పుస్తక సమీక్షణం: | Funday Book review of the day | Sakshi
Sakshi News home page

పుస్తక సమీక్షణం:

Published Sun, Oct 13 2013 1:32 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

Funday Book review of the day

దళిత, బహుజన చైతన్యం
 పుస్తకం    :    దళిత బహుజన సాహితీవేత్తలు
 రచన    :    బి.ఎస్.రాములు
 పేజీలు: 184
 వెల: 100
 
 విషయం    :    వివిధ పత్రికలు, పుస్తకాల్లో భిన్న సందర్భాల్లో బి.ఎస్.రాములు రాసిన వ్యాసాలు, పీఠికలను ‘దళిత బహుజన సాహితీవేత్తలు’(1990-2012) పేరుతో సంకలనం చేశారు కర్రె సదాశివ్, మొయిలి శ్రీరాములు. ప్రతి వ్యాసం దళిత బహుజన భావజాలాన్ని అంతర్లీనంగా పరిచయం చేస్తుంది. దళిత బహుజన సాహిత్యం ఉధృతంగా   వెల్లువెత్తిన కాలాన్ని గుర్తు తెస్తుంది.
 
 జన నాట్య మండలికి పూర్వం సాహిత్యం ఎలా ఉండేది? గద్దర్ పాటల్లోని ప్రయోగాల్లో ఉన్న వైవిధ్యం ఏమిటి? ‘అందుకో దండాలు బాబా అంబేద్కరా’ పాటతో బహుజన సాహిత్యానికి ఊపు తెచ్చిన మాస్టార్జీ కలంలోని   పదును, నర్రెంగ చెట్టు కింద గళాన్ని సవరించిన శివసాగర్ పాటల లోతు, అలిశెట్టి ప్రభాకర్ అక్షరాయుధంలోని మెరుపు.... ఎన్నో విషయాలు. వ్యక్తుల గురించి చదువుతున్నట్లుగా ఉంటుంది. వారి వ్యక్తిగతం తెలుసుకున్నట్లుగా ఉంటుంది. కాని మనం చదివింది వ్యక్తిగతం కాదు ‘దళిత సామాజిక చరిత్ర’ అనే ఎరుక పుస్తకం ముగించేలోపు అర్థమవుతుంది. సాహు గురించిన సంస్మరణ వ్యాసం మళ్లీ మళ్లీ చదివిస్తుంది. జయధీర్ తిరుమలరావు అన్నట్లు రెండు దశాబ్దాల తాత్విక, సైద్ధాంతిక చర్చలు, పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది.
 - పాషా
 ప్రతులకు: విశాల సాహిత్య అకాడమీ, 201, సులేఖ గోల్డెన్ టవర్స్, 2-2-186/53/5, రామకృష్ణ నగర్, బాగ్ అంబర్‌పేట్, హైదరాబాద్-13; ఫోన్: 8331966987
 
 హృదయ స్పందనల సవ్వడి
 
 పుస్తకం    :    సవ్వడి (వ్యాసాలు) రచన    : జి.వి.చక్రవర్తి
 పేజీలు: 222 వెల:100
 ప్రతులకు: సంజీవ్ మీడియా హౌస్, 202,
 నంది ఎన్‌క్లేవ్, సిద్దార్థ నగర్, హైదరాబాద్-38;
 ఫోన్: 97043
 33337
 
 విషయం    :    నేటి సమాజ పోకడలను, విలువల పతనాన్ని, వస్తు సంస్కృతీ వ్యామోహాన్ని, అనుబంధాలు ఆత్మీయతలు పెళుసు బారిపోయిన విధాన్ని చూస్తూ కూర్చోలేని ఒక యదార్థవాది స్పందనలకు అక్షర రూపం ఈ వ్యాససంపుటి. నాడు సాక్షి వ్యాసకర్త పానుగంటి వారిలాగే నిత్యం మన చుట్టూ జరిగే అనేక సంఘటనల్ని, కుపిత నాయిక వాలుజడతో చరపు చరచినట్లు, లోకహితం కోసం చేసిన హృదయాక్రోశమే ఈ సవ్వడి. అయితే సాక్షిలోలా కాలాచార్యుడు, జంఘాల శాస్త్రి, వాణీదాసు, వైశ్యుడు లాంటి నాటకీయ పాత్రలు లేకున్నా, నవరసాల మేళవింపుగా రాసిన వ్యాస కదంబంలో అన్నీ తానై నిలిచాడు రచయిత.
 
  ఒళ్లంతా కళ్లు, బొడ్డు చూడు బొడ్డందం చూడు, ఆఫ్టర్‌నూన్ ఆంటీస్ లాంటి వ్యాసాలు మనలోని నలుపును గుర్తుచేస్తున్నాయి. సంసారం ఓ సాగరం, హింసధ్వని లాంటి వ్యాసాలు బాధ్యతలు మరవవద్దని హితవును చెప్తాయి. గుణమా... ఆ ఒక్కటీ అడక్కు, ఆరో తరగతి ప్రేమికులు, ఉత్తరోత్తరా చెప్పొచ్చేదేమిటంటే... వంటివి మమకారాల్ని, సహాయ సహకారాల్ని అమ్మకాలకు పెట్టవద్దని సందేశమిస్తాయి.
 - మీరాసాహెబ్
 
 అక్షర గంగ
 పుస్తకం    :    స్వరగంగ - ఎం.ఎస్.సుబ్బులక్ష్మి
 సంపాదకులు : ‘లకుమ’ బుదేశ్వరరావు
 పేజీలు: 300
  వెల: 299
 
 విషయం    :    ‘ఆమె పాడకపోతే దేవుళ్లకు కూడా తెల్లవారదు/ ఆమె పాట వినబడకపోతే దేశమే తానైన/ ఏ పల్లే లేవదు’ అంటూ సుబ్బులక్ష్మి గురించి లకుమ చెప్పడం అక్షర సత్యం. కర్నాటక సంగీతానికి తన గళ మాధుర్యంతో ప్రపంచవ్యాప్త ఖ్యాతి  తేవటమేకాక, భారతరత్న పొందిన తొలి సంగీత కళాకారిణిగా చరిత్రలో శిఖరాయమానంగా ఆమె నిలిచిపోయారు. సుబ్బులక్ష్మి జీవిత, సంగీత ప్రయాణంపై వెలువరించిన పుస్తకం ఇది. ఆధ్యాత్మిక లోకాల్లోకి ప్రయాణింపజేసే ఆమె స్వరాన్ని ఇది ఆసక్తిదాయకంగా వ్యక్తీకరించింది. ఓ రకంగా స్మృతి సంకలనమైన ఈ పుస్తకంలో ‘రాశులు - దుద్దులు - బేసరలు - పెర్‌ఫ్యూమ్‌లు - మల్లెపూలు - మట్టిగాజులు- రికార్డులు - జిలుగులు- సంస్కరణలు- ప్రతిష్టలు’ అంటూ చేసిన వ్యాస విభజన లకుమ పరిశోధన దృష్టిని చెబుతుంది. 64 మంది రాసిన వ్యాసాలతోపాటు, మంచి ఫొటోలను పొందుపర్చటం పుస్తకానికి నిండుదనాన్నిచ్చింది.
 - డా. నూకతోటి రవికుమార్
 
 కొత్త పుస్తకాలు
 గురజాడ దర్బార్
 (ఆధునిక సాహితీ రూపకం)
 రచన: డా. ద్వానా శాస్త్రి
 పేజీలు: 32; వెల: 30
 ప్రతులకు: కిన్నెర పబ్లికేషన్స్, మద్దాళి గోల్డెన్ నెస్ట్, ఫ్లాట్ 101, 102, 2-2-647/153, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, హైదరాబాద్-13. ఫోన్: 040-27426666
 
 1.మమకారం (కథలు)
 రచన: రేగులపాటి విజయలక్ష్మి
 పేజీలు: 92; వెల: 90
 2.ఈతరం పెళ్లికూతురు (కథలు)
 రచన: రేగులపాటి కిషన్‌రావు
 పేజీలు: 130; వెల: 120
 ప్రతులకు: కవితా నిలయం, 10-1-436, సంతోష్‌నగర్, రామ్‌నగర్, కరీంనగర్-505001; ఫోన్: 7396036922
 
 నిప్పు కణికలు (కవిత్వం)
 రచన: మొగిలి స్వామిరాజ్
 పేజీలు: 94; వెల: 65
 ప్రతులకు: రచయిత, 1-1-1653, రాకాసిపేట్, బోధన్, నిజామాబాద్- 503185; ఫోన్: 9963642205
 
  ప్రతులకు: లకుమ, ప్రెసిడెంట్, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ఫౌండేషన్, ఎ.239, హిల్ కాలనీ, నాగార్జున సాగర్, నల్లగొండ జిల్లా; ఫోన్: 08680 276454

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement