కుటుంబ నియంత్రణ... ఆడవాళ్లే పాటించాలా? | Dr. Venati Shobha sex suggestions | Sakshi
Sakshi News home page

కుటుంబ నియంత్రణ... ఆడవాళ్లే పాటించాలా?

Published Sat, Mar 12 2016 11:57 PM | Last Updated on Thu, May 24 2018 12:31 PM

కుటుంబ నియంత్రణ... ఆడవాళ్లే పాటించాలా? - Sakshi

కుటుంబ నియంత్రణ... ఆడవాళ్లే పాటించాలా?

సందేహం
నా వయసు 32. నాకు చాలాకాలంగా వక్షోజాల్లో గడ్డలు ఉన్నాయి. పట్టుకుంటే చాలా పెద్దగా తగులుతాయి. నెలసరి రావడానికి పది రోజుల ముందు నుంచీ చాలా నొప్పిగా ఉంటాయి. నెలసరి మొదలవగానే తగ్గిపోతాయి. అయితే ఈ మధ్య ఎప్పుడూ నొప్పిగానే అనిపిస్తున్నాయి. కలయిక సమయంలో కూడా కాస్త గట్టిగా ఒత్తినా తట్టుకోలేకపోతున్నాను. నాకు చాలా భయంగా ఉంది. ఈ గడ్డల వల్ల ఏదైనా ప్రమాదమా? అలాగే నాకు చంకల్లో కూడా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ గడ్డలో కాదో ఎలా తెలుసుకోవాలి? క్యాన్సర్ గడ్డలకి ఏవైనా ప్రత్యేక లక్షణాలు ఉంటాయా?
- పి.రోహిణి, కాకినాడ

 
చాలామందికి వక్షోజాల్లో ఫైబ్రో అడినోమా అనే క్యాన్సర్ కాని గడ్డలు ఉంటాయి. ఇవి చిన్న బఠాణి గింజ అంత సైజు మొదలుకొని నిమ్మకాయంత సైజు వరకు పెరుగుతుంటాయి. ఇవి ముట్టుకుంటే గట్టిగా ఉండి లోపల అటూ ఇటూ కదులుతుంటాయి. వీటివల్ల ప్రమాదముండదు. కాకపోతే సైజు పెరిగేకొలదీ రొమ్ములో నొప్పి, బిగుతుగా ఉండటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. రొమ్ములో వచ్చే అన్ని గడ్డలూ క్యాన్సర్ గడ్డలు కావు. కొన్ని రకాల గడ్డలు చాలా త్వరత్వరగా సైజు పెరుగుతూ లోపల కదలకుండా ఉండి, పైన చర్మం కూడా లోపలికి లాక్కునట్టుగా ఉంటే అవి క్యాన్సర్ గడ్డలు కావచ్చు.

కొందరికి చంకల్లో లింఫ్‌నోడ్స్ ఉంటాయి. అవి సాధారణంగా చేతికి తగలవు. రొమ్ములో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్లగాని, టీబీ వల్లగాని చాలా అరుదుగా క్యాన్సర్ వల్లకానీ ఇవి ఉబ్బి... చిన్న చిన్న గడ్డల్లాగా తగులుతుంటాయి. కాబట్టి మీరు ఓసారి డాక్టర్‌ను సంప్రదించి పరీక్ష చేయించు కోండి. అల్ట్రా సౌండ్ బ్రెస్ట్, మామోగ్రామ్ చేయించుకుని వాటిలో ఏదైనా సందేహం ఉంటే నిర్ధారణ కోసం ఊూఅఇ లేదా బయాప్పీ చేయించుకోండి. అప్పుడు అవి క్యాన్సర్ గడ్డలా కాదా అనే నిర్ధారణ అయిపోతుంది. దాన్ని బట్టి చికిత్స చేయించుకోవచ్చు.

పీరియడ్స్‌కి పది నుంచి పదిహేను రోజుల ముందు నుంచీ చాలామందిలో హార్మోన్ల లోపం వల్ల, కొన్ని మినరల్స్ తక్కువ ఉండటం వల్ల రొమ్ముల్లో నీరు చేరి బరువుగా ఉండటం, నొప్పిగా ఉండటం జరుగుతుంది. దీన్నే ప్రీమెన్‌స్ట్రువల్ మాస్టాల్జియా అంటారు. మీరు కంగారు పడకుండా, ఇంకా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. తగిన పరీక్షలు చేయించుకుని గడ్డలు ఎలాంటివో నిర్ధారించుకుంటే, దానిబట్టి తగిన చికిత్స తీసుకోవచ్చు.
 
నా వయసు 23. ఈ మధ్యనే పెళ్లి అయ్యింది. అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. దానికోసం మాత్రలు వాడుతున్నాను. అయితే ఈ మాత్రలు ఎక్కువ వాడితే ప్రమాదం, లూప్ వేయించు కొమ్మని నా ఫ్రెండ్ చెప్తోంది. నిజమేనా? ఇంకో విషయం ఏమిటంటే... విదేశాల్లో పురుషులకు కూడా కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయని ఆ మధ్య ఇంటర్నెట్లో చదివాను. అది నిజమేనా? అలాంటివి మన దగ్గర లేవా?
- వీణాసాగర్, సికింద్రాబాద్

 
కుటుంబ నియంత్రణ కోసం పురుషులు వాడటానికి మాత్రలు, ఇంజెక్షన్లు ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఇప్పటికీ ప్రయోగ దశలోనే ఉన్నాయి. శుక్రకణాలు తయారవ్వకుండా ఉండటానికి, బయటకు విడుదల కాకుండా ఉండటానికి, కదలిక లేకుండా ఉండటానికి రకరకాల హార్మోన్లు, ఇతర కాంబినేషన్‌లో ప్రయోగాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటి కోసం ఎదురు చూడకుండా మీ జాగ్రత్తలు మీరు తీసుకోవడం మంచిది.

ఇరవై నుంచి ముప్ఫై సంవత్సరాల వారు వేరే ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ రెండు నుంచి మూడేళ్ల పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడవచ్చు. లూప్ సాధారణంగా ఒక కాన్పు అయినవారికే వేస్తారు. అలా వేయడం మంచిది కూడా. కాబట్టి మీరు కంగారు పడకుండా డాక్టర్‌ని సంప్రదించండి. వారి సూచన మేరకు మాత్రలు వాడండి. ఇప్పుడు వచ్చే అతి తక్కువ మోతాదు హార్మోన్ పిల్స్ వల్ల సమస్యలేమీ ఉండవు.
 
నా వయసు 26. పెళ్లై రెండేళ్లవుతోంది. ఏడు నెలల బాబు ఉన్నాడు. డెలివరీ అయిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. నిజానికి నేను చాలా యాక్టివ్. చకచకా తిరుగుతూ నా పనులన్నీ నేనే చేసేసుకుంటాను. అందరితో కలివిడిగా ఉంటాను. కానీ ఇప్పుడలా లేదు. ఎందుకో తెలియదు కానీ దేని మీదా ఆసక్తి లేదు. ఏ పనీ చేయబుద్ధి కావడం లేదు. ఎవరితోనైనా మాట్లాడటం కూడా నచ్చట్లేదు. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. దిగులుగా అనిపిస్తోంది. ఎందుకు నాలో ఈ మార్పు వచ్చిందో అర్థం కావడం లేదు. మా ఆయన కూడా నేను చాలా మారిపోయాను అంటున్నారు. ఇది డెలివరీ వల్లే అయ్యిందా లేక ఏదైనా మానసిక సమస్యా?
 - లతాశ్రీ, ఇస్నాపూర్, మెదక్

 
డెలివరీ తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు, మానసిక శారీరక సమస్యలు, ఇంకా మరెన్నో కారణాల వల్ల కొంతమంది డిప్రెషన్‌లోకి వెళ్లడం జరుగుతుంది. చికాకు, కోపం, టెన్షన్, బాధ, ఏడుపు రావడం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, దేని మీదా ఆసక్తి లేకపోవడం, త్వరగా అలసిపోవడం, కన్‌ఫ్యూజన్, మతిమరుపు వంటి ఎన్నో లక్షణాలు రకరకాల తీవ్రతలో ఉంటాయి (అయితే అందరికీ అన్ని లక్షణాలూ ఉండవు). కొంతమందికి కాన్పు తర్వాతి నుంచి రెండు మూడు వారాల వరకు ఉంటాయి. దానినే పోస్ట్‌పార్టమ్ బేబీ బ్లూస్ అంటారు.

కొందరిలో ఆరు నెలల వరకూ లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు. దీనిని పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అంటారు. దీన్ని అశ్రద్ధ చేస్తే ఇంకా తీవ్రమై చాలాకాలం పాటు కొనసాగుతుంది. కాన్పు తర్వాత ఆక్ట్రోజిన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు ఉన్నట్టుండి తగ్గిపోవడం వల్ల డిప్రెషన్ లక్షణాలు రావచ్చు. బిడ్డతో నిద్ర లేకపోవడం, బిడ్డ పనులు ఎక్కువ ఉండటం, ఇంట్లో పనులతో అలసిపోవడం, శరీరంలో వచ్చిన మార్పుల వల్ల భర్త తనని పట్టించుకోడేమోనన్న భావన వంటి ఎన్నో కారణాల వల్ల కూడా ఈ లక్షణాలు తలెత్తవచ్చు. ఆర్థిక సమస్యలు, ఇంట్లో సపోర్ట్ కరువైనప్పుడు కూడా రావచ్చు.

వీటి నుంచి బయటపడాలంటే భర్త, ఇతర కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. అందరూ మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి. కొద్దిరోజుల పాటు బిడ్డకు పాలు పట్టడం ఇతరత్రా పనుల్లో సహాయంగా ఉండాలి. మీరు మీ సమస్యను మీ భర్తతోను, మిగతా వాళ్లతోనూ చర్చించండి. వాళ్ల సహాయం తీసుకోండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. వాకింగ్, ప్రాణాయామం వంటివి అలవర్చుకోండి. తగినంత ఆహారం తీసుకోండి. అప్పటికీ తగ్గకపోతే సైకియాట్రిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. అవసరమైతే సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో కొంతకాలం మందులు కూడా వాడాల్సి ఉంటుంది.
 
నా వయసు 36 సంవత్సరాలు. నాకు ఇరవై యేళ్లకే పెళ్లయ్యింది. కానీ కొన్ని నెలలు తిరక్కుండానే నా భర్త చనిపోయారు. తర్వాత ఒంటరిగానే ఉండిపోయాను. పెళ్లి చేసుకోవాలని లేదు. అయితే ఈ మధ్య ఎందుకో ఓ బిడ్డ ఉంటే బాగుణ్ను అనిపిస్తోంది. భర్తతో సంబంధం లేకుండా బిడ్డను కనడానికి ఏయే పద్ధతులు ఉన్నాయి? ఎంత ఖర్చవుతుంది? నా వయసు దృష్ట్యా అది వీలవుతుందా? దయచేసి సలహా ఇవ్వండి.
 - సుమిత్ర, రాజమండ్రి

 
మళ్లీ పెళ్లి చేసుకోకుండా బిడ్డను కనాలంటే డోనర్ ఐయూఐ పద్ధతి ద్వారా ప్రయత్నించవచ్చు. అంటే మీకు అండం విడుదలయ్యే సమయంలో దాత నుంచి సేకరించిన వీర్యకణాలను గర్భాశయంలోకి పంపడం ద్వారా గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. వేరే సమస్యలు ఏమీ లేనప్పుడు ఈ పద్ధతిని మూడు నుంచి ఆరుసార్ల వరకూ ప్రయత్నించవచ్చు. తర్వాత కూడా గర్భం రాకపోతే డోనర్ వీర్యకణాలతో టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రయత్నించవచ్చు. కాని భర్త లేకుండా  ఈ పద్ధతుల ద్వారా బిడ్డను కనడానికి మన దేశంలో చట్టరీత్యా అనుమతి లేదు. అయినా జీవితాంతం మీకూ ఓ తోడు కావాలి కాబట్టి మరోసారి పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించండి.

36 సంవత్సరాలైనా ఫర్వాలేదు. పెళ్లి చేసుకుని, మూడు నుంచి ఆరు నెలల వరకూ సాధారణ గర్భం గురించి ప్రయత్నం చేయవచ్చు. ఫలితం లేకపోతే ఐయూఐ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా కూడా ప్రయత్నించవచ్చు. కాకపోతే 35 యేళ్లు దాటిన తర్వాత పుట్టే పిల్లల్లో అవయవ లోపాలు, జన్యుపరమైన సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి. వాటికి తగ్గ పరీక్షలు చేయించుకుంటూ గర్భాన్ని కొనసాగించవచ్చు. ఇవన్నీ ఇష్టం లేకపోతే, ఇంక పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నట్లయితే అనాథ శరణాలయం నుంచి ఎవరైనా ఓ చిన్నబిడ్డను దత్తత తీసుకోండి. ఓ అనాథ బిడ్డకు బతుకునిచ్చినవారు అవుతారు.
 
నా వయసు 23. పెళ్లై రెండేళ్లయ్యింది. రెండు నెలలకే గర్భం దాల్చాను. కవలలు పుట్టారు. నార్మల్ డెలివరీనే. ఆ తర్వాత మళ్లీ నెలసరి మొదలయ్యింది. అయితే సమస్య ఏమిటంటే నాకు మొదట్నుంచీ కూడా పీరియడ్స్ సమస్యలేమీ లేవు. కానీ డెలివరీ అయ్యాక పీరియడ్స్‌లో మార్పు వచ్చింది. బ్లీడింగ్ విపరీతంగా అవుతోంది. ఇంతకుముందు మూడు రోజులకే తగ్గేది ఇప్పుడు ఐదారు రోజుల తర్వాత గానీ తగ్గట్లేదు. పైగా భరించలేనంత కడుపునొప్పి వస్తోంది. ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేనేం చేయాలి?
 - యు.మేరీమణి, కడపర్తి

 
కొంతమందికి కాన్పు తర్వాత హార్మోన్లలో మార్పులు వస్తాయి. వాటి వల్ల లేదా హార్మోన్లలో లోపాలు, బరువు పెరగడం వంటి వాటి వల్ల పీరియడ్స్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ప్రతినెలా మూడు రోజుల పాటు ట్రనెక్సమిక్ యాసిడ్, మెఫినమిల్ యాసిడ్ కలిసిన మాత్రలు రోజుకు రెండు నుంచి మూడు వాడి చూడండి. అయినా ఫలితం లేకపోతే గైనకాలజిస్టును సంప్రదించి స్కానింగ్ తీయించుకుంటే... గర్భాశయంలో లేదా అండాశయాల్లో నీటి తిత్తుల వంటివి ఉన్నాయేమో తెలుస్తుంది. సమస్యను బట్టి చికిత్స తీసుకోవచ్చు. ఒకవేళ బరువు పెరిగివుంటే తగ్గడానికి ప్రయత్నించండి. థైరాయిడ్ వంటి హార్మోన్లలో మార్పులు ఉంటే వాటికి కూడా తగిన చికిత్స తీసుకోండి.
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement