న్యూఢిల్లీ: క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్‌ఐపీ– సిప్) పై ఇన్వెస్టర్ల భరోసా పెరుగుతోంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) సెప్టెంబర్ తాజా గణాంకాల ప్రకారం– సిప్‌లోకి సమీక్షా నెల్లో రికార్డు స్థాయిలో రూ.24,509 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
సిప్‌లోకి ఒకే నెలలో ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక సంపద వైపు మళ్లుతున్న పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ఈ పరిణామం తెలియజేస్తోందని ఏఎంఎఫ్‌ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని అన్నారు. కాగా, ఆగస్టులో సిప్‌లోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.23,547 కోట్లు.
ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.34,419 కోట్లు..
ఇక మొత్తంగా చూస్తే, ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్లు సెప్టెంబర్‌లో 10 శాతం (ఆగస్టుతో పోల్చి) పడిపోయి రూ.34,419 కోట్లుగా నమోదయ్యాయి. లార్జ్ క్యాప్, థీమెటిక్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. అయితే ఈక్విటీ ఫండ్స్‌లోకి నికర పెట్టుబడులు సుస్థిరంగా 43 నెలలుగా కొనసాగుతుండడం సానుకూల అంశం. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసానికి ఇది అద్దం పడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంన్నాయి. ఇక ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఆగస్టులో రూ.66.7 లక్షల కోట్లు ఉంటే, సెప్టెంబర్‌లో రూ.67 లక్షల కోట్లకు ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment