దెయ్యాల్లేవ్‌ గియ్యాల్లేవ్‌ | funday crime story | Sakshi
Sakshi News home page

దెయ్యాల్లేవ్‌ గియ్యాల్లేవ్‌

Published Sun, Dec 17 2017 12:26 AM | Last Updated on Sun, Dec 17 2017 12:26 AM

funday crime story - Sakshi

ఆ చీకట్లో వాళ్లను అలా చూస్తే దెయ్యాలు ఉన్నాయనే అనుకుంటారు ఎవరైనా. ఇద్దరు మనుషులు వాళ్లు! ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. వాళ్ల మధ్యలో ఖరీదైన గుండ్రటి చెక్క బల్ల ఉంది. ఆ బల్ల మీద ఖరీదైన మద్యం సీసా ఉంది. ఉండడానికైతే ఉంది. ఆ ఇద్దరూ తాగడం లేదు. ఆ ఇద్దరికీ తాగే అలవాటు లేదు. చీకట్లో చాలాసేపటిగా చలనం లేకుండాచలికి గడ్డ కట్టుకుపోయినట్లున్న రెండు పొడవాటి చెట్ల మధ్య..  వాళ్లను మనుషులుగా పోల్చుకోవడం ఎంతటి ధైర్యవంతులకైనా కష్టమే. పైగా వాళ్లు తక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కువగా ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు.. కలర్‌ టీవీలు అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న కాలం నాటి క్షుద్ర రచయిత. ఇంకొకరు ‘ఘోరై’ అనే పెన్‌ నేమ్‌తో హాబీగా దెయ్యాల కథలు రాస్తూ, దెయ్యాలు లేవని నిరూపించడానికి ట్రై చేస్తున్న ప్రస్తుత రచయిత. ఘోరై అంటే ఘోస్ట్‌ రైటర్‌. 

‘‘దెయ్యాలు లేవని నిరూపించడానికి నువ్వెవరు? ఆ పని చేయడానికి విజ్ఞాన వేదిక వాళ్లో, అజ్ఞాన దీపిక వాళ్లో ఉంటారు కదా’’ అన్నాడు క్షుర.. చాలాసేపు ఘోరై చెప్పింది విన్నాక. అప్పటికే నడి రాత్రి దాటింది. ‘‘అది నా ధర్మం అనుకున్నాను సార్‌’’ అన్నాడు ఘోరై. ‘‘పౌరుడిగా.. పాటించడానికి, అవలంబించడానికి, అనుసరించడానికి పౌర సమాజంలో ఇంకా అనేక ధర్మాలు ఉంటాయి. నువ్వు దెయ్యాలనే ఎందుకు పట్టుకున్నావు?’’ అడిగాడు క్షుర. పెద్దగా ఏడ్చేశాడు ఘోరై. ఆ ఏడుపు మనిషి ఏడుస్తున్నట్లుగా లేదు.‘‘ఊరుకో.. ఎందుకు ఏడుస్తున్నావ్‌?’’ అన్నాడు క్షుర. అతడి వృద్ధాప్యపు దవడ చలికి వణుకుతోంది. ‘‘పాటించడం, అనుసరించడం, అవలంబించడం.. ఎలా ఉండే భాష ఎలా అయిపోయింది సార్‌.. మీది! మీ దెయ్యం కథలు చదివి వణికి చచ్చిన జనరేషన్‌ మాది. మీ మాట ఎంత షార్ప్‌గా ఉండేది! శవం కాలుతున్నప్పుడు పుర్రె ‘టప్‌’మని పేలినట్లు ఉండేది. అదంతా ఏమైపోయింది సార్‌. అందుకే ఏడుపొచ్చింది’’ అన్నాడు ఘోరై. ‘‘అవన్నీ గుర్తు చెయ్యకు. ఎందుకొచ్చావ్‌ చెప్పు’’ అన్నాడు క్షుర విసుగ్గా. 
క్షుర హర్ట్‌ అయ్యాడని ఘోరైకి అర్థమైంది. తన కథల్లో దెయ్యాల్ని కూడా చాలాసార్లు హర్ట్‌ చేశాడు ఘోరై. పాఠకులకు ధైర్యం చెప్పడానికి అతడు చేసిన ఘాతుకం అది. అతడి కథల్లో ఒక్కచోటైనా ‘దెయ్యాల్లేవ్‌ గియ్యాల్లేవ్‌’ అనే మాట ఉంటుంది. ఆ మాట టెంపరరీగా మనుషులకు ధైర్యం తెప్పించినా, దెయ్యాలను పర్మినెంట్‌గా హర్ట్‌ చేస్తుందేమోనన్న ఆలోచన అతడికెప్పుడూ కలగలేదు. ‘‘ఏంటి నీ సమస్య?’’ అడిగాడు క్షుర. ‘‘నన్ను రాయొద్దంటున్నారు సార్‌’’ అన్నాడు ఘోరై.‘‘ఏం రాయొద్దంటున్నారు? ఎవరు రాయొద్దంటున్నారు?’’

‘‘దెయ్యాల కథల్ని. పాఠకులు’’‘‘ఎందుకట?’’ అడిగాడు క్షుర. ‘‘పిల్లలు భయపడుతున్నారట’’.‘‘మంచిదే కదా. పిల్లలు ఎవరో ఒకరికి భయపడాలి. తల్లిదండ్రులకు భయపడడం లేదు. టీచర్లకు భయపడం లేదు. దేవుడికి భయపడడం లేదు. దెయ్యం భయమైనా లేకపోతే ఎలా? వాళ్లెలా మంచి పౌరుల్లా ఎదుగుతారు?’’ అన్నాడు క్షుర. ఘోరై మనసు మళ్లీ చివుక్కుమంది. తన గురు సమానుడైన క్షుర నోటి నుంచి ‘మంచి పౌరుల్లా ఎదగడం’ అనే దైవ భాష దిగుమతి అయినందుకు కలిగిన బాధ అది. ‘‘కానీ సార్‌..దెయ్యాలు ఉన్నాయని రాసి నేను పిల్లల్ని భయపెట్టడం లేదు. దెయ్యాలు లేవని రాసి పిల్లల్ని ధైర్యవంతుల్ని చేస్తున్నాను’’ అన్నాడు ఘోరై. ‘‘పిల్లలకు భయమే లేనప్పుడు వాళ్లకు ధైర్యం ఎందుకు చెప్పాలి?’’ అన్నాడు క్షుర. ‘‘అంటే.. సార్, ముందు భయపట్టి, తర్వాత ధైర్యం చెబుతాను. అదీ నా స్టెయిల్‌ ఆఫ్‌ రైటింగ్‌’’ అన్నాడు ఘోరై.. చేతులు నలుపుకుంటూ.ఘోరై వైపు తీక్షణంగా చూశాడు క్షుర.‘‘మరి పాఠకులకు వచ్చిన ప్రాబ్లం ఏంటి?’’ అన్నాడు. ‘‘దెయ్యాలు ఉంటే ఉన్నాయని చెప్పాలి కానీ, లేనప్పుడు లేవని చెప్పడం ఎందుకు అంటున్నారు సార్‌.’’‘‘నిజమే కదా’’అన్నాడు క్షుర. ‘‘అసలు ఈ పాఠకులకు ఏం కావాలి సార్‌. పిచ్చి పట్టిపోతోంది నాకు. రాసింది వద్దంటారు. రాయంది కావాలంటారు! చచ్చి, దెయ్యమై పిల్లల్ని తప్ప మిగతా ఇంటిల్లపాదినీ పీక్కుతినాలన్నంత కోపం వస్తోంది సార్‌’’ అన్నాడు ఘోరై. అతడి ఆవేదనను గమనించాడు క్షుర. ‘‘ఐ కెన్‌ అండర్‌స్టాండ్‌. ప్రతి దెయ్యాల రచయితకీ ఉండే ప్రాబ్లమే ఇది’’ అన్నాడు. ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉన్నారు. 

‘ఏం చెయ్యమంటారు సార్‌’ అన్నట్లు చూస్తున్నాడు ఘోరై.క్షుర అతడికి ఏమీ చెప్పలేకపోయాడు. ముప్పై ఏళ్ల క్రితం తనకొచ్చిన సమస్యే ఇప్పుడీ వర్థమాన రచయితకీ వచ్చింది.‘‘రాస్తే ఏమౌతుందట?’’ అడిగాడు ఘోరైని.‘‘చంపేస్తారట సార్‌. బెదిరిస్తున్నారు’’‘‘రాయడం మానేస్తే ఏమౌతుంది?’’‘‘చచ్చిపోతాను సార్‌. రాయకుండా ఉండలేను’’.నిట్టూర్పు విడిచాడు క్షుర. ‘‘టేబుల్‌ మీద ఉన్న ఈ బాటిల్‌ చూశావా? ఫుల్‌ బాటిల్‌. పక్కనే సోడా,  గ్లాసులు. తాగడం నాకు ఇష్టం. కానీ మానేశాను. ఇరవై ఏళ్ల క్రితం క్షుద్ర కథలు రాయడం మానేసిన రోజు నేరుగా వైన్‌ షాపుకు వెళ్లి, కొనితెచ్చుకున్న బాటిల్‌ ఇది. అప్పట్నుంచీ కథ రాయలేదు, ఈ బాటిలూ ఓపెన్‌ చెయ్యలేదు. ఎప్పుడైనా మనసు పీకుతుంది. ఒక్క దెయ్యం కథైనా రాయాలని. రాయకుండా ఉండడం కోసం వెంటనే బాటిల్‌ బయటికి తీస్తాను. ఈ బాటిల్‌లో నీకు మందు కనిపిస్తోంది కదా. నాకు దెయ్యం కనిపిస్తుంది. దెయ్యం కథ రాయాలన్న నా కోరికను దెయ్యంలా ఈ సీసాలో బంధించాను నేను’’.. మరోసారి నిట్టూర్పు విడిచాడు క్షుర. ఘోరై ఆ బాటిల్‌ వైపు చూశాడు. ‘మూత తెరవండీ.. మూత తెరవండీ’ అని బాటిల్‌ లోపల్నుంచి ఎవరో రోదిస్తున్నట్లుగా అనిపించింది. క్షుర వైపు చూశాడు. అతడి కళ్లు చెమ్మగిల్లి ఉన్నాయి. ‘‘ఈ పాఠకులు మనుషులు కాద్సార్‌’’ అని పైకి లేచాడు.‘‘పాఠకులను అనకు. మనమే మనుషులం కాదు’’ అని క్షుర కూడా పైకి లేచాడు. ఇద్దరూ పైకి లేచిన రెండు క్షణాలకు, అప్పటి వరకు శిలల్లా బిగుసుకుపోయి ఉన్న ఆ రెండు పొడవాటి చెట్లూ ఊగడం మొదలుపెట్టాయి! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement