విహారం: మంచు సోయగాల నగర సౌందర్యం | cotton castle of Pamukkale Tourism spot located in Turkish | Sakshi
Sakshi News home page

విహారం: మంచు సోయగాల నగర సౌందర్యం

Published Sun, Dec 1 2013 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM

విహారం: మంచు సోయగాల నగర సౌందర్యం

విహారం: మంచు సోయగాల నగర సౌందర్యం

పముక్కలే : ప్రకృతి కాంత మంచు మేనిముసుగు ధరించిన శీతాకాలపు సోయగం ‘పముక్కలే’ సొంతం. అందమైన మంచు దుప్పటి కప్పుకొన్న పర్వతాలు.. చూడముచ్చటైన సెలయేటి ఒంపులు.. సీజన్ల వారీగా మారే వాతావరణం.. ప్రకృతిని ఆస్వాదించడానికి ఇంతకన్నా గొప్ప ప్లేస్ ఏముంటుంది? అన్నట్టుగా ఉంటుంది  ‘పముక్కలే’ ప్రాంతం.
 
 టర్కీలోని పర్యాటక ప్రాంతాలను పూర్తిగా చూడాలంటే మూడు నెలలు పడుతుందనేది ప్రసిద్ధ నానుడి. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన టర్కీ విషయంలో ఈ నానుడి తప్పు అని నిరూపిస్తుంది ‘పముక్కలే’. ప్రకృతి సౌందర్యాలనెన్నో ఒడిలోదాచుకొన్న ఈ దేశంలో పముక్కలే అందాన్ని ఆస్వాదించడానికే ఆరు రుతువులు సరిపోవు! ఎందుకంటే ఒక్కో రుతువు ఒక్కో రకమైన సౌందర్యాన్ని తెచ్చి పెట్టుకుంటుంది. అందానికి మంచు రూపంలో నిర్వచనం చెబితే అది పముక్కలే! టర్కీ భాష లో పముక్కలే అంటే ‘కాటన్ క్యాజల్’ అని అర్థం. పట్టులా కనిపించే తెల్లని మంచు వల్ల దీనికి ఈ పేరు వచ్చింది.
 
 టర్కీ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది రెండు ఖండాల్లో విస్తరించిన దేశం మాత్రమే కాదు, రెండు ఖండాల్లో విస్తరించిన (ఇస్తాంబుల్) నగరం ఉన్న దేశమూ ఇదే. యూరప్ కు సంబంధించి కొన్ని శతాబ్దాల చరిత్రలో టర్కీ ప్రాముఖ్యతకు, ప్రాధాన్యతకు నిదర్శనం పముక్కలే. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచే పముక్కలే ఒక పర్యాటక ప్రాంతంగా పేరు పొందింది. అప్పటి నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తూనే ఉన్నారు. ఇంకా తనివితీరలేదు. మెట్లు మెట్లుగా ఉన్న లైమ్ స్టోన్ కొండ చరియలను మంచు కప్పి ఉంటుంది. అందులో ఉండే నీరు స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఒక అందమైన అనుభూతిని మిగులుస్తుంది.
 
 చారిత్రకం, ఆధునికం, రమణీయం...
 నేడు టూరిస్టులను బాగా ఆకర్షిస్తున్న దేశాల్లో టర్కీ ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించింది. అటు చారిత్రక ప్రాధాన్యం, మధ్యయుగపు వైభవం, ఆధునిక నిర్మాణాలు, ప్రకృతి సోయగాలతో కూడిన దేశం టర్కీ. ఈ దేశంలోని అపెండస్‌థియేటర్, బండ్రమ్ క్యాజల్, లైబ్రరీ ఆఫ్ సెల్సస్‌లు చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిర్మాణాలు. ఇక రాజధాని నగరం ఇస్తాంబుల్  అభివృద్ధి చెందిన మానవ నాగరకతకు ప్రతినిధి లాంటిది.  చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం, కాలుష్య కారకాలను జయించి నిర్మితమైన నగరాలు, ప్రకృతి సోయగాలు, అద్భుత నిర్మాణాలు టర్కీలోని ప్రధాన ఆకర్షణలు. సౌకర్యాల పరంగా ఇస్తాంబుల్ ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో నిలుస్తోంది. ఇక పతారా బీచ్, పముక్కలే వంటివి టర్కీ సిగలోని ప్రకృతి సోయగాలు. వీటిలో పముక్కలే ప్రపంచ ప్రసిద్ధి చెందిన సహజ దృశ్యం.
 
 ‘మినరల్ వాటర్’లో స్నానం!
  పముక్కలే మంచు కొండల మధ్యన కొన్ని చిన్న చిన్న నీటి చెలమలు ఉంటాయి. స్థానిక వాతావరణానికి అనుగుణంగా ఈ నీటి ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. వేసవి కాలంలో చుట్టూ మంచు ఉన్నప్పటికీ, ఆ మంచు కరగకపోయినా  ఈ చెలమల్లోని నీరు వెచ్చగా ఉంటుంది. ఆ సమయంలో ఈ నీటిలో స్నానం చేస్తే రక్తపోటు, నేత్ర, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. కొన్ని శతాబ్దాలుగా ఈ నమ్మకం ఉంది. దీనికి శాస్త్రీయమైన వివరణ కూడా ఉంది. నీటిలోని రేడియో యాక్టివ్ మినరల్స్ అయిన కాల్షియం, హైడ్రోజన్‌కార్బోనేట్ చర్య చెంది కాల్షియం కార్బోనేట్‌ను సృష్టిస్తాయి. దీన్నే ట్రావెటైన్ అంటారు. పముక్కలేలో ఏర్పడే చిన్న నీటి చెలమల్లో నీరు ఇలాంటి గుణాలను కలిగి ఉంటుంది. ఇందులో స్నానం చేయడం మంచిదనే భావన యూరోపియన్లలో కొన్ని శతాబ్దాలుగా ఉంటూ వస్తోంది. ఈ నమ్మకం పముక్కలేకు విజిటర్ల సంఖ్యను పెంచుతోంది. ఒకవైపు ప్రకృతి సౌందర్యం, మరోవైపు ట్రావెటైన్‌లో స్నానం ఇవి పముక్కలే ప్రాధాన్యతను పెంచుతున్నాయి.
 
 ఇక్కడ క్లియోపాత్ర అనే కొలను ఉంటుంది. అందులో నీరు స్వచ్ఛతకు ప్రసిద్ధి. ఎంతమంది స్నానాలు చేస్తున్నా ఆ నీరు చాలా స్వచ్ఛంగా అలాగే ఉంటుంది. నీటి కింద ఈదుతున్న వారిని కూడా స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ జలకాలాటకు జనం పోటీ పడుతుంటారు.
 
 పురాణాల్లో ప్రస్తావన ఉంది...

 ఈ ప్రాంతానికి గ్రీకు, రోమన్ మైథాలజీల్లో స్థానం ఉంది. ఆ గ్రంథాల్లో ఇదొక పవిత్ర నగరంగా స్థానం పొందింది. ఇప్పటికీ ప్రజల్లో ఈ నమ్మకం కొనసాగుతోంది. రోమ్ మైథాలజీలో స్పా సిటీగా దీని ప్రస్తావన ఉంది. పురాతన రోమన్లు నిర్మించిన పవిత్ర ‘హైరపొలిస్’ అనే పూల్‌కూడా ఇక్కడ ఉంది. దీనిని దైవ సంబంధమైనదిగా పరిగణిస్తారు స్థానికులు. ఇందులోని నీరు పవిత్రమైనదిగా భావిస్తారు.
 
 చిన్న టౌన్...
 డెనిజిల్ ప్రావిన్స్ పరిధిలో నాలుగు వీధులున్న ఒక చిన్న టౌన్ పముక్కలే. చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, సర్వీసెస్ షాపులు, బస్ టికెట్ ఆఫీసులుంటాయి. టూరిజం పరంగా చాలా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో బస చేసే అవకాశాలకు కొదవలేదు. సంవత్సరమంతా పముక్కలేని సందర్శించవచ్చు. అయితే శీతాకాలంలో మాత్రం పముక్కలే అందం వర్ణింప శక్యం కానిది. డెనిజిల్ సిటీ నుంచి అక్కడికి బస్సు ద్వారా చేరుకోవచ్చు.  క్రీస్తు పూర్వం నాటి సమాధి నిర్మాణాలు, ఇక్కడి మ్యూజియం ప్రధాన ఆకర్షణలు.
 
 భిన్నమైన వాతావరణం...
 టర్కీ పరిధిలో ఇఇఎస్‌టీ కాలమానాన్ని ఫాలో అవుతారు. ఈస్టర్న్ యూరోపియన్ సమ్మర్‌టైమ్ అనే ఈ సూచిక ప్రకారం వీరు మనకన్నా రెండు గంటల పాటు వెనుక ఉంటారు. పముక్కలేలో వేసవి కాలంలో ఉదయం ఐదున్నరకే సూర్యుడు పలకరిస్తాడు. రాత్రి ఎనిమిది గంటలకు గానీ సూర్యాస్తమయం కాదు. అదే శీతాకాలంలో అయితే పగటి సమయం మరీ తక్కువ. ఏ పది గంటలో కాస్తంత వెలుగు ఉంటుంది. ఆ తర్వాత చీకట్లు కమ్ముకొంటాయి. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో కాంతి పరావర్తనంతో మంచు విభిన్న రంగుల్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది.
 
 ప్రపంచ వారసత్వ స్థలం..
 1988లో పముక్కలేని ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటిగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సంరక్షించడం మొదలు పెట్టారు. అంత వరకూ ఇక్కడ రూల్స్ ఏమీ ఉండేవి కాదు. తర్వాత మాత్రం స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో అవుతున్నారు. ఈ మంచు కొండలపైకి నడుచుకొంటూ వెళ్లేటప్పుడు చెప్పులు కూడా వేసుకోకూడదనే నియమం ఉంది. ఇప్పుడు ఇక్కడ వాహనాల రాకను నిషేధించారు. నమ్మకాలు, చరిత్ర ఎలా ఉన్నా... మంచును మనసారా ఆస్వాధించడానికి పముక్కలే ఒక చక్కటి ప్రదేశం.
 
 చేరుకోవడం సులువే!
 పముక్కలేకు చేరుకోవాలంటే టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్  ప్రధాన విమానాశ్రయం. ప్రపంచంలోని దాదాపు అన్ని పెద్దదేశాల్లోని ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు విమానాలుంటాయి. అక్కడి నుంచి డెనిజిల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని 45 నిమిషాలు కారులో ప్రయాణిస్తే పముక్కలే వస్తుంది. లేకపోతే ఇస్తాంబుల్ నుంచే నేరు బస్సు ద్వారానో, కారు ద్వారానో చేరుకోవచ్చు. రోడ్లు అంత బాగోకపోయినా చుట్టూ పరిసరాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement