ఆహార వృథాను అరికడదాం | Food waste Prevention | Sakshi
Sakshi News home page

ఆహార వృథాను అరికడదాం

Published Sat, Oct 15 2016 11:46 PM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM

ఆహార వృథాను అరికడదాం - Sakshi

ఆహార వృథాను అరికడదాం

 భూమి అమితంగా వేడెక్కుతోంది. మంచు పర్వతాలు కరుగుతున్నాయి. సముద్రాల నీటి మట్టం పెరుగుతోంది. కరువు, పెనుతుపానులు, వరదలు సాధారణమే అన్నంత తరచుగా వస్తున్నాయి. ఈ ఉపద్రవాల వల్ల రెండు ముఖ్య పర్యవసానాలు తలెత్తుతున్నాయి:

 1. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజల జీవితాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. వీరిలో చాలామంది బక్కరైతులే. ఆహారోత్పత్తికి వీరు మరింతగా తిప్పలు పడాల్సి వస్తోంది. 2. మరో 14 ఏళ్ల నాటికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సరిపోయేలా ఆహారం అందించాలన్న లక్ష్యం దెబ్బతింటున్నది.
 
 ఆహార వృథాను మనం అరికట్టగలం
 ఎలాగంటే.. ఆహారం వృథాను తగ్గించేందుకు ప్రయత్నించాలి. అడవులను, నీరు, మట్టి వంటి ప్రకృతి వనరులను పరిరక్షించుకోవాలి. తక్కువ ఇంధనం లేదా తక్కువ కాలుష్యం వదిలే ఇంధనాలు వాడాలి. ఇటువంటి ఇతర పనులు చేయాలి. ఇంతకీ మీరేం చేయగలరు? రోజువారీ అలవాట్లు కొన్నిటిని మార్చుకోవడం, కొన్ని చిన్న నిర్ణయాలు తీసుకుంటే చాలు - వాతావరణ మార్పులను తట్టుకునేందుకు మీరు చేయగలిగింది మీరు చేసినట్టే.
 
 ప్రకృతి వనరులను పరిరక్షించుకుందాం..
 భూమి, నీరు, పశువులు, మొక్కలు.. ఇవన్నీ ధరిత్రి మనకందిస్తున్న వనరులే. నీరు, నేల లేకుండా మనం పంటలు పండించలేం. మట్టిని సారవంతంగా మార్చే ఖనిజాలు కొరవడి, నీరు కలుషితమైపోతే పోషకాలతో కూడిన ఆహారాన్ని పండించుకోవడం కష్టమౌతుంది. మనందరికీ తగినంత పోషకాహారాన్ని పండించుకోవాలంటే ప్రకృతి వనరులను కంటికిరెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది.. అదెలాగంటే..
 
 నీటిని వృథా చేయకూడదు..
 సుదీర్ఘ స్నానానికి బదులు.. కొద్దిసేపట్లో స్నానం ముగించాలి. 5-10 నిమిషాల షవర్ స్నానంతో పోల్చితే బాత్ టబ్ స్నానం వల్ల నీరు ఎక్కువగా వృథా అవుతుంది. పళ్లు తోముకున్నంత సేపూ కుళాయి తిప్పి ఉంచితే కనీసం 6 లీటర్ల నీరు ఖర్చవుతుంది. తోముకున్న తర్వాత నీటిని ఉపయోగిస్తే లీటరుతో సరిపోతుంది. మీ ఇంట్లో ఏదైనా కుళాయి నుంచి నీరు చుక్కలుగా లీకవుతూ ఉంటే వెంటనే ఇంట్లో పెద్ద వారికి చెప్పండి. లీకయ్యే ట్యాప్ ద్వారా ఏడాదికి 11 వేల లీటర్ల నీరు వృథాగా పోతుంది తెలుసా? వర్షపు నీటిని పట్టి ఉంచుకొని లేదా వంట పాత్రలు, చేతులు చేతులు కడుక్కున్న నీటిని మీ పెరట్లో మొక్కలకు పోస్తే నీటి ఖర్చు తగ్గుతుంది కదూ...
 
 శాకాహారం మిన్న..
 ప్రతి భోజనంలోనూ మాంసాహారం భుజించడం కన్నా. మాంసాహారం తగ్గించి.. పప్పులు వంటి శాకాహారం తీసుకుంటే మంచిది. ఇది అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం. పప్పులతో కొత్త వంటకాలు ఏమేమి చేయొచ్చో ప్రయత్నిస్తే మంచిది. మాంసం కోసం పెంచే పశువుల పోషణ నిమిత్తం విస్తారమైన అడవులు నరికి పచ్చి మేత వేసి పెంచుతున్నారు. కాబట్టి, మాంసాహారం తగ్గిస్తే మంచిది.
 
 చేపలు తరిగిపోకుండా చూడాలి..
 సముద్ర జలాల్లో పెరిగే టూనా, కాడ్ వంటి జాతి చేపల మీద మక్కువతో వాటి సంతతి అంతరించిపోయేలా సముద్రాన్ని జల్లెడ పట్టే బదులు.. మన దగ్గర్లో దొరికే ఇతరత్రా జాతుల చేపలను తినడం మంచిది.
 
 విద్యుత్ ఆదా మేలు..
 పిల్లలూ.. విద్యుత్‌ను పొదుపుగా వాడే గృహోపకరణాలు కొనాల్సిందిగా మీరు పెద్దలకు సూచించండి. గదిలో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆ గదిలో లైట్లు, ఫ్యాన్లను ఆపేయండి. టీవీ, స్టీరియో లేదా కంప్యూటర్లను స్టాండ్‌బైలో ఉంచకుండా పూర్తిగా ఆపేయండి.
 
 ఇంటిపంటలు పండించండి..
 సేంద్రియ సేద్యం వల్ల మట్టి ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని.. మీ ప్రాంతంలో రైతు మార్కెట్లలో లేదా స్థానిక సూపర్ మార్కెట్లలో సేంద్రియ ఆహారోత్పత్తులను గుర్తించి కొనుగోలు చేయడంలో మీ తల్లిదండ్రులకు తోడ్పడండి. మేడపైన, బాల్కనీల్లో ఉన్నంతలో వీలైనన్ని కుండీలు/మడుల్లో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేద్దామని మీ తల్లిదండ్రులను అడగండి..
 
 నేలను, నీటిని రసాయనాలతో పాడుచేయకండి..
 ఇంట్లో గచ్చును శుభ్రం చేయడానికి వాడే క్లీనర్లు, పెయింట్ తదితర ఉత్పత్తులు కొనేటప్పుడు.. ఘాటైన రసాయనాలు కానీ, బ్లీచింగ్ కానీ కలవని వాటిని ఎంపిక చేసుకోమని మీ తల్లిదండ్రులను కోరండి. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులను వాడటం ద్వారా నీటిని, నేలను పాడు చేయకుండా చూడగలుగుతాం..
 
 సోలార్ ప్యానల్స్...
 సౌరశక్తిని వినియోగిస్తే వాతావరణ మార్పులను తగ్గించవచ్చు. సోలార్ ప్యానల్స్, ఇతర వాతావరణ అనుకూల ఇంధన వ్యవస్థల వినియోగానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలేమైనా ఉన్నాయేమో శోధించమని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అడగండి.
 
 ఆహార ఉద్గారాలను తగ్గించండి...
 కార్లు, విమానాలు, విద్యుత్ వాహనాలపై మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు కార్బన్ డయాక్సయిడ్ వంటి కర్బన ఉద్గారాలు (కార్బన్ ఎమిషన్స్) విడుదలై వాతావరణాన్ని అమితంగా వేడెక్కిస్తూ.. వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. ఈ ఉద్గారాలను ‘కార్బన్ ఫుట్ ప్రింట్’గా లెక్కిస్తున్నాం. అదేవిధంగా.. మన ఆహారాన్ని బట్టి ‘ఫుడ్ ప్రింట్’ (ఆహార సంబంధమైన కర్బన ఉద్గారాల ముద్ర)ను లెక్కిస్తున్నారు. మనం వాడే కారు పొగ వదులుతూ ఉంటుంది కాబట్టి.. దాని ఉద్గారాల గురించి మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. అయితే, మనం తినే ఆహారానికి సంబంధించిన ఉద్గారాలు నేరుగా కంటికి కనిపించవు. మన పళ్లెంలోకి వచ్చే ముందు ఈ ఆహారాన్ని ఎక్కడ పండించారు? ఎంత దూరం నుంచి తరలించి, ఎంతకాలం నిల్వ చేశారు? అందుకు ఎంత ఇంధనం ఖర్చయింది? అన్న దాన్ని బట్టి దాని ‘ఫుడ్ ప్రింట్’ ఆధారపడి ఉంటుంది. ఆహార ఉద్గారాలను తగ్గించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేమిటంటే...
 మీకు అవసరమైనంత మాత్రమే కొనండి..
 
 పిల్లలూ.. వీక్లీ షాపింగ్ లిస్ట్‌ను తయారు చేయడం ద్వారా మీ తల్లిదండ్రులకు తోడ్పడండి. ఎంత సరిపోతుందనుకుంటారో అంతే కొనండి. దానితో సరిపెట్టండి! అలా చేస్తే ఆహారమే కాదు, డబ్బు కూడా వృథా కాకుండా ఉంటుంది.
 
 లేబుల్స్ చూసి మోసపోకండి..
 ‘బెస్ట్ బిఫోర్’.. ‘యూజ్ బై’ అని ఆహారోత్పత్తుల ప్యాకింగ్ పై రాసి ఉంటుంది. వీటి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి. ‘బెస్ట్ బిఫోర్’ డేట్ దాటిన తర్వాత కూడా ఆ ఆహారం కొన్నిసార్లు పనికొస్తుంది.  అయితే, ‘యూజ్ బై’ డేట్ దాటితే మాత్రం తినడం మంచిది కాదు.
 
 ప్లాస్టిక్ వాడకం తగ్గించండి..
 ప్లాస్టిక్ ప్యాకెట్లలో ఉండే ఆహారాన్ని తక్కువగా కొనడం, కొనడానికి వెళ్లేటప్పుడు సొంత బ్యాగ్‌లను తీసుకెళ్లడం, తిరిగి వాడదగిన వాటర్ బాటిల్స్ ఉపయోగించడం, వాడి పారేసే ప్లాస్టిక్ కప్పుల వాడకం తగ్గించడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో మీ తల్లిదండ్రులకు తోడ్పడండి.
 
 పునర్వినియోగం
 వాడిన పేపర్, ప్లాస్టిక్, గ్లాస్, అల్యూమినియంను పారేయకుండా.. పునర్వినియోగించే ప్రయత్నం చేయండి. తద్వారా చెత్త కుప్పలు పెరిగిపోకుండా ఉంటాయి.  
 
 ఆహార నిల్వలో జాగ్రత్త..
 ఆహారోత్పత్తుల నిల్వలో తెలివిగా వ్యవహరించాలి. కప్‌బోర్డులు, ఫ్రిజ్‌లలో ఆహారోత్పత్తుల బాక్స్‌లను నిల్వ చేసేటప్పుడు కొత్త వాటిని వెనుక వైపు, పాత వాటిని ముందు వైపు ఉంచాలి. టిన్నులు, ప్యాకెట్లలో ఆహారాన్ని కొంత ఉపయోగించి, మిగతా దాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచేటప్పుడు ఎయిర్‌టైట్ కంటెయినర్లు వాడటం ద్వారా ఆహారం తాజాగా ఉండేలా చూడవచ్చు.
 
 మిగిలిన ఆహారాన్ని ఇష్టపడండి..
 పిల్లలూ.. మీ ఇంట్లో వండిన ఆహారం మిగిలిపోతే.. పారేయకండి! మిగిలిన ఆహారాన్ని ఫ్రీజర్‌లో ఉంచి, తర్వాత ఒక రోజు తీసి తింటే బాగుంటుందని మీ తల్లిదండ్రులకు సూచించండి. మీరు రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు తినగలిగిన దానికన్నా తక్కువగా కొనుగోలు చేయండి. ఫుల్ తినలేమనుకుంటే ఆఫ్ ఇవ్వమని అడగండి. తీసుకున్న ఆహారం మిగిలిపోతే.. ప్యాక్ చేయించి ఇంటికి తీసుకెళ్లండి. ఇలా చేస్తే.. ఆహారాన్ని మాత్రమే కాదు డబ్బునూ ఆదా చేసినట్టే కదూ..!
 
 కంపోస్టు చేయండి..
 ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఆహారం ఎంతో కొంత మిగిలిపోతుంది. అంతమాత్రాన చెత్తకుప్పలో వేయడం ఒక్కటే మార్గం అనుకోకూడదు. పండ్లు, కూరగాయల తొక్కలు, గుడ్ల పెంకులు చెత్తబుట్టలో వేయడం కన్నా.. కంపోస్టు బిన్‌లో వేసి సేంద్రియ ఎరువును తయారు చేసి పెరటి మొక్కలకు వాడవచ్చు.
 
 మన చేతుల్లోనే పర్యావరణ హితం!
 మన రోజువారీ జీవితంలో చేసే చిన్న చిన్న పనుల్లో కొద్దిపాటి మార్పులతో వాతావరణ పరిరక్షణకు మన వంతు సహాయ పడవచ్చు. వీటిలో కొన్ని పద్ధతులను మీరు ఇప్పటికే అనుసరిస్తుంటే సంతోషం.. లేకుంటే మాత్రం కొన్నిటినైనా పాటించేందుకు ప్రయత్నించి పర్యావరణ పరిరక్షణలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి.
 
 చెత్తబుట్ట దగ్గరకు వెళ్లే ముందు ఒక్కసారి..
 చెత్తబుట్ట ఉంది కదా అని దాన్ని నింపటానికి ప్రయత్నించకండి. బ్యాటరీలు, ఫోన్లు, రంగులు, మందులు, రసాయనాలు, టైర్లు వంటివి నీటి వనరులలో కలవటం వల్ల పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ప్రతి వస్తువును పనికిరానిదిగా భావించి చెత్తబుట్టలో వేసే పద్ధతికి స్వస్తి చెప్పి.. వస్తువుల వాడకాన్ని తగ్గించటం, అవకాశం ఉంటే పాత వాటినే మళ్లీ ఉపయోగించటంపై దృష్టి సారించాలి.
 
 నడక ముద్దు..
 దగ్గరలో ఉన్న ప్రదేశాలకు సైకిల్‌పై వెళ్లటం, వీలయితే తరుచూ ప్రజా రవాణా (బస్సులు/లోకల్ ట్రైన్ల)ను వాడటం ద్వారా పర్యావరణ హితానికి మనవంతు కృషి చేయవచ్చు.
 
 స్థానికంగా పండించిన వాటిని కొనండి..
 స్థానిక వ్యాపారాన్ని ప్రోత్సహించండి. దగ్గరలోని షాపుల్లో వస్తువులను కొనుగోలు చేయండి. స్థానికంగా పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయండి. దీనివల్ల వాహనాలు ప్రయాణం చేసే దూరం తగ్గి ఉద్గారాల విడుదల తగ్గుతుంది.
 
 పట్టణాలకు పచ్చదనం అద్దండి..
 పచ్చదనాన్ని జీవితంలోకి ఆహ్వానించండి. మీ పాఠశాలల్లో, పెరటి తోటలను పెంచండి. ఇంటిలోనే ఇంటి పంటలను సాగుచేయండి. ఇంటిపైన, బాల్కనీలో కూరగాయ మొక్కలను పెంచండి. ఒకవేళ మీ ఇంట్లో చోటు సరిపోదని భావిస్తే ఇరుగుపొరుగును కూడగట్టి ఖాళీ స్థలంలో సామూహిక సాగును చేపట్టండి.   
 
 అడవులకు మీ అరచేతులే రక్ష
 రోజువారి వ్యవహారాల్లో సాధ్యమైనంత తక్కువ పేపర్‌ను వాడండి. తప్పనిసరి అనిపిస్తేనే ప్రింట్ తీయండి.  ప్రింట్‌లో పేపర్ రెండువైపులా వాడండి.  చిత్రలేఖనం, చిత్తుప్రతికి పాఠశాల నుంచి సేకరించిన పేపర్‌ను వాడండి.  పేపర్ టవల్స్, మూత్రశాలలో వాడే పేపర్ ఉత్పత్తుల్లో పునర్వినియోగానికి వీలయిన వాటినే వాడండి. మన్నిక గల కలప లేదా పొరల చెక్క (ప్లైవుడ్)తో చేసిన గృహోపకరణాలను మాత్రమే కొనాలని మీ కుటుంబ సభ్యులకు సలహాలివ్వండి.
 
 తాజా పరిణామాలపై ఓ కన్నేయండి..
  ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎ వో) వారి వాతావరణ మార్పులకు సంబంధించిన వెబ్‌సైట్‌ను లేదా సామాజిక మాధ్యమాలను అనుసరించండి. స్థానిక వార్తావ్యవస్థను గమనికలో ఉంచుకోండి.
 
 సందేశాన్ని పంచండి.. స్ఫూర్తిని పెంచండి
 సామాజిక మాధ్యమాల్లో వాతావరణ మార్పులు వంటి పర్యావరణానికి సంబంధించిన సంబంధించిన ఆసక్తికరమైన వార్తలను  చూస్తే లైక్ చేయండి. వాటిని స్నేహితులతో పంచుకోండి. భూమిని రక్షించుకునే లక్ష్యంతో జరిగే స్థానిక, జాతీయ అధికారిక కార్యక్రమాల్లో మీరేం చేయగలరో ఆలోచించుకొని మీ వంతు కృషిచేయండి.
 
 పర్యావరణ హితమైన ఉత్పత్తులకే ప్రాథాన్యమివ్వండి మీ చిట్టి చెల్లెలు బుజ్జి పాపాయిల కోసం వస్త్రంతో చేసిన నాపీలు, తువ్వాళ్లను మాత్రమే కొనుగోలు చేయాలని మీ తల్లిదండ్రులకు ప్రేమతో షరతులు విధించండి. పర్యావరణ హితమైన ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వండి. వాటి అవశేషాలు సులభంగా భూమిలో కలిసిపోతాయి.
 
 పర్యావరణ ప్రియులుగా మసలుకోండి
 మీ సెలవు రోజులను ఆనందంగా గడిపేందుకు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వె ళ్లే సమయంలో వీలయితే విమాన ప్రయాణాన్ని చేయకండి. విమానాలు అధిక మొత్తంలో బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్)ను విడుదల చేస్తాయి. తప్పనిసరయితే కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించే వ్యవస్థలు.. మొక్కల పెంపకం వంటి కార్యక్రమాల్లో పాల్గొనే విమాన కంపెనీలను మాత్రమే మీ ప్రయాణానికి ఎంచుకోండి. పునరుత్పాదక శక్తి వనరుల ప్రాజెక్టుకు సహాయం చేయటం ద్వారా మీ వంతు ఉద్గారాల విడుదల నియంత్రించవచ్చు.
 
 ఆహార వృథాకు స్వచ్ఛంద సంస్థల చెక్
 ఆహార వృథాను అరికట్టడానికి భారత్ సహా వివిధ దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. వేడుకల సందర్భంగా జరిగే విందు భోజనాల్లో, రెస్టారెంట్లలో మిగిలిపోయిన తాజా ఆహారాన్ని సేకరించి నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. మన దేశంలో పెళ్లి వేడుకల్లో, ఇతరత్రా విందు వినోదాల్లో, రెస్టారెంట్లలో నిత్యం 20 శాతానికి పైగా ఆహార పదార్థాలు వృథా అవుతున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అధ్యయనంలో తేలింది. మన దేశంలోని ప్రధాన నగరాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు వేడుకల నిర్వాహకుల నుంచి, రెస్టారెంట్ల నుంచి తినదగిన స్థితిలో ఉండి మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి నిరుపేదలకు పంపిణీ చేస్తున్నాయి.
 
 ఇలా సేకరించిన ఆహారాన్ని నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఆహార వృథాను అరికట్టడానికి మన దేశంలో కచ్చితమైన చట్టాలేవీ లేవు గాని స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి పలు పాశ్చాత్య దేశాలు ఈ విషయంలో కాస్త కఠినమైన చట్టాలనే అమలు చేస్తున్నాయి. రెస్టారెంట్లలో ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను తినకుండా వృథా చేస్తే భారీ జరిమానాలనే వడ్డిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన గ్లోటైడ్ సొసైటీతో పాటు దేశవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు ఆహార వృథాను అరికట్టేందుకు కృషి చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement