ప్రతిసారీ కొత్తగా కావాలంటే ఎలా?! | every time wants new process? | Sakshi
Sakshi News home page

ప్రతిసారీ కొత్తగా కావాలంటే ఎలా?!

Published Sun, Nov 1 2015 1:01 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

ప్రతిసారీ కొత్తగా కావాలంటే ఎలా?! - Sakshi

ప్రతిసారీ కొత్తగా కావాలంటే ఎలా?!

సందేహం
నా వయసు 32. పెళ్లయ్యి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మావారు సెక్స్‌లో చాలా హుషారుగా ఉంటారు. నాకూ ఇష్టమే. కాకపోతే ఆయన కొత్త కొత్త భంగిమలు కావాలంటారు. ఇంగ్లిష్ ముద్దులు పెట్టమని అడుగుతారు. నా ఛాతిని ప్రెస్ చేయాలని ఆశపడతారు. పైగా నేనే పైకి వచ్చి చేయాలంటారు. నాకవేమీ ఇష్టం ఉండదు. నావల్ల కాదు అని చెబితే ఆయన నిరుత్సాహపడుతుంటారు. నేనేం చేయను? ఆయన కోరినవి చేయడం వల్ల ఏ ఇబ్బందులూ ఉండవా? నేను తనని ఎలా తృప్తి పర్చగలను?
 - వసుంధర, వైజాగ్

 
కొందరు ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా, కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టు అవతలివాళ్లు కూడా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకోవడంలో తప్పు లేదు. కాకపోతే బలవంత పెట్టకూడదు. మెల్లగా చెప్పి ఒప్పించాలి. భార్యాభర్తలన్నాక ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరికి కావలసినట్టు ఇంకొకరు నడచుకోవాలి. కొన్నిసార్లు మనకి నచ్చకపోయినా అవతలి వారి కోసం కొన్ని అలవర్చుకోవడంలో ఆనందం ఉంటుంది. మీవారు కోరకూడని వేమీ కోరలేదు. అవి పెద్ద ఇబ్బందికర మైనవీ కావు. వాటివల్ల ఏ సమస్యలూ కూడా రావు. కాబట్టి మీరు తనని అర్థం చేసుకోండి. తన కోరికలు తీర్చడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు ఆయన్ని తృప్తిపర్చగలుగుతారు. భార్య దగ్గర కాకపోతే భర్త తన కోరికలను ఎవరి దగ్గర చెప్పగలడు! కాబట్టి మీరు సిగ్గు, బిడియం వదిలి మీవారిని అనుసరిస్తే ఇద్దరూ సంతోషంగా ఉంటారు.
 
నా వయసు 38. మా వారి వయసు 40. ఇద్దరం ఆరోగ్యంగానే ఉంటాం. అయితే నాకు పొట్ట చాలా పెద్దగా ఉంటుంది. దాంతో సెక్స్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటోంది. మావారి అంగం పూర్తిగా లోనికి వెళ్లడం లేదు. దాంతో ఆయనకి, నాకు కూడా అసంతృప్తిగా ఉంటోంది. ఇద్దరం తృప్తి పొందడానికి వేరే ఏదైనా పద్ధతి ఉందా? లేదంటే నా పొట్ట తగ్గడానికి ఏదైనా మార్గం ఉందా?
 - సువర్ణ, తాడిమర్రి

 
భార్యాభర్తల్లో ఎవరికైనా పొట్ట బాగా పెద్దగా ఉన్నప్పుడు, అది అడ్డు పడు తున్నప్పుడు సెక్స్‌లో ఇబ్బంది, అసంతృప్తి ఉండటం సహజం. అంతేకాక అధిక బరువు వల్ల, సెక్స్ చేసే సమయంలో ఆయాసం, ఇబ్బందిగా ఉండటం, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు కూడా ఉండవచ్చు. మొదట మీరు పొట్ట తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. దానికోసం వాకింగ్, యోగా, అబ్డామినల్ వ్యాయామాలు చేస్తూ... మితాహారం తీసుకుంటూ... అవసరమైతే జిమ్, ఏరోబిక్స్ వంటివి కూడా చేస్తూ ఉంటే పొట్ట తగ్గుతుంది. అంత వరకూ వేరే భంగిమల్లో సెక్స్ చేయడానికి ప్రయత్నించండి. అంటే మీరు మోకాళ్ల మీద వంగితే ఆయన వెనక నుంచి అంగ ప్రవేశానికి ప్రయత్నించ వచ్చు. లేదంటే ఆయన కింద, మీరు పైన ఉండి చేయవచ్చు.
 
నా వయసు 25. పెళ్లై సంవత్సరం కావస్తోంది. ఈ మధ్య నీరసంగా ఉంటోందని పరీక్ష చేయించుకుంటే హెచ్.బి.ఎస్.ఎ.జి.పాజిటివ్ అని వచ్చింది. ఇది అంటువ్యాధి అంటున్నారు. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మావారికి శారీరకంగా దగ్గర కావొచ్చా?
 - నళిని, గణపవరం, గుంటూరు

 
హెచ్.బి.ఎస్.ఎ.జి. పాజిటివ్ అంటే హెపటైటిస్ బి అనే వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది రక్తం ద్వారా లేదా సెక్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. సరిగ్గా పరీక్ష చెయ్యని రక్తం ఎక్కించడం లేదా ఒకరికి వాడిన సిరెంజులే మరొకరికి వాడటం వల్ల కూడా వ్యాపించవచ్చు. మీకు ఉంది కాబట్టి మీ వారికి కూడా ఉందో లేదో నిర్ధారించు కోవాలి. మీ వారికి కూడా వెంటనే పరీక్ష చెయ్యించండి. ఆయనకి కూడా ఉంటే... ఇద్దరూ ఒకేసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును సంప్రదించండి. ఇన్ఫెక్షన్ పాతదా లేక ఇప్పుడు మీ రక్తంలో ఆ వైరస్ యాక్టివ్‌గా ఉందా అన్నది తెలుసు కోవాలి. దానికోసం హెచ్‌బీఎస్ వైరల్ లోడ్ టెస్ట్, అలాగే లివర్ పైన ఏమైనా ప్రభావం ఉందా అన్నది తెలుసుకోడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుని, దాన్నిబట్టి చికిత్స తీసుకోవాలి. మీవారికి లేకపోతే... హెపటైటిస్ వ్యాక్సిన్ మూడు డోసులు ఇప్పించండి. సమస్య తీరేవరకూ కలయిక సమయంలో కండోమ్ తప్పక వాడండి.
 
నా వయసు 22. మరో మూడు నెలల్లో మా మేనమామతో నా పెళ్లి జరగబోతోంది. మేనరికం వల్ల చాలా సమస్యలు వస్తాయని, పిల్లలు లోపాలతో పుడతారని అంటారు. కానీ మేం చాలా పేదవాళ్లం. కాబట్టే ఇలా చేసుకో వాల్సి వస్తోంది. పిల్లలు బాగా పుట్టాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? కలయిక సమయంలో ఏవైనా ప్రత్యేక పద్ధతులు పాటించాలా? మందుల వంటివి వేసుకోవాలా?
 - లక్ష్మి, కర్నూలు

 
మేనరికం వల్ల అందరు పిల్లల్లోనూ అవయవ లోపాలు ఉండాలనేమీ లేదు. సాధారణంగా బిడ్డ ఏర్పడేటప్పుడు... తల్లిలో ఉండే 46 క్రోమోజోముల నుంచి 23 క్రోమోజోములు, తండ్రి నుంచి 23 క్రోమోజోములు సంక్రమిస్తాయి. ఈ క్రోమోజోముల మీద శరీరంలో ఉన్న ప్రతి అవయవం, వాటి పనితీరు, రంగు, రూపునకు సంబంధించిన జన్యువులు ఉంటాయి. ఈ జన్యువుల్లో కొన్ని, కొన్నిసార్లు మార్పు చెంది డిఫెక్టివ్ జీన్‌‌సగా మారతాయి. అవి ఒకే కుటుంబంలోని పిల్లలకు సంక్రమిస్తాయి. అదే కుటుంబంలోని వారికి పెళ్లిళ్లు చేయడం వల్ల డిఫెక్టివ్ జీన్స్ రెండు తల్లిదండ్రుల నుంచి బిడ్డకు సంక్రమించినప్పుడు... జన్యుపరమైన సమస్యలు, అవయవ లోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

అదృష్టం కొద్దీ ఒకటే డిఫెక్టివ్ జీన్ సంక్రమిస్తే సమస్యలు రాకపోవచ్చు. పుట్టబోయే బిడ్డలో సమస్యలు వస్తాయా, రావా అనేది గర్భం దాల్చకముందే చెప్పడం కష్టం. అవి రాకుండా చేయడం కూడా మన చేతిలో ఉండదు. ఎందుకంటే కణాల విభజన అనేది లోపల జరిగే ప్రక్రియ. దాన్ని బయటి నుంచి... అంటే మందులు, ఇంజెక్షన్ల ద్వారా అరికట్టలేం. గర్భం దాల్చడానికి మూడు నెలల ముందు నుంచే రోజుకొకటి చొప్పున ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం, గర్భం దాల్చిన తర్వాత మూడో నెలలో ఎన్.టి.స్కాన్, డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్, ఐదో నెలలో ఖీఐఊఊఅ స్కాన్, 2డి ఎకో చెయ్యించుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలో ఏవైనా అవయవ లోపాలు, కొన్ని రకాల జన్యు సమస్యలు ఉంటే తెలుసు కోవచ్చు. అంతేకానీ అవి రాకుండా చేయగల ప్రత్యేక మందులు, పద్ధతులు ఏమీ లేవు.
 
నా వయసు 22. మావారూ నేనూ రోజుకి రెండు మూడుసార్లు కలుస్తాం. అయితే ఈ మధ్య ఎందుకో నాకు కోరిక కలగడం లేదు. మావారికేమో ఆ ఫీలింగ్స్ చాలా ఎక్కువ. ఎక్కువసార్లు కావాలంటారు. కానీ నేను సహకరించలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా ఫీలింగ్స్ రావడం లేదు. ఏవైనా సెక్స్ వీడియోలు చూస్తే మాత్రం వెంటనే ఫీలింగ్ వస్తోంది. లేకపోతే రావట్లేదు. దాంతో మావారు విసుక్కుంటున్నారు. ఇలా చేస్తే వేరే పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. నాకు కోరికలు పెరగాలంటే ఏం చేయాలి?
 - ఊరు, పేరు రాయలేదు

 
రోజూ చేసే పనిమీద ఆసక్తి తగ్గడం లేదా ఆలోచనలు వేరే వాటి మీదకు మళ్లడం జరిగినప్పుడో... లేదంటే పని ఒత్తిడి వల్లో సెక్స్‌మీద ముందు ఉన్నంత కోరిక కలగకపోవచ్చు. మీదింకా చిన్న వయసు. కాబట్టి కోరికలు పెరగడానికి అప్పుడే మందులు వాడాల్సిన అవసరం లేదు. మనసుని ఆహ్లాదంగా ఉంచుకుని, జీవితాన్ని అందంగా ఊహించుకుంటూ, సంతోషంగా ఉండగలిగితే... కోరికలు అవే పుట్టుకొస్తాయి. మీరిద్దరూ ఎక్కువసేపు ఫోర్‌ప్లే చేయడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఫీలింగ్స్ పెరుగుతాయి. అలానే రోజూ ఒకేలా కాకుండా రకరకాల భంగి మల్లో సెక్స్ చేయడానికి ట్రై చేయండి. ముందు ఈ విషయం గురించి మీవారితో మనసువిప్పి మాట్లాడండి. ఒకరినొకరు అర్థం చేసుకుని సహకరించుకుంటూ సంతోషంగా ఉండండి.
 
నేను బీఎస్సీ రెండో సంవత్సరం చదువు తున్నాను. నా సీనియర్‌ని ప్రేమించాను. కొద్దిరోజుల క్రితం అనుకోకుండా తనకి శారీరకంగా దగ్గరయ్యాను. ఈ నెల పీరియడ్స్ రాలేదు. పరీక్ష చేయిస్తే గర్భవతినని తేలింది. నాకు చాలా భయంగా ఉంది. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అబార్షన్ చేయించుకుందామంటే డబ్బులకు ఇబ్బంది. నువ్వులు తిన్నా, బొప్పాయి తిన్నా అబార్షన్ అయిపోతుందని నా ఫ్రెండ్ చెప్పింది. అది నిజమేనా? అవి తింటే నా సమస్య తీరిపోతుందా?
 - మానస, రాజమండ్రి

 
తప్పు చేసి ఇప్పుడు భయపడితే ఏమి లాభం? నువ్వులు, బొప్పాయి తినడం వల్ల అబార్షన్ కాదు. నువ్వులు, ఇంకా పండిన బొప్పాయిలో విటమిన్స్, ఐరన్, కాల్షియం వంటి పోషక పదార్థాలు ఎన్నో ఉంటాయి. వాటిని మితంగా తినడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. వీటిని తింటూ కాలం వృథా చేసుకోవద్దు. రోజులు పెరిగేకొద్దీ లోపల బిడ్డ పెరిగిపోతూ ఉంటుంది. మొదట్లో, అంటే రెండు నెలల లోపలే అయితే 98 శాతం మందుల ద్వారా అబార్షన్ అయిపోతుంది. ఆలస్యం అయ్యేకొద్దీ ఆ అవకాశాలు తగ్గుతాయి. తర్వాత డీ అండ్ సీ ద్వారా గర్భాశయాన్ని శుభ్రపర్చాల్సి వస్తుంది. దీనికి ఖర్చు కూడా ఎక్కువ. పైగా ఇన్ఫెక్షన్ల వంటి ఇతర సమస్యలు ఏర్పడి తర్వాతి కాలంలో గర్భం ధరించడానికి ఇబ్బంది కావొచ్చు. కాబట్టి కనీసం ప్రభుత్వాసుపత్రికైనా త్వరగా వెళ్లి డాక్టర్‌ని సంప్రదించండి.
 
నా వయసు 29. పెళ్లై ఏడేళ్లు అయ్యింది. ఇద్దరు పిల్లలు. రెండు నెలలుగా కలయిక సమయంలో నాకు యోని బాగా నొప్పి పుడుతోంది. చర్మం కూడా కట్ అవుతోంది. మావారికి కూడా అలానే అవుతోంది. పైగా ఆయన అంగం పైన చర్మం పొరలుగా ఊడుతోంది. ఇలా ఎందుకు అవుతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?
 - ఓ సోదరి

 
కలయికలో నొప్పి వస్తోంది, చర్మం కట్ అవుతోంది అంటున్నారు. మీవారికి కూడా అలాగే అవుతోంది కాబట్టి ఇద్దరికీ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. కొన్నిసార్లు దంపతులిద్దరిలో ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, కలయిక ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు గైనకాలజిస్టును, మీవారు డెర్మటాలజిస్టును కలిసి సమస్య వివరిం చండి. తగిన చికిత్స తీసుకోండి. చికిత్స పూర్తయ్యేవరకూ దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకుండా కలిస్తే, ఇన్ఫెక్షన్ తిరగబెట్టే ప్రమాదం ఉంది. అలాగే తగ్గిన తర్వాత కూడా ఒక వారం పాటు కండోమ్ వాడటం మంచిది.                        
 
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement