
పీచుమిఠాయి... చేయడం సులువేనోయి!
పీచుమిఠాయి పేరు చెబితే చాలు... పిల్లలూ పెద్దలూ కూడా ఎగిరి గంతేస్తారు! సన్నగా దూదిలా ఉండే పీచు మిఠాయిని మెలమెల్లగా చప్పరించడం ఓ సరదా అందరికీ! అయితే అది మనకి కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లోనే దొరుకుతుంది. అంటే... ఎగ్జిబిషన్లు, తీర్థాలు, పార్కులు, థియేటర్లు వంటిచోట మాత్రమే లభిస్తుంది. అలా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తినాలంటే ఎలా? దానికి సమాధానం... ఇదిగో, ఈ మెషీన్ చెబుతుంది! దీన్ని ‘కాటన్ క్యాండీ ఫ్లాస్ మేకర్’ అంటారు.
రూ. 1900 నుంచి మూడు వేల రూపాయల వరకూ రకరకాల ధరల్లో, సైజుల్లో దొరకుతోందీ యంత్రం. ఇది కరెంటుతో పని చేస్తుంది. తేలికగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. పీచు మిఠాయిని చేసుకోవడం కూడా చాలా సులభం. చక్కెరతో చేసిన క్యాండీలు మార్కెట్లో దొరకుతాయి. వాటిని తెచ్చి, ఈ యంత్రానికున్న గుండ్రటి ట్రేలో వేసి, స్విచ్ ఆన్ చేస్తే చాలు. పల్చటి దూదితెరల్లా పీచుమిఠాయి పైకి లేస్తుంది. దాన్ని పుల్లకు చుట్టుకుని తినడమే తరువాయి!