చిల్ల‌ర దొంగ‌ | funday crime story | Sakshi
Sakshi News home page

చిల్ల‌ర దొంగ‌

Published Sun, Jul 8 2018 1:12 AM | Last Updated on Sun, Jul 8 2018 1:12 AM

funday crime story - Sakshi

రాత్రి పదకొండు కావస్తోంది. కర్నూల్‌ పట్టణం పొలిమేరల్లో ఓ కాలనీ! మెయిన్‌ రోడ్డులోని వైన్‌షాపులో ఓ పెగ్గు వేసుకున్నాక కాలనీలోకి ప్రవేశించాడు రఘు. ఆ రోజు ఆదివారం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.రఘు ఓ చిల్లరదొంగ. జేబులు కొట్టడం, సామాన్లు తస్కరించడం, మారు తాళం చెవులతో ఇళ్ల తాళాలు తెరిచి దొంగతనం చేయడంలాంటివి చేస్తుంటాడు. ఓసారి పట్టుబడి జైలుకి కూడా వెళ్లొచ్చాడు. రాత్రుళ్లు దొంగతనానికి బయల్దేరే ముందు ధైర్యం కోసం ఓ పెగ్గు పుచ్చుకోవడం అతనికి అలవాటు.రోడ్డుపై పరధ్యానంగా నడుస్తున్న రఘు ఎవరో పలకరించడంతో తల తిప్పి చూశాడు. నిండుగా బురఖా ధరించిన ఓ స్త్రీ చీకట్లోంచి బయటికొచ్చింది. ఆమె కళ్లు తప్ప ముఖం కనిపించడం లేదు. ‘‘రఘు..! ఓ చిన్న దొంగతనం చేస్తావా? నువ్వు అడిగినంత డబ్బిస్తాను’’ గుసగుసగా అంది. రఘు ఆశ్చర్యపోయాడు. ‘‘మీరెవరు? నా పేరు మీకెలా తెలుసు?’’ అనడిగాడు.

‘‘అదంతా నీకు అనవసరం. అక్కడ ఓ ఇంట్లో భార్యాభర్తలు పొరపాటున తలుపుకి తాళం వేయడం మరిచిపోయి బయటికెళ్లారు. ఇప్పట్లో తిరిగిరారు. ఆ ఇంటి బెడ్‌రూమ్‌లోని అల్మారాలో ఓ చిన్న బ్యాగ్‌ ఉంది. అందులో కొన్ని పత్రాలున్నాయి. ఆ బ్యాగ్‌ నాకు తెచ్చి ఇస్తే, నీకు పదివేలు ఇస్తాను’’ అందామె. పదివేలు అన్న మాట వినగానే రఘు కళ్లు మెరిశాయి.అంతలోనే అతనికొక అనుమానం వచ్చింది. ‘‘ఇంటికి తాళం లేదన్నారు. మరి మీరే వెళ్లి ఆ బ్యాగ్‌ను తీసుకోవచ్చు కదా’’ అన్నాడు రఘు.‘‘ఇంటికి తాళం లేకున్నా అల్మారాకి తాళం వేసి ఉంది. తాళం తెరవడం నాకు చేతకాదు. అందుకే నీకు చెబుతున్నాను’’ అంది ఆ బురఖాలోని స్త్రీ.‘‘సరే.. ఆ ఇల్లు ఎక్కడుందో చూపించండి’’ రఘు ఉత్సాహంగా అడిగాడు. ఆమె అతణ్ని ఆ రోడ్డు చివర్లో ఉన్న ఓ ఇంటి దగ్గరికి పిలుచుకెళ్లింది. ‘‘ఇదే ఆ ఇల్లు. వెంటనే లోపలికెళ్లి బ్యాగు తీసుకురా. నేను ఆ కారు వెనుక నిల్చొని నీ కోసం ఎదురు చూస్తుంటాను’’ అంటూ ఆమె అక్కడికి కొద్ది దూరంలో రోడ్డు పక్కన పార్క్‌ చేసి ఉన్న కారువైపు వెళ్లిపోయింది.రఘు అటూఇటూ చూశాడు. ఎక్కడా మనిషి జాడలేదు. అతను హుషారుగా ఆ ఇంటి గేటు తెరిచి కాంపౌండులోకి ప్రవేశించాడు. ఆ స్త్రీ చెప్పినట్టే ఇంటి ముఖ ద్వారానికి తాళం లేదు. తలుపు నెట్టగానే తెరుచుకుంది. రఘు చప్పుడు చేయకుండా లోపలికి ప్రవేశించాడు. ఇంట్లో చడీచప్పుడు లేదు. హాల్లో ఉన్న జీరో లైటు తప్ప ఏ గదిలోనూ లైట్లు వెలగడం లేదు. దాన్నిబట్టి ఇంట్లో ఎవరూ లేరని రఘుకి అర్థమైంది.

చేతిలో ఉన్న టార్చీని వెలిగించాడు. ఆ వెలుగులో ఒక్కో గదిని పరిశీలించాడు. ఓ గదిలో తలుపుకి ఎదురుగానే అల్మారా కనిపించింది. వెంటనే లోపలికెళ్లి మారు తాళం చెవులతో కొద్దిసేపట్లోనే దాన్ని తెరిచాడు. కానీ లోపల బ్యాగు కనపడలేదు. దానికి బదులు కొన్ని నోట్ల కట్టలు, బంగారు నగలు ఉన్నాయి. ఏదైతే తనకేం అనుకుంటూ రఘు ఆనందంగా వాటిని తన జేబుల్లో పెట్టుకున్నాడు. ఆ స్త్రీ చెప్పిన బ్యాగుతో తనకేం పని? ఆమె ఇస్తానన్న దానికి ఎన్నోరెట్లు ఎక్కువ సొమ్ము దొరికింది. ఆ సొమ్ముతో ఎక్కడికైనా పారిపోయి హాయిగా బతకొచ్చుననుకున్నాడు. ఆ బురఖా స్త్రీ కూడా దొంగే కాబట్టి తన గురించి పోలీసులకు చెప్పే సాహసం చేయదనుకున్నాడు.ఆ గదిలో ఇంకేమైనా దొరుకుతుందేమోననే ఆశతో మంచం ఉన్నవైపు టార్చి వేశాడు. ఆ వెలుగులో కనపడిన దృశ్యం చూసి అదిరిపడ్డాడు. మంచం పక్కన నేల మీద ఓ స్త్రీ మృతదేహం ఉంది. ఆమె గొంతుకి వైరు చుట్టబడి ఉంది. కళ్లు బయటికి పొడుచుకొచ్చాయి. కొద్దిసేపటి క్రితమే ఆమెనెవరో చంపేశారు. బహుశా ఆ బురఖా స్త్రీయే ఈ హత్య చేసి తనని ఇరికించినట్టుంది. ఇక తను అక్కడుంటే ప్రమాదమని రఘు గబగబా తలుపువైపు పరిగెత్తాడు.తలుపు తెరవబోయాడు. కానీ అది తెరుచుకోలేదు. తను ఇంట్లోకి ప్రవేశించాక ఆ బురఖా స్త్రీ తలుపుకి బయటి నుంచి గొళ్లెం పెట్టినట్టుంది. ఇక పెరటి వాకిలి గుండా బయట పడాలనుకుని ఇంటి వెనుకవైపు పరిగెత్తాడు. కానీ ఆ తలుపు కూడా తెరుచుకోలేదు. తను పూర్తిగా ఇరుక్కుపోయానని రఘుకి అర్థమైంది. దిక్కుతోచక ఇల్లంతా తిరగసాగాడు.అంతలో ఇంటి ముందు జీపు ఆగిన చప్పుడైంది. కాసేపట్లో ముందు వాకిలి తలుపు తెరుచుకుంది. బిలబిలమంటూ లోపలికొచ్చిన పోలీసులు రఘుని చుట్టుముట్టారు.

రఘు చెప్పింది ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ కుమార్‌ నమ్మలేదు. ‘‘నువ్వొక దొంగవని అందరికీ తెలుసు. ఓసారి జైలుకి కూడా వెళ్లొచ్చావ్‌. జైలులో బాగా రాటుదేలినట్టున్నావ్‌. ఈసారి దొంగతనంతో పాటు హత్య కూడా చేశావ్‌. అయితే నువ్వు ఈ ఇంట్లోకి దూరడాన్ని అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూశాడు. బయటి తలుపుకి గొళ్లెం పెట్టి అతనే మాకు ఫోన్‌కాల్‌ చేసి చెప్పాడు. అందువల్లే వెంటనే మేము ఇక్కడికొచ్చి నిన్ను పట్టుకోగలిగాం. ఇప్పుడు నువ్వు కట్టుకథ చెబితే నమ్ముతామా?’’ అన్నాడు విజయ్‌.‘‘ఇదంతా ఆ బురఖా స్త్రీ పనే సార్‌..! తను హత్య చేసి నన్ను ఇరికించింది’’ బేలగా అన్నాడు రఘు.‘‘షటప్‌!! గొంతుకి వైరు బిగించి చంపడం ఓ స్త్రీకి సాధ్యమయ్యే పనికాదు. ఈ పని మగాడే చెయ్యగలడు. అందువల్ల ఇది నీ పనే’’ కరాఖండీగా అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.తర్వాత విజయ్‌ ఇరుగుపొరుగు వారి ద్వారా హతురాలి వివరాలు సేకరించాడు. ఆమె పేరు లక్ష్మి అని, భర్త పేరు రాంబాబు అని తెలిసింది. ఇంట్లో వారిద్దరు తప్ప పనిమనిషి కూడా లేదని, రాంబాబు తరచుగా బిజినెస్‌ పని మీద హైదరాబాద్‌ వెళ్తుంటాడని పక్కింటి గురునాథం చెప్పాడు. రాత్రి పది గంటలకు రాంబాబు కారులో హైదరాబాద్‌కి బయల్దేరడం తాను కిటికీలో నుంచి చూశానని ఎదురింటి మాలిని చెప్పింది.మృతురాలు లక్ష్మి సెల్‌ఫోన్‌లో ఉన్న రాంబాబు నంబర్‌ చూసి అతనికి ఫోన్‌ చేసి విషయం తెలిపాడు విజయ్‌. హైవేలో హైదరాబాద్‌ వైపు కారులో వెళ్తున్న రాంబాబు.. భార్య హత్యకి గురైందని వినగానే షాక్‌కి గురయ్యాడు. వెంటనే కర్నూల్‌కి తిరిగొస్తానన్నాడు. గంట తర్వాత తిరిగొచ్చాడు.ఆలోగా ఫొటోగ్రాఫర్లు, ఫోరెన్సిక్‌ నిపుణులు తమ పని పూర్తి చేశారు. అప్పటికే పంచనామా ముగించిన విజయ్‌ చివరగా రాంబాబు స్టేట్‌మెంట్‌ తీసుకున్నాడు. ‘‘నేను పది గంటలకు ఇంటి నుంచి బయల్దేరాను. తలుపు వేసుకోమని లక్ష్మికి చెప్పాను. ఆమె మరిచిపోయినట్లుంది. తలుపు వేసి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదు’’ అంటూ వాపోయాడు రాంబాబు.
∙∙ 
పోస్టుమార్టమ్‌ రిపోర్టు చూశాక ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కి ఓ విషయం అర్థమైంది. అదేమిటంటే ఈ హత్యకి రఘుకి ఎలాంటి సంబంధం లేదని. అసలు హంతకుని కోసం ఇన్‌వెస్టిగేషన్‌ మొదలెట్టాడు. ఆదివారం రాత్రి రాంబాబు ఇంట్లోకి ప్రవేశించాక బయటి నుంచి తలుపుకి గడియపెట్టి పోలీసులకు ఫోన్‌ చేసిన అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ఫోన్‌ నంబర్‌ గురించి ఆరా తీస్తే అది రాంబాబు ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ పబ్లిక్‌ బూత్‌దని తెలిసింది. తర్వాత రాంబాబు కాల్‌ రికార్డ్స్‌ గురించి కూపీ లాగాడు. తన ఎదురింట్లో ఉండే మాలినికి రాంబాబు తరచుగా ఫోన్లు చేసేవాడని, హత్య జరిగిన రాత్రి కూడా తొమ్మిది గంటలకు అతను మాలినికి ఫోన్‌ చేశాడని తెలిసింది.విజయ్‌ వెంటనే మాలినిని పోలీస్‌ స్టేషన్‌కి పిలిపించి ప్రశ్నించాడు. ‘‘రాంబాబు, నేను కలిసే చదువుకున్నాం. తను నా క్లాస్‌మేట్‌. ఆ చనువుతోనే నాకు ఫోన్‌ చేసేవాడు. అంతమాత్రాన నన్ను అనుమానిస్తారా?’’ మాలిని మండిపడింది.

విజయ్‌ ఆమెకు జవాబు చెప్పేలోగా.. లాకప్‌లో ఉన్న రఘు ఊచల్లోంచి మాలినిని పరీక్షగా చూస్తూ ఉలిక్కిపడ్డాడు. ‘‘సార్‌..! ఆ బురఖా స్త్రీ ఎవరో కాదు. ఈవిడే..!!’’ అంటూ అరిచాడు.‘‘నువ్వు ఆమె ముఖం చూడలేదన్నావ్‌ కదా! ఇప్పుడెలా గుర్తుపట్టావ్‌?’’ విజయ్‌ ఆశ్చర్యంగా అడిగాడు.‘‘ముఖం చూడకపోయినా కళ్లను చూశాను. ఆమెవి పిల్లి కళ్లు. ఈమెవి కూడా పిల్లి కళ్లే. అప్పుడామె గొంతు మార్చి నాతో మాట్లాడింది. గొంతు మారిస్తే తనని గుర్తుపట్టననుకుంది. గొంతు మార్చినా కళ్లను మార్చలేకపోయింది. ఆ కళ్లే ఇప్పుడామెని పట్టించాయి’’ హుషారుగా అన్నాడు రఘు.మాలిని ముఖం పాలిపోయింది. విజయ్‌ సైగ చేయగానే, అక్కడే ఉన్న లేడీ కానిస్టేబుల్‌ మాలిని పక్కకు తీసుకెళ్లింది. తనదైన స్టయిల్లో ఆ కానిస్టేబుల్‌ అడిగేసరికి మాలిని నేరం ఒప్పుకుంది. విజయ్‌ వెంటనే రాంబాబుని అరెస్ట్‌ చేశాడు. గత్యంతరం లేక రాంబాబు నేరం ఒప్పుకొని జరిగిందంతా చెప్పసాగాడు.

‘‘నాకు, మాలినికి కాలేజీ రోజుల నుంచి స్నేహం ఉంది. ఆ చనువుతోనే తనకు దగ్గరయ్యాను. ఈ విషయం నా భార్యకు తెలియదు. లక్ష్మి మైగ్రేన్‌ తలనొప్పితో తరచూ బాధపడేది. ఆ సమయంలో తను నిద్రమాత్రలు వేసుకుని పడుకునేది. అప్పుడు నేను మాలిని ఇంటికి వెళ్లేవాణ్ని. ఆ రోజు రాత్రి లక్ష్మికి మాపై అనుమానం వచ్చినట్టుంది. తలనొప్పి లేకపోయినా నిద్రమాత్రలు వేసుకున్నట్లు నటించి పడుకుంది. ఆమె నిజంగానే పడుకుందనుకుని, నేను మాలిని ఇంటికి వెళ్లాను. కొద్దిసేపయ్యాక లక్ష్మి మాలిని ఇంటికి వచ్చి, మమ్మల్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇక కోపంతో నన్ను తిట్టుకుంటూ మా ఇంట్లోకి వచ్చేసింది. వెంటనే తననే ఫాలో అవుతూ నేనూ మా ఇంటికొచ్చాను. ఇద్దరి మధ్యా వాగ్వావాదం జరిగింది. ఇంక ఆవేశం తట్టుకోలేక నేనే నా భార్యను చంపేశాను. ఆవేశం తగ్గాక ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే పక్కవీధిలో ఉండే చిల్లరదొంగ రఘు గుర్తొచ్చాడు. ఆ హత్య కేసులో అతణ్ని ఇరికించాలని నేను, మాలిని పథకం వేశాం. మాలిని తన ఇంట్లో ఉన్న స్నేహితురాలి బురఖాను ధరించి రఘుని బోల్తా కొట్టించి మా ఇంట్లో బందీ చేసింది. నేను పబ్లిక్‌ ఫోన్‌ నుంచి మీకు ఫోన్‌ చేశాక హైదరాబాద్‌కి బయల్దేరాను. అంతా ప్లాన్డ్‌గా చేశామనుకున్నాం.. కానీ’’ అని ఆగాడు రాంబాబు.‘‘మీరు అంత ప్లాన్డ్‌గా చేసినా.. ఎలా దొరికామా.. అని ఆలోచిస్తున్నావా? తప్పు నీది కాదు. నీ సెల్‌ఫోన్‌ది. ఆ రోజు రాత్రి హత్య జరిగిన  సమయంలో నువ్వు ఇంట్లోనే ఉన్నావని అది మాకు చెప్పేసింది. ఆ రాత్రి పది, పదకొండు గంటల మధ్య హత్య జరిగిందని పోస్టుమార్టమ్‌లో తేలింది. కానీ రాత్రి పది గంటలకే నువ్వు హైదరాబాద్‌ బయల్దేరానని మాతో అబద్ధం చెప్పావ్‌. కానీ నీ సెల్‌ఫోన్‌ రికార్డ్స్‌ పరిశీలిస్తే ఆ రోజు రాత్రి పదకొండు వరకు నీ సెల్‌ లొకేషన్‌ నీ ఇంటి పరిధిలోనే ఉన్నట్లు తెలిసింది. దాన్నిబట్టి ఈ హత్య నువ్వే చేశావని మాకు అనుమానం కలిగింది. చివరికి అదే నిజమైంది’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.
- మహబూబ్‌ బాషా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement