బూరెల పండుగ  | Funday children story | Sakshi
Sakshi News home page

బూరెల పండుగ 

Published Sun, Sep 9 2018 1:12 AM | Last Updated on Sun, Sep 9 2018 1:12 AM

Funday children story - Sakshi

సుబ్బమ్మ, సోమయ్య భార్యాభర్తలు. పెళ్లయిన చాలాకాలానికి వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి వెంకన్న అని పేరు పెట్టారు. లేక లేక కలిగిన సంతానం కావడంతో వాడిని అతి గారాబంగా పెంచారు. వాడి చేత ఏ పనీ చేయించేవాళ్లు కాదు. ఎక్కడికీ పంపించేవాళ్లు కాదు. ఎవరితోనూ కలవనిచ్చేవాళ్లు కాదు. ఇలా పెరగడంతో వాడు ఉత్త అమాయకుడుగా తయారయ్యాడు.అమాయకుడైతేనేం, చాలా మంచివాడు. కల్లాకపటం లేనివాడు. ఆ భార్యాభర్తలకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. కాలం గడిచే కొద్దీ వయసు పైబడటంతో వాళ్లు పనిచేయలేని స్థితికి చేరుకున్నారు. కొడుకు పని చేసేవాడు కాదు. అప్పుడు వాళ్లకు తెలిసొచ్చింది కొడుకును అప్రయోజకుడిగా తయారు చేశామని.ఇలాగే ఉంటే లాభం లేదనుకుని ఒకరోజు కొడుకును పిలిచి ‘‘నాయనా...మేము ముసలి వాళ్లమైపోతున్నాం. మా శక్తి ఉడిగిపోతోంది. ఇక నువ్వే ఏదో ఒక పని చేయాలి బాబూ! నువ్వూ బతకాలీ, రేపో మాపో పెళ్లి చేసుకున్నాక వచ్చే భార్యనీ బతికించాలీ, ముసలి వాళ్లమవుతున్న మమ్మల్నీ పోషించాలి. ఇక నువ్వు నాలుగు డబ్బులు సంపాదించాలి నాయనా’’ అని చెప్పారు.ఊరికి దగ్గర్లోనే అడవి ఉంది. 

‘‘అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వస్తానమ్మా! అవి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా!’’ అన్నాడు వెంకన్న.‘‘అలాగే చేయి నాయనా!’’ అన్నారు సుబ్బమ్మ, సోమయ్యలు.ఒకరోజు ఉదయమే అడవికి వెళ్లాడు వెంకన్న. ఒక వెలగచెట్టు నిండా కాయలతో కనిపించింది. ఇవాళ్టికి వెలగకాయలు తీసుకుపోదామనుకుని చెట్టు ఎక్కాడు. ఇంతలో ఎవరివో మాటలు వినిపించాయి. ముగ్గురు వ్యక్తులు. వాళ్ల భుజాల మీద చిన్న మూటలు ఉన్నాయి. వాళ్లు దొంగలు. ముగ్గురూ వెంకన్న కూర్చున్న చెట్టుకు కొద్ది దూరంలోనే ఉన్న మరో చెట్టు కింద కూర్చున్నారు. వాళ్లు పలుగుతో ఒక గొయ్యి తవ్వారు. తాము తెచ్చిన మూటల్లోని డబ్బు, బంగారు నగలు ఆ గోతిలో పూడ్చిపెట్టారు. తర్వాత పెద్ద బండరాతిని మోసుకొచ్చి ఆ గోతిని కప్పెట్టారు. అది వాళ్లకు గుర్తుగానూ,ఇతరులకు ఆనవాలు తెలియకుండానూ.‘‘మనం పాత అల్లుళ్లం కదా! మన ఇళ్లకు పోలీసు మామలు వస్తారు. అడుగుతారు. మనల్ని పట్టుకుపోతారు. లోపల నాలుగు వడ్డిస్తారు. వాటికి ఓర్చుకోవాలి. భయపడొద్దు. తర్వాత వచ్చి సొమ్ము తీసుకుపోయి పంచుకుందాం’’ అని వాళ్లలో నాయకుడిలాంటి వాడు మిగిలిన దొంగలతో చెప్పాడు.‘‘అలాగే గురువా!’’ అన్నారు మిగిలిన ఇద్దరూ. తర్వాత వెంట తెచ్చుకున్న సీసాల్లోని సారాయి తాగి వాళ్లు వెళ్లిపోయారు. చెట్టు మీద ఆకులు, కొమ్మల మాటున భయంతో నక్కి కూర్చున్న వెంకన్న, వాళ్లు వెళ్లిన చాలా సేపటికి మెల్లగా ధైర్యం కూడదీసుకుని చెట్టు దిగాడు. ఉత్త చేతుల్తోనే ఇంటికి వెళ్లాడు. జరిగిన సంగతిని అమ్మా నాన్నలకు చెప్పాడు.‘‘పోలీసులకు చెబుదాం నాన్నా!’’ అన్నాడు వెంకన్న.‘‘తర్వాత చెబుదాం. ఇప్పుడీ విషయం ఎవరికీ చెప్పొద్దు. వెళ్లి పడుకో’’ అన్నాడు తండ్రి.వెంకన్న నిద్రపోయాడు.

‘‘అబ్బాయి నిజం చెబుతాడు. అవి దొరికితే ఏం చేద్దాం?’’ అని భార్యను అడిగాడు సోమయ్య.‘‘పుట్టిన దగ్గర్నుంచీ మనం రెక్కలు ముక్కలు చేసుకున్నాం. ఏం సంపాదించాం, ఏం మిగుల్చుకున్నాం..? బతుకులో ఎదుగూ బొదుగూ లేదు. చాలీ చాలని సంసారం! ఆ సొమ్ములు ఎవరో ఉన్న మహారాజులవి అయి ఉంటాయి. ఇవి పోతే వాళ్లకేం కాదు. మనం పోయిన తెల్లారి ఈ అమాయకుడు ఎలా బతుకుతాడో! దొరికితే అవి దాచుకుందాం’’ అంది భార్య.సొమ్ములు ఇంటికి తెస్తే కొడుకు పోలీసులకు చెప్పేస్తాడనే భయం పీకుతూనే ఉన్నా, భార్యాభర్తలిద్దరూ బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. మరుసటి రోజు చీకటితోనే కొడుకును లేపి అడవికి తీసుకుపోయాడు సోమయ్య. ముందు రోజు దొంగలు సొత్తు దాచిన చోటు చూపాడు వెంకన్న. ఇద్దరూ కలిసి బండను పక్కకు జరిపి గొయ్యి తవ్వారు. చాలా డబ్బు, బంగారం. వెంట తీసుకొచ్చిన గోతాంలో వాటిని వేశారు. గోతాంలోని సొత్తు మీద వెలగకాయలు నింపేశారు. గోతాన్ని మోసుకుంటూ తండ్రీకొడుకులిద్దరూ ఇంటికి చేరుకున్నారు.‘‘వెళ్లి పోలీసులకు చెబుతా’’ అన్నాడు వెంకన్న.‘‘చెబుదువులే! ఇవాళ బూరెల పండుగ. పండుగపూట ఎందుకు? బూరెలు చేశాను. కడుపునిండా తిను.’’ అంది తల్లి సుబ్బమ్మ.బూరెలబుట్ట వాడి ముందు పెట్టింది. ఆకలితో ఉన్నాడేమో ఆత్రంగా బూరెల మీద దాడి మొదలుపెట్టాడు. ఇక మరో ధ్యాసే లేదు.మర్నాడు గారెల పండుగ అంటూ గారెలు చేసి పెట్టింది. మూడో రోజు అరిసెల పండుగ అని అరిసెలు, నాలుగో రోజు సున్నుండల పండుగ అని సున్నుండలు, ఐదో రోజు లడ్డూల పండుగ అని లడ్డూలు, ఆరో రోజు కజ్జికాయల పండుగ అని కజ్జికాయలు, ఏడో రోజు జిలేబీల పండుగ అని జిలేబీలు.. ఇలా వరుసగా వారంలో ఏడురోజులూ రోజూ ఏదో పండుగ అంటూ పిండివంటలు పెడుతూండటంతో వెంకన్న వాటి ధ్యాసలో పడి, పోలీసులకు చెప్పాలనే ఆలోచన మరచిపోయాడు.ఎనిమిదో రోజు ఇంట్లో ఎలాంటి పండుగ హడావుడీ లేదు. వెంకన్నకు పోలీసులకు చెప్పాలనే సంగతి గుర్తొచ్చింది. పోలీసులకు వెళ్లి విషయం చెప్పేశాడు. ఇంటికి పోలీసులు వచ్చి సోదా చేశారు. ఏమీ దొరకలేదు.

‘‘మా వాడు అమాయకుడు బాబూ! ఏమీ తెలియదు. ఉత్త పిచ్చిమాలోకం! వాడికి అన్నీ పండుగలే!’’ అన్నారు సుబ్బమ్మ, సోమయ్యలు.‘‘డబ్బు, నగలు ఎప్పుడు దొరికాయి’’ అని వెంకన్నను ప్రశ్నించారు పోలీసులు.‘‘బూరెల పండుగ రోజు’’ బదులిచ్చాడు వాడు.‘‘బూరెల పండుగ ఎప్పుడు?’’‘‘గారెల పండుగ ముందు రోజు కదూ’’ ఠపీమని చెప్పాడు.‘‘గారెల పండుగ ఎప్పుడు’’‘‘అరిసెల పండుగ ముందు రోజు’’‘‘అదెప్పుడు?’’‘‘సున్నుండల పండుగ ముందు రోజు’’పోలీసులు అడగడం, వాడు ఉన్నది ఉన్నట్టు చెప్పడం!‘‘మాకు తినడానికే తిండి లేదు. అవేం పండుగలు. అవి రోజూ తిన్నట్లు కూడా చెబుతాడు’’ అన్నాడు సోమయ్య. వాడూ అలాగే చెప్పాడు.వీడేదో పిచ్చి మాలోకంలా ఉన్నాడు, కలగని ఉంటాడనుకొని పోలీసులు నవ్వుకుంటూ తిరిగి వెళ్లిపోయారు. సుబ్బమ్మ, సోమయ్యలు కొడుకు దగ్గర ఆ సొత్తును ఎన్నడూ బయటపెట్టలేదు.కొన్నాళ్లకు మంచి అమ్మాయిని చూసి వెంకన్నకు పెళ్లి చేశారు. ఆమె తెలివైనది. బంగారం, డబ్బు ఆమె పుట్టింటి నుంచి తీసుకొచ్చినట్లుగా కొద్ది కొద్దిగా బయటకు తీస్తూ, పనీపాటాచేసుకుంటూ, చక్కని ఇల్లు కట్టుకుని ముసలితనంలో సుఖంగా జీవించారు వాళ్లు.
- మొలకలపల్లి కోటేశ్వరరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement