అప్పలరాజుపురంలో ఆనంద్ అనే బాలుడు ఉండేవాడు. ఆనంద్ అల్లరి పిల్లవాడు. ఇంట్లో, వీధిలో, బడిలో తన అల్లరి వల్ల అమ్మ చేత తిట్లు, చివాట్లు తినేవాడు. ‘‘నువ్వు ఎంత తెలివైనవాడివైనా నీ అల్లరి పనుల వల్ల చెడ్డ బాలుడిగా అందరి చేతా అనిపించుకుంటున్నావు. నీ బుద్ధి మారకపోతే నిన్ను అందరూ ఈసడించుకుంటారు జాగ్రత్త’’ అని హెచ్చరించేవాడు ఆనంద్ తండ్రి.‘‘నిన్ను చూస్తే ముద్దు ముద్దుగా ఉంటావు. అల్లరి చూస్తే రాకాసి బాలుడిలా కనిపిస్తావు’’ అని మందలించేది అమ్మ. ‘‘నేనేమీ అల్లరి పనులు చేయడం లేదు. ఆడుతూ పాడుతూ హుషారుగా ఉంటున్నాను. అయినా నన్ను అందరూ అల్లరి పిల్లాడు అంటుంటారు. మీరు కూడా నన్నే నిందిస్తున్నారు’’ అని బుంగమూతి పెడుతూ అనేవాడు ఆనంద్.‘‘నీకు నీ పనులు అల్లరిపనుల్లా కనిపించవు. కానీ ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తాయి. ఒక్కో సారి చిరాకు పుట్టిస్తాయి. కోపం కూడా తెప్పిస్తాయి. ఆనంద్ మంచి బాలుడు అనిపించు కోవాలని మా ఆశ’’ అనేవారు అమ్మానాన్న.
‘‘నేనేం అల్లరి పనులు చేశాను! మొన్న ఆ మధ్య మన కుక్కపిల్ల నన్ను చూసి తోక ఊపింది. దాంతో దాని తోక మీద పెన్సిల్ ముల్లుతో గుచ్చాను. అంతమాత్రానికే అది నన్ను కరిచేసింది. అప్పుడు అల్లరి నాదా? ఆ కుక్కదా? ఆ మధ్య నా ఫ్రెండ్ గోపీగాడు నా దగ్గర... ‘నీ పెన్సిల్ కన్నా పెద్ద పెన్సిల్ నా వద్ద ఉంది’ అని నా ముందు గొప్పలకు పోయాడు. అందుకే వాడి పెన్సిల్‌ని విరిచేసి ముక్కలు ముక్కలుగా చేసేశాను. అక్కడ నాది అల్లరా? గోపీగాడిదా?మా టీచరమ్మ.. ‘నా బ్యాగ్‌లో వాటర్ బాటిల్ పెట్టరా’ అని చెప్పింది. మూతలేని వాటర్ బాటిల్‌ని ఆమె బ్యాగ్‌లో పెట్టాను. అది తప్పా! టీచర్‌గారు వాటర్ బాటిల్ మూతపెట్టి బ్యాగ్‌లో పెట్టమని చెప్పలేదు కదా!!అంతెందుకు ఆ మధ్య మన వీధి కుళాయి దగ్గర అప్పలమ్మ నీటి కుండ తెచ్చిపెట్టింది. నా మటుకు నేను ఒక్కడినే ఆడుకుంటూ ఎటో రాయి విసిరాను. ఆ రాయికి అడ్డంగా కుండ ఉంది. అందుకే ఆ కుండ పగిలి పోయింది. అందులో నా తప్పు ఏముంది?’’ అని అన్నాడు ఆనంద్ అమాయకంగా ముఖం పెట్టి.ఆనంద్ మాటలు, వివరణలు విని నవ్వాలో, అతణ్ని చూసి జాలిపడాలో తెలియక అయో మయంలో పడ్డారు తల్లిదండ్రులు.‘‘అతితెలివి చూపకు. నువ్వు చెప్పిన అన్ని అంశాలలోనూ తప్పు నీదే’’ అని చిరుకోపం చూపాడు ఆనంద్ తండ్రి.‘‘నిజం రా! కుక్క తోక పట్టుకొని పెన్సిల్‌తో గుచ్చడం, టీచర్ బ్యాగ్‌లో మూతలేని బాటిల్ పెట్టడం, గోపీగాడి పెన్సిల్ విరిచేయడం, అప్పలమ్మ కుండను పగలగొట్టడం సుద్ద అల్లరి పనులు కాక మరేంటి? ఇకనైనా మంచిగా ఉండు’’ అంటూ ముద్దుగా మందలించింది అమ్మ.
‘‘నిజమమ్మా, నిజంగా చెబుతున్నాను. ఇక నుంచి అల్లరి పనులు చేయనే చెయ్యను’’ అంటూ బుద్ధిగా అరగంటసేపు చదువుకున్నాడు ఆనంద్.అమ్మానాన్నా ఎంతో సంతోషించారు. వాళ్ల సంతోషం ఎంతో సమయం నిలబడలేదు.ఆనంద్ స్నానాల గదిలోకి వెళ్లి ఆడుకుంటూ ఆడుకుంటూ కావాలనే స్నానాల సబ్బుని టాయిలెట్‌లో పడేశాడు. పూజ గదికి వెళ్లి అగర్‌బత్తి పుల్లల్ని ముక్కలు ముక్కలుగా విరిచేసి నిప్పుపెట్టాడు. ఇంటిలోకి వచ్చిన పిల్లి పిల్లని కాలితో తన్నబోయి కాలుజారి పడిపోయాడు. స్కూల్‌కి వెళ్లే ముందు కంపాస్ బాక్స్‌లోని సూదిముల్లుతో తన సైకిల్ టైర్‌కి పొడిచాడు. సైకిల్ పని చేయకపోతేనాన్న మోటారు బైక్ మీద తనని స్కూల్‌లో దిగబెడతాడన్నది ఆనంద్ ఆశ. అమ్మ తలపట్టుకొని ‘‘ఈ వెధవను ఎలా బాగు చెయ్యాలిరా దేవుడా’’ అని దిగులు పడింది.‘‘ఈ వెధవని పట్నంలో ఒక హాస్టల్‌లో చేరిస్తే తిక్క కుదురుతుంది. అయినా వీడికి ఈ కోతిచేష్టలేమిటో?’’ అంటూ మథనపడ్డాడు నాన్న. ‘‘ఎప్పుడో వీడికే జ్ఞానోదయం కలుగుతుంది. అప్పుడే ఈ తుంటరి పనులు మానుతాడు’’ అని అమ్మానాన్న అనుకున్నారు. ఆ రోజుల కోసం ఎదురు చూశారు.
‘‘రాత్రి దొంగలుపడ్డారు. మన ఇంటి ప్రహరీ దాటి వచ్చారు, మోటారుబైక్ తీసుకెళ్లడానికి. కుదరక ఆనంద్ సైకిల్ పట్టుకుపోవడానికి ప్రయత్నించారు. కానీ కుక్క అరవడంతో దొంగలు భయపడ్డారు. దొంగలు దాన్ని కర్రతో కొట్టినా, అది ప్రాణాలకు తెగించి ఆనంద్‌గాడి సైకిల్ పోకుండా కాపాడింది’’ అన్నాడు ఆనంద్ తండ్రి. ఆనంద్ తన కుక్కపిల్లని మెచ్చుకున్నాడు. తాను దాని తోక మీద పెన్సిల్‌తో గాయపరిచినామనసులో ఉంచు కోకుండా తన సైకిల్‌ని కాపాడినందుకు ఇకపై కుక్కతో స్నేహంగా ఉండాలనుకున్నాడు.ఒకరోజు ‘‘నాన్న సబ్బు లేకుండా స్నానం చేశాడు. సబ్బు కొనడానికి నాన్న దగ్గర డబ్బులు లేవు’’ అని అమ్మ చెప్పడంతో ఆనంద్ మనసు బాధపడింది. నాన్న కష్టపడి తెచ్చి పొదుపుగా వాడుతున్న వస్తువులను పాడు చేయకూడదని అప్పుడు నిర్ణయించుకున్నాడు.‘‘ఈ పిల్లికి మనం స్వయంగా పాల బువ్వ పెడితే తప్ప దొంగ తనంగా ఇంట్లో ఏ వంటకాన్నీ ముట్టుకోదు’’ అని అమ్మానాన్నా అనుకోవడం విని పిల్లి చాలా మంచిది, దాన్ని హింసించకూడదు అనుకున్నాడు ఆనంద్.వీధిలో ఇరుగు పొరుగిల్ల పిల్లలు తనని చూసి స్నేహంగా నవ్వుతున్నారు. అలాంటి వాళ్లతో స్నేహంగా ఉండాలి తప్ప అల్లరితో గాయపర్చకూడదని తాతయ్య చెప్పిన నీతికథల ద్వారా తెలుసుకొని అప్పటి నుంచి వీధిలో మంచి బాలుడిగా గుర్తింపు పొందాడు.
తన పుట్టినరోజునాడు స్కూల్‌లో బెంచ్‌మేట్స్ గోపీ, రాధిక తనకి మంచి మంచి గిఫ్ట్స్ తెచ్చి ఇచ్చారు. టీచర్స్ అందరూ ప్రార్థనా సమయంలో ‘‘ఆనంద్ పాఠశాల పిల్లలందరికన్నా తెలివైనవాడు, అల్లరి మానేస్తే అతడు భవిష్యత్‌లో గొప్పవాడవుతాడు’’ అని చెప్పడంతో అప్పటి నుంచి బడిలో అల్లరి పనులు చేయడం మానేశాడు.మట్టి కుండలో కుళాయి నీళ్లు పట్టి తీసుకెళ్తున్న పేదలు కుండలు పోతే మరోకుండ కొనడానికి పడే ఇబ్బందుల గురించి తనకు మేనత్త చెప్పడంతో ఇకపై తనెప్పుడూ అల్లరి పనులు చేయకూడదని ఆనంద్‌నిశ్చయించుకున్నాడు.నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. అందుకే కాబోలు ఆనంద్ అల్లరి పనులు చేస్తున్నప్పుడు చివాట్లుపెడుతూ, చీదరించుకుంటూ, విరోధులుగా ఉండే మనుషులే ఆనంద్ మంచి బాలుడని అంటున్నారు. అందుకే ఆనంద్ నిర్ణయించుకున్నాడు – ‘‘అల్లరి సరదాగా ఉండాలి తప్ప ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదు’’.
- ఎం.వి. స్వామి
ఆనంద్ మంచి బాలుడు
Published Sun, Apr 1 2018 2:16 AM | Last Updated on Sun, Apr 1 2018 2:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment