లోకం చుట్టిన దోసె...
వ్యాపార సూత్రం: ఇడ్లీ, వడ, దోసె... ఇవి లేకుండా రోజు మొదలుకాదు. మరి దుబాయ్‌లో ఉద్యోగమొస్తుంది, లేదా లండన్‌కు వెళ్లాల్సి వస్తుంది, లేదా ప్యారిస్‌లో మీటింగ్ ఉంటుంది... అక్కడకు వెళ్లి ఏం తినాలి? రొట్టెలు, పిజ్జాలు, బర్గర్లతో సరిపెట్టుకోగలమా? ఎన్నాళ్లు.. రెండు, మూడు, ఐదు, పదిరోజులు.. తర్వాత నోటికి సహించదు, నాలుక ముట్టదు. మన అవస్థ చూసి మనకంటే ముందే వెళ్లిన మన ఫ్రెండు చెబుతాడు.. ఫలానా చోట ‘శరవణ భవన్’ ఉందని... ఆ మాట చెవులకెంత ఇంపుగా ఉంటుందంటే... అది మాటల్లో చెప్పలేం. శరవణ భవన్... కేవలం హోటల్ కాదు, ప్రపంచంలో సౌత్ ఫుడ్‌కు ఒక బ్రాండ్!
దోసెకు ఒక బ్రాండ్ నేమ్ ఉంటే.. అది శరవణ భవన్. ఇది కేవలం చెన్నైలో హోటల్ కాదు, దక్షిణాది దోసె టేస్ట్‌ను ఇండియాకు, ప్రపంచానికి తెలియజెప్పిన ఒక సంస్థ. దేశ వ్యాప్తంగా 40 దాకా శరవణ భవన్ హోటళ్లున్నాయి. చెన్నైలో అయితే ప్రతి ప్రముఖ ప్రాంతంలోనూ ఒకటి కనిపిస్తుంది. ఈ మధ్య ఉత్తరాదిన కూడా విస్తరించింది. పాశ్చాత్యుల కేఎఫ్‌సీలు ఇండియాలో కనిపించినట్లే సౌత్ ఇండియన్ శరవణ భవన్ ఇపుడు దక్షిణ భారతీయులున్న చోటా కనిపిస్తోంది. దుబాయ్, ఖతార్, ప్యారిస్, న్యూయార్క్, లండన్, ఫ్రాంక్‌ఫర్ట్, డల్లాస్, దోహా... ఇలా! ఒక లోకల్ ట్రెడిషన్ ఫుడ్‌ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి వ్యాపారం చేయొచ్చని నిరూపించింది శరవణ భవన్. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వెజ్ రెస్టారెంట్ చైన్ అట. ఈ శాఖలన్నిటికీ మూలం చెన్నైలోని కేకే నగర్‌లో 43 ఏళ్ల కిందట రాజగోపాల్ పెట్టిన శరవణ భవన్ హోటల్!
50 ఏళ్ల క్రితం దక్షిణాదిన కూడా అందరికీ దోసె తినే భాగ్యం ఉండేది కాదట. పెద్ద పెద్ద నగరాల్లో బ్రాహ్మణ హోటళ్లలో తప్పితే టిఫిన్లు దొరికేవి కావు. అలాంటి సమయంలో చెన్నైలో అడుగుపెట్టాడు రాజగోపాల్. అప్పటికే కూరగాయల వ్యాపారం చేస్తున్న అతడు... ఓ బ్రాహ్మణ హోటల్లో టిఫిన్ చేయడానికి వెళ్తే అనుమతించలేదు. అది అతనికి బాగా ఇబ్బంది అనిపించింది. చాలామందికి కావాల్సిన టిఫిన్, ముఖ్యంగా బ్యాచిలర్స్‌కు దొరకదన్న విషయం అర్థమైంది. సరిగ్గా అదే సమయంలో ఓ మిత్రుడు హోటల్ పెడితే బాగా డబ్బులొస్తాయని సూచించాడు. దీంతో కేకే నగర్‌లో రాజగోపాల్ తొలి బ్రాహ్మణేతర హోటల్ పెట్టారు. మొదట్లో ఎవరూ రాలేదు. నష్టాలొచ్చాయి. దీంతో వంటలకు రుచిపెంచారు. వంటవాళ్లకు, పనివాళ్లకు జీతాలు పెంచారు. నెమ్మదిగా హోటల్‌కు పేరొచ్చింది. తర్వాత దీనికి అనుబంధంగా మరో హోటల్ తెరిచాడు. క్రమంగా శాఖలు పెరిగాయి. దీనికి కారణం కేవలం రుచే అని అర్థం చేసుకుని అందులో ఏ మాత్రం రాజీపడకుండా నడపటం మొదలుపెట్టారు.
తొలి విదేశీ శాఖ దుబాయ్‌లో...
శరవణ భవన్ తొలిసారి 2000లో దేశం దాటి.. దుబాయ్ వాళ్లకు దోసెను పరిచయం చేసింది. తొలిరోజునుంచే భారతీయులు దానికి పోటెత్తారు. నోటికి రుచి తగలక ఎన్నారైలు విలవిల్లాడుతున్నారని అర్థమైంది. వెంటనే ప్యారిస్, అటు నుంచి లండన్, న్యూయార్క్ ఇలా విస్తరించింది శరవణ భవన్. పన్నెండు దేశాల్లోని వివిధ నగరాల్లో అడ్రస్ సంపాదించింది. మన వాళ్లే కాదు.. ఆయా దేశస్థులు కూడా దోసెలు, ఇడ్లీల మీద మోజు పడ్డారు. ముఖ్యంగా దోసె తింటే శరవణ భవన్‌లోనే తినాలి అన్న పేరు వచ్చేసింది!
శరవణ భవన్‌లో వంట మనిషిగా చేరాలంటే రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందాల్సిందే. అంకితభావం, ఓర్పు, కస్టమర్లపై ప్రేమ ప్రధాన అర్హతలు. వంటవాళ్లకి పింఛను, ప్రయాణ ఖర్చులు, చదువుల ఖర్చు, అలవెన్సులు ఇచ్చే ఏకైక హోటల్ బహుశా ఇదే కావొచ్చు. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకు ఏ సమయంలో వెళ్లినా శరవణ భవన్‌లో చిరునవ్వుతో ఆతిథ్యం లభిస్తుంది. ఒక చెన్నై శాఖల్లోనే 8000 మంది పనిచేస్తుంటే ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆ సంఖ్య సుమారు 20 వేలు. ప్రతి వంటవాడికి చెన్నై శరవణ భవన్‌లో ట్రైనింగ్ ఇచ్చాకే విదేశానికి పంపడం మొదలుపెట్టారు. తండ్రి స్థాపించిన ఈ సామ్రాజ్యం ఇప్పుడు కొడుకుల ద్వారా విస్తరిస్తోంది. విదేశీ హోటళ్లు పెద్ద కొడుకు, స్వదేశంలోని శాఖలను చిన్న కుమారుడు చూసుకుంటున్నారు!
- రాజగోపాల్