కాపీ కొట్టడానికి హాలీవుడ్‌నిచ్చావ్! | copy to hollywoood movies by Trivikram Srinivas | Sakshi
Sakshi News home page

కాపీ కొట్టడానికి హాలీవుడ్‌నిచ్చావ్!

Published Sun, Aug 9 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

కాపీ కొట్టడానికి హాలీవుడ్‌నిచ్చావ్!

కాపీ కొట్టడానికి హాలీవుడ్‌నిచ్చావ్!

ఆ సీన్ - ఈ సీన్
రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై హాలీవుడ్ ప్రభావం ఎక్కువ.  ‘చిరునవ్వుతో’ సినిమా దగ్గర నుంచి మొన్నటి ‘జులాయి’ వరకూ చాలా సినిమాలపై హాలీవుడ్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా సీన్లను తెచ్చు కోవడం త్రివిక్రమ్‌కు ఉన్న అలవాటు. పేరు పొందిన హాలీవుడ్ సినిమాల నుంచి తన మనసుకు నచ్చిన సీన్లను తెచ్చి మన మనసులకు నచ్చేలా తీర్చిదిద్ది తన సినిమాల్లో ప్లేస్ చేస్తుంటాడు త్రివిక్రమ్. ఇలా త్రివిక్రమ్ కలం విన్యాసం చేసిన సినిమాల్లో ఒకటి ‘నువ్వు నాకు నచ్చావ్’. ఇందులో ఎంతో పాపులర్ అయిన ఒక సీన్‌కు మూలం హాలీవుడ్ సినిమాలో ఉంది.
 
హీరో అతిథిగా వచ్చిన ఆ ఇంట్లో అంతా మిలటరీ డిసిప్లిన్. ఇంటి పెద్ద అన్నీ నియమానుసారం జరగాలంటాడు. ఇంటి నుంచి బయటకు వెళ్తే చెప్పి వెళ్లాలి, చెప్పులేసుకు వెళ్లాలి లాంటివి ఆయన నియమాలు. అలాగే భోజనానికి ముందు కచ్చితంగా ప్రార్థన చేసి తీరాలి. ఈ విషయం తెలియక లేటుగా వస్తాడు హీరో. డైనింగ్ టేబుల్ వద్దకు వస్తూనే భోజనం మీద పడ్డ హీరో వైపు ఇంట్లో వాళ్లంతా విచిత్రంగా చూస్తారు. భోంచేసే ముందు దణ్ణం పెట్టుకునే అలవాటు లేదా అన్న ఆ ఇంటి పెద్ద ప్రశ్నతో ఇబ్బంది పడిపోయిన హీరో దాన్ని కవర్ చేసుకునేందుకు చిత్ర విచిత్రమైన ప్రార్థన ఒకటి చేస్తాడు.

అప్పటికప్పుడు ఆశువుగా తనకు తోచిన ప్రార్థన చేసేసి ఇంట్లో వాళ్లకి కన్ఫ్యూజన్‌ను, జనాలకు కామెడీని క్రియేట్ చేస్తాడు. ‘దేవుడా ఓ మంచి దేవుడా... నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావ్, బంగాళాదుంప ఫ్రై ఇచ్చావ్, చారు కూడా ఇచ్చావ్, అదే చేత్తో స్టేట్‌లో ఉన్న ఏడు కోట్ల మందికి, కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, ప్రపంచంలో ఉన్న... నంబర్ కరెక్ట్‌గా తెలీదు, ఎంతమంది ఉంటారో అంతమందికీ ఇవ్వు. యాజిటీజ్‌గా ఇదే మెనూ కాదు, బ్రెడ్డు, బటర్.. వారు ఏం తింటారో అది. అలా ఇస్తావని కోరు కుంటున్నా. నువ్వు ఇస్తావ్. ఎందుకంటే బేసికల్లీ యు ఆర్ గాడ్, ఎ వెరీ గుడ్ గాడ్’ అంటూ సాగుతుంది హీరో ప్రార్థన. ఈ సీన్ చూసి పడీ పడీ నవ్వని ప్రేక్షకుడు లేడన్నది అందరికీ తెలిసిందే.

ఇంతగా పండిన ఈ సీన్‌కు మూలం ‘మీట్ ద పేరెంట్స్’ అనే హాలీవుడ్ సినిమాలోని ఓ సన్నివేశం. 2000లో వచ్చిన ‘మీట్ ద పేరెంట్స్’ హాలీవుడ్‌లో  నవ్వులు పూయించింది. ప్రకాశ్‌రాజ్ పాత్రలో ప్రముఖ నటుడు రాబర్‌‌ట డి నీరో, వెంకటేష్ పాత్రలో బెన్ స్టిల్లర్ కనిపిస్తారా సినిమాలో. నీరోని ఇంప్రెస్ చేయడానికి డైనింగ్ టేబుల్ వద్ద బెన్ ప్రార్థన చేస్తాడు. వెంకీ ప్రార్థనలోని కొన్ని లైన్లు.. బెన్ ప్రార్థనలోని కొన్ని లైన్లకు అచ్చంగా మ్యాచ్ అవుతాయి. రెండూ చిత్ర విచిత్రమైన ప్రార్థనలే!
 
నిజానికి హీరో ప్రార్థన మాత్రమే కాదు... ఆ తర్వాత కొనసాగింపుగా సాగే ప్రకాష్‌రాజ్ కవిత్వ ప్రహసనం కూడా హాలీవుడ్ సినిమాలోనిదే! హీరో అన్నం తినబోయే ముందు చేసే చిత్ర విచిత్రమైన ప్రార్థన విన్నాక... ప్రకాష్‌రాజ్ పాత్రలో కూడా భావుకత్వం తన్నుకొస్తుంది. తను తన తల్లిమీద రాసుకున్న కవిత్వాన్ని వినిపిస్తాడతను. ‘‘అమ్మా అడక్కుండానే జన్మనిచ్చావ్.. ఏడిస్తే పాలిచ్చావ్.. రాసు కోవడానికి పలకనిచ్చావ్.. గీసుకోవడానికి గడ్డం ఇచ్చావ్...’’ అంటూ సాగే ఆ కవిత మామూలుగా నవ్వించలేదు. ‘మీట్ ద పేరెంట్స్’ సినిమాలోని ఇంటిపెద్ద కూడా తన తల్లి గురించి కూడా ఇలాంటి కవితే వినిపిస్తాడు. ఆ కవితలోని లైన్లు, ప్రకాష్‌రాజ్ చెప్పే కవితలోని లైన్లు కూడా బాగా మ్యాచ్ అవుతాయి.
 
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ప్రకాష్‌రాజ్ కవిత విన్న వెంకటేష్ ‘మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్’ అంటాడు విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ. ఆంగ్ల చిత్రంలో హీరో బెన్ కూడా నీరో కవిత విని సేమ్ డైలాగ్ వల్లిస్తాడు. దాన్ని బట్టి ఈ సీన్ మీద ‘మీట్ ద పేరెంట్స్’ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
నిజానికి ‘నువ్వు నాకు నచ్చావ్’లోని డైనింగ్ టేబుల్ సీన్‌కు ఎన్ని పేరడీలు వచ్చాయో చెప్పలేం. ప్రత్యేకించి ప్రకాష్‌రాజ్ తల్లి గురించి చెప్పే కవితపై ఫేస్‌బుక్‌లో అనేక పేరడీలు కనిపిస్తూ ఉంటాయి. త్రివిక్రమ్ రచనా ప్రావీణ్యంతో ఈ కవిత అంతగా మనవాళ్లలోకి చొచ్చుకుపోయింది. అయితే త్రివిక్రమ్‌కు ఆ సీన్‌ని రాసేందుకు స్ఫూర్తినిచ్చింది మాత్ర ం నిస్సందేహంగా హాలీవుడ్ చిత్రం ‘మీట్ ద పేరెంట్సే’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement