దెయ్యం – భయం | Funday | Sakshi
Sakshi News home page

దెయ్యం – భయం

Published Sun, Sep 2 2018 1:28 AM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM

Funday  - Sakshi

రోజులు గడుస్తున్నాయి. కాలేజీకి వెళ్లడం, రావడం ఇదే పని. ఓ రోజు కాలేజ్‌ అయ్యాక తొందరగా ఇంటికి వచ్చి బ్యాగ్‌ బెడ్‌ మీద పడేసి బయటకు జంప్‌ అవుతుంటే ‘‘ఒరేయ్‌! ఏదన్న తిని పోరా’’ అని అమ్మ వంట గది నుంచే అరిచింది. ‘‘ఆకలైతలేదమ్మా!’’ అని గట్టిగా అంటూనే బయటపడ్డా. అదే రోజు రాత్రివరకు బయట షికార్లు కొట్టి, అమ్మకు ఫోన్‌ చేసి చెప్పా – ‘‘అమ్మా! ఇవ్వాళ లేటయితది’’. అమ్మ తిట్టాల్సిందంతా తిట్టి, జాగ్రత్త చెప్పి ‘సరే’ అంది. నా ఫ్రెండ్‌ అర్జున్‌తో కలిసి ఓ హాలీవుడ్‌ హర్రర్‌ ఫిల్మ్‌కి వెళ్లా. సినిమా ఎంత భయంకరంగా ఉందో మాటల్లో చెప్పలేను. సినిమా చూస్తున్నంతసేపు భయపడుతూనే ఉన్నా, కానీ చూడాలి అనిపిస్తోంది.‘‘ఏంది మామా! హర్రర్‌ సినిమాలు ఈ రేంజ్‌లో ఉంటాయా! నాకు భయమైతుంది. పోదామా?’’ అని అర్జున్‌ నా చెవిలో అరుస్తున్నాడు.‘‘నాకేం తెలుసురా! ఇంట్లో హర్రర్‌ సినిమాలు చూస్తే పెద్దగా భయం కాలేదు కానీ థియేటర్లో చూస్తే మాత్రం చాలా భయమైతుందిరా! సర్లే, మొత్తం సినిమా చూసే పోదాం’’ అన్నా. ఆ దెయ్యాలు, ఆ సౌండు, దెయ్యాలు మనుషుల రక్తాలు తాగడాలు.. వణుకుతూనే సినిమా చూస్తూ కూర్చున్నాం. సినిమా అయ్యాక, ‘ఇంకోసారి చీకట్లో ఇలాంటి హర్రర్‌ సినిమాలకు రావొద్దురా’ అనుకున్నాం. అసలే చీకటి. హర్రర్‌ సినిమా చూసి ఇంటికి వెళ్తున్నాం. ఇద్దరం ఏం మాట్లాడుకోవట్లేదు. 

సడెన్‌గా, ‘‘రామ్‌! దెయ్యాలు ఎలా ఉంటాయో తెలుసా’’ అని వాడు నావైపు చూస్తూ అడిగాడు.‘‘ఈ టైమ్‌లో దెయ్యాల గురించి డిస్కషన్‌ ఏందిరా! నాకేం తెల్వదు.’’ అన్నాను భయపడుతూనే. ‘‘రామ్‌! నేను దయ్యాన్ని చూశా.’’ అని ఆగాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. భయమేసింది. ‘‘ఎక్కడరా?’’ అనడిగా. ‘‘నువ్వేం భయపడకు. ఇప్పుడు కాదులే! చిన్నప్పుడు..’’ అని గట్టిగా నవ్వాడు. నాకు ఆ భయంలో వాడి మీద కోపమొచ్చింది. ఇంటికొచ్చేశాం. వాడిల్లు, మా ఇల్లు పక్కపక్కనే. ఇంటికి చేరేసరికి భయం కాస్త పోయింది. రాత్రి కలలు భయపెట్టాయి కానీ, పొద్దున్నే లేచి ఇంట్లోనే ఉన్నా అని నమ్మకం కలిగాక నాకు నేనే నవ్వుకున్నాను. ఆ తర్వాతిరోజు ఏదో ఫంక్షన్‌ ఉందని ఇంట్లోవాళ్లు ఊరెళ్లారు. నేను, తమ్ముడు ఎప్పట్లానే కాలేజీకి వెళ్లిపోయాం. నేను కాలేజీ నుంచి ఇంటికొచ్చేసరికి ఇంటిముందు జనం. ‘ఏమైంది.. ఏమైంది..’ అని పరిగెత్తాను.  అక్కడున్న వాళ్లెవరూ ఏం చెప్పట్లేదు. పక్కింటి ఆంటీని అడిగా – ‘‘ఏమైందాంటీ?’’ అని. ‘‘మీ తమ్ముడు ఇందాకే వచ్చి వెళ్లిండు. తాళంచెవి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత గంట నుంచి ఇగో.. ఇట్ల సౌండ్‌..’’ అని భయంతో చెప్పింది.

‘‘అరెయ్‌ రామ్‌! కొంపదీసి ఇంట్లో దయ్యముందారా?’’ అన్నాడు నన్ను చూసి అటు దూరంనించి నడుచుకుంటూ వచ్చిన అర్జున్‌. రాత్రి భయపెట్టింది చాలనట్లు ఇంకా భయపెడుతున్నాడు.డోర్‌ ఓపెన్‌ చేసి వెళ్దామంటే కీ లేదు. జనం మొత్తం వచ్చేస్తున్నారు. అయ్యో ఇంట్లో ఏదో చొరబడిందని భయపెట్టిస్తున్నారు. ఓ పెద్ద మనిషైతే ‘‘మొన్ననే ఒక దెయ్యాన్ని చూశిన. ఈ ఇంట్లనే జొరబడ్డదేమో!’’ అన్నాడు. ఈ కాలంలో దయ్యాలుంటాయా అని అనిపించినా నాకూ భయం పెరిగిపోతూనే ఉంది. కీ కోసం తమ్ముడికి కాల్‌ చేశా. వాడు రావడానికి అరగంట పడుతుందన్నాడు.లాభం లేదు. తాళం పగలగొట్టాలి. కానీ లోపల్నించి వస్తోన్న సౌండ్‌? భయం పెరుగుతూనే ఉంది. తమ్ముడి కోసం ఎదురుచూశా. వాడు రావడమే అందరం తలుపు పక్కన భయపడుతూ నిలబడ్డాం. కాసేపట్లో నిజంగానే హర్రర్‌ సినిమా లైవ్‌లో కనబడుతుంది అనుకుంటున్నా. లోపల్నించి ఎవరో బలంగా తలుపును కొడుతున్నారు. ‘‘నా వల్ల కాదు. అమ్మో దయ్యముందేమో!’’ అని నేను దూరంగా పరిగెత్తా. ‘‘ఎవరూ లోపల?’’ అని అరిచా గట్టిగా. అటువైపు నుంచి మాటలు రాలేదు కానీ డోర్‌ను గట్టిగా తంతూ ఓ వింత సౌండ్‌ మళ్లీ వినిపించింది. ‘తలుపు తీయ్‌’ అంటున్నారు అందరూ. కానీ ఎవ్వరూ ముందుకు కదలట్లేదు. మా తమ్ముడైతే దూరంగా వెళ్లి నిలబడ్డాడు అప్పటికే.‘‘అర్రె! ఏం భయంరా. అందరం ఉన్నాంగా! మేం దూరంగా నిలబడుతాం’’ అని నన్ను డోర్‌ దగ్గర వుంచి అందరు దూరంగా వెళ్లిపోయారు. ‘‘తలుపు తీయ్‌.. తలుపు తీయ్‌..’’ అని అరుస్తున్నారు.  ఇక లాభం లేదని తాళంచెవి పెట్టి, తలుపు తీసి వెంటనే వెనక్కి పరిగెత్తుకొచ్చాను. అందరూ భయంభయంగా తలుపు వైపే చూస్తున్నారు. ఇంట్లోంచి ఎప్పుడూ వినని విధంగా సౌండ్‌ చేసుకుంటూ ఓ కుక్క బయటకు వచ్చి అందరిని చూసి భయపడి రెండు నిమిషాల్లో సందు దాటేసింది. అది వెళ్లిపోయాక అందరూ ఒకటే నవ్వులు. ‘భయపడి సచ్చినం కదరా!’ అనుకున్నారు అందరూ. 
అసలు విషయం ఏమైందంటే, మధ్యాహ్నం తమ్ముడు ఇంటికొచ్చి అన్నం తిని వెళ్లాడు. ఆ టైమ్‌లో ఆ కుక్క ఇంట్లో జొరబడింది. ఆ తర్వాత వాడు అది చూసుకోకుండా తాళమేస్కొని బయటికెళ్లాడు. దాన్ని చూసి వీళ్లంతా దయ్యమనుకొని భయపడ్డారు. నన్నూ భయపెట్టి పడేశారు. 
– రమేశ్‌ రాపోలు, నల్లగొండ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement