సముద్రం ఎందుకు ఇలా నీలంగా ఉంటుంది? రంగులేని నీరు సముద్రంలోనే నీలంగా ఎందుకుంది?ఓడ పైభాగంలో నిలబడి మెడిటరేనియన్ సముద్రాన్ని చూస్తుంటే హఠాత్తుగా ఆయనకా సందేహం వచ్చింది.గొప్ప భౌతికశాస్త్రవేత్త కాబట్టి అంత పెద్ద అద్భుతం వెనుక ఉన్న రహస్యమేదో మెదడుకు చేరువవుతున్నట్టనిపించింది కూడా. నీలాకాశాన్ని ప్రతిబింబించడం వల్లనా, ఆ నీలం?ఇదే నిజమైతే వెలుగు లేని క్షణాలలో ఈ అద్భుత జలరాశి నీలం రంగులో కాకుండా ఇంకెలా కనిపిస్తుంది? కెరటాలు వెళ్లి ఒడ్డును తాకి పతనమయ్యే వరకు కూడా నీలంగా ఉంటాయి కదా!అప్పుడే సమాధానానికి చాలా సమీపంగా కూడా వచ్చారాయన. సూర్యకిరణాలు జల కణాల మీద వికిరణం చెందడం వల్లనే ఆ జలనిధిని నీలి వర్ణం కమ్ముకుందా?!బ్రిటిష్ సామ్రాజ్యంలోని విశ్వవిద్యాలయాల సమావేశం 1921లో లండన్‌లో జరిగింది. ఆ సమావేశానికి కలకత్తా విశ్వవిద్యాలయం తరఫున చంద్రశేఖర్ వెంకట రామన్ హాజరయ్యారు. తిరిగి వస్తుంటే ఆ మహా భౌతికశాస్త్రవేత్తకు కలిగిన ఆలోచన లివి. అప్పటికే ఈ అంశం భౌతిక శాస్త్రంలో బీజమాత్రంగా ఉంది. కలకత్తా చేరుకున్న వెంటనే పరిశోధన ప్రారంభించారాయన. ఈ పరిశోధనే ఆయనను 1930 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతికి అర్హుడిని చేసింది. మన కంటికి కనిపిస్తున్న ఈ వెలుగు చేసే ఒక అద్భుతాన్ని, ఒక విన్యాసాన్ని సీవీ రామన్ (నవంబర్ 7, 1888–నవంబర్ 21, 1970) లోకానికి బహిర్గతం చేశారు. ధ్వని తరంగాల రహస్యాన్ని కూడా ఆయన ఛేదించారు. వెలుగు వెనుక రహస్యాన్ని ఛేదించినందుకే ఆయనను నైట్‌హుడ్ కూడా వరించింది. అలా సర్ సీవీ రామన్ అయ్యారు.
ఆసియాలో నోబెల్ కమిటీ నుంచి విజ్ఞాన శాస్త్రాలలో తొలి పురస్కారం అందుకున్న ఘనత సర్ సీవీ రామన్‌కే దక్కుతుంది. కానీ చిత్రమేమిటంటే, 1913లో సాహిత్య నోబెల్ అందుకున్న రవీంద్రనాథ్ టాగోర్‌కు వచ్చినంత గౌరవం, ప్రాచుర్యం తరువాత నోబెల్ అందుకున్నవారికి రాకపోవడం ఒకింత ఆశ్చర్యం. మరింత విషాదం. జీవితంలో కొద్దిగా చిరుచీకట్లు ఉన్నా, భౌతికశాస్త్రం వైపు, అక్కడ నుంచి వెలుతురు పరిశోధన వైపు ఆయన సాగించిన ప్రయాణం స్ఫూరిదాయకంగానే ఉంటుంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి గ్రామంలో ఒక పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర అయ్యర్. కావేరి ఒడ్డున ఉంది ఆ గ్రామం. అయ్యర్ భౌతికశాస్త్రం, గణితశాస్త్రాలలో అందె వేసిన చేయి. ఆయన భార్య పార్వతి అమ్మాళ్. పెళ్లయిన తరువాత భర్త దగ్గరే కొంచెం చదువుకుంది. అంతో ఇంతో సంగీతం వచ్చు. వీరి రెండో సంతానమే వెంకటరామన్. పెద్ద కుటుంబం. ఉద్యోగం చూస్తే బడిపంతులు. కొంచెం కష్టాలలోనే ఆ దశ జీవనం సాగింది. అలాంటి సమయంలోనే విశాఖపట్నంలో అయ్యర్‌కి భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. దానితో కుటుంబం విశాఖపట్నం చేరుకుంది. అప్పటి నుంచి కుటుంబానికి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం వచ్చింది. వంశ పారపర్యంగా వచ్చిన సంస్కృత సాహిత్యం, సంగీతం, తండ్రి నుంచి కొత్తగా లభించిన విజ్ఞానశాస్త్రం మధ్య రామన్ బాల్యం వైవిధ్యంగా గడిచింది.
వెంకటరామన్ విశాఖపట్నంలోనే సెయింట్ ఎలోయిసిస్ ఆంగ్లో ఇండియన్ హైస్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ సమయంలోనే తండ్రి తెచ్చుకున్న భౌతికశాస్త్ర గ్రంథాలను రామన్ చదువుకునేవారు. తండ్రి పనిచేస్తున్న కళాశాల గ్రంథాలయం నుంచి పుస్తకాలు తెచ్చుకుని కూడా చదివేవారు. చిన్నతనం నుంచి విజ్ఞానశాస్త్రమంటే ఎంతో అభిమానం. పదకొండవ ఏటనే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 13 ఏటనే ఎఫ్‌ఏ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. తరువాత తండ్రి వెంకటరామన్‌ను మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో బీఏ (ఫిజిక్స్)లో చేర్పించారు. అప్పుడే ఓ ఘటన జరిగింది. ఇలియెట్ అనే అధ్యాపకుడు తరగతికి వచ్చి వెంకటరామన్‌ను చూశారు. ‘నువ్వు బీఏ విద్యార్థివేనా?’ అనడిగారాయన, ఎంతో అనుమానంగా.‘అవున్సార్!’ చెప్పారు వెంకటరామన్.‘నీ పేరు?’ ‘సీవీ రామన్’ నిజమే, అలాంటి అబ్బాయి బీఏ తరగతి గదిలో కనిపిస్తే ఆ అధ్యాపకుడికే కాదు, ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అప్పటికి రామన్ వయసు 14 ఏళ్లు. బీఏలో సాధించిన బంగారు పతకం, ఎంఏ (ఫిజిక్స్)లోచేరడానికి బంగారు బాటనే పరిచింది. పదార్థ విజ్ఞానం, ఎనర్జీ ఐచ్ఛికాంశాలుగా ఎంచుకున్నారు. అప్పటికే ఆయన జర్మనీ శాస్త్రవేత్త హెల్మ్‌హోజ్, బ్రిటిష్ శాస్త్రవేత్త లార్డ్ ల్యారీ పరిశోధనల పట్ల అభిమానాన్ని, ఆసక్తిని పెంచుకున్నారు. ఎమ్మేలో ఉండగానే లోకసుందరి అమ్మాళ్‌ను వివాహం చేసుకున్నారు.
ఎమ్మే అయిన తరువాత ఆయన ఆసక్తికి అవరోధం ఏర్పడింది. అప్పటికే రామన్ అన్నగారు సీఎస్ అయ్యర్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ఉత్తీర్ణుడయ్యారు. పెద్ద జీతం. హోదా. అందుకే అన్నగారితో పాటు, తండ్రి కూడా ఆ పోటీ పరీక్ష రాయమని సలహా ఇచ్చారు. రామన్ ఆ పరీక్షలో కూడా ఉత్తీర్ణులయ్యారు. భారత ఆర్థిక శాఖలో అసిస్టెంట్ అకౌంటెట్ జనరల్‌గా నియమితులయ్యారు. కలకత్తాలో ఉద్యోగం. కానీ దృష్టంతా భౌతికశాస్త్రం మీదనే ఉండేది.ఒక సాయంకాలం ఆఫీసు పని ముగించుకుని ట్రామ్‌కార్ మీద ఇంటికి వెళుతున్న రామన్‌కు 210, బౌ బజార్ వీధి దగ్గర ఒక బోర్డు కనిపించింది. అక్కడికక్కడే ఆయన ట్రామ్ దిగిపోయారు. ఇండియన్ అసోషియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్ కార్యాలయం అక్కడే ఉన్నట్టు చెప్పే బోర్డు అది. కార్యాలయంలోకి వెళ్లి సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృత్‌లాల్ సర్కార్‌ను కలుసుకున్నారు. తన గురించి చెప్పుకున్నారు. డాక్టర్ సర్కార్ కూడా పగలు సహాయ అకౌటెంట్ జనరల్‌గా ఉంటున్నా, ఖాళీ సమయాలలో ఆ సైన్స్ ప్రయోగశాలలో పార్ట్‌టైమ్ శాస్త్రవేత్తగా పరిశోధనలు చేయడానికి ఆనందంగా అంగీకరించారు. ఇలా పదేళ్లు అటు ఇటు కూడా రామన్ పనిచేశారు. నిజం చెప్పాలంటే ట్రామ్‌కార్ దిగిన రామన్‌కు తాను ఎక్కవలసిన రైలు ఎదురొచ్చిందని చెప్పాలి.ఖాళీ సమయాలలో అని రామన్ చెప్పినప్పటికీ, అకౌంట్స్ కార్యాలయం నుంచి వచ్చాక గంటల తరబడి, ఎన్నో రాత్రులు ఆ ప్రయోగశాలలో పరిశోధనలు చేసేవారు. చాలా రాత్రులు అలసిపోయి, అక్కడే ఏదో టేబుల్ మీద నిద్రపోయేవారు. కొన్నిసార్లు నిరాహారంగా కూడా గడిపేవారు. ‘నేచర్’, ‘ది ఫిలసాఫికల్ మేగ్జయిన్’, ‘ఫిజిక్స్ రివ్యూ’ వంటి అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర పత్రికలలో రామన్ వ్యాసాలు ప్రచురించారు. ఒక శాస్త్రవేత్తకు సృష్టంతా పరిశోధన మయంగానే కనిపిస్తుంది కాబోలు. ఆయన చిన్నతనంలో సంగీతం బాగా విన్నారు. తంత్రీవాద్యాల నుంచి, చర్మ వాద్యాల నుంచి వెలువడే ధ్వనులలోని సంక్లిష్టతను గురించి కూడా అధ్యయనం చేశారు. అప్పటికే ప్రపంచంలో ఎంతో ఖ్యాతి పొందిన ఎకోస్టిక్స్ శాస్త్రంలో ఇదొక భాగం.
అదే సమయంలో బర్మాకు బదలీ అయింది. తండ్రి పోయినట్టు వార్త కూడా వచ్చింది. ఆరుమాసాలు సెలవు పెట్టి ఇంటికి వెళ్లారు. ఆ కార్యక్రమాలు అయిపోయిన తరువాత ఆయన మద్రాసులోనే మళ్లీ సైన్స్ ప్రయోగాల కోసం మిగిలిన సమయం కేటాయించారు. 1913లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాటయింది. పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను సమావేశ పరిచి చర్చలు, సంప్రదింపులకు అవకాశం కల్పించడం ఈ సంస్థ ఉద్దేశం. దీనికి అధ్యక్షుడు నాటి కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ అశుతోష్ ముఖర్జీ. భౌతికశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు సీవీ రామన్. 1914లో కాంగ్రెస్ తొలి సమావేశం జరిగింది. మొత్తానికి 1915లో రామన్ పూర్తిస్థాయి పరిశోధకునిగా స్థిర పడడానికి అవకాశం వచ్చింది. అప్పుడే కలకత్తా విశ్వవిద్యాలయంలో సైన్స్ కాలేజ్‌ను స్థాపించారు. అందులో తారకానాథ్ పాలిత్ పేరుతో ఒక విజ్ఞానశాస్త్ర పీఠం ఏర్పాటు చేశారు. ఆ పీఠానికి అధిపతిగా రామన్‌కు అవకాశం ఇచ్చారు. కానీ సహాయ అకౌటెంట్ జనరల్ కంటే జీతం ఎంతో తక్కువ. హోదా అనే ప్రశ్నే లేదు. అయినా ప్రొఫెసర్ ఉద్యోగాన్నీ, పరిశోధనలనీ ఆయన ఎంచుకున్నారు. కానీ ఒక గొప్ప ఇంకొక వెసులుబాటు మాత్రం కల్పించారు. ఉద్యోగం ఆచార్యుడే అయినా పరిశోధనలకు పరిమితం కావచ్చు. బోధన నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. మెడిటరేనియన్ సముద్రం మీద నుంచి గమనించిన వెలుగుల రహస్యం గురించి పరిశోధించిన రామన్, ఆ అంశాలను గురించి 1928లో నేచర్ పత్రికలో ప్రచురించారు. ఆయన ఎమ్మే చదువుతున్న కాలంలోనేప్రొఫెసర్లు ఇంగ్లండ్ వెళ్లి పరిశోధన చేయవలసిందని సూచించారు. కానీ ఆయన వెళ్లలేదు. మద్రాస్ సివిల్ సర్జన్ ఒక సందర్భంలో రామన్‌ను దేశం విడిచి వెళ్లవద్దని సలహా ఇచ్చారు. అక్కడి వాతావరణం నీకు పడదని కూడా చెప్పారు. ఇందుకు గట్టి ఉదాహరణ కూడా ఉంది. సీవీ రామన్ కంటే ఒక సంవత్సరం పెద్దవాడైన గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిన్న వయసులోనే మరణించడానికి కారణం– ఇంగ్లండ్ వాతావరణానికి తట్టుకోలేకే. అలా భారతదేశంలోనే ఉండి అంతటి పురస్కారానికి అవసరమైన పరిశోధనలు చేశారాయన. అంటే గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయాలంటే ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు. అవకాశం ఉంటే వెళ్లడానికి అభ్యంతరం ఉండనక్కరలేదు. కానీ వెళ్లలేకపోయినంత మాత్రాన అవకాశాలు రాకుండా ఉండవని రామన్ జీవితం చెబుతోంది. ఆయనకు నోబెల్ పురస్కారాన్ని తెచ్చి పెట్టిన ‘రామన్ ఎఫెక్ట్’ (నీలి వర్ణం పరిశోధన)ను నిరూపించడానికి ఆయన ఉపయోగించిన పరికరాల ఖరీదు మూడు వందల రూపాయలు మాత్రమే. అవన్నీ ఒక డ్రాయిర్ సొరుగులో ఇమిడిపోతాయి. గొప్ప జీవితం గడిపిన రామన్ తన 82వ ఏట బెంగళూరులో తుది శ్వాస విడిచారు.
- డా. గోపరాజు నారాయణరావు
నోబెల్ ప్రాంగణంలో వెలుగు
Published Sun, Dec 17 2017 12:22 AM | Last Updated on Sun, Dec 17 2017 12:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment