు ప్రేక్షకమహాశయులు.

మా సినిమా ఫ్లాప్‌ కావడానికి మరో రీజన్‌ సెన్సార్‌ వాళ్లు.
రొటీన్‌  సినిమాల్లో అయితే హీరో వైన్‌షాప్‌కు వెళ్లి ‘‘మందు బాటిల్‌ కావాలి’’ అంటాడు.
అలా కాకుండా మా సినిమాలో ‘‘వైన్‌షాప్‌  కావాలి’’ అంటాడు.
ఎందుకు?!!!!!!! అని తెల్లబోతాడు షాప్‌ఓనర్‌.
‘మందుకొట్టడానికి’ అంటూ కోటిరూపాయల కట్టను ఓనర్‌ ముఖం మీద వేసి... కేవలం గంటలో వైన్‌షాప్‌లో ఉన్న బాటిల్స్‌ను చుక్క లేకుండా ఖాళీ చేస్తాడు. ఈ సీన్‌కు పెద్ద అప్లాజ్‌ వస్తుందని ఎక్స్‌పెక్ట్‌ చేశాం. కాని సెన్సార్‌ వాళ్లు లేపేశారు!
∙‘కోటి రూపాయల పాట’ అంటుంటారు చూడండి... అలాగే మా సినిమాలోనూ ‘కోటి రూపాయల సీన్‌’ ఉంది. లెన్త్‌ సమస్య వల్ల, చెప్పలేని ఇతర కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సీన్‌ లేపేయాల్సి వచ్చింది. ఈ సీన్‌ ఉండి ఉంటే సినిమా కచ్చితంగా నిలబడి ఉండేది.
ఇంతకీ ఆ సీన్‌ ఏమిటంటారా...
విలన్‌ కోసం హీరో భూమి నలుచెరగులా భూతద్దం వేసి వెదుకుతుంటాడు.
ఈలోపు హీరోకి ఆకాశరామన్న ఫోన్‌ వస్తుంది.
‘‘ఆడి కోసం వెదకాల్సింది ఇండియాలో కాదు ఈజిప్ట్‌లో.. ఇట్లు మీ శ్రేయోభిలాషి, ఆ నలుగురు’’ అని ఫోన్‌ పెట్టేస్తాడు ఆ ఆకాశరామన్న. వెంటనే హీరోగారు  ‘ఇండియా టు ఈజిప్ట్‌’ విమానం ఎక్కేస్తాడు.
‘ఇక విలన్‌గాడి పని క్లోజ్‌’ అనుకుంటారు ప్రేక్షకమహాశయులు.
ఈలోపు పెద్ద ట్విస్ట్‌.
ఆకాశంలో విమానం కుప్పకూలిపోతుంది. మంటలు!
విశ్రాంతి కార్డు పడుతుంది.

సెకండాఫ్‌లో....
అంత పెద్ద ప్రమాదంలో విమానం డ్రైవరు, క్లీనర్‌తో సహా ప్రయాణికులందరూ సచ్చిపోతారండి... ఒకే ఒక్కడు మిగులుతాడండీ... ఆడే మన హీరో. ప్రమాదాన్ని ఊహించిన హీరోగారు తన తల కింద ఉన్న ఎయిర్‌ దిండు సహాయంతో డఫామని కిందికి దూకేస్తాడండీ...
ఈయన ఎక్కడ పడతాడో తెలుసునటండీ?
సరాసరి వెళ్లి నైలునదిలోని ఒక పడవలో!
ఆ పడవలో ఎవరు ఉంటారో తెలుసునటండీ... హీరో ఎంతో కాలంగా వెదుకుతున్న విలన్‌!!
ఈ సీన్‌కి ఎన్ని వీలలు, చప్పట్లు పడేవో!! సినిమా ఏ రేంజ్‌లో హిట్టయ్యేదో!... ఈ సీన్లు సినిమాలో లేకపోవడానికి ఆ పొడ్యూసర్‌ బామ్మర్దే కారణమండీ... స్టోరీ డిస్కషన్‌లో కూర్చున్న రోజు నుండి తలకు మాసిన డౌట్లు అడుగుతూనే ఉన్నాడు. అతడే బంగారంలాంటి ఈ సీన్లు లేకుండా చేశాడు. ఇక ముందు నేను ఎవరి మాట వినదల్చుకోలేదు. ఎవరి ఒత్తిడికి లోనుకాదల్చుకోలేదు.
ఇక నుండి నా సినిమాకు నేనే ప్రొడ్యూసర్‌.
గుర్తుంచుకోండి... నా సినిమా చరిత్రను రీరైట్‌ చేస్తుంది. రికార్డులు బ్రేక్‌ చేస్తుంది.
సినిమా పేరు కూడా ఇప్పుడే ఎనౌన్స్‌ చేస్తున్నాను...
‘నా సినిమా చూడకపోయారో...’
ట్యాగ్‌లైన్‌: ఇది బెదిరింపు కాదు అర్థింపు.
– యాకుబ్‌ పాషా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement