ఆ రహస్యం బయటపడుతుందా?!
సందేహం
గర్భం తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసే క్రమంలో కొందరికి ఇన్ఫెక్షన్లు వస్తాయి. తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. కొందరికి ప్రాణహాని కూడా ఏర్పడుతుంది.
నాకు ఈ మధ్యనే పెళ్లయ్యింది. మేమిద్దరం సెక్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మావారు ఆనల్ సెక్స్ కావాలని అడుగుతున్నారు. కానీ నాకు ఎందుకో ఇష్టం లేదు. ఆ విషయం చెప్పినా ఆయన బలవంతం చేస్తున్నారు. అసలు ఆనల్ సెక్స్ చేయవచ్చా? దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా?
- మాధురి, భీమవరం
ఆనల్ సెక్స్ (మలద్వారం ద్వారా రతి జరపడం) అనేది విపరీత కోరికలకు తార్కాణం. అంటే పర్‌వెర్షన్ అన్నమాట. దీనివల్ల మొదట్లో బ్లీడింగ్, నొప్పి ఉండవచ్చు. తర్వాత కాస్త ఫ్రీ అయినా కూడా మగవారికి తప్ప ఆడవారికి పెద్దగా అనుభూతి కలగదనేది వాస్తవం. అది మాత్రమే కాక... దీనివల్ల బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పాటు సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకూ ఆనల్ సెక్స్ జోలికి పోకపోవడమే మంచిది. మీవారికి బహుశా దానివల్ల వచ్చే సమస్యలు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఆయనకు అన్నీ వివరించండి. కన్విన్స్ కాకపోతే ఓసారి కౌన్సెలింగ్ ఇప్పించండి.
నా వయసు 20. ఎనిమిది నెలల క్రితం పెళ్లయ్యింది. కలయిక సమయంలో ఇంతవరకూ ఎటువంటి ఇబ్బందీ లేదు. కానీ వారం రోజులుగా సెక్స్ చేసే సమయంలో వైట్ డిశ్చార్జ్ అవుతోంది. దుర్వాసన కూడా వస్తోంది. యోనిలో నొప్పి కూడా అనిపిస్తూ ఉండటం వల్ల ఉత్సాహంగా పాల్గొనలేక పోతున్నాను. దాంతో మావారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నాకెందుకిలా అవుతోంది?
- సంయుక్త, మెయిల్
సెక్స్ చేసేటప్పుడు వైట్ డిశ్చార్జ్ విడుదల కావడం మామూలే. శృంగార ప్రేరేపణల వల్ల యోనిలో స్రావాలు ఊరతాయి. దానికి మగవారి నుంచి విడుదలయ్యే వీర్యం కూడా కలిసి, వైట్ డిశ్చార్జిలాగా బయటకు వస్తుంది. అయితే దుర్వాసన ఉండదు. మీరు దుర్వాసన, నొప్పి ఉన్నాయంటున్నారు కాబట్టి ఇన్ఫెక్షన్ ఉండి ఉండొచ్చు. యోనిలో ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల పెరుగులాగ, దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఒక్కోసారి ఇది కాస్త పసుపుగా కూడా ఉంటుంది.
కొందరికి అయితే దురద, కలిసినప్పుడు మంట, నొప్పి కూడా ఉంటాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే... ఇన్ఫెక్షన్ గర్భాశయంలోకి, పొత్తి కడుపులోకి వ్యాపించి, మామూలప్పుడు కూడా దురద, వాసన, మంటతో కూడిన వైట్ డిశ్చార్జ్ అవుతుంది. పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి వంటి ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా వెంటనే గైనకాలజిస్టును సంప్రదిస్తే అవసరమైన పరీక్షలు చేస్తారు. కారణాన్ని బట్టి యాంటీ బయొటిక్స్, యాంటీ ఫంగల్ మందులు వాడితే సరిపోతుంది.
నా వయసు 27. నేనో అబ్బాయిని ప్రేమించాను. శారీరకంగా కూడా దగ్గరయ్యాను. దాంతో గర్భం వచ్చింది. నా ఫ్రెండ్స్ సహాయంతో ట్యాబ్లెట్స్ వేసుకుని అబార్షన్ చేసుకున్నాను. దురదృష్టంకొద్దీ నేను ప్రేమించిన అబ్బాయి కొన్నాళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు. తర్వాత నేను వేరే పెళ్లి చేసుకున్నాను. సంతోషంగానే ఉన్నాను కానీ నాకు ఒక్కటే భయం. భవిష్యత్తులో నేను గర్భం దాలిస్తే... నా అబార్షన్ సంగతి బయటపడే అవకాశం ఉందా?
- వైష్ణవి, ఊరు రాయలేదు
పెళ్లి కాకముందు పెట్టుకునే శారీరక సంబంధాల వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో అనర్థాలు జరుగుతాయి. వాటిలో కొన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి సంబంధాల వల్ల హెచ్‌ఐవీ, హెపటైటిస్, సిఫిలిస్ వంటి సుఖవ్యాధులు కూడా రావొచ్చు. గర్భం ధరించడం, దాన్ని తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసే క్రమంలో కొందరికి ఇన్ఫెక్షన్లు వస్తాయి. తీవ్రమైన రక్తస్రావం అవుతుంది.
కొందరికి ప్రాణహాని కూడా ఏర్పడుతుంది. ఇన్ఫెక్షన్లు రావడం వల్ల గర్భాశయం పాడవడం, ట్యూబ్స్ మూసుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడి సంతానలేమి కూడా కలగవచ్చు. ఈ శారీరక సమస్య లన్నిటితో పాటు.. తప్పు చేశాము అన్న భావన, పెళ్లయ్యాక భర్తకి గతం తెలిసిపోతుందేమోనన్న భయంతో మనశ్శాంతి దూరమవుతుంది. సంసార జీవితాన్ని సంతోషంగా గడపలేని పరిస్థితి వస్తుంది. అందుకే ఇలాంటి సంబంధాలు ఎంతమాత్రం మంచివి కావు. ఇక మీ అబార్షన్ విషయానికి వస్తే... మందుల ద్వారా అయ్యింది కాబట్టి బయటపడే అవకాశం లేదు.
- డా.వేనాటి శోభ