ఎన్‌ఆర్‌ఐ (NRI)
'ఉదయం పూట టీ త్రాగగానే దినపత్రిక తిరగేసిన అలవాటు, అది కూడా తెలుగు పత్రిక అయితేనే తృప్తి. లాప్టాప్ ముందుపెట్టి మీకు కావలసిన పత్రిక చదువుకొండి! అంటున్నారు అమెరికాలో పిల్లలు. నిజమే నెట్లో వార్తలు తెలుసుకోవడం చాలా సులభం అయిపోయింది. అయినాసరే పేపర్‌ను చదవడమంటే వాలుకుర్చీలో ఒరిగి భౌతికంగా పేజీలను తిప్పుతూ శ్రీమతి విసుక్కున్నా ఆ వార్తలను గురించి ఆమెతో ప్రస్తావించడంలో లభించే ఆనందమే వేరు.
అమెరికాలో న్యూస్‌పేపర్ తెప్పించుకొని చదివేవారు రోజురోజుకు తగ్గిపోతున్నారట. అంతదాకా ఎందుకు ఇప్పుడు మన దేశంలోనే ఆ పరిస్థితి వస్తుంది. వర్క్ చేసుకుంటూనే నెట్లో తాజావార్తలు చూసేస్తున్నారు. టీవీ న్యూస్ ఉండనే ఉన్నాయి, ఎటుపోయినా కారులో రేడియోలు మొగుతూనే ఉంటాయి. అంతదానికి ప్రత్యేకంగా న్యూస్ పేపర్ తెప్పించుకోవడం దేనికి అనుకుంటున్నది కొత్త తరం.'
అమెరికాలో పత్రికలవాళ్ళు అమ్మకుండా మిగిలిన న్యూస్ పేపర్‌లను పాలితిన్ కవర్‌లలో చుట్టి మరీ ఇండ్ల ముందు పడేస్తుంటారు. అలా ప్రచారం కోసం వస్తున్న పత్రికలు ఎప్పటికప్పుడు తీయకపోతే చెత్తకుప్పలా తయారవుతాయి సుమా! ఇండియాలోనైతే వాటిని పాత వేస్ట్ కిందా అమ్ముకొని సొమ్ము చేసుకునే అవకాశమైనా ఉండేది ఇంట్లో మన ఆడవాళ్లకు.
యూఎస్‌లో పేపర్ రద్దీకి ఒక ప్రత్యేక బాక్స్ ఉంచుతారు. అందులో వేస్తే అవి రీ సైక్లింగ్‌కు వెళ్లి పోతాయి. అమెరికాలో న్యూస్ పేపర్ ఖరీదు మనదేశంతో పోల్చుకుంటే తక్కువే అనవచ్చు. 50 సెంట్లకు అంతకు మించిన పేజీల పత్రిక, ప్రకటనల బ్రోచుర్లు కలుపుకొని వస్తుంది.
ఆదివారం పేపర్ పేజీలు లెక్కించడం కాదు తూచి చూడాల్సిందే. అడ్వర్టైజ్‌మెంట్ కల్చర్ అంతగా పెరిగిపోయింది ఆ దేశంలో. వ్యాపార ప్రకటనలు చదువరులకు చేరవేయడానికి న్యూస్ పేపర్‌ల వాళ్లకు కవర్లలాగా ఉపయోగపడుతున్నాయనిపిస్తుంది. పేపర్ బాయ్స్ కారులో బయలుదేరి ఇంటింటికి పేపర్లు వేస్తూ వెళ్తుంటే మనకది చూడముచ్చట, కానీ అక్కడి వాళ్లకు మామూలే.
ఒక దినపత్రికలో వార్తలు కాకుండా స్పోర్ట్స్, హెల్త్, ట్రావెల్, ఫ్లేవర్ అంటూ బోలెడు సప్లమెంట్లు, పిల్లల కోసం, పెద్దల కోసం పేజీలకు పేజీలు కార్టూన్లు, సినిమాలు, దుస్తులు, ఫర్నిచర్ ప్రకటనలు, స్పెషల్ ఆఫర్లు ఎన్నో.. ప్రత్యేక ఆసక్తి ఉంటే తప్ప పేపర్ మొత్తం చదవడం మాత్రం అయ్యే పనికాదు.
ఇక రియల్ ఎస్టేట్ వారి కలర్ ఫుల్ ప్రకటనల గురించి చెప్పాల్సిన పనిలేదు (ఈ కల్చర్ ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేస్తుంది). అసలు వాళ్ళే అక్కడ దినపత్రికలను నడుపుతున్నారేమో అనిపిస్తుంది. అమెరికావారి పత్రికల్లో మనదేశం గురించిన వార్తలు ఎప్పుడో కాని కనబడవు. వాళ్ళ దృష్టంతా ఇస్లామిక్ దేశాల మీదనే, 9/11 దాడి తర్వాత వచ్చిన మార్పు ఇది.
మన దినపత్రికల్లో రాజకీయ నాయకుల ఫోటోలు, ప్రకటనలే ఎక్కువగా కనబడుతాయి, అమెరికా ఇందుకు భిన్నం అనిపిస్తుంది. అక్కడ దేశాధ్యక్షుడు కూడా ఎప్పుడో గానీ చిరునవ్వులు చిందిస్తూ పత్రికల్లో కనబడడు. వారి పత్రికల్లో స్థానిక సమస్యలకు, చదువులకు, కుటుంబ విషయాలకు, ఆరోగ్యానికి, రుచికరమైన ఆహార పానీయాలకు ప్రాధాన్యత ఎక్కువ. ఏమి తింటున్నామో అనే కాదు.., ఎలా తినాలో తెలిపే టేబుల్ మ్యానర్స్ కూడా వారికి ముఖ్యం.
మరో విశేషం.. అమెరికా పత్రికల్లో ఎంగేజ్మెంట్‌లు, బర్త్‌డేలు, పట్టభద్రులకు అభినందనలు ఎక్కువ కనబడుతుంటాయి. ఆత్మీయులు చనిపోయినప్పుడు మొక్కుబడిగా ఫోటో వేసి నివాళులు అర్పించడం కాదు, సంక్షిప్తంగా గతించిన వారి జీవిత విశేషాలను పేర్కొనడం అక్కడి ఆనవాయితీ.
క్లాసిఫైడ్స్ ప్రకటనల్లో ఎన్నెన్నో వింతలు పెంపుడు జంతువుల గురించి ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్కపిల్ల తప్పిపోయిందని, పిల్లి మాయమైందని బెంగపెట్టుకొని వాటి రూపురేఖా విలాసాలు వర్ణిస్తూ ప్రకటనలు ఇస్తారు. దొరికినట్లయితే మరో ప్రకటన ద్వారా కృతజ్ఞతలు కూడా చెబుతారు. ఇక సేవల ప్రకటనలకు లెక్కే లేదు. అవసరమైన వారికి అందమైన వారిని పంపడం కూడా వారి దృష్టిలో సేవే, ఎవరి పిచ్చి వారికి ఆనందం.
పత్రికల సర్క్యూలేషన్ విషయానికి వస్తే అమెరికాలో జాతీయ స్థాయిలో వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్, న్యూయార్క్ పోస్ట్, వాషింగ్టన్ పోస్ట్ వంటివి ముందు వరుసలో ఉంటాయి. అయితే స్థానిక పత్రికల డిమాండ్ కూడా తక్కువేం లేదు, ప్రతి సిటీ పేరు మీద ఏదో పత్రిక ఉండనే ఉంటుంది. ముఖ్యమైన సెంటర్‌లలో, మాల్స్‌లలో వెండింగ్ మెషిన్‌ల ద్వారా పత్రికలు పొందవచ్చు, కాకపోతే మన వద్ద సరిపడా కాయిన్స్ ఉండాలి.
చాలామంది ప్రకటనల కోసం వీకెండ్ పేపర్ లు కొంటుంటారు. మత, కమ్యూనిటీ పరమైన, విదేశీయుల పత్రికలకు కూడా అమెరికాలో కొరత లేదు. జర్నలిజం అమెరికాలో ఎంతో గౌరవ ప్రదమైన వృత్తి. ఎన్నెన్నో కుంభకోణాలను బయట పెట్టినవి వాళ్ళ పత్రికలు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో పత్రికలది ప్రముఖ పాత్ర.
'విద్యార్థి దశలో నేను పాఠ్య పుస్తకాల కన్నా ఎక్కువగా చదివినవి పత్రికలే, గురువులకన్నా కూడా నన్ను ఎక్కువ ప్రభావితం చేసినవి పత్రికలు, సాహితీ పుస్తకాలే. ఇక్కడున్నా బయటి దేశాలకు వెళ్లినా సినిమాలు, షికార్ల కన్నా కూడా నా ప్రధాన కాలక్షేపం అవే. నేను ఎప్పుడైనా ఇంటినుండి బయటికి వెళ్తుంటే ‘జేబులో పర్సు పెట్టుకోవడం మరిచిపోయినా మా అయన పత్రికో పుస్తకమో పట్టుకోవడం మాత్రం మరిచి పోడని’ జోక్ చేసేది శ్రీమతి చంద్రభాగ!' — వేముల ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment