ప్రతీకాత్మక చిత్రం
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): చోరీ చేస్తూ దొంగ పట్టుబడిన ఘటన నెలమంగల తాలూకా త్యాగదహళ్లిలో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ సభ్యుడు రామచంద్ర కుటుంబంతో సహా ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. గురువారం రాత్రి తిరిగి వచ్చారు. తాళం పగలగొట్టిన దృశ్యం చూసి ఇంట్లో దొంగ ఉన్నాడని పసిగట్టి గొళ్లెం పెట్టేశాడు.
స్థానికులను పిలిచి తలుపులు తెరిచి దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని శివమొగ్గకు చెందిన సురేశ్‌గా గుర్తించారు. రామచంద్ర కొత్త ఇల్లు నిర్మిస్తున్నాడని, ఇంట్లో క్యాష్ ఉంటుందని గ్రామానికి చెందిన బాలాపరాధి ఇచ్చిన సమాచారంతో దొంగతనానికి వచ్చినట్లు నిందితుడు సురేష్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. వెనుక ఇంటిలో అరుస్తున్న కుక్కను రాడ్‌తో చంపేసి చోరీకి ఉపక్రమించినట్లు వెల్లడించాడు.
నిందితుడి నుంచి రూ.లక్ష నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. సురేశ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 9కి పైగా చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఎక్కడ చోరీ చేయాలనుకున్నా దగ్గరలో ఉన్న ఆలయంలో దేవుడికి దండం పెట్టుకునే అలవాటు ఉందని, ఆ తర్వాతే దొంగతనానికి వెళ్తునాని సురేష్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment