ఆరోగ్యంగానే ఉన్నా...టెస్ట్ ఎందుకు?
సందేహం
నా వయసు 24. మరో రెండు నెలల్లో నా పెళ్లి. నా వక్షోజాలు చాలా చిన్నగా ఉంటాయి. వక్షోజాలు పెద్దగా ఉండేవాళ్లనే పురుషులు ఇష్టపడతారని ఎక్కడో చదివాను. మరి నా స్తనాల సైజు పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఇంజెక్షన్ ఉందని విన్నాను. నిజమేనా?
- దీపిక, రాజమండ్రి
మీ బరువు ఎంతో రాయలేదు. ఛాతీ అనేది శరీర బరువును బట్టి కూడా ఉంటుంది. వక్షోజాల్లో కొవ్వు, పాల గ్రంథులు, కనె క్టివ్ టిష్యూ ఉంటాయి.
బరువు తక్కువగా ఉంటే బ్రెస్ట్‌లో కూడా కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి వక్షోజాల సైజు కూడా తక్కువే ఉంటుంది. మీరు కనుక సన్నగా ఉంటే పాలు, పండ్లు, సోయాబీన్స్, డ్రైఫ్రూట్స్ వంటి పౌష్టికాహా రాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల శరీరంతో పాటు వక్షోజాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెట్లో దొరికే ఇంజెక్షన్లు, క్రీములు, జెల్స్ తాత్కాలికంగా మార్పును చూపిస్తాయి తప్ప వాడటం మానేయగానే వక్షోజాలు మామూలు సైజుకే వచ్చేస్తాయి.
పైగా వాటివల్ల అలర్జీ, దురదలు, బొబ్బలు వంటి దుష్ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ సర్జరీ, సిలికాన్ ఇంప్లాంట్స్ లాంటివి ఉన్నా వాటి వల్ల కూడా దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి అనవసరమైన ప్రయోగాల జోలికి పోకుండా మంచి పౌష్టికాహారం తీసుకుంటూ బ్రెస్ట్ మసాజ్, బ్రెస్ట్ ఎక్సర్‌సైజులు చేయండి. అంతవరకూ కావాలంటే ప్యాడెడ్ బ్రాలు వాడండి.
నా వయసు 30. మా వారికి 35. పెళ్లయ్యి 6 నెలలు అవుతుంది. నాకు పీరియడ్స్ కరెక్టుగానే వస్తాయి. మా ఇద్దరి వయస్సు ఎక్కువగా ఉంది కదా. తొందరగా గర్భం దాల్చితే బాగుంటుంది అను కుంటున్నాం. రోజూ రెగ్యులర్‌గానే కలుస్తాం. కానీ కలిసిన తర్వాత వీర్యం అంతా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదేమోనని సందేహం. డాక్టర్‌ని సంప్రదించాలంటే సిగ్గుగా ఉంది. దయచేసి సలహా ఇవ్వగలరు.
- విజయ, గుంటూరు
సాధారణంగా, ఎటువంటి సమస్యా లేనప్పుడు, 80 శాతం దంపతులు పెళ్లైన సంవత్సరం లోపే గర్భం దాలుస్తారు. మిగతా 20 శాతం మందిలో 15 శాతం - 2 సంవత్సరాలలో గర్భం దాలు స్తారు. 5 శాతం మందిలోనే సమస్యలు ఉండవచ్చు. మీకు పెళ్లయ్యి 6 నెలలే కాబట్టి, ఇంకా ఆర్నెల్లు ప్రయత్నించవచ్చు. సాధారణంగా కలయిక తర్వాత, భర్త నుంచి విడుద లయ్యే వీర్యం 3-5 ఎం.ఎల్. యోని భాగంలో చేరుతుంది.
వీర్యం, దానిలో ఉండే కదిలే వీర్యకణాలు మాత్రమే యోనిలో నుంచి, గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) ద్వారా గర్భా శయంలోకి ప్రవేశిస్తాయి. మిగతా ద్రవం, నీళ్లలా ఉండే వీర్యం బయటకు వస్తుంది. కొంత మందిలో ఎక్కువగా విడుదలైనప్పుడు వెంటనే వస్తుంది, కొందరిలో కొంతసేపటి తర్వాత జెల్‌లాగా ఏర్పడి మెల్లగా వస్తుంది. దాని వల్ల సమస్య ఏమీలేదు. కలయిక ముందు ఆడవాళ్ల నడుం కింద దిండు పెట్టుకుంటే, యోనిలో వీర్యం ఎక్కువసేపు ఉండి, వీర్యకణాలు ఎక్కువగా సర్విక్‌లో నుంచి గర్భాశయం లోకి వెళ్తాయి.
వీర్యం అయితే మెల్లగా బయటికే వస్తుంది. వెంటనే పైకి లేవ కుండా, 10-15 నిమిషాలు పడుకొనే ఉండటం మంచిది. అలా ఇంకొక ఆర్నెల్లు ప్రయత్నించవచ్చు. లేదు వయసు పెరుగు తోందని ఆందోళనగా ఉంటే, సిగ్గు పడ కుండా డాక్టర్ని కలిసి వేరే సమస్యలున్నా యేమో పరీక్ష చేయించుకుంటే మంచిది.
నా వయసు 26. పెళ్లయ్యి మూడేళ్లయింది. పీరియడ్స్ 45 రోజులకొకసారి వస్తాయి. పిల్లలు లేరు. డాక్టర్ని సంప్రదిస్తే రక్తపరీక్షలు, స్కానింగ్ చేసి, అండం తయారవటం లేదని మందులిచ్చారు. ఆరు నెలల నుంచి వాడుతు న్నాను. మూడు నెలల నుంచి ఫాలిక్యులర్ స్టడీ చేసి మందుల వల్ల అండం తయారవుతుందని చెప్పారు. మా ఆయనకు వీర్య పరీక్ష చేయించ మన్నారు. మా ఆయన, నేను ఆరోగ్యంగానే ఉన్నాం. మరి టెస్ట్ ఎందుకు?
- నాగశ్రీ, కర్నూలు
గర్భం రాకపోవటానికి, 100లో 35 శాతం ఆడవారిలో లోపాలు, 35 శాతం మగవారిలో లోపాలు, 30 శాతం ఇద్దరిలో లోపాలుండవచ్చు. గర్భం దాల్చని ఆడవారిలో 70 శాతం మందిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం తయారు కాదు. మిగతా 30 శాతంలో ట్యూబ్స్ బ్లాక్ అవ్వటం, ఇన్‌ఫెక్షన్లు, ఎండో మెట్రియో సిస్, ఇంకా ఇతర కారణాల వల్ల కావచ్చు. ఇప్పుడు మీకు మందుల వల్ల అండం విడుదలవుతుంది కాబట్టి, మీ ఆయన వీర్యపరీక్ష తప్పనిసరిగా చేయించాలి. వీర్యకణాలు సరిపడా ఉన్నాయా, వాటి కదలిక సరిగా ఉందా లేదా వంటివాటిని చూడాలి.
మగవారు ఆరోగ్యంగా ఉండటానికి, వీర్యకణాలకు సంబంధం లేదు. వారు ఆరోగ్యం గానే ఉన్నా, హార్మోన్ల అసమతుల్యత వల్ల, వీర్యకణాలు వచ్చే దారిలో ఏదైనా అడ్డంకి ఉన్నా, వీర్యకణాల ఉత్పత్తిలో తేడా ఉన్నా ఇబ్బందే. అలాగే ఇన్‌ఫెక్షన్లు, వీర్యకణాలు తక్కువ ఉండటం, కదలిక తక్కువ ఉండటం లేదా అసలే లేకపోవడం కూడా జరగొచ్చు. కాబట్టి వీర్యపరీక్ష కచ్చితంగా చేయించు కోవాలి. మీరు ఇన్ని పరీక్షలు చేయించు కుని, ఇన్ని మందులు వాడుతున్నప్పుడు మీ ఆయన చిన్న, సులువైన వీర్యపరీక్ష చేయించుకోవడంలో తప్పులేదు కదా. ఒకవేళ, వీర్యకణాలు సరిగా లేనప్పుడు, మీరు ఒక్కరే మందులు వాడినా లాభం లేదు కదా. మందులు ఊరకనే వాడి, డబ్బులు కూడా వృథా!
- డా॥వేనాటి శోభ