ఆ  ట్యాబ్లెట్స్‌ మంచివేనా? | funday health counciling | Sakshi
Sakshi News home page

ఆ  ట్యాబ్లెట్స్‌ మంచివేనా?

Published Sun, Apr 29 2018 12:54 AM | Last Updated on Sun, Apr 29 2018 12:54 AM

funday health counciling - Sakshi

నేను ఇప్పుడు ప్రెగ్నెంట్‌ని. ‘ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌’ అనేవి ప్రెగ్నెంట్‌ లేడీస్‌కి మంచిదని చదివాను. మా ఆయనతో దీని గురించి మాట్లాడితే అలాంటివి పట్టించుకోవద్దు అన్నారు. దయచేసి దీని మంచి, చెడుల గురించి తెలియజేయగలరు. – కె. వనజ, కర్నూల్‌
ప్రతి ఒక్కరి శరీరంలో నాడీ వ్యవస్థకు సంబంధించి, ఇంకా ఇతర అవయవాల పనితీరుకు, హార్మోన్ల ఉత్పత్తికి కొద్దిగా కొవ్వు అవసరం ఉంటుంది. అందులో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ అనేవి కూడా ముఖ్యం. అవి కళ్లు, నాడీ వ్యవస్థ, మెదడు పనితీరుకు దోహదపడతాయి. గర్భిణీ స్త్రీలు ఇవి తీసుకోవడం వల్ల, కడుపులోని శిశువు కళ్లు, మెదడు పనితీరు, ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. అలాగే కొందరిలో శిశువు కొద్దిగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.  అందులో ముఖ్యంగా డీహెచ్‌ఏ అనే ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్‌ శిశువుకి బాగా ఉపయోగపడుతుంది. అవి చేపలు, రొయ్యలు వంటి వాటిలో ఎక్కువగా లభ్యమవుతాయి. వెజిటెబుల్‌ నూనెలు అంటే సోయాబీన్, మొక్కజొన్న నూనెల్లో.. అలాగే బాదం పప్పు, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో కొద్దిగా దొరుకుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మాంసాహారులైతే వారానికి రెండుసార్లు చేపలు తీసుకోవచ్చు. ఇలాంటి ఆహారం సరిగా తీసుకోనివారు విడిగా దొరికే డీహెచ్‌ఏ క్యాప్సూల్స్‌ రోజూ 300ఎమ్‌జీ తీసుకోవడం మంచిది.

మెనోపాజ్‌ దశలో తలెత్తే  శారీరక, మానసిక సమస్యలకు దూరంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వయసుతో సంబంధం లేకుండా ఇది త్వరగా వచ్చే అవకాశం ఉందా? త్వరగా రాకుండా ఉండడానికి ఏదైనా పరిష్కారం ఉందా? – యంఎల్, విజయవాడ
ఆడవారిలో నలభై అయిదు సంవత్సరాలు దాటిన తర్వాత అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ క్రమేణా తగ్గిపోతూ వచ్చి యాభైఆరు సంవత్సరాలకు పూర్తిగా ఆగిపోతుంది. ఆ సమయంలో పీరియడ్స్‌ పూర్తిగా ఆగిపోతాయి. దీన్నే మెనోపాజ్‌ దశ అంటారు. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి వారిలోని జన్యువులు, బరువు, ఇంకా తెలియని ఎన్నో అంశాల మీద ఆధారపడి మెనోపాజ్‌ దశను ఒక్కొక్కరు ఒక్కో వయసులో చేరుకుంటారు. కొందరిలో నలభై సంవత్సరాల కంటే ముందు కూడా పీరియడ్స్‌ ఆగిపోయి మెనోపాజ్‌ దశకు చేరే అవకాశం ఉంటుంది. దీన్నే ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌ అంటారు. క్యాన్సర్‌ చికిత్స కోసం రేడియో థెరపీ, కీమో థెరపీ వంటివి తీసుకున్న వారిలో చాలామందికి పీరియడ్స్‌ ముందుగానే ఆగిపోయే అవకాశం ఉంటుంది. మెనోపాజ్‌ ముందుగా రాకుండా ఉండటానికి మనం చెయ్యగలిగింది ఏమీలేదు. కాకపోతే దాని లక్షణాలను, సమస్యలను కొద్దిగా అధిగమించడానికి వాకింగ్, యోగా వంటివి చేస్తూ మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. వీరిలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గిపోవడం వల్ల ఎముకలు, కండరాలు బలహీనపడటం, చెమటలు పట్టడం, ఒళ్లంతా ఆవిర్లు వచ్చినట్లుండటం, నిద్ర సరిగా పట్టకపోవడం, చిరాకు, కొద్దిగా మతిమరుపు, ఏకాగ్రత లేకపోవడం, మూత్ర సమస్యలు, లైంగిక సమస్యలు ఏర్పడతాయి. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌లాగా పనిచేసే ఫైటో ఈస్ట్రోజన్స్‌ అనే పదార్థాలు సోయాబీన్స్‌లో దొరుకుతాయి. కాబట్టి ఆహారంలో సోయాబీన్స్, సోయాబీన్స్‌ పౌడర్, సోయాపాలు తీసుకోవడం మంచిది. అలాగే క్యాల్షియం ఎక్కువగా దొరికే ఆకుకూరలు, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, రాగులు, గుడ్లు, కొద్దిగా మాంసాహారం తీసుకోవాలి.

మా చెల్లెలికి గర్భం తీసేశారు. ‘ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ’ వల్ల ఇలా జరిగిందని చెబుతున్నారు. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. గర్భం తొలగించిన తర్వాత, మరోసారి గర్భం దాల్చడానికి ఎంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది. – జి. నందన, అనకాపల్లి
సాధారణంగా గర్భం ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లో మొదలై మెల్లిగా పిండం ఏర్పడి, అది గర్భాశయంలోకి చేరి అక్కడ పెరగడం మొదలవుతుంది. కొందరిలో ట్యూబ్స్‌లో ఇన్‌ఫెక్షన్, ట్యూబ్స్‌ ఆకారం, పనితీరులో మార్పుల వల్ల గర్భంలోని పిండం గర్భాశయంలోకి రాకుండా ట్యూబ్స్‌లోనే ఉండిపోతుంది. పిండం పెరిగే కొద్దీ గర్భాశయం సాగుతుంది. కానీ ట్యూబ్స్‌ అలా సాగవు. కాబట్టి పిండం పెరిగేకొద్దీ ట్యూబ్స్‌ పగిలి, కడుపులో బ్లీడింగ అయిపోవడం, కడుపులో నొప్పి, షాక్‌లోకి వెళ్లడం, ప్రాణాపాయస్థితికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భం అని ఇది యూరిన్‌ ప్రెగ్నెన్సీ టెస్ట్‌ ద్వారా నిర్ధారణ అయ్యాక, స్కానింగ్‌ ద్వారా నిర్ధారణ అవుతుంది. అలాగే సీరమ్‌ బీహెచ్‌సీజీ అనే రక్త పరీక్ష ద్వారా అది ఎంత పెరుగుతుంది, దీనికి మందుల ద్వారా చికిత్స చెయ్యవచ్చా, తప్పనిసరిగా ఆపరేషన్‌ చేసి ట్యూబ్‌ని తొలగించవలసి వస్తుందా అనేది అంచనా వేయడం జరుగుతుంది. ఈ గర్భాన్ని తొలగించిన తర్వాత కనీసం మూడు నెలలైనా గ్యాప్‌ తీసుకొని మళ్లీ గర్భానికి ప్రయత్నించొచ్చు.

డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement