
డిజిటల్ బామ్మ
ఒకప్పుడు అక్షరం ముక్క రాని ఈ బామ్మ ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్‌పర్ట్. సామాజిక అభివృద్ధి కోణంలో డిజిటల్ మీడియా పాత్రను అవగాహన చేసుకొని కొత్త అడుగులు వేస్తుంది. రాజస్థాన్‌లోని ఆజ్మీర్ జిల్లాలోని హర్మద అనే గ్రామంలో జన్మించిన నౌరోతి ఎన్నడూ స్కూలు ముఖం చూడలేదు. కుటుంబానికి ఆసరాగా నిలవడం కోసం రాళ్లు కొట్టే పని నుంచి రోడ్డు నిర్మాణ పనులలో కూలీ పనుల వరకు రకరకాల పనులు చేసేది. అయితే పురుషులతో పోల్చితే స్త్రీలకు కూలీ డబ్బులు తక్కువ ఇచ్చేవాళ్లు.
‘మగవాళ్లతో సమానంగా కష్టపడుతున్నప్పుడు...వారితో సమానంగా కూలీ ఎందుకు ఇవ్వరు?’ అని ప్రశ్నించేది నౌరోతి.కేవలం ప్రశ్నించడంతో మాత్రమే ఊరుకోలేదు. ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి న్యాయపోరాటం చేసింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లి గెలిచింది. ఈ విజయం...నౌరోతిలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆత్మవిశ్వాసాన్ని నింపింది.న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో చదువు ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుంది నౌరోతి. ‘‘చదువుకోకుండా ఇన్ని సంవత్సరాలు వృథా చేశాను’’ అని అనుకున్నదే ఆలస్యం తనలోని నిరక్షరాస్యతపై పోరాటం మొదలుపెట్టింది.
తన గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిలోనియాలోని బేర్‌ఫుట్ కాలేజీలో అక్షరాభ్యాసం మొదలు పెట్టింది. త్వరగా నేర్చుకునే నైపుణ్యం, చురుకుదనంతో ఆరు నెలల్లోనే చదవడం, రాయడం నేర్చుకుంది. చదువుకు దూరమైన ఎంతోమంది మహిళలను తనతో పాటు బడికి తీసుకువచ్చేది. తన నాయకత్వ లక్షణాలతో గ్రామ ప్రజల మనసులు చూరగొన్న నౌరోతి పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్‌గా గెలిచింది.సర్పంచ్‌గా ఉన్న అయిదు సంవత్సరాల కాలంలో గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ఆల్కహాల్ మాఫియాపై పోరాటం చేసింది. ఇదంతా ఒక్క ఎత్తయితే... కంప్యూటర్‌పై అవగాహన పెంచుకోవడం మరో ఎత్తు.
కంప్యూటర్ నాలెడ్జ్ వల్ల సమయం ఆదా కావడం మాత్రమే కాకుండా... ఎన్నో విధాలుగా ఉపయోగం ఉంటుందని స్వయంగా తెలుసుకొని రంగంలోకి దిగింది. కంప్యూటర్‌పై పట్టు సాధించింది.మహిళాసాధికారతకు సంబంధించిన వార్తలు, ఆరోగ్యసమస్యలు, వ్యవసాయంలో వస్తున్న సరికొత్త మార్పులు...ఇలా ఎన్నో విషయాలు ఇంటర్‌నెట్‌లో చదివి పదిమందికి చెబుతుంటుంది నౌరోతి. కంప్యూటర్‌ను ఎలా ఉపయోగించాలో గ్రామస్తులకు చెబుతుంటుంది. నౌరోతి దగ్గర కంప్యూటర్ పాఠాలు నేర్చుకున్న ఎంతో మంది శిష్యులు రకరకాల ఉద్యోగాల్లో స్థిరపడడం మరో విశేషం!