ఆహారదాతకు ‘నోబెల్‌ శాంతి’ | UN WFP Won Nobel Prize | Sakshi
Sakshi News home page

ఆహారదాతకు ‘నోబెల్‌ శాంతి’

Published Sat, Oct 10 2020 12:47 AM | Last Updated on Sat, Oct 10 2020 12:47 AM

UN WFP Won Nobel Prize - Sakshi

కాలానుగుణంగా వచ్చే ప్రాణాంతక వైరస్‌లో, ధూర్త రాజ్యాల కారణంగా వచ్చే ప్రపంచ యుద్ధాలో కాదు... ప్రపంచ మానవాళిని అన్నివేళలా వెంటాడుతూ అత్యధిక శాతంమందిని బలితీసుకుంటు న్నది ఆకలి మహమ్మారే. కాస్త ముందో వెనకో వైరస్‌లను అరికట్టేందుకు ఔషధాలొస్తున్నాయి. కానీ ఆకలి చిరంజీవి. అదెప్పుడూ మానవాళిని వెంటాడుతూనే వుంటుంది. ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కార విజేతగా ఎంపికైన ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) సంస్థ ఆ రంగంలో 59 ఏళ్లుగా విశేషకృషి చేస్తోంది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థగా నిరుడు 88 దేశాల్లో దాదాపు పదికోట్ల మందిని ఆదుకుంది. 42 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహారాన్ని, 120 కోట్ల డాలర్ల నగదును, వోచర్లను అందజేసింది. ఆవిర్భవించిన ఏడాదికే... అంటే 1962లో ఇరాన్‌లో భూకంపం సంభవించినప్పుడు రంగంలోకి దూకి ఆపన్నహస్తం అందించింది. ఆకలి, అలజడి– ఈ రెండూ పరస్పర ప్రభావితాలు. ఆకలితో అలమటించే సమాజంలో అరాచకం ప్రబలుతుంది. అలజడి రేగుతుంది.

దాన్ని సకాలంలో గుర్తించి సరైన చర్యలు తీసుకోనట్టయితే అది సాయుధ ఘర్షణలకో, యుద్ధానికో కారణమవుతుంది. అలాగే సంక్షుభిత సమాజంలోనైనా, సాయుధ ఘర్షణలు జరిగే ప్రాంతాల్లోనైనా ఆహార పదార్థాల కొరత, దాని పంపిణీకి అవరోధాలు ఏర్పడి ఆకలికి దారితీస్తుంది. యెమెన్‌లాంటిచోట అయితే తమకు లొంగిరాని ప్రాంతాన్ని దిగ్బంధించి, దానికి ఆహారపదార్థాల పంపిణీ జరక్కుండా చూసే సాయుధ ముఠాలు వుంటాయి. అలాంటిచోట వేలాదిమంది ఆకలితో అలమటించి మరణిస్తారు. తగిన పోషకాహారం లోపించి వ్యాధులబారిన పడి చనిపోతారు. నోబెల్‌ కమిటీ చెప్పినట్టు అలాం టిచోట ఆహార పంపిణీ నిస్సందేహంగా శాంతి సాధనకు తోడ్పడుతుంది. భూగోళంలో ఎక్కడో మారుమూల ఏదో జరిగితే మనకేమిటన్న నిర్లిప్తత క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌పీ వంటి సంస్థలు చేస్తున్న కృషి అందరికీ తెలియాల్సివుంది.

నోబెల్‌ సీజన్‌లో ఇతర బహుమతుల కన్నా నోబెల్‌ శాంతి బహుమతిపై అందరిలో ఆసక్తి వుంటుంది. మిగిలినవన్నీ సామాన్యులకు కొరుకుడు పడని శాస్త్ర సాంకేతిక అంశాలకు సంబం ధించినవి కావడం అందుకు కారణం. కనుకనే శాంతి బహుమతి విషయంలో మాత్రమే రకరకాల అంచనాలు వస్తాయి. అందరి అంచనాలకూ భిన్నంగా నిర్ణయించినప్పుడు దానిపై విమర్శలు కూడా వెల్లువెత్తుతాయి. ఫలానా వ్యక్తుల్ని, సంస్థల్ని ఎందుకు వదిలిపెట్టారన్న ప్రశ్నలు తలెత్తుతాయి. ఈసారి అందరూ కరోనా వైరస్‌ మహమ్మారిపై ప్రపంచ దేశాలను సమన్వయపరచుకుని పోరాడిన ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ పురస్కారం వస్తుందన్నారు. పర్యావరణ అంశాల్లో పోరాడుతున్న యువతి గ్రేటా థన్‌బర్గ్‌కు వస్తుందని మరికొందరు జోస్యం చెప్పారు. అయితే ‘అంతర్జాతీయ సంఘీ భావం, సహకారం వంటివి మునుపెన్నడూ లేనంతగా అవసరమైన వర్తమాన తరుణంలో...’ డబ్ల్యూఎఫ్‌పీకి శాంతి పురస్కారాన్ని అందజేయాలని నోబెల్‌ కమిటీ భావించింది. అమెరికా అధ్య క్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకొచ్చినప్పటినుంచి అంతర్జాతీయ సహకారాన్ని కొట్టిపారేస్తు న్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేశారు. ఆ సంస్థ నుంచి తప్పుకుంటామని ప్రకటిం చారు. కనుక డబ్ల్యూఎఫ్‌పీకి బహుమతి ఇవ్వడం దేనికి సంకేతమో, ఎవరికి సందేశమో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలకు దేశాలు క్రమేపీ నిధులు అందజేయ డాన్ని తగ్గించుకుంటున్నాయని, ఈ బహుమతి అలాంటి దేశాల్లో పునరాలోచన కలగజేస్తుందని ఆశిస్తున్నామని కమిటీ చెబుతోంది. శాంతి పురస్కారం వివాదాస్పదం అయిన సందర్భాలు లేకపోలేదు. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు, 2012లో యూరప్‌ యూనియన్‌(ఈయూ)కు వచ్చినప్పుడు అందరూ నిర్ఘాంతపోయారు. ఒబామా అప్పటికే ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లలోని పౌరప్రాంతాల్లో ద్రోన్‌ దాడులకు ఆదేశాలిచ్చారు. పర్యవసానంగా అనేకమంది సాధారణ పౌరులు మరణించారు. ఒబామాకు బహు మతి ఎందుకిస్తున్నామన్న అంశంలో నోబెల్‌ కమిటీకే స్పష్టత లేదు. తననే ఎందుకు ఎంపిక చేశారో ఒబామాకు తెలియదు. ‘అంతర్జాతీయ దౌత్యానికి, ప్రజల మధ్య సహ కారానికి విశేష కృషి చేసినం దుకు’ ఇస్తున్నామని అప్పట్లో కమిటీ ప్రకటించింది.

అధ్యక్ష పదవికొచ్చి ఏడాది కాకుండానే అంతర్జా తీయంగా ఆయన చేసిన విశేషకృషి ఏమిటన్నది ఎవరికీ అర్థంకాలేదు. ఆ సమయంలో నోబెల్‌ శాంతి బహుమతి కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గెయిర్‌ లుండెస్టాడ్‌ రిటైర్మెంట్‌ తర్వాత 2015లో ఒక పుస్తకం వెలువరిస్తూ ఒబామా ఎంపిక తప్పిదమేనని అంగీకరించారు. ఆ పురస్కారం ఆయన్ను మరింత బలోపేతం చేస్తుందని అప్పట్లో కమిటీ భావించిందని ఆయన రాశారు. కానీ ఒబామా మద్దతుదార్లు సైతం ఆ ఎంపిక సరికాదన్నారట. చిత్రమేమంటే... 2016లో అధ్యక్ష పదవినుంచి నిష్క్రమించినప్పుడు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఒబామా కూడా ఆ పురస్కారం ఎందుకిచ్చారో తనకు తెలియదని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఎప్పటిలాగే ఈసారీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు రావొచ్చని కొందరు అంచనా వేశారు. కానీ నోబెల్‌ కమిటీ దృష్టిలో ఆయన లేనేలేరు.

ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభ 2015లో ఖరారు చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2030 నాటికి ఆకలిని అంతం చేయడం కూడా ఒకటి. ఈ లక్ష్య సాధన సాధ్యం కావాలన్నా కరోనా అనంతర పరిస్థితుల్లో ఏర్పడ్డ పెను సంక్షోభాన్ని అధిగమించాలన్నా డబ్ల్యూఎఫ్‌పీ కన్నా మెరుగైన సంస్థ మరేదీ లేదు. ఆహా రాన్ని ఉత్పత్తి చేయడం అసాధ్యమైన... అవరోధాలు ఎదుర్కొంటున్న ప్రాంతాలన్నిటా ఆ సంస్థ తన కార్యకర్తల ద్వారా ప్రజానీకానికి అన్నదాతగా నిలుస్తోంది. అటు ఆహార పంపిణీ  కార్యకలాపాలను, ఇటు శాంతి స్థాపన కృషిని మిళితం చేస్తూ పనిచేయడం ద్వారా డబ్ల్యూఎఫ్‌పీ తానేంటో ఇప్పటికే నిరూపించుకుంది. నోబెల్‌ శాంతి పురస్కారం దాని అవిరళ సేవలకు మణిహారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement