ఒకే బ్లడ్ గ్రూప్ అయితే... పిల్లలకు లోపాలా?
నాది, మావారిది ఒకే బ్లడ్ గ్రూప్. నాకు ఇటీవలే పెళ్లైంది. మా ఫ్రెండ్స్‌లో చాలామంది ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు పెళ్లి చేసుకుంటే పిల్లలు సరిగా పుట్టరని చెబుతున్నారు. అది నిజమేనా? అలాగే నా భర్త మా బంధుల అబ్బాయే. దీనివల్ల కూడా పిల్లలు అవయవ లోపాలతో పుడతారని అందరూ అంటున్నారు. మా అమ్మానాన్నలది కూడా మేనరికమే. దాంతో ఇంకా భయంగా ఉంది. ఇటు పిల్లలు కావాలని తొందరగా ఉన్నా, ఎక్కడ వారికి లోపాలుంటాయేమోనని కంగారుగా ఉంది. దయచేసి దీనికి ఏమైనా ట్రీట్‌మెంట్ లేక మందులు ఉంటే చెప్పండి.
- ఓ సోదరి
భార్యాభర్తలది ఒకే బ్లడ్ గ్రూప్ ఉండటం వల్ల వారికి పుట్టబోయే పిల్లలకు ఎలాంటి సమస్యలు రావు. మేనరికపు సంబంధాలలో, దగ్గరి రక్త సంబంధీకులలో పెళ్లి చేసుకుంటే, వారికి పుట్టబోయే పిల్లల్లో సాధారణ పిల్లల్లోకంటే 2-3 శాతం ఎక్కువగా జన్యుపరమైన సమస్యలు, అవయవ లోపాలు వంటివి రావచ్చు. అంతేకానీ మేనరికపు పెళ్లిళ్లలో అందరికీ సమస్యలు వస్తాయని ఏమీ లేదు. రక్త సంబంధీకులలోని జన్యువులలో ఏదైనా సమస్య ఉంటే, అవి భార్యాభర్తలలో ఇద్దరికీ ఉన్నప్పుడు... పుట్టేబిడ్డకు అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ తల్లిదండ్రులది మేనరికం, అలాగే మీ భర్త కూడా బంధువే అంటున్నారు కాబట్టి... మిగతా వాళ్లతో పోలిస్తే మీకు పుట్టబోయే బిడ్డలో సమస్యలు ఉండే అవకాశాలు లేకపోలేదు.
ఒకసారి మీ ఇద్దరు జెనెటిక్ కౌన్సెలర్‌ను సంప్రదిస్తే మంచిది. కౌన్సెలర్ మీ ఇద్దరి కుటుంబాలలో ఉన్నవారి వివరాలను బట్టి, మీకు పుట్టబోయే పిల్లల్లో ఎంతవరకు సమస్యలు రావచ్చో అంచనా వేసి చెబుతారు. మీరిద్దరూ భయపడకుండా సంతోషంగా ఉంటూ... మీకు గర్భం రాకముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున వేసుకోవడం మంచిది. గర్భం వచ్చిన తర్వాత మూడో నెల చివరిలో ఎన్‌టీ స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్, అయిదో నెల చివరిలో టిఫ్ఫా స్కాన్, ట్రిపుల్ మార్కర్ లేదా క్వాట్రపుల్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకుంటే, పుట్టబోయే పిల్లల్లో జన్యు సమస్యలు, అవయవ లోపాలు వంటివి ఏమైనా ఉన్నాయనేది తెలుస్తుంది. కొన్ని సమస్యలు పుట్టిన తర్వాతే బయట పడతాయి.
నా వయసు 17. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు మెచ్యూర్ అయ్యారు. టెన్త్ క్లాస్ వరకు కడుపు నొప్పి అంటే తెలిసేది కాదు. ఎప్పుడైతే ఇంటర్‌లో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ప్రతి నెలా కడుపు నొప్పి విపరీతంగా వస్తోంది. ఫస్ట్ రోజు ఆ నొప్పి భరించలేక పోతున్నాను. డాక్టర్ దగ్గరకు వెళితే మెఫ్తాల్ స్పాస్ టాబ్లెట్ వేసుకోమన్నారు. కానీ అది వేసుకున్నా, నాకు తగ్గినట్టు అనిపించడం లేదు. మొదటి రెండురోజులు కాలేజీకి వెళ్లలేక పోతున్నాను. ఆ సమయంలో టాబ్లెట్‌కు బదులుగా ఏవైనా ఫ్రూట్స్ లాంటివి తింటే రిలీఫ్ దొరుకుతుందా? అలాగే నొప్పి తగ్గడానికి సొల్యూషన్ చెప్పండి.
- ప్రసన్న, ఊరు రాయలేదు
పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్స్ విడుదలవుతాయి. ఇవి గర్భాశయ కండరాలను కుదింపజేసి బ్లీడింగ్‌ను బయటకు పంపిస్తాయి. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి హార్మోన్ల మోతాదు ఆధారపడి ఉంటుంది. అది అధికంగా విడుదలైన వారిలో పొత్తి కడుపులో నొప్పి, నడుము నొప్పి వంటి లక్షణాల తీవ్రత ఉంటుంది. కొందరిలో ఒక్కోనెలలో హార్మోన్ల విడుదలలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఇవే కారణాలు అయితే, కంగారు పడాల్సిన అవసరం లేదు. నొప్పి ఉన్న ఒకటి రెండు రోజులు... నొప్పి నివారణ మాత్రలు, నొప్పి తీవ్రతను బట్టి రోజుకు రెండు నుంచి మూడు మాత్రలు వేసుకోవచ్చు. క్రమంగా నడక, యోగా వంటి వ్యాయామాలు చెయ్యడం వల్ల కూడా నొప్పిని తట్టుకునే శక్తి పెరుగుతుంది, కాబట్టి నొప్పి పెద్దగా తెలియదు.అలాగే పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపు మీద వేడి నీటి గుడ్డతో లేదా ప్లాస్టిక్ బాటిల్‌లో వేడి నీళ్లు పోసి మసాజ్ చేసుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
వేడినీటితో పాటు తులసి ఆకు, పూదీనా, కొత్తిమీర, అల్లం, నువ్వులు, కలబంద, ఇంగువ, బీట్‌రూట్ లాంటివి కొంత మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. (మీకు కడుపు నొప్పి ముందు నుంచి లేకుండా, ఈ మధ్యనే మొదలైంది కాబట్టి గర్భాశయంలో వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. అలాగే స్కానింగ్ వంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది. కొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఇన్‌ఫెక్షన్, వాపు వంటి ఎన్నో సమస్యల వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి రావచ్చు)
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్