వజ్రాల హారం | Diamond jewel | Sakshi
Sakshi News home page

వజ్రాల హారం

Published Sat, Jan 16 2016 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

వజ్రాల హారం

వజ్రాల హారం

ఆర్నాల్డ్ కుప్పకూలగానే ఆమె రివాల్వర్‌ని కింద పడేసి గట్టిగా అరవసాగింది. జేమ్స్‌కి ఆమె పథకం అర్థమైంది. ఏ కారణంగానో తన భర్తని చంపాలకున్న ఆమె తనని ఇరికించాలని తన ముందు ఆ పని చేసింది. కారణం డబ్బా? ప్రియుడా? కాని ఆ నేరం ఇప్పుడు తన మీదకి నెడుతుంది.
  మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  29 మన్‌హేటన్‌లోని ప్లాజా హోటల్‌లోంచి బయటికి వచ్చే మిసెస్ ఆర్నాల్డ్ మేడిసన్ కంఠంలోని వజ్రాల హారాన్ని ఓ దొంగ దొంగిలించి అంతా తేరుకునేలోగా తన భాగస్వామి నడిపే కారు ఎక్కి పారి పోయాడు. దానికి డోర్ మేన్ ఒక్కడే సాక్షిగా పోలీసులకి లభించాడు. మిగతా వాళ్లంతా ఆగకుండా వెళ్లిపోయారు.

 ‘‘దానికి ఇన్సూరెన్స్ చేశాను. అది కొంత నయం. కాని నా భర్త దాన్ని మా పెళ్లికి బహూకరించాడు. కాబట్టి అది దొరకాలనే నేను దేవుడ్ని పార్థిస్తున్నాను’’ మిసెస్ ఆర్నాల్డ్ పత్రికా విలేఖరులకి చెప్పింది. ఆమె సొసైటీ లేడీ కాబట్టి టీవీలో ఈ వార్తని, ఆమె అభ్యర్థ నని ప్రసారం చేశారు.
   
 మర్నాడు... జేమ్స్ ఫోన్ డయల్ చేశాడు. అవతలివైపు ఎత్తాక అడిగాడు. ‘‘మిసెస్ ఆర్నాల్డ్?’’
 ‘‘మీరెవరు?’’
 ‘‘నా పేరు జాన్’’ జేమ్స్ అబద్ధం చెప్పాడు.
 ‘‘నేను పనిమనిషిని. ఆమెని పిలుస్తాను. లైన్‌లో ఉండండి.’’
 కొన్ని క్షణాల తర్వాత కొత్త కంఠం వినిపించింది... ‘‘హలో.’’
 ‘‘మిసెస్ ఆర్నాల్డ్?’’
 ‘‘అవును. నాతో ఏం పని?’’
 ఆమె కంఠం మగవాళ్ల కంఠానికి దగ్గరగా ఉందని జేమ్స్ అనుకున్నాడు. ‘‘టీవీలో మీ మాట విన్నాను. ఆ విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను.’’
 ‘‘నెక్లెస్ గురించా?’’
 ‘‘అవును. దానికి మీరు నిజంగా సెంటిమెంటల్ వేల్యూని ఇస్తే అది మీకు తిరిగి చేరుతుంది. ఏభై వేల డాలర్లు ఇస్తే తిరిగి ఆ నెక్లెస్‌ని మీకు అప్పగిస్తాను.’’
 కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత ఆమె అడిగింది. ‘‘ఇది ప్రాక్టికల్ జోకా?’’
 ‘‘మీ మెళ్లోంచి కొట్టేసిన ఆ హారం నాకు చేరింది. దానికి లోపల ఎస్‌డబ్ల్యూ అన్న ప్లాటినం అక్షరాలు ఉన్నాయి. అంటే అది నా దగ్గర ఉందని నమ్ముతారా?’’ జాన్ అడిగాడు.
 మరి కొద్ది క్షణాల నిశ్శబ్దం.         
 ‘‘ఎంతన్నారు?’’
 ‘‘ఏభై వేల డాలర్లు.’’
 ‘‘అది చాలా ఎక్కువ.’’
 ‘‘మీ సెంటిమెంట్ బలంగా లేకపోతే ఎక్కువే. పైగా మీకు ఇన్సూరెన్స్ కంపెనీ నించి రెండు లక్షల డాలర్లు అందుతాయి. ఆ నగ మీ దగ్గర ఉంటే పోలీసులు ఇక దాన్ని రికవరీ చేయలేరు. దాంతో ఆ మొత్తాన్ని వాళ్లు మీకు చెల్లించక తప్పదు.’’
 ‘‘సరే.’’

 ‘‘పోలీసుల ప్రమేయం ఉంటే మాత్రం మీ నగ తిరిగి రాదు.’’
 ‘‘మీ భయాన్ని అర్థం చేసుకోగలను. ఎప్పుడు? ఎక్కడ? పబ్లిక్ ప్లేస్‌లో తప్ప ఇంకెక్కడా కలవను.’’
 ‘‘బ్రియంట్ పార్క్‌లో ఫ్లవర్ షో జరుగుతోంది. ఈ వారమంతా అక్కడ పెద్ద టెంట్ వేసి ఉంచుతారు. సాయంత్రం ఐదుకి రండి’’... జేమ్స్ రిసీవర్ని యథాస్థానంలో ఉంచాడు.
   
 పది నిమిషాల ముందే జేమ్స్ బ్రియంట్ పార్క్‌కి చేరుకున్నాడు. తనకి తెలిసిన మఫ్టీలోని పోలీసులు ఎక్కడైనా ఉన్నారా అని వెదికి చూశాడు. ఎవరూ కనపడలేదు. అతను మిసెస్ ఆర్నాల్డ్‌ని చూసి పలకరించాడు. ‘‘మనం ఇదివరకు కలుసుకున్నట్లున్నాం. నా పేరు జాన్.’’
 అతన్ని చూసి చెప్పింది.

 ‘‘ఆ దొంగ మీరు కాదనుకుంటా?’’
 ‘‘నేను రబ్బరు ముక్కు, మీసం పెట్టు కోలేదు. పోలీసులకి మీరు ఫోన్ చేయలేదుగా.’’
 ‘‘లేదు’’ చెప్పింది.
 ‘‘మీరు ఆ హారాన్ని ధరించి న్యూయార్క్‌లో బయటికి రాకూడదు. నిజానికి మీలాంటి అందగత్తెకి దాన్ని ధరించాల్సిన అవసరం కూడా లేదు.’’
 ‘‘మీ కాంప్లి మెంట్‌కి థ్యాంక్స్. పాతిక వేల డాలర్లు నా పరిమితి. మీరు దాన్ని దొంగ సరుకు కొనేవారికమ్మితే అంతకు మించి రాదు.’’

 ‘‘సరే. డబ్బు తెచ్చారా?’’
 ‘‘మీరు నెక్లెస్ తెచ్చారా?’’
 ‘‘లేదు. మీరు పోలీసులకి నా గురించి చెప్తే? అది వాళ్లు స్వాధీనం చేసుకుంటే?’’
 ‘‘మరి?’’
 ‘‘మనం ఇంకోసారి కలుద్దాం. గ్రాండ్ సెంట్రల్ స్టేషన్‌లోని లోయర్ లెవెల్‌లో కలుద్దామా?’’
 ‘‘ఓకే. ఎప్పుడు?’’... అడిగింది.
 ‘‘ఈ రాత్రి తొమ్మిదికి.’’

 ‘‘సరే’’ ఆమె వెళ్లిపోయింది.
 పోలీసులకి ఆమె సిగ్నల్ ఇవ్వక పోవడం వల్ల తనని అరెస్ట్ చేయలేదని, వారు తననే గమనిస్తున్నారని జేమ్స్‌కి మనసులో అనుమానమే. అందుకని సరా సరి ఇంటికి వెళ్లలేదు. రాత్రి తొమ్మిదికి మిసెస్ ఆర్నాల్డ్‌తో ఆమె భర్త ఆర్నాల్డ్ కూడా వచ్చాడు. ‘‘నువ్వేనా నిన్న రాత్రి నెక్లెస్‌ని కొట్టేసింది?’’ అడిగాడు.

 ‘‘నేను ఆ నెక్లెస్‌ని తిరిగి మీకు అందే ఏర్పాటు చేసేవాడిగా మాత్రమే భావిం చండి. డబ్బు తెచ్చారా?’’ జేమ్స్ అడిగాడు. అతను తల ఊపి అడిగాడు... ‘‘నువ్వు నెక్లెస్‌ని తెచ్చావా?’’
 ‘‘తెచ్చాను. డబ్బుని ఓసారి చూపించండి.’’

 మిసెస్ ఆర్నాల్డ్ తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి ఓ రివాల్వర్‌ని తీసింది. తక్షణం తన భర్తని కాల్చి చంపింది. ఆర్నాల్డ్ కుప్పకూలగానే రివాల్వర్‌ని కింద పడేసి గట్టిగా అరవసాగింది. జేమ్స్‌కి ఆమె పథకం అర్థమైంది. ఏ కారణంగానో తన భర్తని చంపాలకున్న ఆమె తనని ఇరికించాలని తన ముందు ఆ పని చేసింది. కారణం డబ్బా? ప్రియుడా? కాని ఆ నేరం ఇప్పుడు తన మీదకి నెడుతుంది. నెక్లెస్ తన జేబులో లేకపోవడం తనని కాపాడుతుందని జేమ్స్ అనుకున్నాడు. తను ఆమెని కలవడానికి అక్కడికి రాలేదని చెప్పాలి.

 నిమిషంలో పోలీసులు అక్కడికి చేరు కున్నారు. ‘‘ఇతను నా భర్తని చంపాడు. ఇతను నిన్న నా వజ్రాల హారాన్ని కొట్టేసిన దొంగ. అది ఇస్తానని, డబ్బు తీసుకురమ్మని మా వారికి చెప్పాడు. తెస్తే ఆ డబ్బు కొట్టేయడానికి కాల్చాడు’’ మిసెస్ ఆర్నాల్డ్ చెప్పింది.
 ‘‘జరిగింది నేనంతా చూశా. ఈమె, ఈమె భర్త వాదించుకోవడం చూశా. కోపంగా ఈమె హ్యాండ్ బ్యాగ్‌లోంచి తన రివాల్వర్ తీసి తన భర్తని కాల్చి చంపింది’’ జేమ్స్ చెప్పాడు.

 ‘‘అది అబద్ధం. అతని జేబులు వెదకండి. నెక్లెస్ ఉంటుంది.’’
 పోలీస్ ఆఫీసర్ జేమ్స్ వంక చూశాడు.
 ‘‘మీరు ఈమె కుడి గ్లవ్‌ని పరీక్షిస్తే దానిమీద గన్ పౌడర్ పార్టికల్స్ కనిపిస్తాయి. నా జేబులు మీరు వెదికినా నాకు అభ్యంతరం లేదు. ఆ నెక్లెస్ నా దగ్గర లేదు’’ జేమ్స్ చెప్పాడు.
 ‘‘నమ్మకండి. అతనే కాల్చాడు’’ అరిచింది.

 జేమ్స్ పర్స్‌లోంచి తన ఐడెంటిటీ కార్డ్‌ని తీసి పోలీస్ ఆఫీసర్‌కి చూపించాడు. ‘‘ఓ! మీరు డిటెక్టివ్ ఫస్ట్ గ్రేడ్ చార్లెస్ బార్నెసానా సార్?’’ దాన్ని చూసిన అతను అడిగాడు.  ‘‘అవును. 91వ ప్రిసింక్ట్ (పోలీస్ స్టేషన్)లో పని చేస్తున్నా. కావాలంటే వాళ్లకి ఫోన్ చేసి కనుక్కోండి.’’
 మిసెస్ ఆర్నాల్డ్ జేమ్స్ వంక నమ్మలేనట్లుగా చూసింది.  ‘పోలీస్ ఆఫీసర్ దొంగతనం చేయడం నేరం. అందువల్ల కష్టాల్లో పడొచ్చు. కాని తేలిగ్గా బయట పడొచ్చు కూడా’ అకున్నాడు జేమ్స్.
 (ఎడ్వర్డ్ డి హాక్ కథకి స్వేచ్ఛానువాదం)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement