క్షణ క్షణం... | Funday crime story in this week | Sakshi
Sakshi News home page

క్షణ క్షణం...

Published Sun, Nov 4 2018 2:12 AM | Last Updated on Sun, Nov 4 2018 2:12 AM

Funday crime story in this week - Sakshi

రాత్రి ఏడు కావస్తోంది.రోడ్డు దాటుతున్న అతన్ని ఎదురుగా వచ్చిన కారు గుద్దింది. కారు ముందుభాగం అంచు తగలడంతో తుళ్లిపడి విసురుగా వెనక్కు తూలిపడ్డాడతను. చేతిలోని న్యూస్‌పేపర్‌ చుట్టిన కవర్‌ దూరంగా పడి అందులోని బాటిల్‌ బద్దలైంది. ఒక్కసారిగా విస్కీ వాసన గుప్పుమంది.అతనికి పెద్దగా దెబ్బలు తగల్లేదు. డ్రైవింగ్‌ సీటులోని అమ్మాయి డోరు తెరుచుకుని అతన్ని సమీపించింది. ‘‘సారీ సర్‌! తప్పయిపోయింది’’ అందామె అపరాధం చేసినట్టు.‘‘ఐయామ్‌ ఓకే, డోంట్‌ వర్రీ’’ అని చెప్పి, దూరంగా పడిన ప్యాకెట్‌ అందుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో పడేశాడు. అది ట్రాఫిక్‌ లేని రోడ్డుకావడంతో జనం మూగలేదు.‘‘మీకు నేను వేరే బాటిల్‌ కొనిస్తాను’’ చెప్పిందామె. ‘‘అవసరం లేదు. షాపు మూసేశారు’’ తాపీగా అన్నాడతను.ఆమె వైన్‌షాపు వైపు దృష్టి సారించి, ఆ తర్వాత అతన్ని ఆశ్చర్యంగా చూసింది. ఆ హడావుడిలో కూడా వెనుక వైపు వైన్‌షాపు షట్టర్‌ మూసిన శబ్దం అతను విన్నాడని గ్రహించడం వల్ల కలిగిన ఆశ్చర్యం అది.‘‘ఇప్పుడు మీకేమైనా పని ఉందా?’’ అడిగిందామె.‘‘లేదు’’ చెప్పాడతను.‘‘ఇంట్లో బోర్‌ కొడుతుంటే షాపింగ్‌కి వచ్చాను. మీరు కలిశారు. నా దగ్గర స్కాచ్‌ ఉంది’’అతను మౌనంగా ఉండిపోయాడు. ‘‘అనుమానాలు పెట్టుకోవద్దు. ఇంట్లో ఎవరూ లేరు’’ నవ్వుతూ చెప్పిందామె.‘‘పదండి’’ అన్నాడతను ఒక నిర్ణయానికి వచ్చినట్టు.ఇద్దరూ ఎక్కాక కారు బయల్దేరింది. ఆ వీధిలోంచి కుడివైపు తిప్పి మెయిన్‌ రోడ్డులోని ట్రాఫిక్‌లోకి పోనిచ్చింది కారు. ఢిల్లీ నగరంలో సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్రాఫిక్‌ అధికంగా ఉంటుంది.

‘‘మీ పేరు?’’ అడిగాడతను.‘కీర్తన’’ డ్రైవింగ్‌ మీద నుంచి దృష్టి మరల్చకుండానే చెప్పింది.‘‘ఏం చేస్తుంటారు?’’‘‘సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ని... మీరేం చేస్తుంటారు?’’ అడిగిందామె.‘‘సెక్రటరియేట్‌లో యూడీసీని. ఆఫీసు అయ్యాక మందు కొనుక్కుని రూమ్‌కు తీసుకుపోవడం అలవాటు. ఈ వైన్‌షాపుకి వస్తూ హోటల్‌లో దాల్‌ రోటీ తీసుకుంటాను. మళ్లీ రేపు ఉదయమే బయటికొచ్చేది’’ వివరించాడతను.సెంట్రల్‌ బస్టాండ్‌ దాటాక ఓ కాలనీలోకి తిరిగి, ఒక ఇంటి ముందు ఆగింది కారు. ఆమె కారు దిగి గేటు తాళం తీసి, కారు లోపల పార్క్‌ చేశాక గేటుకి లోపలి నుంచి తాళం వేసింది. ఇంట్లో కాలుపెట్టిన మరుక్షణం విశాలమైన హాలు ఎదురైంది. హాల్లో రెండు పెద్ద సోఫాలు, నాలుగు కుర్చీలు, మధ్యలో టీపాయ్‌ ఉన్నాయి. టీపాయ్‌ మీద న్యూస్‌పేపర్, టెలిఫోన్, మోడెమ్‌ కనిపిస్తున్నాయి. గోడలకు రకరకాల పెయింటింగ్స్‌. కిటికీలకు అందమైన కర్టెన్లు వేలాడుతున్నాయి.‘‘కాఫీ తాగుతారా? టీనా?’’ అడిగిందామె.‘‘టీ...’’ చెప్పాడతను.‘‘పేపర్‌ చూస్తూ ఉండండి. ఇప్పుడే వస్తాను’’ చెప్పి లోపలికి నడిచిందామె.న్యూస్‌పేపర్‌ అందుకుంటూ టీపాయ్‌ వంక చూశాడు. న్యూస్‌పేపరుకి, టెలిఫోనుకి మధ్య యాష్‌ ట్రే ఉంది. దాని నిండా కాల్చిపడేసిన సిగరెట్‌ పీకలు. అవి రెండు బ్రాండ్లకు చెందినవి.పదినిమిషాల్లో ట్రేతో వచ్చిందామె. ఒక కప్పు అతనికిచ్చి తనొకటి తీసుకుంది. టీ తాగడం అయ్యాక ఖాళీ కప్పులు ట్రేలో పెట్టుకుని చెప్పింది.‘‘బట్టలు మార్చుకుని వస్తాను’’అతను తలూపి సిగరెట్‌ వెలిగించి లేచి గోడలకు వేలాడుతున్న పెయింటింగ్స్‌ చూడసాగాడు. సరిగా మూడు నిమిషాలకు అతని శరీరం తూలింది. వెంటనే తూటా దెబ్బతిన్న పిట్టలా నేలకూలిపోయాడు.వేళ్ల మధ్య నుంచి జారి పక్కకు దొర్లింది సిగరెట్‌.ఆ చప్పుడుకి బయటకొచ్చి కిందపడి ఉన్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంది. ఒంటరిగా సింహాన్ని బోనులో బంధించానన్న గర్వం ఆమె మనసులో కలిగింది.

చన్నీళ్లు ముఖం మీద పడటంతో అతను కళ్లు తెరిచాడు. ఎదురుగా ముగ్గురు వ్యక్తులతో పాటు కీర్తన నిలబడి ఉంది. ‘‘టీలో ఏం కలిపావు..?’’ ఏమీ జరగనట్టు నవ్వుతూ అడిగాడు కీర్తనని. ఆమె ముఖం పక్కకి తిప్పుకుంది. ముగ్గురు మగాళ్ల చేతుల్లో రివాల్వర్స్‌ ఉన్నాయి.‘‘మేము అడిగిన సమాచారం చెబితేనే నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు వెళతావు. లేదంటే ఇక్కడే సమాధి అవుతావు.’’ చెప్పాడు ముగ్గురిలో సన్నగా ఉన్న వ్యక్తి. అతని ముఖం నిండా స్ఫోటకం మచ్చలు. వారందరికీ అతనే నాయకుడని మిగతావారి బాడీ లాంగ్వేజీని బట్టి తెలుస్తోంది.‘‘రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఎక్కడ?’’ అడిగాడు స్ఫోటక మచ్చల వ్యక్తి.‘‘నాకు తెలీదు’’ చెప్పాడతను.ఆ వ్యక్తి చెయ్యి మెరుపులా కదిలింది. అతని చెంపకి బలంగా తగిలి ఫట్‌మనే చప్పుడొచ్చింది. ఆ బాధ తట్టుకోవడానికి కొన్ని క్షణాల పాటు కళ్ల మూసి తెరిచాడతను.‘‘నేను ఢిల్లీ ప్రభుత్వ సెక్రటరియేట్‌లో క్లర్కుగా చేస్తున్నాను. నా పేరు రామస్వామి నాయర్‌. కావాలంటే నా ఐడెంటిటీ చూడండి’’ అన్నాడు.
ఆ వ్యక్తి శబ్దం రాకుండా నవ్వాడు.‘‘నువ్వు రా ఏజెంట్‌ మిస్టర్‌ ఎక్స్‌ అని నాకు తెలుసు. నిన్ను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాం’’ అని కీర్తన వైపు చూసి తలూపాడు. ఆమె లోపలికి వెళ్లి అరచేతిలో ఇమిడిపోయే ఎలక్ట్రానిక్‌ పరికరంతో తిరిగొచ్చింది.దాన్ని చూడగానే అతని ముఖం కళ తప్పింది. కంటికి కనిపించకుండా దాచిన మైక్రోచిప్స్‌ను కనుక్కునే లేటెస్ట్‌ డిటెక్టర్‌ అది. తను ఊహించిన దానికంటే ప్రమాదకరమైన వ్యక్తుల మధ్య ఉన్నానని అతనికి అర్థమైపోయింది. కీర్తన ఆ డిటెక్టర్‌తో అతని శరీరం మొత్తం చెక్‌ చేసింది. కుడికాలి పిక్క దగ్గర బీప్‌ అనే చప్పుడు చేసిందా పరికరం.‘‘అది నీ ఐడెంటిటీ కదూ!’’ అన్నాడు స్ఫోటకం మచ్చల వ్యక్తి.అతను మాట్లాడలేదు. హోం మినిస్టర్‌ దగ్గర ప్లాంట్‌ చేసిన రా ఏజెంట్‌ అతను. ఎవరో తనను వెంటాడుతున్నారని పది రోజుల కిందట గ్రహించాడు. తన ప్రవర్తనలో ఏమాత్రం తేడా వచ్చినా పిట్ట ఎగిరిపోతుందని, మెడికల్‌ లీవు తీసుకున్నాడు. శత్రువు గురించి తెలుసుకోవాలంటే తెగించాలి. అంతా అనుకున్నట్టే జరిగింది. కాని ఆమె వెనుక శత్రు గూఢచారులు ఉన్నారనేది కొత్త సంగతి.దేశ రాజధాని కాబట్టి ఢిల్లీకి నిత్యం లక్షలాది మంది వచ్చి పోతుంటారు. అలా వచ్చిన వాళ్లందరి మీదా నిఘా ఉంచడం సాధ్యంకాని పని. అయినా రకరకాల రూపాల్లో ఏజెంట్లు సంచరిస్తూ ఉంటారు. ఎవరి మీదైనా అనుమానం కలిగితే అంత తేలిగ్గా వదిలిపెట్టరు. అలాంటి పరిస్థితిలో రా వంటి ముఖ్యమైన గూఢచారి శాఖలోని ఒక ఏజెంట్‌ని వాచ్‌ చేయడమంటే మాటలు కాదు.ఎవరో సమాచారం లీక్‌ చేసి ఉండాలి. 

అతని ఆలోచనలు సాగుతుండగానే ఒక వ్యక్తి అతన్ని సమీపించి, ఫ్యాంట్‌ను కుడి మోకాలి వరకు లాగాడు. కీర్తన మరోసారి డిటెక్టర్‌తో చెక్‌ చేసింది. ఈసారి కూడా బీప్‌ శబ్దం వచ్చింది. పరీక్షగా చూస్తే అక్కడ చర్మం గీరుకున్నట్టు పొడవుగా మచ్చ. ఆ భాగంలో చాకును గుచ్చి కండను పెకలించాడు ఆ వ్యక్తి.అతని శరీరం బాధతో మెలి తిరిగింది. కదలకుండా కట్టేసినా అతని బలానికి కుర్చీ చప్పుడు చేసింది. కండతో పాటు చిప్‌ బయటపడింది. దాన్ని నేల మీద పడేసి బూటు కాలితో నలిపేశాడా వ్యక్తి.‘‘ఇప్పుడు మనకి ముసుగులు లేవు. మేము శత్రు గూఢచారులమని, నువ్వు ఈ దేశ ప్రధాన గూఢచారి సంస్థ రా ఏజెంటువని తేలిపోయింది. నువ్వు మాకు సహకరిస్తే ప్రాణాలతో ఉంటావు’’ చెప్పాడు స్ఫోటక మచ్చల వ్యక్తి.అంతవరకు పంటి బిగువున బాధ భరించిన అతను తలెత్తి నవ్వుతూ అడిగాడు... ‘‘రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఎక్కడ ఉందో తెలిస్తే ఏం చేస్తావు?’’ అని.‘‘మా పథకాలు మాకున్నాయి’’ అన్నాడతను.‘‘మీరు ఎన్ని పథకాలు వేసినా రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ హెడ్‌క్వార్టర్స్‌ను కనుక్కోలేరు. ఆ సంగతి తెలియక సమయం వృథా చేసుకుంటున్నారు. అసలు దానికి హెడ్‌క్వార్టర్స్‌ లేదు’’స్ఫోటక మచ్చల వ్యక్తి ముఖం తెల్లగా పాలిపోయింది. అతని పక్కన నిలబడిన వ్యక్తి కత్తిని భుజంలో గుచ్చాడు. బాధతో అతని శరీరం వణికింది. అప్పటికే కుడికాలి పిక్క నుంచి కారిన రక్తం పాదం చుట్టూ మడుగులా ఏర్పడింది.‘‘కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి నిజం చెప్పు’’ అరిచాడు కత్తి భుజంలోకి దించిన వ్యక్తి.‘‘ఎంత హింసించినా నా దగ్గరలేని సమాచారం తెలుసుకోలేరు. రా ఏజెంట్లు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలీదు. ఎవరికి వారు స్వతంత్రంగా ఉంటారు. వారితో అవసరం వచ్చినప్పుడు బాస్‌ లేదా అతని అసిస్టెంట్లు ఏదో హోటల్లో కలుస్తారు. వారికి చెయ్యాల్సిన పని అప్పగిస్తారు. ఇదంతా మూడో కంటికి తెలియకుండా జరుగుతుంది’’ చెప్పాడతను. భుజం నుంచి కారిన రక్తం షర్టుని తడిపేస్తోంది.‘‘పని పూర్తయ్యాక ఎక్కడ రిపోర్టు చేస్తారు?’’ అడిగింది కీర్తన.

‘‘అతనికి అన్‌లిస్టెడ్‌ నంబర్‌ ఒకటి ఇస్తారు. ఆ నంబర్‌కి కాల్‌ చేస్తే కలుసుకోవాల్సిన చోటు తెలుస్తుంది.’’‘‘అతను మరణిస్తే’’‘‘చావడం అనేది ఈ వృత్తిలో ఒక భాగం. నిర్ణీత సమయానికి కాల్‌ చేయాల్సిన ఏజెంట్‌ నుంచి సమాచారం రాకపోతే అతను ప్రమాదంలో చిక్కుకున్నట్టే. వెంటనే తమ సోర్స్‌ ద్వారా అతని పరిస్థితి తెలుసుకోవడానికి  రా ప్రయత్నిస్తుంది.’’అక్కడ కొన్ని క్షణాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. హఠాత్తుగా స్ఫోటక మచ్చల వ్యక్తి అడిగాడు.‘‘నీకిచ్చిన అన్‌లిస్టెడ్‌ నంబర్‌ ఎంత?’’అంత నీరసంలో కూడా అతను నవ్వాడు.‘‘అది తెలుసుకోవడం నీ తరం కాదు’’ చెప్పాడు. ఆవేశంతో స్ఫోటక మచ్చల వ్యక్తి ముఖం ఎర్రబడింది. రివాల్వర్‌ అతని తలకి గురిపెట్టాడు.ఇంతలో కాలింగ్‌బెల్‌ మోగింది.కీర్తన వైపు చూసి తలూపాడు స్ఫోటక మచ్చల వ్యక్తి. వెంటనే అతని నోట్లో కర్చీఫ్‌ దూర్చి.. ఆ గది తలుపులు మూశారు. ఒక వ్యక్తి తలుపు చాటున, మరో అతను కర్టెన్‌ వెనుక, మూడో అతను రెండో గది గుమ్మం పక్కన పొజిషన్‌ తీసుకున్నారు. వెనక్కి తిరిగి అంతా సవ్యంగా ఉందని గ్రహించి, మెయిన్‌ డోర్‌ దగ్గరకు నడిచింది కీర్తన. సెక్యూరిటీ హోల్‌ నుంచి బయటకు చూసింది. టెలి కమ్యూనికేషన్స్‌ ఉద్యోగి నిలబడి ఉన్నాడు. అతను ఎప్పుడూ వచ్చేవాడిలా గుర్తించి, వెనక్కి తిరిగి తలూపింది కీర్తన. ఆ ముగ్గురూ తేలిగ్గా ఊపిరి తీసుకుని మొదటి గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నారు. ‘‘నెట్‌ పనిచేయడం లేదని కంప్లైంట్‌ ఇచ్చారు మేడమ్‌’’ అని చెప్పి లోపలకు వచ్చాడు ఆ ఉద్యోగి. తిన్నగా ఫోన్‌ దగ్గరకు నడిచి రిసీవర్‌ అందుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు. రిసీవర్‌ పెట్టేసి మోడెం స్విచాఫ్‌ చేశాడు.అతన్ని జాగ్రత్తగా గమనిస్తోంది కీర్తన.ఆమె ఉలికిపాటుగా వెనక్కి తిరిగే లోపు ఒక మనిషి కీర్తన నోరు మూసి కదలకుండా పట్టుకున్నాడు. ఆటోమేటిక్‌ ఆయుధాలతో కమెండోలు లోపలకు ప్రవేశించారు. ఎలాంటి రక్తపాతం లేకుండా అక్కడున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

మిలటరీ హాస్పిటల్‌లో ఆ ఏసీ రూమ్‌ తలుపు తెరుచుకుని లోపలకు వచ్చిన ఆయన్ని చూసి అంత నీరసంలో కూడా ఉలిక్కిపడ్డాడతను. మంచం పక్కనున్న టేబుల్‌ మీద ఫ్రూట్‌బ్యాగ్‌ ఉంచి స్టూల్‌ మీద కూర్చుని అభిమానంగా అడిగాడు. ‘‘హౌ ఆర్యూ మై బోయ్‌’’‘‘ఫైన్‌ సర్‌!’’ చెప్పాడతను వినయంగా.ఆయనకు అరవైదాక ఉంటుంది వయసు. జనంతో కిటకిటలాడే కన్నాట్‌ ప్లేస్‌లో వాకింగ్‌కి వెళితే రిటైరైన ఉద్యోగిలా ఉంటాడు. సినిమాహాలు క్యూలో నిలబడితే ఆ వయసులో ఏమీ తోచక సినిమాకు వచ్చినవాడిలా కనిపిస్తాడు. అంతే తప్ప అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతదేశ గూఢచర్య నెట్‌వర్క్‌ను లీడ్‌చేస్తాడని, ఏ సమయంలోనైనా రాష్ట్రపతి, ప్రధాని వంటి వారిని కలవడానికి అనుమతి పొందిన అరుదైన వ్యక్తి అని కనీసం ఊహించడానికి కూడా వీలుకానంత మామూలుగా ఉంటాడాయన.‘‘ఆ ఇంట్లోని నలుగురినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం. ఒకతను సైనైడ్‌ గుళిక మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్లంతా ఎక్స్‌ప్లోజివ్స్‌ మీద శిక్షణ పొందిన వాళ్లు. ఆ ఇంట్లో ఆర్డీఎక్స్‌తో పాటు శత్రుదేశం నుంచి భారత్‌లోకి ప్రవేశించే రూట్‌ మ్యాప్‌ దొరికింది. గుడ్‌ జాబ్‌. ఒక మనిషి నిన్ను అనుసరిస్తున్నాడని గ్రహించినప్పుడు డిపార్ట్‌మెంట్‌కి ఎందుకు ఇన్‌ఫామ్‌ చెయ్యలేదు’’ అడిగాడాయన.‘‘ఒక యువతి నన్ను అనుసరిస్తోందని అనుమానం కలిగింది సార్‌! ఆమె నావెంట ఎందుకు పడిందో తెలీదు. నా ప్రవర్తనలో తేడావస్తే అసలు విషయం తెలియదని, ఆమె సంగతి తేల్చుకోవాలని మెడికల్‌లీవు తీసుకుని నన్ను అనుసరించమని మనవాడికి చెప్పాను.’’‘‘ఒంటరిగా శత్రు శిబిరంలోకి ప్రవేశించడం ప్రమాదం కదా!’’‘‘ప్రమాదమని శత్రువుని వదిలితే ఎలా సార్‌?’’‘‘ఈ ఆపరేషన్‌లో నీకేమైనా అయితే..?’’‘‘ప్రాణాలు పోతాయని భయపడి దేశానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా దేశద్రోహమే సార్‌! పార్లమెంట్‌ మీద దాడి జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయిన ఉమన్‌ హోమ్‌గార్డు ప్రాణం కంటే నా ప్రాణం గొప్పది కాదు సార్‌!’’ఆయన తలపంకించి నిలబడ్డాడు.‘‘నిన్ను ఏ వన్‌కి రికమెండ్‌ చేశాను. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన వెంటనే కాంటాక్ట్‌ చెయ్యి. ఆపరేషన్‌ పీకే చార్జ్‌ తీసుకోవాలి’’అతను గుటకలు మింగుతూ తలూపాడు. ఆపరేషన్‌ పీకే అంటే క్షణక్షణం ప్రమాదంతో కూడుకున్నది. తిరిగి దేశంలో కాలుపెడతామో లేదో తెలియనంత తీవ్రమైంది. అదంతా ఆ వృత్తిలో భాగమని అతనికి తెలుసు.
- మంజరి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement