సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): ఏడాది జిల్లాలో దొంగతనాలు చేస్తూ.. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు దొంగలను (భార్యాభర్తలు) పోలీసులు పట్టుకున్నారు. జిల్లాకేంద్రంలోని మార్కెట్ ఏరియాలో అనుమానస్పదంగా తిరుగుతుండగా సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో సంబంధిత కేసు వివరాలను ఏసీపీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
ఆయన కథనం ప్రకారం.. బెల్లంపల్లి మండలం బట్వన్‌పల్లికి చెందిన తాళ్లపల్లి ప్రసాద్, విజయవాడకు చెందిన ధనలక్ష్మి భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వీరు జిల్లా కేంద్రంలోని ఎక్బల్ హైమద్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ధనలక్ష్మి ప్రతిరోజూ కాలనీల్లో తిరుగుతూ గాజులు అమ్మేది. ప్రసాద్ కూల్‌డ్రింక్స్ విక్రయిస్తుండేవాడు. కుటుంబ పోషణ, జల్సాలకు డబ్బులు సరిపోక దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా ఎంచుకున్నారు.
ఈ క్రమంలో ఏడాదిగా జిల్లాలో ఏడు చోరీలు చేశారు. సీసీ కెమెరాలకు సైతం చిక్కారు. పోలీసులు వీరిపై ప్రత్యేక నిఘా పెట్టారు. సోమవారం మరో దొంగతనం కోసం రెక్కి నిర్వహించేందుకు తిరుగుతున్న దంపతులను ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. విచారణలో ఏడు దొంగతనాలను ఒప్పుకున్నారని, నిందితుల వద్ద నుంచి రూ.9వేల నగదు, రూ.4లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు.
విజయవాడలోనూ చోరీలు
ప్రసాద్ చిన్నతనంలోనే విజయవాడకు వెళ్లి కూలీగా పనిచేసేవాడు. హోటళ్లలో పనిచేసే క్రమంగా చిన్నచిన్న చోరీలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు. ఈ క్రమంలో ధనలక్ష్మి పరిచయం అది ప్రేమకు దారి తీసింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దంపతులిద్దరూ మంచిర్యాల జిల్లా కేంద్రానికి మకాం మార్చారు.
పగటిపూట ప్రసాద్ కాలనీల్లో రెక్కి నిర్వహించి, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. రాత్రి పూట భార్యతో కలిసి చోరీలకు పాల్పడేవాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన సీఐ నారాయణ్‌నాయక్, ఎస్సైలు దేవయ్య, ప్రవీణ్‌కుమార్, కిరణ్‌కుమార్, ప్రత్యేక పోలీస్ బృందం సభ్యులు దివాకర్, శ్రీనివాస్ను ఏసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment