నన్ను చూసి నవ్వుతున్నారు... ఏం చేయను?!
జీవన గమనం
యండమూరి వీరేంద్రనాథ్
నేనో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిని. పని పరంగా ఇబ్బందుల్లేవు. కానీ నేను చుట్టూ ఉన్నవాళ్లతో త్వరగా కలసిపోలేకపోతు న్నాను. ఎవరితో మాట్లాడాలన్నా మొహ మాటం. ఏ ఇద్దరు మాట్లాడుకుని నవ్వుకుం టున్నా, నన్నేమైనా కామెంట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇదేమైనా మానసిక రుగ్మతా?
- సుధాకర్‌బాబు, గుడివాడ
మీరు ఒకే ప్రశ్నలో రెండు సమస్యలు రాశారు. ఒకటి, చుట్టూ ఉన్నవాళ్లతో త్వరగా కలవలేకపోవడం. రెండు, ఏ ఇద్దరు మాట్లాడుతున్నా మీ గురించే అనుకోవడం. మొదటిది పెద్ద సమస్య కాదు. అందరితో కలివిడిగా ఉండేవారు ఒక వర్గానికి చెందినవారైతే, హుందాగా తన పని తాను చేసుకుపోయేవారు మరొక వర్గం. నిజానికి రెండో వర్గం వారినే చుట్టూ ఉన్నవారు గౌరవంగా చూస్తారు. అయితే ఇంట్రావర్షన్ వేరు. రిజర్వ్‌డ్‌గా ఉండటం వేరు. ఇంట్రావర్షన్ అంటే అవసరమైనప్పుడు కూడా మాట్లాడలేక పోవడం. రిజర్వ్‌డ్‌గా ఉండటమంటే అవసరమైనంత వరకూ మాట్లాడి ఆపేయడం, అధిక ప్రసంగం చేయక పోవడం. ఇక రెండో సమస్య... ఏ ఇద్దరు మాట్లాడుకున్నా మీ గురించేమోనని అనుమానపడటం. దీనికి పరిష్కారం కలివిడిగా ఉండటం కాదు, మీ పట్ల మీరు నమ్మకం పెంచుకోవడం. మీ గురించి నవ్వుకునేటంత హాస్యాస్పదమైన, దుర్మార్గమైన పనులు మీరేమీ చేసి ఉండరు. కొంచెం విశ్లేషించుకుంటే ఈ విషయం మీకే అర్థమవుతుంది. అలాం టప్పుడు మీ చుట్టూ ఉన్నవారికి మీ గురించి నవ్వుకునే అవసరం ఏముం టుంది? మరీ గాఢంగా ప్రేమిస్తే తప్ప, ఒక మనిషి తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించేది రోజుకి కేవలం రెండు గ ంటలేనని మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు. అది వాస్తవం అనుకుంటే... ఒక మనిషికి పదిమంది స్నేహితులున్నా రనుకుందాం. అతడు రోజుకి పన్నెండు నిమిషాలే ఒక్కొక్కరి గురించీ ఆలోచి స్తాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే... ఈ వేగ వంతమైన ప్రపంచంలో మీ గురించి ఆలోచించడానికి, నవ్వుకోవ టానికి ఎవరికీ సమయం ఉండదు.
నేను డిగ్రీ పూర్తి చేసి, మూడేళ్లుగా బ్యాంక్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాను. ఒక మంచి అవకాశం వస్తే ఓ అమ్మాయి ప్రేమలో పడి పోగొట్టుకున్నాను. ఆ అమ్మాయీ దక్కలేదు. ఇప్పుడు మరో అమ్మాయి కోసం పిచ్చోడిలా తిరుగుతున్నాను. దాంతో నా స్నేహితులు నువ్వీ జన్మలో మారవు అంటూ తిడుతున్నారు. నేనెలా అయినా ఉద్యోగం తెచ్చుకోవాలి. ఏం చేయాలో సలహా ఇవ్వండి.
- అరవింద్, సంద్యాల
బ్యాంక్ ఉద్యోగం సంపాదించలేని మీ అశక్తతకి ‘అమ్మాయి ప్రేమ’ అనే అంశాన్ని కారణంగా తీసుకుని ఆత్మవంచన చేసు కుంటున్నారేమోనని నా అభిప్రాయం. రెండో అమ్మాయి కోసం పిచ్చోడిలా తిరుగుతున్నానని రాశారు. అర్థం కాలేదు. ఆ రెండో అమ్మాయి మీ ప్రేమను ఒప్పు కుందా? ఒప్పుకోకపోతే పిచ్చోడిలా తిరుగుతున్నారా? ఒప్పుకున్నాక పిచ్చో డయ్యారా? మొదటి అమ్మాయి ప్రేమలో పడి అవకాశం పోగొట్టుకోవడం ఏమిటో కూడా అర్థం కాలేదు. ఒక సమస్యకి పరిష్కారం అడుగుతున్నప్పుడు, చెప్పే వారికి అర్థమయ్యేట్టు వివరంగా రాయాలి.
నాకో బెస్ట్ ఫ్రెండ్ ఉంది. తను నా ప్రాణం. నాకు తనతో కలిసి హ్యాపీగా చదువుకోవాలని ఉంది. కానీ మావాళ్లు నాకు పెళ్లి చేస్తామంటు న్నారు. పెళ్లి చేసుకుంటే నా ఫ్రెండ్‌కి దూరమై పోతానేమోనని నాకు భయంగా ఉంది. తనకు పెళ్లయ్యాకే నేను చేసుకోవాలి అనుకుంటున్నాను. కానీ మావాళ్లు నా మాట వినడం లేదు. నేనేం చేయాలి?
- ఎం.హరిత, మెయిల్
పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి మీరు దూరమైపోతారన్న విషయం వాస్తవమే అయితే, ఆమెకు పెళ్లయ్యాక కూడా మీకు అదే స్థితి సంభవిస్తుంది కదా! ముందు వాస్తవాలను ఎదుర్కొనే మనస్తత్వాన్ని పెంచుకోండి. మీ స్నేహాన్ని జీవితాంతం కాపాడుకోవాలంటే, ఇద్దరూ అవివాహి తులుగా ఉండాల్సిన అవసరం లేదే. మీ ప్రశ్న చూస్తూంటే నాకు నందితాదాస్ ‘ద ఫైర్’ సినిమా గుర్తొస్తోంది. ప్రాణ స్నేహమంటే ప్రతి క్షణం కలిసి ఉండటం కాదు. ఎంత దూరంగా ఉన్నా తాము మానసికంగా దగ్గరే అన్న నమ్మకం. స్కైప్ దగ్గర్నుంచి ఫేస్ బుక్ వరకూ ఆధునికత పెరిగిన ఈ రోజుల్లో... దూరం అన్న సమస్యే ఉత్పన్నం కాదు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి. మీ ప్రాణ స్నేహితురాలితో పాటు మీ భర్త కూడా ప్రాణ స్నేహితు డవుతాడు. బెస్టాఫ్ లక్.